సాక్షి, ఆదిలాబాద్: సాధారణ ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా రాజకీయ పార్టీలో సందడి మాత్రం కనిపిస్తోంది. ప్రజల్లో పట్టుకోసం అన్ని పార్టీలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో సెప్టెంబర్‌లో సంస్థాగత నిర్మాణ సందడి మొదలు కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర హైదరాబాద్‌లో శనివారం నుంచి మొదలు కానుంది. పార్టీ జిల్లా నేతలు అక్కడికి తరలివెళ్లారు.
ఇక ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన దళిత, గిరిజన దండోరా ఆత్మగౌరవ సభ విజయం ఆపార్టీ నేతల్లో ఉత్సాహం నింపింది. జిల్లా కేంద్రంలో త్వరలో జిల్లాస్థాయిలో గిరిజన, దళిత ఆత్మగౌరవ దండోరా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక స్తబ్ధుగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లోనూ ప్రస్తుతం కదలిక కనిపిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆరి్డనేటర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ శనివారం జిల్లా కేంద్రానికి రానుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
చదవండి: కేసీఆర్ ఆదేశం.. గులాబీసేనకు కొత్త రథసారథులు!
వచ్చే నెలలో సంస్థాగత నిర్మాణం..
టీఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణం సెప్టెంబర్‌లో పూర్తి చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ఆదేశాలు రావడంతో ముఖ్యనేతలు ఆదిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలతోపాటు అనుబంధ సంఘాలను పటిష్ట పరిచేలా పార్టీ నిర్మాణం చేయడానికి కసరత్తు ప్రారంభించారు. జిల్లా కమిటీతోపాటు గ్రామ, మండల స్థాయిలో కమిటీల్లో స్థానం సంపాదించేందుకు పలువురు ప్రయత్నిస్తుండటంతో నేతల్లో సందడి కనిపిస్తోంది.
చదవండి: జిరాక్స్ పేపర్లతో వచ్చి షో చేశాడు: మంత్రి మల్లారెడ్డి
‘బండి’ పాదయాత్ర..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర హైదరాబాద్‌లో శనివారం ప్రారంభం కానుంది. బీజేపీ జిల్లా ముఖ్య నేతలందరూ రాజధాని బాటపట్టారు. ఎంపీ సో యం బాపురావు పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, ఇతర ముఖ్య నేతలందరు ఈ యాత్రలో మొదటి రోజు పాల్గొననున్నారు. పార్టీ శ్రేణులు కూడా యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. జిల్లా నేతలు, ఇతర అనుబంధ సంఘాల నాయకులు ప్రజాసంగ్రామ యాత్రకు సంబంధించి పోస్టర్లు రూపొందించి సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్‌లో దండోరా జోష్..
ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ విజయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో మెండుగా కనిపిస్తోంది. ఇదే స్ఫూర్తితో జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట దళితబంధు పథకాన్ని రా ష్ట్రంలోని దళితులందరికీ అందించాలని, అదే వి« దంగా గిరిజనబంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ ఆధ్వర్యంలో ఈనెల 30న ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దళితులు, గిరిజనులు ఈ ధర్నాలో పా ల్గొనేలా జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.
ఆర్‌ఎస్పీ జిల్లా పర్యటన..
జిల్లాలో స్తబ్ధంగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీలో కదలిక కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఈ పార్టీ పరంగా పలు నియోజకవర్గాల్లో పలువురు నేతలు క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే కొంత కాలంగా పార్టీలో స్తబ్ధత కనిపిస్తోంది. తాజాగా పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆరి్డనేటర్‌గా మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ నియామకం తర్వాత జిల్లాలోనూ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. శనివారం జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్‌లో బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు బాబురావు అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రాష్ట్ర కోఆరి్డనేటర్లు డి.గంగాధర్, ఎస్.మల్లేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహతి రమేశ్ తదితరులు హాజరవుతున్నారు. జిల్లాస్థాయిలో గతంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment