సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) నడుం బిగించింది. అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేని కళాశాలలకు చెక్ పెట్టేలా చర్యలకు సంసిద్ధమైంది. వైద్య విద్యలో నాణ్యతను పెంపొందించే దిశగా పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్‌ఎంసీ ఆదేశించింది.
ప్రతి కాలేజీలో 25 చొప్పున సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ఆధార్ సహిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్), రోగుల వివరాలు, స్థితిగతులు తెలుసుకునేలా (ట్రాకింగ్) హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (హెచ్‌ఎంఎస్) అమలు చేయాలని స్పష్టం చేసింది. కళాశాలల్లోని ఈ వ్యవస్థను ఢిల్లీలోని ఎన్‌ఎంసీ వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తారు. లైవ్ వీడియో ఫీడ్‌ను కమాండ్ సెంటర్‌కు షేర్ చేసేలా ఏర్పాట్లు చేయాలని ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు జారీ చేసింది. తద్వారా ప్రతి మెడికల్ కాలేజీని నేరుగా ఎన్‌ఎంసీ పర్యవేక్షించనుంది.
మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు..
►బోధన సిబ్బంది,సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్ల హాజరును నమోదు చేయడానికి సమర్థవంతమైన డిజిటల్ పరిష్కారం బయోమెట్రిక్ వ్యవస్థ. అందువల్ల నేషనల్ ఇన్ఫర్మేటి క్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) అభివృద్ధి చేసిన ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీ లు ఈ నెల పదో తేదీలోగా అమల్లోకి తేవాలి.
►మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లోని రోగుల లోడ్, ఇతర వివరాలను పర్యవేక్షించేందుకు హెచ్‌ఎంఎస్‌ను అమలు చేయాలి. అందుకోసం ఈ–హాస్పిటల్ సాఫ్ట్‌వేర్‌ను ఎన్‌ఐసీ అభివృద్ధి చేసింది. ఇది ఆసుపత్రి కౌంటర్‌లో రోగుల నమోదును సులభతరం చేస్తుంది. మొబైల్ ఓటీపీ, ఆధార్ మొదలైన వాటి ద్వారా రోగుల స్వీయ నమోదును సులభతరం చేస్తుంది.
►వైద్య విద్యపై నియంత్రణకు, ప్రత్యేకించి కొన్ని వైద్య కళాశాలలు తనిఖీల సందర్భంగా నకిలీ ఫ్యాకల్టీలను, రోగులను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న విధానాన్ని నిరోధించేందుకు కొత్త పద్ధతి ఉపయోగపడుతుంది.
►మెడికల్ కాలేజీల ప్రాంగణంలోని తరగతి గదులు, ఇతర కీలక ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు.. ప్రతిదీ ట్రాక్ చేయడానికి, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయా కాలేజీలన్నిటినీ పరిశీలించడానికి వీలు కలుగుతుంది.
►కాలేజీల నుంచి లైవ్ ఫీడ్, బయో మెట్రిక్ హాజరు తదితరాల పర్యవేక్షణకు, సమన్వయం చేసేందుకు ఒక నోడల్ అధికారిని నియమించాలి.
►ఏఈబీఏఎస్ పోర్టల్‌లో ఫ్యాకల్టీ మొత్తం స్వయంగా నమోదు చేసుకోవాలి. మెడికల్ కాలేజీ నోడల్ అధికారి హాజరును పర్యవేక్షిస్తారు.
►ఈ నెలాఖరు నాటికి మెడికల్ కాలేజీలు ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment