పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కృష్ణాజిల్లా బందరు మండలం కోన గ్రామంలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది.
మచిలీపట్నం: పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కృష్ణాజిల్లా బందరు మండలం కోన గ్రామంలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ కార్యకర్తలు ఆయన్ని అడ్డుకుని ఇసుక, కంకరరాళ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. లాఠీచార్జి చేసిన పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసిన నేపథ్యంలో రైతులతో మాట్లాడేందుకు రఘువీరారెడ్డి గ్రామానికి వచ్చారు. తొలుత మాజీ సర్పంచ్ నాగేంద్రం మాట్లాడుతూ పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ కారణంగా తమ గ్రామంతో పాటు రెండువేల ఎకరాలకు పైగా భూమి పోయే అవకాశం ఉందని చెప్పారు.
అనంతరం రైతులు భూమి కోల్పోతే తాము పడే ఇబ్బందులను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు వచ్చారు. శనివారం రాత్రి మంత్రి రవీంద్ర, ఎంపీ నారాయణరావులను మాట్లాడనివ్వకుండా పంపేశారని, కాంగ్రెస్ నాయకులు వస్తే ఎందుకు మాట్లాడనిస్తామంటూ అడ్డుతగిలారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, టీడీపీ కార్యకర్తలకు వాగ్వాదం, తోపులాట జరిగాయి. రఘువీరారెడ్డి పార్టీలను పక్కనపెట్టి రైతులంతా ఐకమత్యంగా ఉండి భూముల్ని రక్షించుకోవాలని సూచించారు.
ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు.. రఘువీరారెడ్డి మాట్లాడటానికి వీల్లేదంటూ ఇసుక ఎత్తిపోశారు. ఇంటి శ్లాబుకు ఉపయోగించే కంకరరాళ్లు విసిరారు. దీంతో లాఠీచార్జి చేసిన పోలీసులపైనా దాడికి దిగారు. శారదానగర్, పొట్లపాలెం, పోతేపల్లి, బొర్రపోతుపాలెం గ్రామాల్లో రఘువీరారెడ్డి,డీసీసీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, తదితరులతో కలసి పర్యటించారు. అనంతరం కల్యాణ మండపంలో రైతులతో సమావేశం నిర్వహించారు.