ఆదిలాబాద్ లో కారు యమస్పీడ్! | TRS get more seats in Adilabad | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ లో కారు యమస్పీడ్!

Published Fri, May 16 2014 10:53 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TRS get more seats in Adilabad

ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎంపీ రమేశ్ రాథోడ్, బోథ్ తాజా మాజీ ఎమ్మెల్యే గడ్డం నగేశ్ టీఆర్ఎస్ పార్టీ తరపున, కాంగ్రెస్ తరపున నరేశ్ బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎంపీ రమేశ్ రాథోడ్ పై టీఆర్ఎస్ అభ్యర్ధి గడ్డం నగేశ్ 171093 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లోని తాజా ఫలితాలను ఓసారి పరిశీలిస్తే...

సిర్పూర్
సిర్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్ధి కావేటి సమ్మయ్యపై కాంగ్రెస్ టికెట్ దక్కని కోనేరు కోనప్ప బరిలో బీఎస్పీ టికెట్ పై బరిలోకి దిగారు. కావేటి సమ్మయ్యపై  8837 ఓట్ల తేడాతో కోనప్ప విజయం సాధించారు.

చెన్నూరు(ఎస్సీ)    
చెన్నూరు(ఎస్సీ) సిట్టింగ్ ఎమ్మల్యే, టీఆర్ఎస్ అభ్యర్ధి  నల్లాల ఓదెలు 26164 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి జి.వినోద్ పై విజయం సాధించారు.     

బెల్లంపల్లి (ఎస్సీ)
బెల్లంపల్లి (ఎస్సీ) నియోజకవర్గంలో కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా మల్లేష్ (సీపీఐ), టీఆర్ఎస్ తరపున చిన్నయ్య పోటీలో నిలిచారు. గుండా మల్లేశ్ పై టీఆర్ఎస్ అభ్యర్ధి చిన్నయ్య 52528 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మంచిర్యాల
మంచిర్యాల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలిచిన  అరవింద్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటిలో నిలిచారు. టీఆర్ఎస్ కు షాకిచ్చిన అరవింద్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని తన పార్టీ తరపున గడ్డం దివాకర్ రావు బరిలోకి దించారు. జిల్లాలో గులాబీ హవా కొనసాగడంతో టీఆర్ఎస్ గెలుపు సులభంగా మారింది. గడ్డం దివాకర్ రావు 58434 ఓట్లతో విజయం సాధించారు.

ఆసిఫాబాద్ (ఎస్టీ)
ఆసిఫాబాద్ (ఎస్టీ) నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి    ఆత్రం సక్కుపై టీఆర్ఎస్ అభ్యర్ధి కోవ లక్ష్మి 19055 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఖానాపూర్ (ఎస్టీ)
ఖానాపూర్ (ఎస్టీ) నియోజకవర్గంలో గత ఎన్నికల్లో సుమన్ రాథోడ్ గెలుపొందారు. ఓ కేసులో సుమన్ రాథోడ్ చిక్కుకోవడంతో మళ్లీ ఆమె పోటీలో నిలువకోవడంతో జరిగింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున అజ్మీరా హరినాయక్, టీఆర్ఎస్ అభ్యర్ధిగా     రేఖ నాయక్ బరిలో ఉన్నారు. పోటాపోటిగా జరిగిన ఎన్నికలో ఈ స్థానంలో అజ్మీరా హరినాయక్ పై రేఖ నాయక్ రేఖ 37940 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సుమన్ రాథోడ్ కుమారుడు రితేష్ రాథోడ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

ఆదిలాబాద్
ఆదిలాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న ఈసారి టీఆర్ఎస్ తరపున బరిలో దిగారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించిన ఆయన ఆతర్వాత చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా టీఆర్ఎస్ లో చేరారు. ఈ స్థానంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటి జరిగింది. భార్గవ్ దేశ్ పాండే పై జోగు రామన్న సులభంగా విజయం సాధించారు. ఈసారి రామన్నకు 14507 ఓట్ల మెజార్టీ లభించింది.

బోథ్ (ఎస్టీ)
బోథ్ (ఎస్టీ)     రిజర్వుడు నియోజకవర్గంలో  జాదవ్ అనిల్(కాంగ్రెస్), రాథోడ్ బాబురావు(టీఆర్ఎస్),  సోయం బాబురావు(వైఎస్ఆర్ కాంగ్రెస్)ల మధ్య గట్టి పోటి జరిగింది. 2014 ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగడంతో ఆపార్టీ అభ్యర్ధి రాథోడ్ బాబూరావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి అనిల్ పై 26993 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

నిర్మల్
నిర్మల్ నియోజక వర్గంలో పోటి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఇంద్రకరణ్ రెడ్డికి నిరాశ ఎదురవ్వడంతో బీఎస్పీ పార్టీ తరపున బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీకి నిలిచారు. టీఆర్ఎస్ తరపున  కె.శ్రీహరిరావు కూడా రంగంలోకి దూకారు. ఇంద్ర కరణ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కే.శ్రీహరిరావుల మధ్య పోటి భీకరంగా సాగింది. అయితే రాజకీయ నేతల అంచనాలను తలకిందులు చేస్తూ ఇంద్రకరణ్ రెడ్డి 8628 ఓట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీఎస్సీ తొలిసారి ఖాతాను తెరిచింది.

ముధోల్    
ముధోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత వేణుగోపాలచారిపై      జి.విఠల్‌రెడ్డి 14686 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement