కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం: రఘువీరా
మడకశిర (అనంతపురం): కృష్ణా జలాల వాటాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 160 టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దీన్ని అడ్డుకోకుండా సీఎం చంద్రబాబు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిరలో గాంధీజీ విగ్రహం ఎదుట రఘువీరా మౌనదీక్ష చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ప్రయత్నం ఫలిస్తే సీమాంధ్రలోని ఎనిమిది జిల్లాలు ఎడారిగా మారిపోవడం ఖాయమన్నారు. కృష్ణా జలాల అక్రమ వాడకాన్ని ఆపకపోతే పోలవరం నిర్మించినా ఫలితం ఉండదని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కును కాపాడుకోవడానికి ఈ నెల 23న శ్రీశైలం డ్యాం వద్ద ఎనిమిది జిల్లాల నాయకులతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిపారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్లకు టీడీపీ, బీజేపీ ఎసరు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక అమ్మకంలో రూ.5 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇసుక అమ్మకాలు, బెల్టుషాపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.