సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు మెడికల్ కాలేజీల్లో మెడికల్ సీట్ల రద్దుతో విద్యాసంవత్సరం నష్టపోయే విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ విషయమై గత నెల 30న లేఖ రాసిన జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) వారంలోగా స్పందించాలని సూచించినా వైద్య, ఆరోగ్యశాఖ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అయితే విద్యార్థులను సర్దుబాటు చేయాలని మాత్రమే ఎన్‌ఎంసీ సూచించిందని... అదనపు సీట్లు (సూపర్ న్యూమరరీ) సృష్టించడంపై స్పష్టత ఇవ్వలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. సరైన వసతులు లేవంటూ సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్, పటాన్‌చెరులోని టీఆర్‌ఆర్, వికారాబాద్‌లోని మహావీర్ కాలేజీల్లోని మొత్తం 450 ఎంబీబీఎస్ సీట్లతోపాటు రెండు కాలేజీల్లోని 113 పీజీ మెడికల్ అడ్మిషన్లను ఎన్‌ఎంసీ రద్దు చేయడం తెలిసిందే.
దీంతో ఆయా కాలేజీల్లో ఈ ఏడాది చేరిన వైద్య విద్యార్థులు అడ్మి షన్లు పొందిన నెల రోజులకే రోడ్డున పడ్డారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారు. ఎన్ని విన్నపాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని
అంటున్నారు.
బిహార్‌లో సర్దుబాటు...
రాష్ట్రానికి రాసిన లేఖలో బిహార్‌లో సర్దుబాటు అంశాన్ని ఎన్‌ఎంసీ ప్రస్తావించింది. ఆ కాపీని కూడా జత చేసింది. బిహార్‌లోని ఒక కాలేజీలో సైతం ఎంబీబీఎస్ అడ్మిషన్లు రద్దవగా అందులోని విద్యార్థులను ఏడు ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేశారు. అయితే ఒక కాలేజీ కాబట్టి విద్యార్థుల సర్దుబాటు చిన్న విషయమని కాళోజీ వర్గాలు అంటున్నాయి. కానీ రాష్ట్రంలో మూడు కాలేజీల విద్యార్థులను సర్దుబాటు చేయడం కష్టమని చెబుతున్నాయి. అయినా ఎన్‌ఎంసీ అనుమతిస్తే ఎంబీబీఎస్ విద్యార్థులను సర్దుబాటు చేయొచ్చని, పీజీ మెడికల్ విద్యార్థులను సర్దుబాటు చేయడం క్లిష్టమైన వ్యవహారమని పేర్కొంటున్నాయి.
ఎన్‌ఎంసీ నుంచి మార్గదర్శకాలు రాకుండా సర్దుబాటు చేస్తే తర్వాత న్యాయపరమైన చిక్కులు వస్తాయని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు ఇచ్చిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని విద్యార్థులు నిలదీస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment