
వివాహితుడైనప్పటికీ ఆమె అతన్ని గాఢంగా ఇష్టపడింది. శారీరక సుఖం కోసం అతనూ ఆమెను ఇష్టపడినట్లు నటించాడు. ఇద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగారు. పైపెచ్చు వాళ్ల తిరుగుళ్లకు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. అలా నాలుగేళ్లు గిర్రుమన్నాయి. తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేసరికి భరించలేకపోయాడు. ప్రేమ మత్తులో ఉండగానే ఆమెను అనంతలోకాలకు పంపించేశాడు. అప్సర-వెంకటసాయికృష్ణ జీవితాలు ఆ ఒక్కరాత్రిలో తలకిందులయ్యాయి. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందంటే..
అప్సర-సాయికృష్ణ.. ఏడాది కాలంలోనే వాళ్ల మధ్య బంధం బలపడింది!. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తల్లితో సహా వచ్చిన అప్సర.. సరూర్ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించసాగింది. దైవభక్తి కారణంగా ఆలయాలకు క్రమం తప్పకుండా వెళ్తుండేది. అలా.. 2022లో సరూర్ నగర్ బంగారు మైసమ్మ గుడి పెద్ద పూజారి వెంకటసాయికృష్ణతో పరిచమైంది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసేజ్‌లు పంపేవాడు. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు సాయి. అలా స్నేహం బలపడింది. ఈలోపు.. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. వాట్సాప్ ద్వారా ఇద్దరూ వాళ్ల ప్రేమ వ్యక్తం చేసుకున్నారు.

👉అప్పటికే అప్సరకు వివాహమై భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. మరోవైపు సాయికృష్ణకు వివాహమైంది కూడా. కానీ, ఇద్దరూ చనువుగా ఉంటూ వచ్చారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు. అప్సర తల్లి(Apsara Mother)ని అక్కా.. అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. సాయి-అప్సరల స్నేహ బంధం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగడాన్ని భరించలేకపోయాడు. అలా చేయకపోతే రోడ్డుకు ఈడుస్తానని హెచ్చరించడంతో రగిలిపోయాడు. చివరకు..
.. ఆమెను చంపడం ఒక్కటే మార్గమని భావించాడు. ఈ క్రమంలో ఎలా చంపాలనేది గూగుల్‌లో వెతికి మరీ స్కెచ్ వేసుకున్నాడు. సరూర్ నగర్‌లో తాను పూజారిగా ఉన్న గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాక.. ఆ స్థలంలో ఆమెను పాతిపెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగుల పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ వద్ద స్థలం ఉందని గురించి తన ప్లాన్‌ను అమలు చేశాడు.
👉హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్ చేశాడు. "How to Kil human being" అని గూగుల్‌లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్ అయ్యాడు.

జూన్ 3.. అప్సర పాలిట కాళరాత్రి
ఓ ఫిల్మ్‌మేకర్‌తో సినిమా అవకాశాల కోసం మాట్లాడదామని.. అందుకోసం కోయంబత్తూరు వెళ్దామని అప్సరను సాయికృష్ణ నమ్మించాడు. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేననుకున్న ఆమె లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది.
2023 జూన్ 3న.. అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని, ఆమెను శంషాబాద్ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి వెంకటసాయికృష్ణ చెప్పాడు.

ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్‌నగర్ నుంచి బయల్దేరారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు.
రాత్రి 10 గంటలకు శంషాబాద్ మండలం రాళ్లగూడలో డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు.
అప్సరకు ఎంతో ఇష్టమైన గోశాలలో కొంతసేపు గడిపారు. అయితే గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటబడకుండా అతడు కారులోకి చేర్చాడు.
4న తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్ వద్దకు చేరారు.
ఫ్రంట్ సీటులో తన పక్కనే గాఢ నిద్రలోకి జారుకున్న అప్సరను.. కారు సీటు కవర్‌ను ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆపై బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
మృతదేహంపై కారు కవర్ కప్పి అక్కడి నుంచి సరూర్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు.
రెండ్రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని.. కవర్‌లో చుట్టి సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్‌హోల్‌లో పడేశాడు.
ఆపై దుర్వాసన వస్తోందంటూ ఎల్బీనగర్ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌ను కప్పి సిమెంట్‌తో పూడ్పించాడు.
అప్సర నుంచి ఎలాంటి స్పందన లేకపోయే సరికి ఆమె తల్లి కంగారుపడి సాయికృష్ణకు ఫోన్ చేసింది. ఏమీ తెలియనట్లు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి.. తాను వెతుకుతున్నట్లు నటించాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో సాయికృష్ణే హంతకుడని తేలింది. దర్యాప్తు జరుగుతున్న టైంలో సాయికృష్ణ అమాయకుడని.. తప్పంతా అప్సరదేనని అతని తల్లిదండ్రులు, భార్య వాదించారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన మృగానికి తగిన శిక్ష పడాలని అప్సర తల్లి డిమాండ్ చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు విస్తృతంగా జరిగింది. విచారణలోనూ సాయికృష్ణ తన నేరాన్ని అంగీకరించాడు. అలా..
2023 జూన్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషి సాయికృష్ణకు బుధవారం(మార్చి 26, 2025)న శిక్ష పడింది. జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకుగానూ అదనంగా మరో ఏడేళ్ల శిక్ష వేసింది. అప్సర కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.