గ్రేస్ మార్కుల గోల్‌మాల్!
- ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అడ్డగోలు వ్యవహారం
- నిర్ణయాన్ని తప్పుబట్టిన ఎంసీఐ
- పీజీలో గ్రేస్ మార్కులకు అవకాశమే లేదంటూ లేఖ
- ఎంసీఐ ఆదేశాలను అమలు చేస్తారా? అధికార పార్టీకి ఊడిగం చేస్తారా?
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఈ సారి ఆస్పత్రికి వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి..! స్పెషాలిటీ కోర్సులో పీజీ చేసిన వైద్యుడు గ్రేస్ మార్కులతో పాసయ్యారా? లేక నిజంగానే కష్టపడి చదివి పాసయ్యారా? అనే విషయాన్ని తెలుసుకోండి. పీజీ పరీక్షలు పాస్ కాలేక.. అధికార పార్టీ అండదండలు, పలుకుబడితో వర్సిటీ అధికార యంత్రాంగాన్ని ప్రభావి తం చేసి.. దొడ్డిదారిలో గ్రేస్ మార్కులు సంపాదించి పాసైన డాక్టర్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి.
గత ఏడాది జరిగిన వివిధ స్పెషాలిటీ పీజీ కోర్సుల పరీక్షలో గట్టెక్కలేక పెద్ద సంఖ్యలో డాక్టర్లు ఫెయిల్ అయ్యారు. అందులో ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన నాయకుల, అధికార పార్టీ అండదండలున్న పిల్లలు చాలామందే ఉన్నారు. వారంతా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికార యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పీజీలోనూ గ్రేస్ మార్కులు కలపాలనే వివాదాస్పద నిర్ణయాన్ని గతేడాది సెప్టెంబర్‌లో తీసుకున్నారు. ఎంబీబీ ఎస్‌లో గ్రేస్ మార్కులు కలపడం అప్పుడప్పుడు జరిగేదే అయినా పీజీలో అలా చేయడం ఎన్నడూ జరగలేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.
మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికార యంత్రాంగం తీసుకున్న వివాదాస్పద గ్రేస్ మార్కుల నిర్ణయంపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేస్ మార్కులు కలిపే విధానం.. పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఇటీవల యూనివర్సిటీకి ఎంసీఐ లేఖ రాసింది. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో పాటు దేశంలోని అన్ని వైద్య విశ్వవిద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేయాలని నవంబర్ 22న జరిగిన మెడికల్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ‘ఎంసీఐ ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులను రద్దు చేసి.. ఫెయిల్ అయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారా? అయిందేదో అయిందని, ఇక మీదట గ్రేస్ మార్కుల ప్రస్తావన తీసుకురాబోమని సరిపెడతారా? యూనివర్సిటీ పరువు నిలబెడతారో? అధికార పార్టీ నేతల ప్రాపకానికి తాకట్టు పెడతారో? చూడాలి’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.