
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్లను రద్దు చేస్తూ జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) ఇటీవల ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో వాటి అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలను ఇవ్వాల్సిందిగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్‌ఎంసీని కోరింది. ఈ మేరకు లేఖ రాసినట్లు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఆయా కళాశాలల్లోని విద్యార్థులను నిబంధనల మేరకు యూనివర్సిటీ పరిధిలోని వివిధ వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేస్తామన్నారు. ఏ విద్యార్థి కూడా సీటు కోల్పోవడం జరగదని ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.