ఆదిలాబాద్‌లో పోరు.. రసవత్తరం | Tough Fight On All Parties In Adilabad | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌లో పోరు.. రసవత్తరం

Published Sun, Mar 24 2019 6:13 PM | Last Updated on Sun, Mar 24 2019 6:15 PM

Tough Fight On  All Parties In Adilabad - Sakshi

గోడం నగేశ్‌ (టీఆర్‌ఎస్‌), రాథోడ్‌ రమేశ్‌ (కాంగ్రెస్‌), సోయం  బాçపూరావు (బీజేపీ)  

నిర్మల్‌: ప్రత్యర్థులు ఎవరో దాదాపు తేలిపోయింది. ఇక ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. కొత్త పాతల కలయికలతో పార్టీలు తమ అభ్యర్థులను సిద్ధం చేసుకున్నాయి. ఉన్న తక్కువ సమయంలో గెలుపు గుర్రాలుగా అభ్యర్థులతో ప్రచారాన్ని పరుగులు పెట్టించేందుకు పార్టీలు తగిన వ్యూహాలు రచిస్తున్నాయి. సోమవారం నామినేషన్ల ఘట్టం పూర్తి కాబోతోంది. ఇప్పటికే జిల్లాలోని మూడు ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్లను వేశారు. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన సోయం బాపురావు శనివారం సాయంత్రం వరకు బీఫారం పొందకున్నా.. ఆ పార్టీ నుంచే ఆయన బరిలో దిగుతున్నారు. సోమవారం మరో సెట్‌ నామినేషన్లను దాఖలు చేసిన తర్వాత అభ్యర్థులంతా పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి దిగనున్నారు.

ఇప్పటికే ప్రజల్లోకి.. 

మొన్నటికి మొన్న ముందస్తు ఎన్నికలతో శాసనసభలో విజయదుందుభి మోగించిన టీఆర్‌ఎస్‌ ఎంపీ ఎన్నికల్లోనూ గెలిచేందుకు ముందస్తు ప్రచారాన్ని చేపట్టింది. అభ్యర్థులను ప్రకటించకున్నా.. సన్నాహక సమావేశాల పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో నిర్వహించాల్సిన సన్నాహక సమావేశం రద్దయినప్పటికీ స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రచారాన్ని మాత్రం ఆపకుండా కొనసాగిస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న నగేశ్‌ ఇప్పటికే ఒక దఫా నియోజకవర్గాన్ని చుట్టివచ్చారు. ప్రస్తుతం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాథోడ్‌ రమేశ్, సోయం బాçపూరావుల్లో ఒకరు బరిలో ఉంటారని ముందు నుంచి ప్రచారం జరిగినా.. పార్టీ రమేశ్‌వైపే మొగ్గు చూపింది. అభ్యర్థుల ఎంపిక జరిగే వరకు ఆ పార్టీ నేతలు కూడా జనంలోకి వెళ్లలేదు. అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత నుంచే రాథోడ్‌ ప్రచార వేగాన్ని పెంచారు.

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అందరికంటే ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించింది. ముందుగా పార్టీ తరపున ఆడె మా నాజీ, సట్ల అశోక్, డాక్టర్‌ మనోహర్‌ తదితరులు ప్రయత్నాలు చేశారు. చివర్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు కాషాయ కండువా వేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన ప్రచారాన్ని ప్రారంభించ లేదు. మ రోవైపు ఆ పార్టీ శ్రేణులు మాత్రం సోషల్‌ మీడి యాలో తమ ప్రచార వేగాన్ని పెంచుతున్నాయి. 
ఎవరి వ్యూహం వారిది.. 
పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయనున్నారు. టీఆర్‌ఎస్‌కు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలిస్తేనే కేంద్రం నుంచి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధించుకోవచ్చని, నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉంటుందని ఓటర్లకు వివరిస్తున్నారు.  గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నందున వారి మద్దతుతో ఎంపీ అభ్యర్థి నగేశ్‌ ప్రజల్లోకి వెళ్తున్నారు. మున్ముందు నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలు, ఇతర సమస్యలను ఎత్తిచూపి జనాదరణ పొందాలని హస్తం పార్టీ చూస్తోంది. ప్రజాదరణ కలిగిన పార్టీ అధినేతలను రప్పించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేవలం ముథోల్‌లోనే బీజేపీ కాసింత ప్రభావం చూపగలిగింది. మిగతా నిర్మల్, ఖానాపూర్‌ స్థానాల్లో ఘోర ఓటమి పాలైంది. తమది జాతీయ పార్టీ అయినందున పార్లమెంట్‌ ఎన్నికల్లోనే ప్రజలు మద్దతిస్తారని ఆ పార్టీ భావిస్తోంది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, ఇతర ప్రజాసంక్షేమ పథకాలపై ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈఎన్నికల్లో మూడు పార్టీల నుంచి ముగ్గురు ప్రముఖులు బరిలో దిగడంతో పోటీ త్రిముఖంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మాజీ ఎంపీలుగా గుర్తింపు ఉన్న రాథోడ్‌ రమేశ్, గోడం నగేశ్‌లకు ఈసారి మాజీ ఎమ్మెల్యే, ఆదివాసీ ఉద్యమ నాయకుడు సోయం బాపురావు బీజేపీ నుంచి పోటీగా రావడం ఆసక్తికరంగా మారింది.

అన్నీ తానై.. ‘అల్లోల’ 
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌సభ స్థానాలను గెలిపించుకునేందుకు సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక మంత్రులకు బాధ్యతలను అప్పగించింది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తాజా మాజీ ఎంపీ నగేశ్‌ను గెలిపించేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. స్వయంగా తానే వెళ్తూ ఓటర్లకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఎంపీలను గెలిపించాల్సిన అవశ్యకతను వివరిస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన పథకాలను రప్పించాలంటే టీఆర్‌ఎస్‌ ఎంపీలను అధిక సంఖ్యలో గెలిపించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. నగేశ్‌తో కలిసి శనివారం బోథ్‌ నియోజకవర్గంలోని మండలాల్లో జోరుగా ప్రచారం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement