PCC President Raghuveera Reddy
-
రాష్ట్రాభివృద్ధిపై బీజేపీ, టీడీపీ దొంగాట
పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి మండిపాటు మైలవరం: రాష్ట్రాభివృద్ధిపై బీజేపీ, టీడీపీ దొంగాట అడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. తిరువూరు నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో మైలవరంలో మంగళవారం కొద్దిసేపు నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రయోజనాలు కలిగేలా విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందని తెలిపారు. ప్రస్తుతం కేంద్రం రూ.6 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలుగుదేశం, రూ. 1.70 లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ చెబుతున్నాయన్నారు. ఈ నిధులపై ఇరు పార్టీలు పోట్లాడుకుని రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలా తయారు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా కోర్టులో వీరు ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. కాపులకు చంద్రబాబు ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందన్నారు. పార్లమెంట్లో కాపు వర్గీకరణపై సవరణ చేయాలని కోరారు. కాపు వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు దేవినేని ఆవినాష్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాస్‌కుమార్, పర్సా రాజీవ్త్రన్, మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి బొర్రా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం: రఘువీరా
మడకశిర (అనంతపురం): కృష్ణా జలాల వాటాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 160 టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దీన్ని అడ్డుకోకుండా సీఎం చంద్రబాబు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిరలో గాంధీజీ విగ్రహం ఎదుట రఘువీరా మౌనదీక్ష చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రయత్నం ఫలిస్తే సీమాంధ్రలోని ఎనిమిది జిల్లాలు ఎడారిగా మారిపోవడం ఖాయమన్నారు. కృష్ణా జలాల అక్రమ వాడకాన్ని ఆపకపోతే పోలవరం నిర్మించినా ఫలితం ఉండదని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కును కాపాడుకోవడానికి ఈ నెల 23న శ్రీశైలం డ్యాం వద్ద ఎనిమిది జిల్లాల నాయకులతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్లకు టీడీపీ, బీజేపీ ఎసరు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక అమ్మకంలో రూ.5 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇసుక అమ్మకాలు, బెల్టుషాపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
కోనలో మళ్లీ ఉద్రిక్తత
మచిలీపట్నం: పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కృష్ణాజిల్లా బందరు మండలం కోన గ్రామంలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ కార్యకర్తలు ఆయన్ని అడ్డుకుని ఇసుక, కంకరరాళ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. లాఠీచార్జి చేసిన పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసిన నేపథ్యంలో రైతులతో మాట్లాడేందుకు రఘువీరారెడ్డి గ్రామానికి వచ్చారు. తొలుత మాజీ సర్పంచ్ నాగేంద్రం మాట్లాడుతూ పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ కారణంగా తమ గ్రామంతో పాటు రెండువేల ఎకరాలకు పైగా భూమి పోయే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం రైతులు భూమి కోల్పోతే తాము పడే ఇబ్బందులను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు వచ్చారు. శనివారం రాత్రి మంత్రి రవీంద్ర, ఎంపీ నారాయణరావులను మాట్లాడనివ్వకుండా పంపేశారని, కాంగ్రెస్ నాయకులు వస్తే ఎందుకు మాట్లాడనిస్తామంటూ అడ్డుతగిలారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, టీడీపీ కార్యకర్తలకు వాగ్వాదం, తోపులాట జరిగాయి. రఘువీరారెడ్డి పార్టీలను పక్కనపెట్టి రైతులంతా ఐకమత్యంగా ఉండి భూముల్ని రక్షించుకోవాలని సూచించారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు.. రఘువీరారెడ్డి మాట్లాడటానికి వీల్లేదంటూ ఇసుక ఎత్తిపోశారు. ఇంటి శ్లాబుకు ఉపయోగించే కంకరరాళ్లు విసిరారు. దీంతో లాఠీచార్జి చేసిన పోలీసులపైనా దాడికి దిగారు. శారదానగర్, పొట్లపాలెం, పోతేపల్లి, బొర్రపోతుపాలెం గ్రామాల్లో రఘువీరారెడ్డి,డీసీసీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, తదితరులతో కలసి పర్యటించారు. అనంతరం కల్యాణ మండపంలో రైతులతో సమావేశం నిర్వహించారు. -
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కోరారు. ఇదే డిమాండ్‌తో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. శ్రీకాకుళంలోని ఇందిరావిజ్ఞాన భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ విభజన చట్టంలో తీర్మాణం చేసినట్టు పేర్కొన్నారు. ఇందుకు అప్పటి ప్రతిపక్ష పార్టీ నేత వెంకయ్యనాయుడు అంగీకరించారన్నారు. ఇపుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే ప్రధాని మోడీని, ఇతర పార్టీల ప్రతినిధులను కలసి ప్రత్యేకహోదా కోసం మద్దతివ్వాలని మాట్లాడడం జరిగిందన్నారు. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రోజుకు రెండు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రియాశీల సభ్యులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతతో సత్వర అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ కాంక్షిస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ ఏపీ విభజన సమయంలో అన్ని పార్టీలూ ఏవిధంగా అయితే సహాయ పడ్డాయో ఇపుడు ప్రత్యేక హోదా కల్పన కోసం అలాగే కృషిచేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు డోల జగన్మోహనరావు మాట్లాడుతూ సోమవారం నుంచి రిలేనిరాహారదీక్షలు చేపడతామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కిల్లి రామ్మోహన్రావు, చౌదరి సతీష్, రత్నాల నరసింహమూర్తి, పైడి రవి, గంజి ఎజ్రా, ఎం.ఎ.బేగ్, చొంగ రమాదేవి, పుట్టా అంజనీకుమార్, లండ శ్రీను పాల్గొన్నారు. -
పెత్తందారులకు తొత్తుగా టీడీపీ
విజయనగరం ఫోర్ట్ : టీడీపీ ప్రభుత్వం పెత్తందారులకు తొత్తుగా మారిందని పీసీ సీ అధ్యక్షుడు ఎన్.రఘువీరెడ్డి ఆరోపిం చారు. కోటి సంతకాల సేకరణ కార్యక్ర మంలో భాగంగా సోమవారం జిల్లాకు వ చ్చిన ఆయన స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఆ ంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు సాధించే వరకు పోరాడాతామని స్పష్టం చేశారు. అరబిందో కంపెనీలో విధుల నుంచి తొల గించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగు లు ప్రశాంతంగా ఆందోళన చేపడితే వారిపై టీడీపీ ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించిందన్నారు. దీన్ని బట్టి చూస్తుం టే టీడీపీ ప్రభుత్వం పెత్తందారులకు మద్దతు పలుకు తున్నట్లు అర్థం అవుతోందని చెప్పారు. నవ్యాంధ్ర హితం కోరుతూ చేపట్టిన సంతకాల సేకరణ నాలుగు జిల్లాలో పూర్తయిందని తెలిపారు. బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీ ల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి బీజేపీ మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ మొద లు పెట్టిన తర్వాత ఉద్యమాన్ని నీరు గార్చాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ కోసం రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. దేశంలోనే శక్తివంతమైన ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ప్రధాని మోడీని నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు ప్రత్యేకహోదాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. అంతకుముందు ఇటీవల జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు వల్లూరి శ్రీనువాస్‌రావు , రామకృష్ణ, టి.వెంకటలక్ష్మి, బంగాారు ఉషలను అభినందించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి కుంతియాజ్, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎంపీలు ఝాన్సీలక్ష్మి, కనుమూరి బాపిరాజు, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యేలు అప్పలనరసయ్య, అప్పలనాయుడు, డీసీసీ అధ్యక్షుడు పిళ్లా విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. వదిలే ప్రసక్తే లేదు.. గజపతినగరం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే వరకూ పోరాటం ఆపే ప్రసక్తే లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున కోటి సంతకాల సేకరణలో భాగంగా స్థానిక నాలుగురోడ్ల జంక్షన్ వద్ద జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకు ఐదేళ్ల పాటు ప్రత్యేకహోదా కల్పించాలని ప్రతిపాదించగా, బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు దాన్ని పదేళ్లకు పెంచాలని పట్టుబట్టి సాధించుకున్నారని చెప్పారు. ఇప్పుడేమో ఆయన మాట మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్రకు 24,350 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ చట్టం చేయగా నేడు కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ. 50 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, సమన్యాయం అంటూ ఆఖరి క్షణ వరకు తప్పించుకుని తిరిగిన చంద్రబాబు చివరికి ఆ పాపం కాంగ్రెస్ మీద వేయడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కిళ్లి కృపారాణి, రాష్ట్ర పరిశీలకుడు రామచంద్ర కుంతియా, మాజీ మంత్రి కోండ్రుమురళి, మాజీ ఎమ్మేల్యేలు, బొత్స అప్పలనరసయ్య , సంబంగి చినప్పలనాయుడు, బడుకొండ అప్పల నాయుడు, డీసీసీ అధ్యక్షుడు విజయ్‌కుమార్, యడ్ల.రమణమూర్తి, యడ్ల.ఆదిరాజు, తదితరులు పాల్గోన్నారు. -
సర్వం పోయింది
ఎచ్చెర్ల: ‘సర్వం నాశనమైపోయింది.. పంటచేతికందే పరిస్థితి లేదు..ఎలా బతకాలో అర్థం కావడం లేదు..’ ఇదీ..పీసీసీ బృందం వద్ద అన్నదాతల మొర. పీసీసీ అ ధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, కోండ్రు మురళీమోహన్, కిల్లి కృపారాణి తదితరులతో కూడిన బృందం..హుదూద్ బాధితులను గురువారం పరామర్శించింది. ఎచ్చెర్ల మండలం పొన్నాడ, బొంతలకోడూరు గ్రామా ల్లో తుపాను నష్టాలను పరిశీలించారు. పాడైన వరి, అరటి, చెరుకు పంటలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఎర్రన్నాయుడు, కన్నప్పడు, నేతింటి నీలమప్పడు, పంచిరెడ్డి రాంబాబు తదితరులు సమస్యలను ఏకరువు పెట్టారు. అధికారులు కనీసం పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.రావులపాలెం నుంచి అరటి విత్తనాలను తెచ్చి పంటను సాగు చేశామని, ఎకరాకు రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టామని, పంట నెలరోజుల్లో చేతికి వస్తుందన్న సమయంలో నేల పాలైందని వాపోయారు. పొట్టదశలో ఉన్న పైరును గాలులు చీల్చేశాయని, దీంతో తెగుళ్లు ఆశిస్తున్నాయని పేర్కొన్నారు. రుణమాఫీ హామీతో మోసం రుణమాఫీ పేరిట చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని రైతులు పేర్కొన్నారు. గ తంలో రుణం తీసుకున్న వెంటనే..బీమా చేసేవారమని..ప్రస్తుతం రుణమాఫీ, రీషెడ్యూల్ లేదు సరికదా..కనీసం పంటల బీమాకు కూడా దూరమయ్యామంటూ..ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేతలు మా ట్లాడుతూ..రైతులకు న్యాయం జరిగేంత వర కు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ డోల జగన్, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కిల్లి రామ్మోహనరావు, చౌదరి సతీష్, పైడి రవి తదితరులు పాల్గొన్నారు.