సాక్షి, అమరావతి: నీట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకుల్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది. టాప్ టెన్‌లో నలుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. మొదటి ర్యాంకు అమ్మాయిలే దక్కించుకోవడం విశేషం. జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించిన గుత్తి చైతన్య సింధు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకర్‌గా నిలిచింది. జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించిన కోటా వెంకట్ ఇక్కడ రెండో ర్యాంకు సాధించారు. రాష్ట్రం నుంచి సుమారు 62 వేల మంది నీట్‌కు హాజరయ్యారు. వీరిలో అన్ని కేటగిరీలు కలిపి 35,270 మంది అర్హత సాధించారు. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు మాత్రమే అని, త్వరలోనే ఒరిజినల్ మెరిట్ లిస్టును ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
జనరల్ కేటగిరీకి 147 కటాఫ్ మార్కులు
జనరల్ కేటగిరీకి 147 కటాఫ్ మార్కులుగా నిర్ధారించారు. జనరల్ పీహెచ్ కేటగిరీకి 129, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలకు 113 కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. మెరిట్ జాబితా మేరకు త్వరలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. తొలి ఐదు స్టేట్ ర్యాంకులు జనరల్ కేటగిరీ అభ్యర్థులే కాగా.. 6వ ర్యాంకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థికి దక్కింది. ఎస్సీ కేటగిరీకి చెందిన చక్రధర్ జాతీయ స్థాయిలో 39వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించారు. టాప్ 100 ర్యాంకుల్లో 45 మంది అమ్మాయిలుండగా, 55 మంది అబ్బాయిలు ఉన్నారు.
జీవోలు రాగానే అడ్మిషన్లు
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. కానీ ఫీజులు, అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. జీవోలు రాగానే ఆన్‌లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తాం.
– డాక్టర్ శంకర్, రిజిస్ట్రార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment