సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాధారణ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శాసనసభ్యులకు ‘అవిశ్వాసం’ తలనొప్పి తీవ్రమైంది. పూర్వ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నాలుగింట ఇదే పరిస్థితి నెలకొంది. సొంత పార్టీలో ఎమ్మెల్యేలకు అనుయాయులుగా వ్యవహరించినవారే అదను చూసి అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగిస్తుండడంతో ఏం చేయాలో తోచని స్థితిలో శాసనసభ్యులు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో సొంత పార్టీలోనే అసమ్మతి పెరిగిపోతుందనడానికి ఈ పరిణామాలను ఉదాహరణగా చెప్పుకునే పరిస్థితి తలెత్తింది. అవిశ్వాసం పెట్టినవారు, అవిశ్వాసాన్ని ఎదుర్కోబోయే వారు ఇద్దరూ టీఆర్‌ఎస్ వాళ్లే అవుతుండడం ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదు. ‘కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. ‘నా కనుసన్నల్లో ఉండే నాయకులు ఎదురు తిరుగుతారా?’ అనే అతి విశ్వాసం పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఇబ్బందిగా మారింది.
బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 2న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఓటింగ్ నిర్వహిస్తారు. అలాగే మండలాల్లో ఎంపీపీలపై ఇచ్చిన అవిశ్వాస నోటీసులకు కూడా ఆదిలాబాద్ జెడ్పీ సీఈవో నుంచి స్పందన వచ్చింది. నోటీసులు ఇచ్చిన తేదీల ఆధారంగా జెడ్పీ సీఈవో ప్రత్యేక సమావేశాలకు ఆదేశాలు జారీ చేశారు. కాసిపేట ఎంపీపీ శంకరమ్మపై ఇచ్చిన అవిశ్వాసం నోటీస్‌పై ఆగస్టు 7న సమావేశం ఏర్పాటు చేయగా, రెబ్బెన ఎంపీపీ సంజీవ్‌కుమార్ అవిశ్వాసంపై ఆగస్టు 9న ప్రత్యేక సమావేశం జరుగనుంది. అలాగే కుంటాల ఎంపీపీ కొత్తపల్లి గంగామణి అవిశ్వాసాన్ని ఆగస్టు 14న జరిగే సమావేశంలో ఎదుర్కోనున్నారు. ఖానాపూర్ ఎంపీపీ శోభారాణిపై అవిశ్వాస ప్రత్యేక సమావేశం ఆగస్టు 16న జరుగుతుంది. జన్నారం ఎంపీపీపై ఇచ్చిన అవిశ్వాసంపై త్వరలో నిర్ణయం వెలువడనుంది.
రాష్ట్రంలో చర్చనీయాంశమైన బెల్లంపల్లి
బెల్లంపల్లి మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లకు ఏకంగా 29 మంది అవిశ్వాసం ప్రకటించారు. వైస్ చైర్మన్‌తో పాటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ సభ్యులంతా ఈ అవిశ్వాసంలో పాలు పంచుకున్నారు. నెలరోజులుగా క్యాంపు రాజకీయాలు చేస్తుండగా, నేరుగా ఎమ్మెల్యే రంగంలోకి దిగి అసమ్మతిని అణచివేయాలని చేసిన ప్రయత్నాలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓ కౌన్సిలర్ కూతురుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన హెచ్చరికలు వైరల్‌గా మారడంతో టీఆర్‌ఎస్ అధిష్టానం కూడా ఉలిక్కిపడింది. ఈ క్రమంలోనే ఖైరిగూడ ఓసీపీలో పనిచేసే ఇద్దరు కౌన్సిలర్ల భర్తలను ఏకంగా మణుగూరుకు బదిలీ చేయిస్తూ ఉత్తర్వులు జారీ చేయించినా, కౌన్సిలర్లు తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 2న జరిగే అవిశ్వాస సమావేశం కోసం అందరితో పాటు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా ఎదురుచూస్తున్నారు. నెలరోజులకు పైగా క్యాంపులో ఉన్న అసమ్మతి కౌన్సిలర్లు ఆగస్టు 2వ తేదీన నేరుగా సమావేశానికే హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అధ్యక్షతన బెల్లంపల్లిలో జరిగే ఈ సమావేశంపైనే ఉమ్మడి జిల్లా రాజకీయ నాయకులు దృష్టి సారించారు.
కాసిపేటలో చక్రం తిప్పిన ఎమ్మెల్యే
కాసిపేట ఎంపీపీ శంకరమ్మ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వైఖరిని తప్పుపడుతూ రెండు నెలల క్రితం కోదండరాం టీజేఎస్ పార్టీలో చేరగా, ఆమెపై ఐదుగురు ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టారు. ఇక్కడ అవిశ్వాసం నెగ్గడం లాంఛనమే. అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీ ముందు కాసిపేట ఎంపీపీ అతి చిన్న అంశంగా మారింది.
ఎత్తుకు పైఎత్తుల్లో రేఖానాయక్–రమేష్‌రాథోడ్
ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టీడీపీ ద్వారా సుధీర్ఘకాలం ఎమ్మెల్యే, ఎంపీగా పదవులు పొందిన రమేష్ రాథోడ్ గత సంవత్సరం టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడే వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేసిన రమేష్ రాథోడ్ ఆ దిశగా పావులు కదుపుతూ నియోజకవర్గంలో తన వర్గాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాథోడ్ ఎత్తులను చిత్తు చేసేందుకు రేఖా నాయక్ సైతం తనవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జన్నారంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ వర్గీయులైన ఎంపీపీ చెట్టుపల్లి రాజేశ్వరిపై రమేష్ రాథోడ్ మద్దతుతో తొమ్మిది మంది ఎంపీటీసీలు అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చారు. వీరిలో ఏడుగురు టీఆర్‌ఎస్‌కు చెందిన వారు కాగా, ఇద్దరు కాంగ్రెస్ ఎంపీటీసీలు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ చక్రం తిప్పి ఒకరిద్దరు ఎంపీటీసీలను తనవైపు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు గ్రూపులు క్యాంపులోనే ఉన్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ ఖానాపూర్ మండలంలో రమేష్ రాథోడ్ వర్గానికి చెందిన శోభారాణిపై అవిశ్వాసం పెట్టించారు. ఇక్కడ ఎంపీపీకి వ్యతిరేకంగా 13 మంది క్యాంపులో ఉండడం విశేషం.
ఒప్పందాల ఉల్లంఘనతో కుంటాల, రెబ్బెన అవిశ్వాసాలు
రెబ్బెన ఎంపీపీ సంజీవ్‌కుమార్‌పై వైఎస్ ఎంపీపీతో పాటు ఏడుగురు ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించగా, ఆగస్టు 9న సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఇక్కడ ఎంపీపీ, వైఎస్ ఎంపీపీలకు మధ్య రెండున్నరేళ్ల పదవీకాలం ఒప్పందం ఉండగా, దాన్ని ఎంపీపీ ఉల్లంఘించారు. కుంటాలలో కూడా ఎంపీపీ గంగామణి, గొల్లమాడ ఎంపీటీసీకి మధ్య రెండున్నరేళ్ల ఒప్పందం ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా పదవిలో కొనసాగడంతో అవిశ్వాసం అనివార్యమైంది. ఈ పరిణామాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్ జోక్యం చేసుకున్నా రెబ్బెనలో ఫలితం లేకుండా పోయింది. కుంటాలలో టీఆర్‌ఎస్‌కే చెందిన ఎంపీటీసీల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరికి మద్ధతు ఇవ్వలేక మిన్నకుండిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment