గడువులోగా మెడికల్‌ కౌన్సెలింగ్‌ పూర్తి | Dr Shyamprasad Complete medical counseling by deadline | Sakshi
Sakshi News home page

గడువులోగా మెడికల్‌ కౌన్సెలింగ్‌ పూర్తి

Published Fri, Feb 18 2022 6:25 AM | Last Updated on Fri, Feb 18 2022 6:25 AM

Dr Shyamprasad Complete medical counseling by deadline - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): మెడికల్‌ అడ్మిషన్స్‌లో ఈ ఏడాది సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో వాటిని పరిష్కరిస్తూ ప్రక్రియను కొనసాగిస్తున్నామని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్‌ పి.శ్యామ్‌ప్రసాద్‌ చెప్పారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిర్ణయించిన సమయానికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. యూనివర్సిటీ యూజీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను ఆయన గురువారం మీడియాకు వివరించారు. యూనివర్సిటీ అడ్మిషన్లకు సంబంధించి పదేళ్లుగా ఒకే సాఫ్ట్‌వేర్‌ సంస్థను వినియోగిస్తుండటంతో ఆడిట్‌ అభ్యంతరాలు తలెత్తాయని, దీంతో టెండర్లు పిలవగా.. హైదరాబాద్‌కు చెందిన సంస్థ టెండర్‌ దక్కించుకుందని తెలిపారు. 

అపోహలకు తావులేదు..  
యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో మొత్తం 2,342 పీజీ/డిప్లమో సీట్లుండగా, వాటిలో 50 శాతం నేషనల్‌ పూల్‌కు పోను, రాష్ట్ర కోటాగా 38 స్పెషాలిటీల్లో 1,171 సీట్లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యూనివర్సిటీ పీజీ, డిప్లమో సీట్ల భర్తీకి నవంబర్‌ 3న నోటిఫికేషన్‌ ఇచ్చినట్టు వీసీ తెలిపారు. వెబ్‌సైట్‌లో కొన్ని సాంకేతిక పరమైన చిక్కులతో డిసెంబర్‌ 23న రీ నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు. మెరిట్‌ లిస్టును జనవరి 19న ప్రకటించి, నాన్‌ సర్వీసు కోటాకు సంబంధించి ఫిబ్రవరి 1న సీట్ల అలాట్‌మెంట్‌ చేశామన్నారు.

కొన్ని లోపాలు తలెత్తినట్టు నిపుణుల కమిటీ గుర్తించి, వాటిని రద్దు చేసి, ఫిబ్రవరి 2న రీ నోటిఫికేషన్‌ ఇచ్చినట్టు చెప్పారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో 7న సీట్లు అలాట్‌ చేసి, 14లోపు జాయిన్‌ అవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. సర్వీసు కోటాకు సంబంధించి తెలంగాణ వారికీ  సీట్లు కేటాయించాలని కోర్టు ఉత్తర్వుల మేరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఈ నెల 13న నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. సర్వీస్‌ కోటాలో మిగిలిన సీట్లు నాన్‌ సర్వీస్‌ కోటాలో భర్తీ చేస్తామని తెలిపారు. మార్చి 7 నాటికి పీజీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేస్తామని, ఇందుకోసం యూనివర్సిటీ సిబ్బంది పబ్లిక్‌ హాలిడేస్, ఆదివారాల్లో సైతం పనిచేస్తున్నారని, ఎలాంటి అపోహలకు తావులేదని వీసీ వివరించారు.  

యూజీకి 14 వేల దరఖాస్తులు.. 
ఎంబీబీఎస్, ఎండీఎస్‌ అడ్మిషన్ల కోసం జనవరి 28న నోటిఫికేషన్‌ ఇచ్చినట్టు తెలిపారు. నోటిఫికేషన్‌ గడువు ఫిబ్రవరి 8తో ముగిసిందని, ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. ఈ నెల 25తో పరిశీలన పూర్తి చేసి, 28న ఫైనల్‌ మెరిట్‌ లిస్టు ప్రకటిస్తామని వీసీ వివరించారు. మార్చి మొదటి వారంలో మొదటి దశ, రెండో వారంలో రెండో దశ, మూడో వారంలో మూడో ఫేస్‌ యూజీ కౌన్సెలింగ్‌ నిర్వహించి మార్చి 19 నాటికి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement