సర్వం పోయింది
ఎచ్చెర్ల: ‘సర్వం నాశనమైపోయింది.. పంటచేతికందే పరిస్థితి లేదు..ఎలా బతకాలో అర్థం కావడం లేదు..’ ఇదీ..పీసీసీ బృందం వద్ద అన్నదాతల మొర. పీసీసీ అ ధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, కోండ్రు మురళీమోహన్, కిల్లి కృపారాణి తదితరులతో కూడిన బృందం..హుదూద్ బాధితులను గురువారం పరామర్శించింది. ఎచ్చెర్ల మండలం పొన్నాడ, బొంతలకోడూరు గ్రామా ల్లో తుపాను నష్టాలను పరిశీలించారు. పాడైన వరి, అరటి, చెరుకు పంటలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఎర్రన్నాయుడు, కన్నప్పడు, నేతింటి నీలమప్పడు, పంచిరెడ్డి రాంబాబు తదితరులు సమస్యలను ఏకరువు పెట్టారు. అధికారులు కనీసం పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.రావులపాలెం నుంచి అరటి విత్తనాలను తెచ్చి పంటను సాగు చేశామని, ఎకరాకు రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టామని, పంట నెలరోజుల్లో చేతికి వస్తుందన్న సమయంలో నేల పాలైందని వాపోయారు. పొట్టదశలో ఉన్న పైరును గాలులు చీల్చేశాయని, దీంతో తెగుళ్లు ఆశిస్తున్నాయని పేర్కొన్నారు.
రుణమాఫీ హామీతో మోసం
రుణమాఫీ పేరిట చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని రైతులు పేర్కొన్నారు. గ తంలో రుణం తీసుకున్న వెంటనే..బీమా చేసేవారమని..ప్రస్తుతం రుణమాఫీ, రీషెడ్యూల్ లేదు సరికదా..కనీసం పంటల బీమాకు కూడా దూరమయ్యామంటూ..ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేతలు మా ట్లాడుతూ..రైతులకు న్యాయం జరిగేంత వర కు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ డోల జగన్, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కిల్లి రామ్మోహనరావు, చౌదరి సతీష్, పైడి రవి తదితరులు పాల్గొన్నారు.