అక్రమాలే టీడీపీ అజెండా
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
జక్కంపూడి రాజా ధ్వజం
గుంటూరు (పట్నంబజారు): కేవలం దోచుకోవడం, దాచుకోవడమే పనిగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. గుంటూ రు నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి, అక్రమాలే సింగిల్ ఏజెండాగా చంద్రబాబు ప్రభుత్వం నడుస్తోందని, ప్రత్యేక హోదా విషయంలో సైతం రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రం విడిపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, విభజన వద్దని ఆనాడే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఐదు సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని ఎన్నికల సమయంలో మాట్లాడిన చంద్రబాబు ఈరోజు హోదా సంజీవినా అని అనడం సిగ్గుచేటన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే, నేటి ప్రభుత్వం దాన్ని సరిగా అమలు చేయకుండా ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా డీఎస్సీ, ఏపీపీఎస్‌సీ నిర్వహిస్తామని చెప్పిన చంద్రబాబు కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు.
ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు..
వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు యువజన విభాగం కృషిచేస్తుందని జక్కంపూడి రాజా అన్నారు. ఆగస్టు 2వ తేదీన పార్టీ అధినేత వైఎస్. జగన్ పిలుపు మేరకు నిర్వహించనున్న బంద్ కార్యక్రమంలో యువజన విభాగం కీలకంగా వ్యవహరిస్తుందన్నారు.