అనుమతి లేని కాలేజీల్లో చేరొద్దు.. మెడికల్‌ అభ్యర్థులకు ఎన్‌ఎంసీ హెచ్చరిక | NMC Warns Against Illegal MBBS And Other Medical Courses | Sakshi
Sakshi News home page

అనుమతి లేని కాలేజీల్లో చేరొద్దు.. మెడికల్‌ అభ్యర్థులకు ఎన్‌ఎంసీ హెచ్చరిక

Published Tue, Nov 1 2022 12:41 AM | Last Updated on Tue, Nov 1 2022 7:55 AM

NMC Warns Against Illegal MBBS And Other Medical Courses - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: అనుమతి లేని మెడికల్‌ కాలేజీల్లో చేరవద్దని జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) విద్యార్థులను హెచ్చరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ సహా ఇతర వైద్య కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఎన్‌ఎంసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేని రాజస్తాన్‌లోని సింఘానియా యూనివర్సిటీ ఎంబీబీఎస్, ఇతర మెడికల్‌ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానించినట్లు ఎన్‌ఎంసీ తెలిపింది.

వివిధ వార్తాపత్రికల్లో సైతం ఈ సంస్థ ప్రకటన ఇచ్చిందని వివరించింది. కొత్త మెడికల్‌ కాలేజీని స్థాపించడానికి, ఆధునిక వైద్యంలో కోర్సులను అందించడానికి ఎన్‌ఎంసీ ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. అనుమతి లేని సంస్థల్లో ఎంబీబీఎస్, ఎండీ సహా ఇతరత్రా వైద్య కోర్సులు చేసిన విద్యార్థులు మెడిసిన్‌ ప్రాక్టీస్‌ చేయడానికి అనర్హులవుతారని హెచ్చరించింది.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనుమతి ఉన్న వైద్య కళాశాలల వివరాలను, సీట్ల సంఖ్యను ఎన్‌ఎంసీ వెబ్‌సైట్లో ప్రదర్శించింది. ఏదైనా మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్‌ తీసుకునేముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించింది. అన్ని విధాలా కాలేజీలను పరిశీలించి తనిఖీ చేసిన తర్వాతే వాటిల్లో చేరే విషయమై నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు..
రాష్ట్రంలో గత వైద్య ప్రవేశాల అనంతరం మూడు మెడికల్‌ కాలేజీల అడ్మిషన్లను ఎన్‌ఎంసీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇది పెద్ద దుమారాన్నే లేపింది. కొన్ని నెలల అనంతరం ఒక కాలేజీ సీట్లను పునరుద్ధరించగా, మరో రెండు కాలేజీల విద్యార్థులను ఇతర ప్రైవేట్‌ కాలేజీల్లో సర్దుబాటు చేశారు. అయితే 2022–23 వైద్య విద్య అడ్మిషన్లలో ఆ రెండు కాలేజీలైన టీఆర్‌ఆర్, మహావీర్‌లకు ఎన్‌ఎంసీ అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని విద్యార్థులు ప్రత్యేకంగా గమనంలో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొందరు దళారులు సీట్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటారని, ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement