ntr health university
-
అంతా మీ ఇష్టమా?.. మంత్రి సత్యకుమార్‌ను నిలదీసిన టీడీపీ నేత!
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి పాలనలో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పలుచోట్ల కూటమి నేతలను సొంత పార్టీ నేతలే ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. తాజా మంత్రి సత్యకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంత్రిని టీడీపీ నేత ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.గుంటూరులో మంత్రి సత్యకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలో పీజీ మెడికల్ కౌన్సిలింగ్‌పై మంత్రిని టీడీపీ నేత నిలదీశారు. మెడికల్ కాలేజీల్లో ఫీజు ఫైనల్ కాకుండా కౌన్సిలింగ్ ఎలా పెడతారని సదరు నేత ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వర్సిటీలో ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. అయితే, సత్య కుమార్ మాత్రం విద్యార్థులు పేరెంట్స్ మాట్లాడుతున్నప్పటికీ వారి మాటలను పట్టించుకోకుండా మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఎంబీబీఎస్ కన్వినర్ కోటా సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో తొలి దశ కౌన్సెలింగ్ ఎంబీబీఎస్ కన్వినర్ (ఎ కేటగిరి) సీట్లను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.దివ్యాంగ, మరికొన్ని ప్రత్యేక విభాగాల్లో తుది మెరిట్ జాబితా ఇంకా సిద్ధం కానందున ఆ విభాగాల సీట్ల వరకూ పెండింగ్‌లో ఉంచారు. మొత్తం 3,879 సీట్లకు గాను తొలి దశ కౌన్సెలింగ్‌లో 3,507 సీట్లు భర్తీ అయ్యాయి. అదేవిధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా ప్రవేశాలకు సంబంధించిన ప్రాథమిక తుది మెరిట్ జాబితాను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే, అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. -
హెల్త్ వర్సిటీ వెబ్సైట్లో మార్పులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ సోమవారం ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక వర్సిటీ అధికారిక వెబ్సైట్లోనూ మార్పుల ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వెబ్సైట్లను డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తున్నారు. ఇకపై అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు, ఇతర కార్యకలాపాలు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుతోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం అనుబంధ కళాశాలలకు, నేషనల్ మెడికల్ కమిషన్‌కు సమాచారం ఇవ్వనున్నారు. ఒకట్రెండు రోజుల్లో యూనివర్సిటీ భవనాలపై ఉన్న పేర్లు సైతం మార్పుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో రెండుసార్లు పేరు మార్పు విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం ఇప్పుడు కొత్తేమీ కాదని సీనియర్ వైద్యులు అంటున్నారు. తొలుత యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (యూహెచ్ఎస్)గా ఉండేదని, ఆ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా నామకరణ చేశారని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారని పేర్కొన్నారు. అప్పట్లో వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని.. ఇప్పుడు కూడా ఏమీ ఉండవని వారంటున్నారు. వైఎస్సార్ సేవలకు గుర్తింపుగానే.. ఇక రాష్ట్రంలో వైద్య రంగానికి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగానే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని యూనివర్సిటీ డెంటల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ మెహబూబ్ షేక్ తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి సేవలతో పాటు, కొత్తగా మూడు వైద్య కళాశాలలను ఏర్పాటుచేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్నారని, వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంతో తప్పులేదని, విద్యార్థులకూ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టంచేశారు. -
వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ: చట్ట సవరణకు గవర్నర్ ఆమోదముద్ర
అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మారుస్తూ చేసిన చట్ట సవరణకు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు అసెంబ్లీ చేసిన చట్ట సవరణను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ్టి నుంచి సవరించిన చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేసిన సంగతి తెలిసిందే. దీనికి తాజాగా గవర్నర్ ఆమోద ముద్ర వేయగా, ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది. -
ఏది సంస్కృతి? ఏది విశ్వాసం?
ఎన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చడంపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఆయన పేరు కొనసాగించాలని కోరవచ్చు. కాని అతిగా ప్రభుత్వంపై, జగన్‌పై విమర్శలు చేయడం ద్వారా తమ పాత చరిత్ర అంతటినీ ప్రజల ముందుకు మరోసారి తెచ్చుకుని తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయింది. ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే సంస్కృతి నాశనమైతే.. ఎన్.టి.ఆర్. పదవినే మార్చేసిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతిని చంపేసిందని బాలకృష్ణ ఒప్పుకుంటున్నట్లేగా? ఇక విశ్వాసం మాటకు వస్తే.. తనకు జన్మనిచ్చిన ఎన్.టి.ఆర్.కు బాలకృష్ణ ఎంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు? బావ చంద్రబాబుతో కలిసి తండ్రిని పదవి నుంచి దించేసినప్పుడు తన విశ్వాసం ఏమైంది?! ఏపీలో ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సి టీగా మార్చడంపై ఎన్.టి.ఆర్. కుమారుడు, చంద్రబాబు నాయుడు వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆశ్చ ర్యకరంగా ఉన్నాయి. ఆయన చేసిన ట్వీట్‌ని చూస్తే అసలు ఎన్.టి.ఆర్. పట్ల విశ్వాసం ఉండవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికా? తెలుగుదేశం వారికా? అన్న ప్రశ్న వస్తుంది. ఒక్కసారి బాల కృష్ణ ట్వీట్‌ను పూర్తిగా చూద్దాం. ‘‘మార్చేయడానికి, తీసేయడానికి ఎన్.టి.ఆర్. అన్నది ఒక పేరు కాదు. అది ఒక సంస్కృతి, ఒక నాగరికత, తెలుగు జాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు మార్చారు. కొడుకు గద్దె ఎక్కి యూనివర్సిటీ పేరు మార్చుతున్నాడు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు. పంచభూతాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అక్కడ మహనీయుడి భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు. పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు’’.. ఇది ఆయన ట్వీట్. ఎంత అర్థరహితంగా ఉంది! ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే సంస్కృతి నాశనమైతే.. ఎన్.టి.ఆర్. పదవినే మార్చేసిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతిని చంపేసిందని బాలకృష్ణ ఒప్పుకుంటున్నట్లేగా? ఎన్.టి.ఆర్.ను పదవి నుంచి దించివేసినందుకు, ఆయనపై చెప్పులు వేసినందుకు టీడీపీ నేతలు కనీసం క్షమాపణ చెప్పకపోతే పోయె, బాధపడినట్లు అయినా ఎక్కడైనా చెప్పారా! ఎన్.టి. రామారావు హృదయ విదారకంగా అందరి ముందు విలపించినప్పుడు; తనను తన పిల్లలు, అల్లుళ్లు కలిసి దారుణంగా అవమానించారని కుమిలిపోయినప్పుడు వీరంతా అధికారం లాగేసుకున్నామని పకపకా నవ్వుకున్నారే... అదేనా సంస్కృతి! ఎన్.టి.ఆర్. వేదనతో మరణించినప్పుడు ఆయన అభిమా నులు బాధపడ్డారు కాని ఆయన కుటుంబంగా భావించేవారిలో కొంతమంది లక్ష్మీపార్వతి వర్గంతో గొడవ పడడానికే ప్రాధాన్యం ఇచ్చారు! ఆమెపై రకరకాల వదంతులు సృష్టించే పనిలో పడ్డారు! చివరికి అక్కడ కూడా చెప్పులు విసురుకున్నారు. ఇదా తెలుగు జాతి సంస్కృతి? తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చారని పరోక్షంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించారు. ఎయిర్‌పోర్టు పేరు వ్యవహారం కేంద్రం పరిధి లోనిది. పోనీ బాలకృష్ణ చేసిన విమర్శ కరెక్టే అను కున్నా, 2014 నుంచి నాలుగేళ్లపాటు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే.. అప్పుడు అశోక్ గజపతిరాజు కేంద్ర విమాన యాన శాఖ మంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా! మరి ఎందుకు మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మి నల్కు ఎన్.టి.ఆర్.పేరు పెట్టలేదు? అంటే వారికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేనట్లే కదా! పోనీ విజయవాడ విమానాశ్రయానికి అయినా ఎందుకు ఆయన పేరు పెట్టలేదు? రాజధాని ప్రాంతానికి ఎన్.టి.ఆర్. సిటీ అని పేరు పెట్టాలని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి... ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు లేఖ రాసినప్పుడు ఏమి చేశారు? బుచ్చయ్య చౌదరిపైనే ఫైర్ అయ్యారు తప్ప ఎన్.టి.ఆర్. పేరు పెట్టారా? రామోజీ ఆదేశాల మేరకు చంద్రబాబు అమరావతి అనే పేరు పెట్టారు. అంటే రామోజీకి ఇచ్చిన విలువ ఎన్.టి.ఆర్.కు చంద్రబాబు ఇవ్వలేదనే కదా? ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా 1995 ప్రాంతంలో ‘ఈనాడు’ దారుణమైన కార్టూన్లు వేస్తే బాలకృష్ణ కాని, ఆయన సోదరులు కాని ఎవరైనా ఇదేమిటి అని ప్రశ్నించారా? తనను తన కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని లక్ష్మీపార్వతిని ఎన్.టి.ఆర్. వివాహమాడితే ఆయనతో తగాదా పెట్టుకున్నది ఎవరు? అధికారం వచ్చాక లక్ష్మీపార్వతితో ఆదరణగా ఉన్నట్లు నటించింది ఎవరు? ఎన్.టి.ఆర్. మరణం తర్వాత ఆమెను ఎన్.టి.ఆర్. కుటుంబ సభ్యులు ఎవరైనా పట్టించుకున్నారా? ఆమె ఉంటున్న ఇంటి నుంచి ఆమెను తరిమేశారే! మరి ఇదంతా తెలుగు జాతి సంస్కృతి, నాగరికత అని అనుకోవాలా? ‘‘ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు, పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు..’’ అని బాలకృష్ణ నీచమైన వ్యాఖ్య చేశారు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. ఎన్.టి.రామారావు టీడీపీని స్థాపించి ప్రజలలో తిరుగు తున్నప్పుడు కాంగ్రెస్ వారిని ‘కుక్కమూతి పిందెలు’ అని విమ ర్శించేవారు. విశేషమేమిటంటే అప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండేవారు. ఎన్.టి.ఆర్. తన అల్లుడు మినహా మిగిలిన కాంగ్రెస్ వారికి ఆ తిట్టు వర్తిస్తుందని చెప్పలేదు. పోనీ బాలకృష్ణ చెప్పినట్లు చేరిన పార్టీలోనే ఉండడమే విశ్వాసం అయితే, తొలుత అది వర్తించవలసింది చంద్రబాబుకే కదా! రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌ను కాదని, తన ఓటమి తర్వాత మామ ఎన్.టి.ఆర్. స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేశారు కదా. మరి దానిని బాలకృష్ణ ఏమని అంటారు? ఆ మాటకు వస్తే తనకు జన్మనిచ్చిన ఎన్.టి.ఆర్.కు ఆయన ఎంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు? బావ చంద్రబాబుతో కలిసి ఆయనను పదవి నుంచి దించేసినప్పుడు తన విశ్వాసం ఏమైంది? అప్పుడు కుక్కలు వెక్కి రించలేదా? వాటి ముందు తెలుగుదేశం నేతలు ఎవరూ తలదించు కుని సిగ్గు లేకుండా బతకలేదా? తన సోదరి పురందేశ్వరి కాంగ్రెస్‌లోకి వెళ్లి కేంద్ర మంత్రి పదవులు అలంకరించారే... తదుపరి ఆమె బీజేపీలో ఎలా చేరారు? దీనిని విశ్వాసమే అంటారా? తన బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆశ చూపి, ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగస్వామిని చేశారే... తీరా చంద్రబాబు సీఎం అయ్యాక దగ్గుబాటిని పరాభవించి బయటకు పంపేశారే... మరి బాలకృష్ణకు విశ్వాసం ఏమైంది? ఎన్.టి.ఆర్. పట్ల అందరికీ గౌరవం ఉంది. పేరు మార్చడానికి ముఖ్యమంత్రి జగన్ తన కారణాన్ని వివరించారు. తమకు ఎన్.టి.ఆర్. అవసరం లేదని, ఆయనకు విలువలు లేవని చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే, జగన్ చాలా పద్ధతిగా మాట్లాడారు. తనకు ఎంతో గౌరవం ఉంది కనుకే ఒక జిల్లాకు ఎన్.టి.ఆర్. పేరు పెట్టానని అన్నారు. అలా పేరు పెట్టినప్పుడు బాలకృష్ణ కనీసం స్వాగతించలేక పోయారే? నిజానికి ఎన్.టి. రామారావు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు ప్రత్యర్ధులు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు అయితే ఎన్.టి.ఆర్.తో అసలు సంబంధమే లేదు. ఆ విషయాన్ని కూడా గమనించాలి. ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే మొత్తం జాతి అంతా తల్లకిందులవుతున్నట్లుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారే మరి చంద్రబాబు టైమ్‌లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును మార్చి ఎన్.టి.ఆర్. పేరు పెట్టలేదా? రాజీవ్ పేరు మార్చినప్పుడు దేశానికి అంతటికీ అవమానం జరిగినట్లు అను కోవాలా? తెలం గాణలో ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి కాళోజీ నారాయణరావు పేరు పెట్టినప్పుడు టీడీపీ వారు, బాలకృష్ట వంటి వారు కనీసం నోరెత్తి ఎందుకు మాట్లాడలేదని పలువురు ప్రశ్నిస్తు న్నారు. ఆ మాటకు వస్తే కాకాని వెంకటరత్నం పేరుతో ఉన్న మెడికల్ కాలేజీని యూనివర్సిటీగా మార్చినప్పుడు ఆయన పేరును ఎన్.టి.ఆర్. ఎందుకు తొలగించారు? తెలుగుదేశం వారికి ఎన్.టి.ఆర్.పేరును వాడుకునే అర్హత లేద న్నది వాస్తవం. ఎన్.టి.ఆర్. తన అల్లుడు చంద్రబాబు నాయుడును దూషిస్తూ, ‘ద్రోహి, ఔరంగజేబు కన్నా నీచం’ అని అన్నారు. అలా తన తండ్రి దూషణలకు గురైన చంద్రబాబుకు అత్యంత విశ్వాస పాత్రుడుగా, విధేయుడుగా బాలకృష్ణ వ్యవహరించడం ఏమి సంస్కృతి అన్నదానికి ముందుగా ఆయన వివరణ ఇచ్చి, ఆ తర్వాత ఎదుటివారిపై వ్యాఖ్యలు చేస్తే మంచిది. కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
కన్నీటి మడుగులో మొసళ్లు!
రాజీవ్‌గాంధీ మన దేశానికి ఐదేళ్లపాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. టెలీకమ్యూనికేషన్స్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న కొత్త గాలులకు ఆయన కాలంలోనే భారత్ తెరచాప లెత్తింది. నూతన ఆర్థిక పంథా వైపు అప్పుడే దేశం అడుగులు వేసింది. ఆ తొలి అడుగులే తదనంతర కాలంలో సంస్కరణల ప్రస్థానంగా మారాయన్న సంగతిని అందరూ అంగీకరిస్తు న్నారు. దురదృష్టవశాత్తు చిన్నవయసులోనే రాజీవ్ తీవ్రవాదుల రక్తదాహానికి బలయ్యారు. భారత క్రీడారంగంలో ఒక అత్యు న్నత పురస్కారాన్ని రాజీవ్ పేరు మీద ఆయన జ్ఞాపకార్థం పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘రాజీవ్ ఖేల్‌రత్న’ పేరుతో క్రీడారంగ పురస్కారాలకు తలమానికంగా ముప్ప య్యేళ్లపాటు ఈ అవార్డు కొనసాగింది. ఏడాది కింద నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులో రాజీవ్ పేరును తొలగించి ధ్యాన్‌చంద్ పేరును చేర్చింది. భారతదేశ క్రీడారంగ కీర్తి పతాకాన్ని దేశదేశాల్లో సమున్నతంగా ఎగరేసిన హాకీ ఎవరెస్ట్ ధ్యాన్‌చంద్. ఈ పేరు మార్పు వల్ల దేశంలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపడానికి, పోరాట పటిమను రగల్చ డానికి ధ్యాన్‌చంద్ పేరే సరైనదని బుద్ధిజీవులందరూ భావిం చారు. ఈ పేరు మార్పు వల్ల రాజీవ్‌గాంధీకి అవమానం జరిగినట్టుగా ఎవరూ అనుకోలేరు. ఆయన ప్రతిష్ఠ మసకబార లేదు. ఆయన ఘనతలకు మకిలంటలేదు. రాజీవ్‌గాంధీ ప్రత్యే కతలూ, విజయాలు చెక్కుచెదరలేదు. క్రీడారంగ మకుటంపైకి మాత్రం చేరవలసిన రత్నమే చేరింది. దాదాపుగా ఇటువంటి సన్నివేశమే ఈ వారం ఆంధ్ర ప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. ఎన్టీఆర్ పేరు స్థానంలో రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును కూడా ఆమోదించింది. తెలుగుదేశం పార్టీ అధినాయ కత్వం అంతరాంతరాల్లో మాత్రం ఈ పరిణామం కొంత ఉప శమనాన్నీ, సాంత్వననూ కలిగించింది. ప్రవాహంలో కొట్టుకు పోయేవాడి చేతికి గడ్డిపరక దొరికితే కలిగే ఉపశమనం లాంటిది. ఆ పార్టీలో, దాని అనుబంధ ఎల్లో కూటమిలో సదరు గడ్డిపరక ఎన్నెన్నో భావాల్ని, ఊహల్ని ఎగదోసింది. ఈ గడ్డిపరకే బ్రహ్మాస్త్రమై మండి రాష్ట్రం రావణకాష్ఠమై కాలుగాక! ధర్నాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలతో జనజీవనం అట్టుడికిపోవుగాక! సప్త సముద్రాలు ఉప్పొంగి విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా పనికిరాకుండా చేయుగాక! జన సమ్మర్దం చెలరేగి తక్షణం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గద్దె దిగును గాక! మన చంద్రన్న అధికారం స్వీకరించాలనీ ఊరూ వాడా ఏకమై అర్జీలు పెట్టుగాక! ఈ రకమైన మంత్రాలు పఠించి వారు గడ్డిపరకను ప్రయోగించారు. ఒకరో ఇద్దరో మంత్రాలు చదవడం కాదు... వేద పఠనం మాదిరిగా సామూహిక మంత్ర పఠనాలు చేయించారు. పత్రికా కార్యాలయాల్లో, టీవీ చర్చల్లో ఈ సామూహిక మంత్ర పఠన, విలేఖన కార్యక్రమాలు జరి గాయి. ఇతర రాజకీయ పార్టీలను సమీకరించి వారి చేతనూ పఠింపజేశారు. తటస్థుల పేరుతో ఇంకొందర్ని అద్దెకు తెచ్చి చదివింపులు చేయించారు. మన సినిమాల్లో సతీసావిత్రి, సతీ సక్కుబాయి వంటి నాయికలు మంత్రతుల్యమగు ఇటువంటి శాపనార్థాలను పెట్ట డంలో ప్రసిద్ధి చెందారు. ఈ మంత్ర శాపాలకు ముందు వారు విధిగా ‘నేనే పతివ్రతను అగుదునేనీ’ అంటూ తమ మహత్తును షరతుగా విధించేవారు. ఎల్లో కూటమి ఈ షరతును పెట్టలేదు. ఎందుకో జడుసుకున్నట్టుంది. మంత్రాలకు చింతకాయలే రాల వంటారు. ఇక గడ్డిపరకలు బ్రహ్మాస్త్రాలవుతాయా? అవలేదు. అక్కడక్కడా ఒక్కపూట ధర్నాలకే శక్తులుడిగిపోయాయి. ఇప్పుడు ఎన్టీఆర్‌ను నిజంగా అవమానించింది ఎవరు అనే చర్చ మొదలైంది. అదేదో సినిమాలో ఓ కామెడీ రౌడీ ఉంటాడు. ఆ ముఠా మీద హీరో కాల్పులు జరుపుతాడు. అందరూ పడి పోతారు. ఈ కామెడీ రౌడీ ఒక్కడే నిలబడి ఉంటాడు. ‘అన్నియ్యా! అందర్నీ చంపేశావు, నన్నొక్కడినే వదిలేశావు ఎందుకన్నియ్యా?’ అని అడుగుతాడు కామెడీ రౌడీ. ‘ఒరేయ్! నీకు బాగా కొవ్వెక్కువై తెలియడం లేదు కానీ, నీకు బుల్లెట్ దిగి చాలాసేపైంద’ంటాడు హీరో. ఎన్టీఆర్‌కు అవమానం అనే విషయంలో బుల్లెట్ దిగింది తమకేనన్న విషయం రెండు రోజుల తర్వాత గానీ ఎల్లో కూటమికి అర్థం కాలేదు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రే వివరణ ఇచ్చారు. డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి స్వయంగా వైద్యుడు. రాజకీయాల్లోకి రాకముందు పేదల వైద్యుడిగా ప్రసిద్ధికెక్కారు. కేవలం ఒక్క రూపాయి ఫీజుతోనే రోగుల్ని పరీక్షించేవారు. అదీ ఇవ్వలేనివారిని ఉచితంగానే చూసే వారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఆరోగ్య రంగంలో అప్పటికి అనూహ్యమైనటువంటి మార్పుల్ని తీసు కొచ్చారు. ఈ మార్పుల వెనుకనున్న ఆలోచనలకు ఆయన చేసిన పాదయాత్ర పాదు చేసింది. వైద్యరంగం కార్పొరేటీకరణ జడలు విప్పిన రోజులవి. ప్రభుత్వం అనధికారికంగా ఆ రంగాన్ని వదిలివేస్తున్న సమయమది. పెద్ద రోగమొస్తే ఆస్తులమ్ము కోవడం, అవీ లేకుంటే చావు కోసం ఎదురు చూడటం తప్ప మరో దారీతెన్నూ లేని దయనీయమైన కాలం అది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ పాడుకాలపు కృతికర్త మరెవరో కాదు... నారా చంద్రబాబు నాయుడు! దైన్యాన్ని కళ్లారా చూసిన డాక్టర్ నాయకుని గుండెకు తట్టిన తక్షణ తరుణోపాయం – ఆరోగ్యశ్రీ. ప్రజారోగ్యానికి ఇది సంజీ వని మూలికలా పనిచేసింది. తదనంతర కాలంలో యావత్తు భారతావనికే ఆదర్శంగా నిలబడిపోయిన పథకమిది. అలాగే 108, 104 ఎమర్జెన్సీ సర్వీసులు. ఇప్పుడు ప్రతి రాష్ట్రం ఏదో ఒక స్థాయిలో అమలుచేయక తప్పని పరిస్థితిని ఈ సర్వీసులు కల్పించాయి. ఈ కార్యక్రమాల అమలు ద్వారా డాక్టర్ రాజశేఖర రెడ్డి రోగుల పాలిటి ఆత్మబంధువుగా, పేదల పాలిటి పెన్నిధిగా అవతరించారు. అందువల్లనే ఆయన చనిపోయినప్పుడు తెలుగునాట ప్రతి ఇంటి గడపపై శోకదేవత బైఠాయించింది. అందుకే అన్ని వందల గుండెలు పగిలిపోయాయి. ప్రజారోగ్య రంగానికి డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు వాటికవే చాలు... హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడానికి! కానీ, అంతమాత్రం చేతనే మార్చలేదు. కథ చాలా ఉన్నది. వైఎస్సార్ పేరుతో ఏర్పడిన రాజకీయ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది. ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఉన్నారు. ఆయన ఇప్పుడున్న సమాజాన్ని సమూలంగా విప్లవీకరించి సమున్నతంగా నిలబెట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందు కోసం వివిధ కీలక రంగాలతోపాటు ప్రజారోగ్య వైద్య వ్యవస్థలో కూడా ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్రం వచ్చిన డెబ్బయ్యేళ్లలో రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే ఇప్పుడు ఒకేసారి 17 కాలేజీలను జగన్ ప్రారం భించారు. 16 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ‘నాడు–నేడు’ పేరుతో ప్రజారోగ్య వ్యవస్థను ప్రజలకు చేరువ చేశారు. గ్రామాల్లో కొత్తగా 1032 వైఎస్సార్ విలేజి క్లినిక్స్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎమ్, ఆశా వర్కర్ నిరంతరం అందుబాటులో ఉంటారు. 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నవీక రించారు. ఆ కేంద్రాల్లో గతంలో ‘డాక్టర్ వస్తాడో రాడో’ అనే పరిస్థితి. ‘నర్సు ఉంటుందో ఉండదో’ తెలియని అనిశ్చిత వాతావరణం ఉండేది. అందువల్ల ఖర్చయినా సరే, చిన్న రోగాలకు సైతం జనం ప్రైవేట్ బాట పట్టేవారు. ఇప్పుడు నిర్దేశించిన కార్యక్రమం ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇద్దరు డాక్టర్లు, నర్సులు సహా పన్నెండుమంది సిబ్బంది ఉంటారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాలను ఇద్దరు డాక్టర్ల మధ్య విభజిస్తారు. ఒక డాక్టర్ కేంద్రంలో ఓపీని చూస్తుంటే, మరో డాక్టర్ 104 మొబైల్ సిబ్బందితో కలిసి తనకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తారు. పెద్ద రోగాలతో బాధపడుతున్న వారి గృహాలకు స్వయంగా వెళతారు. మిగిలిన వారిని మొబైల్ దగ్గర పరీక్షించి అవసరమైన మందులు, సలహాలు ఇస్తారు. కొంతకాలం గడిచేసరికి వారికి కేటాయించిన గ్రామాల్లోని రోగులకు సంబంధించిన సమస్త వివరాలు ఆ డాక్టర్‌కు తెలిసిపోతాయి. రోగుల హెల్త్ ప్రొఫైల్ కూడా తయారవుతుంది. ఆచరణలో ఈ ప్రజలందరికీ ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉంటే చాలా ప్రమాద కరమైన జబ్బులను మొగ్గదశలోనే గుర్తించి నయం చేసే అవకాశం ఉంటుంది. ప్రజలకు వ్యయ ప్రయాసల భారం తగ్గుతుంది. ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో సైతం ఎగువ మధ్యతరగతి ప్రజలకు కూడా ఒక మంచి ఫిజీషియన్ అపాయింట్మెంట్ దొరకడమే కష్టంగా మారింది. ముక్కు నొప్పి వస్తే ముక్కు డాక్టర్ దగ్గరికీ, మోకాళ్లు నొప్పిచేస్తే... చిప్పలు మార్చివేయాలని సలహాలిచ్చే ఆర్థోల దగ్గరికీ, గ్యాస్ట్రబుల్తో వెళితే ఇరవై రెండు పరీక్షలు చేసి గుండు గొరిగే పెద్దాసుపత్రుల దగ్గరికీ పరుగెత్తక తప్పడం లేదు. వ్యక్తి ఆరోగ్యాన్ని సమగ్ర దృష్టితో పరీక్షించే ఫిజీషియన్లే దొరక నప్పుడు ఇక ఫ్యామిలీ డాక్టర్ అనే వ్యక్తి ఒక గగన కుసుమం. ఆ గగన కుసుమాన్ని ఇప్పుడు ప్రతి మారుమూల పల్లెలో, నిరుపేదల ఇంటి ముంగిట్లో పూయించడం కోసం ఒక బృహత్తరమైన ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపైకి ఎత్తుకున్నది. ఈ తరహా ప్రజారోగ్య ఉద్యమం భారతదేశంలో న భూతో! ఏ కార్యక్రమమైనా ఉద్యమ రూపు దాలిస్తేనే ప్రజలకు చేరువవుతుంది. ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతుంది. ఉద్యమ రూపు దాల్చాలంటే ఆ కార్యక్రమంలోని పాత్రధారు లను ఉత్తేజపరిచే అంశాలు అందుబాటులో ఉండాలి. ఏ ఉద్యమానికైనా తనవైన కొన్ని ప్రతీకలుండాలి. తనదైన కొంత పదజాలం ఏర్పడాలి. తనవైన కొన్ని పేర్లుండాలి. ఉద్యమంలో స్ఫూర్తి నింపగల మూర్తిమత్వం ఉండాలి. ప్రజారోగ్య రంగానికి సంబంధించిన వరకు ఆ మూర్తిమత్వం ఎన్టీఆర్‌లో దొరకదు. వైఎస్సార్‌లో దొరుకుతుంది. అందుకు కారణం ఈ నేపథ్య మంతా! ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి నంతమాత్రాన ఆయనను అవమానించినట్టు కాదు, ఆయనకు అసలైన అవమానం జీవించి ఉన్నప్పుడే జరిగింది. ఆయన కళారంగంలో ఒక ధ్రువతార. మహానటుడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. అది నిజమే! ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. రాజకీయ రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. పేదల సంక్షేమంలో, పాలనా సంస్కరణల్లో తన కాలానికి ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన చనిపోయి 26 సంవత్స రాలవుతున్నది. ఇందులో 14 సంవత్సరాలపాటు ఆయన స్థాపించిన పార్టీయే అధికారంలో ఉన్నది. ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆయన విశేషంగా ప్రభావితం చేసిన రంగాల్లో ఏదైనా సంస్థకో, పథకానికో తెలుగుదేశం పార్టీ ఆయన పేరు పెట్టి ఉండవలసింది. ఆ పని చేయలేదు. ఎమ్జీ రామ చంద్రన్‌కు లభించిన ‘భారతరత్న’ పురస్కారం ఎన్టీఆర్‌కు కూడా రావాలని ఆయన అభిమానుల ఆకాంక్ష. చంద్రబాబు రాష్ట్రపతులనూ, ప్రధానమంత్రులనూ నియమించగల స్థితిలో ఉన్నప్పుడు (ఆయనే చెప్పుకున్నట్టు) ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇప్పించగలిగేవారు. కానీ ఎందుకు ఇప్పించలేదో ఇంతవరకూ ఆయన సంజాయిషీ ఇవ్వలేదు. ప్రజారోగ్య రంగంలో ఎన్టీఆర్ చేసిన కృషి స్వల్పం. హెల్త్ యూనివర్సిటీ మకుటంపైకి ఇప్పుడు అర్హమైన రత్నమే చేరింది. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం గౌరవించింది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం 14 ఏళ్లలో ఆ పని కూడా చేయలేకపోయింది. ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీ నుంచి తొల గించడంపై యాగీ చేసి లబ్ధి పొందాలనుకున్న తెలుగుదేశం ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడి చిందెవరు? ఆయన చావుకు కారకులెవరు? ఆయన పార్టీని అక్రమంగా లాక్కున్నదెవరు? ఆయన జెండానూ, బ్యాంకులో ఉన్న నిధులనూ స్వాధీనం చేసుకున్నదెవరు? ఆయనపై చెప్పులు వేయించిందెవరు? ఎన్టీఆర్‌కు నీతి నియమాలు లేవని ‘ఇండియా టుడే’కు ఇంటర్వ్యూలు ఇచ్చింది చంద్రబాబు కాదా? ఎన్టీఆర్ పరువుప్రతిష్ఠలు దిగజార్చేలా నగ్న కార్టూన్లు వేసి దూషణలతో కూడిన రాతలు రాయించింది రామోజీరావు కాదా? దుర్మార్గులు, కపటులు, మోసగాళ్లని చంద్రబాబు, రామోజీలను ఎన్టీఆర్ విమర్శించలేదా? చంద్రబాబు ఒక మీడియా అధిపతితో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ‘వాడు వీడు’ అని అవాకులు చెవాకులు పేలిన వీడియో బయటకు రాలేదా? ఆ వీడియోపై ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదెందుకు? ఈ రకమైన ప్రశ్నలతో, నాటి పేపర్ల క్లిప్పింగులతో సోషల్ మీడియా నేడు హోరెత్తుతున్నది. ఎన్టీఆర్ పేరుతో బతికి బట్టకడదామనుకున్న ఎల్లో కూటమికి అడుగడుగునా ప్రతిఘటన ఎదురవుతున్నది. ఎన్టీఆర్ పేరు మార్పుపై సరిగ్గా స్పందిం చలేదని జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతులపై దాడికి దిగబోయిన ఎల్లో కూటమి బొక్కబోర్లా పడింది. వారిని అడుగ డుగునా అవమానించిన ఎల్లో కూటమి, జూనియర్ సినిమాలను దొంగ రివ్యూలతో, తప్పుడు ప్రచారాలతో దెబ్బతీయడానికి ప్రయత్నించిన ఎల్లో కూటమి ధర్మపన్నాలను జనం అసహ్యించు కుంటున్నారు. సినీనటుడు బాలకృష్ణ ట్వీట్‌తో నెటిజన్లు ఆడుకుంటున్నారు. ‘పండిత పుత్రః పరమ శుంఠః’ అనే నానుడి మరోమారు రుజువైందని చెప్పుకుంటున్నారు. ఎల్లో కూటమి ఎన్టీఆర్ పేరును జపించినంతకాలం... ఆయన ఆత్మ ఆ కూటమిని శపిస్తూనే ఉంటుంది! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వైఎస్సార్ గొప్పతనం భావితరాలకూ తెలియాలి
సాక్షి, అమరావతి: హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం సముచితం, ప్రశంసనీయం, ఆహ్వానించాల్సిన విషయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు సంబంధించిన బిల్లును మంగళవారం ఆమె అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ విజయాలు, ఆయన అందించిన సేవలు, ఆయన చూపిన దాతృత్వం, మంచితనం, గొప్పదనం భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే హెల్త్ వర్సిటీకి ఆయన పేరు పెట్టామని స్పష్టం చేశారు. ‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది ప్రాణాలు కాపాడారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఈ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంలో తప్పేంటి? ఎన్టీఆర్‌ను వాడు, వీడు అని సంబోధించిన వ్యక్తి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఫొటో, పేరు కనిపించకూడదని మాట్లాడతారు. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగువారు ఎవరూ మర్చిపోలేదు. (2019 ఎన్నికల ముందు మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు) చంద్రబాబు, రాధాకృష్ణ మనసులో ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయో ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మాటలు చంద్రబాబువి కాదా? ‘ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీయే ఉందా ఇంకా.. అని రాధాకృష్ణ అడిగితే, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు మారుస్తాం.. అది ఎప్పుడో మరిచిపోయారు.. వాడిది అయిపోయింది.. వాడిది అప్పుడు’ అని ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడారు. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అప్పట్లో చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో ప్రచురితమైన పత్రికల్లో ఇది కనిపిస్తుంది. ఇదీ చంద్రబాబుకు ఎన్టీఆర్ మీదున్న గౌరవం. (ఆ క్లిప్పింగ్స్ ప్రదర్శించారు) సీఎం వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ మీద అపార గౌరవం ఉంది కాబట్టే ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు’ అని చెప్పారు. ప్రజలతో విడదీయలేని బంధం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటేనే తెలుగు ప్రజలకు విడదీయలేని ఒక బంధం.. ఒక భావోద్వేగం అని మంత్రి రజిని చెప్పారు. ‘వైఎస్సార్ మరణవార్త విని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన 800 మంది అందుకు సాక్ష్యం. ఒక మనిషి శాసిస్తే.. గాడి తప్పిన ఒక రాష్ట్రం పట్టాలెక్కుతుందంటే ఆ వ్యక్తి డాక్టర్ వైఎస్సార్. వైఎస్సార్ గొప్ప మానవతావాది. పరిపాలన దక్షుడు. ప్రజల కోసమే బతికాడు. ప్రజల కోసం వెళ్తూనే మరణించాడు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 8 మెడికల్ కాలేజీలు ఉంటే.. వైఎస్సార్ 3 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. ఇప్పుడు ఆయన తనయుడుగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో మరో 17 మెడికల్ కాలేజీలను తీసుకురాబోతున్నారు. మొత్తం మన రాష్ట్రంలో 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయి. వైఎస్సార్ ఎన్నో గొప్ప పనులు చేసినందున మనం క్రెడిట్ తీసుకోవడంలో తప్పు లేదు’ అని చెప్పారు. ఔరంగజేబుకు, చంద్రబాబుకు తేడా లేదు నారాయణ స్వామి, డిప్యూటీ సీఎం చంద్రబాబు, ఔరంగజేబు ఒక్కటే. మామను వెన్ను పోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. తమ్ముడిని కూడా మానసిక సంక్షోభంతో ఇంటికే పరిమితం చేశాడు. చంద్రబాబు పగ, ఈర్ష్య, ద్వేషంతో పుట్టాడు. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని సవాల్ విసరడం కాదు.. జడ్ కేటగిరీ భద్రత లేకుండా నువ్వు రావాలి. పేద వారిని దగ్గరకు తీసుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉందా? సత్య హరిశ్చంద్రుడిని వైఎస్ జగన్ రూపంలో చూశాం. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేందుకు కుప్పం నాంది పలుకుతుంది. ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎంతో గౌరవం. వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అందుకే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెడుతున్నాం. రాజకీయంగా ఏమీ లేక, టీడీపీ సభ్యులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారు. బాబు హయాంలో ఎన్టీఆర్ పేరుపై ఒక్క పథకం లేదు అబ్బయ్య చౌదరి, దెందులూరు ఎమ్మెల్యే సభలో టీడీపీ సభ్యుల తీరు చాలా బాధాకరం. స్పీకర్ వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. అధికారం కోల్పోతేనే టీడీపీకి ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. అధికారంలో లేనప్పుడే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ‘ఎన్టీఆర్ పేరును ఆరోగ్యశ్రీ పథకంలో తీసేస్తా, వాడి పేరు కనబడకుండా చేస్తా, ఇక ఏ పథకానికి వాడి పేరు పెట్టను’ అని చెప్పింది చంద్రబాబే. ప్రతి పథకానికి చంద్రన్న పేరు పెట్టుకున్న వీళ్లు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు నటించడం తగదు. బాబు హయాంలో ఎన్టీఆర్ పేరుపై ఒక్క పథకం లేదు. ఎన్టీఆర్‌ను మా పార్టీ గౌరవించింది. హెల్త్ వర్సిటీకి ఎందుకు వైఎస్సార్ పేరు పెట్టాలనుకున్నామో తెలుసుకోకుండా ఆందోళన చేయడం తగదు. వైఎస్సార్ పేరు ఆమోదయోగ్యం మంత్రి, మేరుగు నాగార్జున దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి భారతదేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో ఆరోగ్యశ్రీ పేదల ఆరోగ్యానికి అండగా నిలిచింది. పేద ప్రజల కోసం ఆలోచన చేసే రూపాయి డాక్టర్‌గా వైఎస్సార్‌కు పేరుంది. అలాంటి మహనీయుడి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెడితే బాగుంటుందని భావించాం. సీఎం వైఎస్ జగన్ ఏ మండలానికి వెళ్లినా బ్రహా్మండమైన ఆస్పత్రి, జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖరరెడ్డి పేరు ఆమోదయోగ్యం అని భావిస్తున్నాం. ఇక టీడీపీ వాళ్ల బాగోతం గురించి ఎంత చెప్పినా తక్కువే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయులు, రామానాయుడులు సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌ను బహిరంగంగానే కొట్టారు. వీధి రౌడీగా ఉండి మర్డర్ కేసు వల్ల విజయవాడ నుంచి వెళ్లి విశాఖపట్నంలో స్థిరపడిన రామకృష్ణబాబు కూడా చేయి చేసుకున్నారు. పయ్యావుల కేశవ్ సభలో రౌడీలా ప్రవర్తించారు. ఎన్టీఆర్ పట్ల బాబుకు గౌరవం లేదు మంత్రి, అంబటి రాంబాబు తెలుగుదేశం సభ్యుల ప్రవర్తన చాలా దురదృష్టకరం. రెడ్ లైన్ దాటి, స్పీకర్ పోడియం వద్దకు వచ్చి, దౌర్జన్యం చేస్తూ, కాగితాలు చించి పైకి విసరడం ఏమిటీ? ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న పచ్చ కాగితాలు తెచ్చి చించి పడేయడం చూస్తే వారికి వాళ్ల నాయకుడి మీద ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు గౌరవం ఇవ్వకూడదని ఎప్పుడూ అనుకోలేదు. మా ప్రభుత్వం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యులు, ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆరోగ్యశ్రీని తెచ్చిన ఆ మహానుభావుడి పేరును హెల్త్ వర్సిటీకి పెట్టాలని భావిస్తున్నాం. ఎన్టీఆర్‌ను అవమానించింది చంద్రబాబే. ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీకి ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి ఐఎస్వో సర్టిఫికెట్
సాక్షి, లబ్బీపేట (విజయవాడ తూర్పు): పారదర్శకమైన సేవలు అందిస్తున్నందుకుగాను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. వర్సిటీలో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఐఎస్వో ఏపీ, తెలంగాణ ఇన్చార్జి శివయ్య చేతుల మీదుగా వీసీ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ ఐఎస్వో సర్టిఫికెట్‌ను అందుకోనున్నారు. నెల రోజుల కిందట శివయ్య బృందం వర్సిటీని సందర్శించి మెడికల్, ఆయుష్, పారా మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుపుతున్న తీరు, అకడమిక్ విభాగంలో పారదర్శక సేవలు, పరీక్షల నిర్వహణ వంటి అన్ని విషయాలను పరిశీలించింది. వర్సిటీలో పారదర్శకంగా నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు గుర్తించి ఐఎస్వో సర్టిఫికెట్‌ను అందించనున్నారు. కాగా ఇప్పటివరకు దేశంలోని ఏ ఆరోగ్య వర్సిటీ ఐఎస్వో సర్టిఫికెట్‌ను పొందలేదని, దీన్ని తొలిసారిగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అందుకుంటున్నందుకు సంతోషంగా ఉన్నట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. (క్లిక్: తత్కాల్ టికెట్స్‌పై ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం) -
గడువులోగా మెడికల్ కౌన్సెలింగ్ పూర్తి
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెడికల్ అడ్మిషన్స్లో ఈ ఏడాది సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో వాటిని పరిష్కరిస్తూ ప్రక్రియను కొనసాగిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయించిన సమయానికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. యూనివర్సిటీ యూజీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను ఆయన గురువారం మీడియాకు వివరించారు. యూనివర్సిటీ అడ్మిషన్లకు సంబంధించి పదేళ్లుగా ఒకే సాఫ్ట్వేర్ సంస్థను వినియోగిస్తుండటంతో ఆడిట్ అభ్యంతరాలు తలెత్తాయని, దీంతో టెండర్లు పిలవగా.. హైదరాబాద్‌కు చెందిన సంస్థ టెండర్ దక్కించుకుందని తెలిపారు. అపోహలకు తావులేదు.. యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో మొత్తం 2,342 పీజీ/డిప్లమో సీట్లుండగా, వాటిలో 50 శాతం నేషనల్ పూల్‌కు పోను, రాష్ట్ర కోటాగా 38 స్పెషాలిటీల్లో 1,171 సీట్లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యూనివర్సిటీ పీజీ, డిప్లమో సీట్ల భర్తీకి నవంబర్ 3న నోటిఫికేషన్ ఇచ్చినట్టు వీసీ తెలిపారు. వెబ్సైట్లో కొన్ని సాంకేతిక పరమైన చిక్కులతో డిసెంబర్ 23న రీ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. మెరిట్ లిస్టును జనవరి 19న ప్రకటించి, నాన్ సర్వీసు కోటాకు సంబంధించి ఫిబ్రవరి 1న సీట్ల అలాట్మెంట్ చేశామన్నారు. కొన్ని లోపాలు తలెత్తినట్టు నిపుణుల కమిటీ గుర్తించి, వాటిని రద్దు చేసి, ఫిబ్రవరి 2న రీ నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో 7న సీట్లు అలాట్ చేసి, 14లోపు జాయిన్ అవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. సర్వీసు కోటాకు సంబంధించి తెలంగాణ వారికీ సీట్లు కేటాయించాలని కోర్టు ఉత్తర్వుల మేరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఈ నెల 13న నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. సర్వీస్ కోటాలో మిగిలిన సీట్లు నాన్ సర్వీస్ కోటాలో భర్తీ చేస్తామని తెలిపారు. మార్చి 7 నాటికి పీజీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేస్తామని, ఇందుకోసం యూనివర్సిటీ సిబ్బంది పబ్లిక్ హాలిడేస్, ఆదివారాల్లో సైతం పనిచేస్తున్నారని, ఎలాంటి అపోహలకు తావులేదని వీసీ వివరించారు. యూజీకి 14 వేల దరఖాస్తులు.. ఎంబీబీఎస్, ఎండీఎస్ అడ్మిషన్ల కోసం జనవరి 28న నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిపారు. నోటిఫికేషన్ గడువు ఫిబ్రవరి 8తో ముగిసిందని, ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. ఈ నెల 25తో పరిశీలన పూర్తి చేసి, 28న ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటిస్తామని వీసీ వివరించారు. మార్చి మొదటి వారంలో మొదటి దశ, రెండో వారంలో రెండో దశ, మూడో వారంలో మూడో ఫేస్ యూజీ కౌన్సెలింగ్ నిర్వహించి మార్చి 19 నాటికి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. -
AP: వైద్యుల సేవలు భేష్
సాక్షి, లబ్బీపేట(విజయవాడతూర్పు): కరోనా సమయంలో రోగులకు వైద్యులు, వైద్య విద్యార్థులు మెరుగైన సేవలందిస్తున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. భవిష్యత్‌లో కూడా సమాజానికి, పేదలకు తగిన సేవలందించాలని సూచించారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 22, 23వ స్నాతకోత్సవం గురువారం విజయవాడలో జరిగింది. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ హరిచందన్ రాజ్‌భవన్ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. సెకండ్ వేవ్ ఒక్కసారిగా విజృంభించి.. ప్రమాదకర స్థితికి తీసుకెళ్లిన సమయంలో వైద్యులు చేసిన సేవలు ఎనలేనివన్నారు. వైద్య, అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులను సైతం ఈ దిశగా ప్రోత్సహించాలని చెప్పారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం చేయాలని సలహా ఇచ్చారు. వైద్య విద్యలో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం వైస్ చాన్సలర్ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ యూనివర్సిటీలో అనుసరిస్తున్న నూతన విధానాలను వివరించారు. డాక్టర్ పళనివేలు, డాక్టర్ నాగేశ్వరరెడ్డికి డాక్టరేట్లు.. కోయంబత్తూరులోని జెమ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ సి.పళనివేలు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. అలాగే ఐదుగురికి పీహెచ్‌డీలు, ఒకరికి సూపర్ స్పెషాలిటీ డిగ్రీ అందజేశారు. 125 మంది విద్యార్థులకు 150 మెడల్స్, 42 మందికి నగదు బహుమతులు ప్రదానం చేశారు. రాగిణి అనే విద్యార్థిని అత్యధికంగా మూడు గోల్డ్‌మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్, రెండు నగదు బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, కాకినాడ రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.బాబ్జి, గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.పద్మావతి, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్, వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఇ.రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం.. జరిగేది అప్పుడే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ 22, 23వ స్నాతకోత్సవాలు జనవరి 6న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పీహెచ్‌డీలు, మెడల్స్, బహుమతులు అందిస్తున్నట్టు చెప్పారు. మెడల్స్, బహుమతులకు ఎంపికైన వారి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. ఈ నెల 8న జరగాల్సిన ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. టెన్త్ విద్యార్థులకు ‘సర్టిఫికెట్’ ఇవ్వాలి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి సాక్షి, అమరావతి: పదో తరగతి పూర్తయిన తర్వాత వివిధ కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని.. వారి కోసం మార్కుల మెమోతో పాటు కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు రాష్ట్ర పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఇంటర్లో లాంగ్వేజెస్‌తో పాటు ఒకటి లేదా రెండు సబ్జెక్టులు గ్రూప్‌లో ఉంటున్నందున.. పదో తరగతిలో ఆయా సబ్జెక్టులు పాస్ అయిన వారికి ఇంటర్లో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఇవ్వాలని కోరారు. దీని వల్ల డ్రాపౌట్లు తగ్గే అవకాశముందన్నారు. -
వైఎస్సార్ కంటి వెలుగుతో ఎందరికో చూపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చూపు కోల్పోయిన ఎంతో మందిలో వెలుగులు నింపినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ పి.శ్యామ్‌ప్రసాద్ చెప్పారు. ఏపీ ఆప్తాల్మిక్ సొసైటీ (ఏపీవోఎస్) ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న 6వ రాష్ట్ర నేత్ర వైద్యుల సదస్సు ఐకాన్–2021ను శనివారం డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నేత్ర వైద్యంలో ఆధునిక పద్ధతులను వివరిస్తూ ముద్రించిన జర్నల్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా నేత్ర వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ నమ్రతా శర్మ, ఏపీ ఆప్తాల్మిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎం.పర్నికుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్.విష్ణువర్ధన్‌రావు, ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ ఎ.శ్రీహరి, ఉపాధ్యక్షుడు డాక్టర్ జీఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆయుర్వేదంలో విస్తృత పరిశోధనలు జరగాలి
తిరుపతి తుడా : ఆయుర్వేద వైద్యంలో విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఇందుకు యూనివర్సిటీ సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం ఆయన వైద్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి, కళాశాలలోని వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, రోగులు ఎంతో నమ్మకంతో చికిత్స నిమిత్తం డాక్టర్ల వద్దకు వస్తారని, వారితో ఆప్యాయంగా మాట్లాడితే సగం రోగం నయం చేసినట్లేనన్నారు. డాక్టర్లు కేవలం సంపాదన కోసమే కాకుండా పేదలకు మేలు చేసేలా కూడా ఆలోచించాలన్నారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా డాక్టర్లు నైపుణ్యం పెంచుకోవాలని వీసీ సూచించారు. పుస్తకాలు చదవడం కంటే రోగిని డీల్ చేయడమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద వైద్యంలో పరిశోధనలకు మంచి అవకాశాలున్నాయని, ప్రొఫెసర్లు ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. వైద్య రంగంలో మరింత పురోగతి సాధించడానికి ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎంబీబీఎస్ సీటు రానందువల్ల ఆయుర్వేద వైద్యంలో చేరామనే భావనను విద్యార్థులు తొలగించుకోవాలని హితవు చెప్పారు. థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండండి కోవిడ్ థర్డ్ వేవ్‌పై నిపుణుల హెచ్చరికలపట్ల అప్రమత్తంగా వుంటూ ప్రజల్ని చైతన్యపరచాలని డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ కోరారు. కోవిడ్–19 అనేక రకాలుగా రూపాంతరం చెందుతోందని.. ఆయుర్వేద వైద్యంలో కూడా దీని కట్టడికి పరిశోధనలు చేయాలన్నారు. ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, ఆర్ఎంవో డాక్టర్ జి.పద్మావతి, పీజీ రీడర్ డాక్టర్ రేణుదీక్షిత్‌తో పాటు వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి నీట్లో అర్హత సాధించినవారు ఈ నెల 21 సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కోర్సుల్లో కటాఫ్ స్కోర్, స్టేట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ముందు అఖిల భారత కోటాలో 15 శాతం సీట్లు, తర్వాత స్టేట్ కోటాలో ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లు, తదుపరి యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేస్తారు. మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం (ఈ నెల 13) నుంచే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు 147, ఎస్సీ ఎస్టీ, బీసీలకు 113, దివ్యాంగులకు 129గా కటాఫ్ మార్కులను నిర్ణయించారు. దరఖాస్తుకు వెబ్సైట్.. http://ntruhs.ap.nic.in/ అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు.. ► స్థానికులై ఉండటంతోపాటు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల్లో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం, దివ్యాంగులకు 45 శాతం) మార్కులు వచ్చి ఉండాలి. ► అభ్యర్థికి 2020 డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. వైకల్యం ఉన్నవారు నిర్ధారిత సర్టిఫికెట్ పొంది ఉండాలి. దరఖాస్తు ఫీజు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే జనరల్, బీసీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.3,540 (జీఎస్టీతో కలిపి). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,950 (జీఎస్టీతో కలిపి). అభ్యర్థులు ఆన్లైన్లో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. కావాల్సిన ధ్రువపత్రాలు ఆన్లైన్ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువపత్రాలన్నీ పీడీఎఫ్ ఫార్మాట్లో కేబీల్లోనే ఉండాలి. ► నీట్ ర్యాంకు కార్డు ► ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ మార్కుల మెమోలు ► 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు ► టీసీతోపాటు కులధ్రువీకరణ పత్రం,మైనార్టిలు, ఈడబ్ల్యూఎస్‌లకు సంబంధిత శాఖలు జారీ చేసిన ధ్రువపత్రాలు ► ఆధార్ కార్డు, లోకల్ సర్టిఫికెట్ కార్డు, పాస్‌పోర్టు ఫొటో, సంతకం, నివాస ధ్రువీకరణ పత్రం వంటివన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు సంప్రదించాల్సిన నంబర్లు ► సాంకేతిక సమస్యలకు: 9490332169, 9030732880, 9392685856 ► సలహాలు, సందేహాలకు: 08978780501, 7997710167 -
ప్రభుత్వ, కన్వీనర్ కోటా సీట్లు 3,662
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్న సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు కలిపి 3,662 ఉన్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ప్రభుత్వ పరిధిలో (ఆల్ ఇండియా కోటాతో కలిపి) 3,662 సీట్లు ఉన్నాయి. వీటికోసం అభ్యర్థులు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. రాష్ట్ర ర్యాంకులనుబట్టి చూస్తే 32 వేలమందికిపైనే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మార్కులు ఎక్కువగా వచ్చినందున గత ఏడాది కటాఫ్‌లతో బేరీజు వేయలేమని, అందువల్ల సీటు ఎక్కడొస్తుందనేని అంచనా వేయలేమని అభ్యర్థులు పేర్కొంటున్నారు. వీరు వరుసగా విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు వైద్యకళాశాల, కర్నూలు, తిరుపతి, కాకినాడ కాలేజీలను తమ ప్రాధాన్యతలుగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లోనూ మౌలిక వసతులు కల్పించడం, అధ్యాపకులను నియమించడంతో మిగతా కాలేజీల్లో సీటు వచ్చినా బావుంటుందని పేర్కొంటున్నారు. త్వరలోనే ఆన్లైన్ పరిశీలనకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. -
నీట్ స్టేట్ ర్యాంకులు విడుదల
సాక్షి, అమరావతి: నీట్లో రాష్ట్రస్థాయి ర్యాంకుల్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది. టాప్ టెన్‌లో నలుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. మొదటి ర్యాంకు అమ్మాయిలే దక్కించుకోవడం విశేషం. జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించిన గుత్తి చైతన్య సింధు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకర్‌గా నిలిచింది. జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించిన కోటా వెంకట్ ఇక్కడ రెండో ర్యాంకు సాధించారు. రాష్ట్రం నుంచి సుమారు 62 వేల మంది నీట్‌కు హాజరయ్యారు. వీరిలో అన్ని కేటగిరీలు కలిపి 35,270 మంది అర్హత సాధించారు. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు మాత్రమే అని, త్వరలోనే ఒరిజినల్ మెరిట్ లిస్టును ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. జనరల్ కేటగిరీకి 147 కటాఫ్ మార్కులు జనరల్ కేటగిరీకి 147 కటాఫ్ మార్కులుగా నిర్ధారించారు. జనరల్ పీహెచ్ కేటగిరీకి 129, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలకు 113 కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. మెరిట్ జాబితా మేరకు త్వరలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. తొలి ఐదు స్టేట్ ర్యాంకులు జనరల్ కేటగిరీ అభ్యర్థులే కాగా.. 6వ ర్యాంకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థికి దక్కింది. ఎస్సీ కేటగిరీకి చెందిన చక్రధర్ జాతీయ స్థాయిలో 39వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించారు. టాప్ 100 ర్యాంకుల్లో 45 మంది అమ్మాయిలుండగా, 55 మంది అబ్బాయిలు ఉన్నారు. జీవోలు రాగానే అడ్మిషన్లు ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. కానీ ఫీజులు, అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. జీవోలు రాగానే ఆన్లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తాం. – డాక్టర్ శంకర్, రిజిస్ట్రార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ -
‘మేలు మరిచిపోలేం..రుణపడి ఉంటాం’
సాక్షి, విజయవాడ: ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకున్న సమయంలో అండగా నిలిచిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారుల సహకారం మరువలేనిదని పీజీ మెడికల్ విద్యార్థులు అన్నారు. వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 37 రోజులుగా జీవో 56 అమలుచేయాలని ఆందోళన చేశామని, చివరకు హైకోర్టులో తమకు న్యాయం జరిగిందని విద్యార్థులు పేర్కొన్నారు. జీవో 56 తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. పీజీ మెడికల్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో చేరామని తెలిపారు. సహకరించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి మేలు మరిచిపోలేమని తెలిపారు. -
పీజీ మెడికల్ విద్యార్థుల ధర్నా
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్ యూనివర్శిటీ ఎదుట పీజీ మెడికల్ విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను తక్షణమే చేర్చుకోవాలని ఆందోళన చేశారు. పీజీ అడ్మిషన్లు పొందినా విద్యార్థులను చేర్చుకోకుండా ప్రవేట్ మెడికల్ కళాశాలలు కోర్టు ను ఆశ్రయించాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 56 తక్షణమే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రవేట్ మెడికల్ కాలేజీలు వాదనల పై ఈనెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈనెల 27 వరకు మాత్రమే కాలేజీలో చేరేందుకు గడువు ఉంది. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో పీజీ మెడికల్ ఫీజులు తగ్గించి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలిచిందని విద్యార్థులు తెలిపారు. -
పీజీ వైద్య ఫీజులపై కసరత్తు కొలిక్కి
సాక్షి, అమరావతి: పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్య ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు దాదాపు పూర్తయింది. గత కొంతకాలంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు కలిసి ఈ విషయమై పలు దఫాలుగా చర్చలు జరిపి ఫీజులు ఎంతమేరకు నిర్ణయించాలి అన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ కోటాలో ఇచ్చే 50 శాతం సీట్లకు, యాజమాన్య, ఇన్స్టిట్యూషనల్, ఎన్ఆర్ఐకి ఉన్న 50 శాతం సీట్లకు ఎంత నిర్ణయించాలి అన్నదానిపై చర్చించారు. అలాగే.. వివిధ రాష్ట్రాల్లో ఫీజులు ఎలా ఉన్నాయి.. మన రాష్ట్రంలో ఎలా ఉన్నాయో పరిశీలించారు. కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎన్ఆర్ఐ, యాజమాన్య కోటా సీట్లకు ఇక్కడే ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్న విషయం అధికారులు గమనించారు. మరోవైపు.. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు, తమకు ప్రభుత్వ కోటాలో ఇస్తున్న సీట్లకు ఫీజులు పెంచాలని లేఖలు రాశాయి. దీంతో వీలైనంత త్వరలో ఫీజులు నిర్ణయిస్తామని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఫీజులపై అధికారులిచ్చిన నివేదికలో ఇలా.. ► ఏపీలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో 50 శాతం (స్పెషాలిటీల వారీగా) ప్రభుత్వ కోటా కింద భర్తీచేస్తున్నారు. ► మిగతా 50 శాతం సీట్లలో 25 శాతం నీట్ మెరిట్‌లోనూ, మిగతా 10 శాతం సీట్లు ఇన్స్టిట్యూషన్ కోటా కింద (కాలేజీలు భర్తీ చేసుకోవచ్చు), 15 శాతం సీట్లు ప్రవాస భారతీయ కోటా కింద ఉన్నాయి. ► ఉత్తరప్రదేశ్‌లో కాలేజీ గ్రేడింగ్‌ను బట్టి ఫీజులు వసూలుచేస్తున్నారు. ► ఏపీతో పోలిస్తే మిగతా రాష్ట్రాల్లో ఫీజులు తక్కువగా ఉన్నట్లు తేలింది. ► డీమ్డ్ వైద్య కళాశాలల్లోనూ ఫీజులు పరిశీలించారు. ► చాలా రాష్ట్రాల్లో జనరల్ మెడిసిన్ సీటుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ కోటా కింద సీట్లు లేవు. ► దీంతో సీట్ల కేటాయింపులు, ఫీజుల నిర్ణయంలో మార్పులు జరగాల్సి ఉందని అధికారులు తేల్చారు. -
సీఎం వైఎస్ జగన్ ఫొటో పెట్టేందుకు నిరాకరణ!
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటో పెట్టేందుకు ప్రయత్నించగా కొంత మంది అడ్డుకుంటున్నారు. తన చాంబర్లో సీఎం వైఎస్ జగన్ ఫొటో పెట్టాలని సాక్షాత్తు హెల్త్ వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ సీవీ రావు ఆదేశించినా సంబంధిత అధికారులు బేఖాతర్ చేయడం వర్సిటీలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వర్సిటీలో కీలక పోస్టుల్లో ఉన్న కొంత మంది ఉద్యోగులు సీఎం ఫొటో పెట్టే విషయంలో తాత్సారం చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ఎక్కడా లేని విధంగా వర్సిటీలోనే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన అధికారులే.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ఫొటో పెట్టేందుకు మనసొప్పక అడ్డుకుంటున్నారని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ఫొటో పెట్టే విషయమై ప్రభుత్వం నుంచి జీవో విడుదల కాలేదంటూ కొందరు అధికారులు సాకులు చెబుతున్నారు. అయితే యూనివర్సిటీ పక్కనే ఉన్న సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ప్రిన్సిపాల్ చాంబర్లో, విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సీఎం వైఎస్ జగన్ ఫొటో ఇప్పటికే ఏర్పాటు చేసి చాలా రోజలు కావడం గమనార్హం. వర్సిటీలోని పరిపాలన, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో కీలక పోస్టుల్లో పనిచేసే కొంత మంది అధికారులు, ఉద్యోగులు గత ముఖ్యమంత్రి మీద అమితమైన మక్కువతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
ఆ ఐదు కాలేజీల వైపే విద్యార్థుల మొగ్గు..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నా అందులో ఐదు వైద్య కళాశాలల వైపే ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. నీట్లో మంచి ర్యాంకులు సాధించినవారు జాతీయ పూల్ కింద వివిధ రాష్ట్రాల్లో మంచి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు పొందే అవకాశమున్నా మన రాష్ట్ర కళాశాలల్లో చేరడానికే ఆసక్తిగా ఉన్నారు. ఆంధ్రా మెడికల్ కళాశాల (విశాఖపట్నం), గుంటూరు మెడికల్ కళాశాల, కర్నూలు మెడికల్ కళాశాల, కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాలల్లో చేరడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. గతేడాది చివరి ర్యాంకులు పొందిన అభ్యర్థుల కటాఫ్ మార్కులు చూసుకున్నా ఆ ఐదు కళాశాలల్లోనే ఎక్కువ మార్కులు సాధించినవారు ఉన్నారు. అక్కడ సీటు రాని అభ్యర్థులే మిగతా కళాశాలల వైపు చూస్తున్నారు. అధ్యాపకులు, మౌలిక వసతులే కారణం విద్యార్థులు ఆ ఐదు కళాశాలల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.. వాటిలో అధ్యాపకుల కొరత లేకపోవడం, మిగతా వాటితో పోలిస్తే మౌలిక వసతులు మెరుగ్గా ఉండటమే. అన్నిటికీ మించి ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా ఆ కళాశాలలను ఎంచుకోవడానికి కారణంగా నిలుస్తోంది. గతేడాది జనరల్ కేటగిరీలో విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌లో సీటు పొందిన చివరి ర్యాంకు అభ్యర్థికి 538 మార్కులు వచ్చాయి. అంటే ఎంతగా పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే గుంటూరు మెడికల్ కళాశాలలో చివరి ర్యాంకు పొందిన జనరల్ అభ్యర్థికి 533 మార్కులు వచ్చాయి. ఇలా పైన పేర్కొన్న ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్క విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల మినహా మిగిలిన నాలుగింటిలో చివరి ర్యాంకు పొందిన జనరల్ అభ్యర్థులకు 500 మార్కులు పైనే రావడం విశేషం. కటాఫ్‌లు పెరిగే అవకాశం మరికొద్ది రోజుల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్ని మార్కులు వస్తే ప్రభుత్వ సీటు వస్తుందనే దానిపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. తమకు వచ్చిన మార్కులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు వస్తుందా? రాదా? అనే దానిపై విద్యార్థులు చర్చించుకుంటున్నారు. పైగా ఈ ఏడాది ప్రశ్నపత్రం సులువుగానే ఉండటంతో మెజారిటీ అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించారు. దీంతో కటాఫ్ మార్కులు కూడా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశం ఉండటంతో మరికొంతమందికి సీట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది నుంచే ఆర్థికంగా వెనుకబడిన బలహీనవర్గాలకు సీట్లు కేటాయించబోతున్నారు. నేడో, రేపో నీట్లో మెరిట్ విద్యార్థుల జాబితాను వెల్లడించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
‘స్వైన్‌ఫ్లూతో ఏపీలో 21 మంది మరణించారు’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ఫ్లూ బారినపడి 2018 నుంచి ఇప్పటివరకు 21 మంది మరణించినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిపై వైఎస్సార్ సీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే మంగళవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం 2018లో ఏపీలో 402 మంది స్వైన్ ఫ్లూ బారినపడగా 17 మంది మరణించారని పేర్కొన్నారు. 2019లో ఏపీలో ఇప్పటివరకు 77 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా అందులో నలుగురు మృత్యువాత పడ్డారని చెప్పారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా 169 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు తెలిపారు. కర్నూలు జిల్లాలో 66 కేసులు నమోదు కాగా, అందులో ఆరుగురిని ఈ వ్యాధి కబళించిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ ఆడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం.. మైనారిటీ విద్యా సంస్థలు మినహా ఇతర ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆడ్మిషన్లలో రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలన్న విషయంలో ఆయా రాష్ట్రాలదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జీవో నంబర్ 550ని ఉల్లంఘిస్తూ జరిపిన మెడికల్ సీట్ల భర్తీ కారణంగా రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు జరిగిన అన్యాయం మీ దృష్టికి వచ్చిందా అని మంగళవారం రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ దుబే మెడికల్ కాలేజీ అడ్మిషన్ల కోసం ప్రతి రాష్ట్రం సొంతంగా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఆలిండియా కోటాలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : మెడికల్ కౌన్సిలింగ్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ విద్యార్థులు చేసిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు జరిగిన కౌన్సిలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో విద్యార్థులు యూనివర్సిటీని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులను పెనుమలూరు పోలీస్ స్టేషన్‌కు తరిలించారు. -
మెడికల్ కౌన్సిలింగ్ నిలిపివేత: సీపీఐ ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేతపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి పూర్తి రీకౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. మొదటి విడత కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కౌన్సిలింగ్ రద్దు చేయడం సరికాదని, మొత్తం ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సిలింగ్ రద్దు చేసి రీకౌన్సిలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 550 ప్రకారం, స్లయిడింగ్ విధానం అమలు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు న్యాయం చేయాల్నారు. కాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు శనివారం ప్రకటించారు. బీసీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై వర్సిటీ వీసీతో చర్చించామన్నారు. త్వరలో మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు.