Telangana Lok Sabha Elections 2019
-
తాత్కాలిక స్పీడ్ బ్రేకరే:కేటీఆర్
-
ఎదురుదెబ్బ కాదు.. స్పీడ్ బ్రేకరే
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ కాదని, వాటిని తాత్కాలిక స్పీడ్‌బ్రేకర్‌గా భావిస్తున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 40 శాతం ఓట్లు, మెజారిటీ సీట్లు వచ్చాయని తెలిపారు. దేశవ్యాప్తంగా మోదీ మళ్లీ ప్రధాని కావాలనే భావన ఏర్పడిందని, బీజేపీకి కార్యకర్తలు లేనిచోట్ల కూడా ఆ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయన్నారు. లోక్‌సభ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని, గెలుపోటములకు ఒక్కోచోట ఒక్కో కారణం కనిపిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 4.5 లక్షల ఓట్లు తగ్గాయని తెలిపారు. అయితే వరంగల్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్కు వచ్చిన మెజారిటీ కాంగ్రెస్, బీజేపీలు గెలిచిన ఏడు స్థానాల్లో సాధించిన మెజారిటీ కంటే ఎక్కువగా వచ్చిందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపారని, సాంకేతికంగా ఇప్పటివరకు ఎవరూ చేరలేదని చెప్పారు. కేటీఆర్ మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివిధ అంశాలపై కేటీఆర్ స్పందన ఆయన మాటల్లోనే... 16 సీట్లూ గెలుస్తామని ఆశించాం... 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 34 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి కంటే 2019లో 6శాతం ఓట్లు పెరిగాయి. 16 ఎంపీ సీట్లలో గెలుపు కోసం మేము గట్టిగా ప్రయత్నించాం. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు బాగా పని చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మేం కష్టపడినంతగా ఏ పార్టీ పని చేయలేదు. అయితే మేం ఆశించిన ఫలితాలు రాలేదు. మల్కాజిగిరి, భువనగిరిలో వెంట్రుకవాసి తేడాతో కాంగ్రెస్ గెలిచింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ హవా పని చేసింది. అందుకే బీజేపీకి ఇక్కడ సీట్లు వచ్చాయి. ఆదిలాబాద్‌లో గెలుస్తుందని బీజేపీ నేతలు, అక్కడి అభ్యర్థే ఊహించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్ కనిపించింది. ఈ ఫలితాలు టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ కాదు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకోవడంతో బీజేపీకి ఓటింగ్ పెరిగింది. బీజేపీకి కార్యకర్తలు లేనిచోట్ల సైతం ఆ పార్టీకి ఓట్లు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీకి 19 వేల ఓట్లు లభిస్తే ఇప్పుడు ఏకంగా 59 వేల ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గెలుస్తామని బీజేపీ వాళ్లే అనుకోలేదు. కచ్చింగా 16 స్థానాల్లో గెలుస్తామని మేము భావించాం. ఇలాంటి ఫలితాలను ఊహించలేదు. అభ్యర్థుల ఎంపిక సబబే... నిజామాబాద్‌లో కవిత ఓడిపోయారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవేగౌడ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. గతంలో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ పరాజయం పాలయ్యారు. రెండోసారి సీఎం అయిన కేసీఆర్ సైతం మొదటి ఎన్నికల్లో ఓడిపోయారు. టీఆర్ఎస్ డక్కామొక్కీలు తిన్న పార్టీ. ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించింది. కొందరు ముఖ్యనేతలు ఓడిపోయినంత మాత్రాన కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందనేది నిజం కాదు. టీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సరిగా లేదనే వ్యాఖ్యలు సరికాదు. ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసిన వినోద్ కుమార్, బూర నర్సయ్యగౌడ్, కవిత ఓడిపోయారు. కొత్తగా పోటీ చేసిన వారు, పార్టీ మారిన వారు గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములకు రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక్క కారణం అని చెప్పడానికి లేదు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి గతంలో గెలిచినప్పుడు కిరీటాలు పెట్టలేదు... ఈ ఎన్నికల్లో 16 సీట్లు గెలిచినా కేంద్రంలో ఏమీ చేయలేని పరిస్థితే. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎవరి మద్దతు అవసరంలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కార్యకర్తలెవరూ కుంగిపోవాల్సిన పనిలేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్కు కేవలం 4.5 లక్షల ఓట్లు తగ్గాయి. రాష్ట్రంలో 40 శాతం ఓటర్లు టీఆర్ఎస్కే మద్దతు తెలిపారు. మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో మా పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను విఫలమయ్యాయని అనుకోవడంలేదు. గతంలో విజయాలు సాధించినప్పుడు ఎవరూ కిరీటాలు పెట్టలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై లోతైన సమీక్ష చేస్తాం. వరుస ఎన్నికలు, పాలనలో జాప్యం వల్ల మా పార్టీపై ఏమైనా ప్రభావం పడిందేమో పరిశీలించుకుంటాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాం. సింహభాగం సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుంది. కేంద్రంతో రాజ్యాంగపరమైన సత్సంబంధాలు... రాష్ట్రాలు ఎంత బలపడితే దేశానికి అంత మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించే మానసిక పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీఆర్ఎస్, డీఎంకే వంటి పార్టీలే ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీని ఎదుర్కొంటాయి. దేశంలో ఫెడరల్ స్ఫూర్తి పెరగడం మంచిదే. కేంద్ర ప్రభుత్వంతో రాజ్యాంగపరంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ సత్సంబంధాలనే కొనసాగిస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో అలాగే ఉంటాం. అయితే రాష్ట్ర సమస్యల పరిష్కారం విషయంలో రాజీపడం. మోదీతో మా సంబంధాలు రాజ్యాంగ పరమైనవిగానే ఉంటాయి. సీఎం కేసీఆర్ కరీంనగర్ ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ ఓటమికి కారణం కాదు. బీజేపీ దేశమంతా గెలిచింది. మరి ఇతర ప్రాంతాల్లో కేసీఆర్‌లా ఎవరూ మాట్లాడలేదు కదా? హరీశ్‌రావును పక్కన పెట్టలేదు... మాజీ మంత్రి హరీశ్‌రావును లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పక్కనబెట్టామన్న వాదన నిజం కాదు. లోక్‌సభ సెగ్మెంట్ల బాధ్యతలను సీఎం కేసీఆర్ మంత్రులకు అప్పగించారు. మెదక్ లోక్‌సభ సెగ్మెంట్‌ను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తూ హరీశ్‌రావుకు అప్పగించారు. మెదక్‌లో టీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలిచినా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్కు ఓట్లు బాగా తగ్గాయి. సిరిసిల్లలోనూ ఇదే జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీకి కార్యకర్తలు లేరు. కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అక్కడ బీజేపీకి భారీగా ఓట్లు పెరిగాయి. సీఎం కేసీఆర్ అన్ని లోక్‌సభ సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అధినేతగా ఆయన ప్రచారం చేసిన తర్వాత నేనైనా, ఇంకెవరైనా ప్రచారం చేయడం ప్రధానం కాదు. విజయానికి కారకులు ఎక్కువ మంది తామే అంటారు. ఓటమి అనాథ లాంటిది. ఇప్పుడు ఎవరైనా, ఏదైనా మాట్లాడతారు. కవిత ఓటమికి రైతులు కారణం కాదు... నిజామాబాద్‌లో కవిత ఓటమికి రైతులు కారణం కాదు. అక్కడ నామినేషన్లు వేసింది రైతులు కాదు, రాజకీయ కార్యకర్తలే. జగిత్యాలకు చెందిన ఓ కాంగ్రెస్ నేత ఇంట్లోనే 93 మంది నామినేషన్లు తయారయ్యాయి. నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి కాబట్టే కవిత ఓడిపోయింది. టీఆర్ఎస్, నేను, కవిత అనేక డక్కామొక్కీలు తిన్నాం. ఒక్క ఓటమితో మేము కుంగిపోం. కవిత పోరాట యోధుడి కూతురు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోయారు. అంతమాత్రాన కాంగ్రెస్ కార్యకర్తలు దుప్పట్లు కప్పుకొని ఇంట్లో పడుకుంటారా? అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి వస్తే టీఆర్ఎస్కు నష్టం కలిగేది అనే వాదనతో ఏకీభవించను. ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ గెలిచింది. లోక్‌సభ ఫలితాల ప్రకారం చూసినా రాష్ట్రంలో టీఆర్ఎస్కు 71 స్థానాల్లో మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాంకేతికంగా చేరలేదు... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఇప్పటివరకు సాంకేతికంగా టీఆర్ఎస్లో చేరలేదు. మా పార్టీ కండువా కప్పుకోలేదు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించడం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో మాకు నష్టం జరిగిందనే వాదన సరికాదు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. వారికి చెందిన ఎనిమిది సెగ్మెంట్లలో టీఆర్ఎస్కు ఆధిక్యత వచ్చింది. ‘హాజీపూర్’పై రాజకీయాలా? హాజీపూర్ ఘటన నిజంగా దారుణం. అక్కడ జరిగిన దారుణంతో అందరం చలించిపోయాం. అందరం బాధపడ్డాం. ఇలాంటి విషయాల్లోనూ కొందరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. కొందరు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు. అలాంటి రాజకీయం మేము చేయం. బాధితులకు న్యాయం చేస్తాం. బాధితులను ఆదుకునే బాధ్యత మాది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుతో విచారణ వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఇంటర్మీడియెట్ ఫలితాలపై వివాదాన్ని కొందరు గోరంతలు చేశారు. కొందరు విద్యార్థుల మరణం బాధాకరం. గ్లోబరీనా సంస్థకు, నాకు సంబంధం ఉందని పనికిమాలిన వాళ్లు విమర్శలు చేశారు. ఐటీ మంత్రిగా పని చేసిన నాకు విద్యాశాఖలోని అంశాలతో ఏం సంబంధం ఉంటుంది? జగన్ సొంతంగా గెలిచారు... ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. జగన్మోహన్రెడ్డి గెలిచారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటాలని అందరూ కోరుకుంటున్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనేది టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం. అందుకే మహారాష్ట్ర, కర్ణాటకతో బాగానే ఉంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌తోనూ ఇదే రకమైన సంబంధాలు కోరుకుంటున్నాం. ప్రమాణ స్వీకారానికి రావాలంటూ జగన్మోహన్రెడ్డి వచ్చి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. అంతేతప్ప ఈ భేటీలో ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు. టీఆర్ఎస్ సహకారంతో జగన్ గెలిచారనేది కరెక్టు కాదు. అక్కడ ప్రజలు తీర్పు చూసిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. జగన్మోహన్రెడ్డి సొంతంగా గెలిచారు. 3,600 కిలోమీటర్లకుపైగా ఆయన పాదయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తాం. -
‘సీఎం కుడి భుజాన్ని ఓడగొట్టాం’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిస్తే.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోయిందని వారి పార్టీ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుని పునీతులు అవుతున్నారని అన్నారు. ప్రజలు నమ్మి ప్రతిపక్షస్థానం ఇస్తే కూడా.. వ్యాపారాల కోసం అధికార పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ మీద పోరాటం చేసే స్థాయిలో కాంగ్రెస్ లేదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగిందనీ, ఉత్తమ్ జైలుకు వెళ్తాడని టీఆర్ఎస్ నాయకులు అన్నారు కానీ ప్రస్తుతం వారు లోపాయికారి ఒప్పందంపై ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ నుంచి విజయ దుందుభి మోగించామని, ఉద్దండుల మీద భారీ మెజార్టీతో గెలిచామన్నారు. బీజేపీ ఎంపీలు జెయింట్ కిల్లర్స్.. సీఎం కూతురును, కుడి భుజాన్ని ఓడగొట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైందన్నారు. జాతీయ స్థాయిలోని వారి నాయకుడే అస్త్ర సన్యాసం చేశారని ప్రస్తుతం దిక్కూ దివాణం లేకుండా ఉందని అన్నారు. బీజేపీ విజయాన్ని చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నంలో కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఉన్నాయని విమర్శించారు. కేటీఆర్ ఇప్పుడు మోదీ హవా అంటున్నాడు.. ఎన్నికల ఫలితాలకు ముందు హవా లేదన్నావుగా అని నిలదీశారు. పోస్టల్ బ్యాలెట్లో 38 శాతం ఓట్లతో బీజేపీదే అగ్రభాగమని తెలిపారు. 17 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని అన్నారు. యూపీలో స్వయంగా రాహుల్ ఓడిపోయాడని ఆరు రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటును మాత్రమే గెలిచిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి గెలిచిన 19మంది ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. ఉత్తమ్, కేసీఆర్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌తో గెలిచారని కాంగ్రెస్ నాయకులే అంటున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ పోకడతో టీఆర్ఎస్ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ బీజేపీలో చేరారని అన్నారు. అమిత్ షా టార్గెట్ తెలంగాణ అని.. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభమైన ఏ ఉద్యమం ఆగదని, ఇప్పుడు బీజేపీ కూడా అంతేనని అన్నారు. ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను రోడ్ మీద వేశారని, ఇంటర్ తప్పిదాల విషయంలో ఇంటర్ కార్యదర్శి అశోక్‌ను, విద్యాశాఖా మంత్రిని తప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. -
మల్కాజ్‌గిరిలో రేవంత్‌ది గెలుపే కాదు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ లోక్‌సభ ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. శాసనసభ్యుల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌కుమార్ నామినేషన్ వేయడానికి ఎల్పీ ఆఫీసుకు వచ్చిన సందర్భంగా కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. 'లోక్ సభ ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో మాకు సీట్లు పోయినా ఓటు శాతం పెరిగింది. గతం కంటే 6 శాతం ఓట్లు టీఆర్ఎస్కు పెరిగాయి. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌పార్టీ వెంట్రుక వాసిలో గెలుపొందింది. రేవంత్ రెడ్డిది ఒక గెలుపు కానే కాదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మాకు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్‌లాంటివే. దేశ వ్యాప్తంగా మోదీ హవా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ మంచి సీట్లను గెలుచుకుంది. ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీ గెలుస్తుందని ఊహించలేదు. విచిత్రమైన ట్రెండ్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కనిపించింది. అలాగే వరుస ఎన్నికలు, పాలనలో జాప్యం ప్రభావం ఉందేమో విశ్లేషిస్తాము. సిరిసిల్లలో బీజేపీకి కార్యకర్తలు కూడా లేరు. అసెంబ్లీ ఎన్నికలకంటే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ ఫలితాలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందొద్దు. వరంగల్‌లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మెజారిటీ మిగతా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులకంటే ఎక్కువ వచ్చింది. నేను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు' అని కేటీఆర్ అన్నారు. -
పదవి లేకున్నా ప్రజల కోసం పనిచేస్తా: కవిత
చంద్రశేఖర్‌కాలనీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు, ఓటములు సహజమని టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓటమి చెందడంతో తట్టుకోలేక నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో ఈనెల 24న పార్టీ కార్యకర్త కిషోర్ గుండెపోటుతో మరణించాడు. సోమవారం మృతుని కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. కిషోర్ కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందినందుకు బాధపడటం లేదన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పాటుపడుతుందని అన్నారు. పదవి ఉన్నా, లేకున్నా తాను నిజామాబాద్‌ను వదిలిపెట్టిపోనని, ప్రజల సమస్యల పరిష్కారంలో, జిల్లా అభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని స్పష్టంచేశారు. పార్టీ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘హుం దాగా ఉందాం, బంగారు తెలంగాణ కోసం పనిచేద్దాం’అని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్‌గుప్తా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ నగర మాజీ మేయర్ డి.సంజయ్, డి.రాజేంద్రప్రసాద్ తదితరులు ఆమె వెంట ఉన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన కవిత -
అందుకే భువనగిరిలో ఓడిపోయాం : హరీశ్ రావు
సాక్షి, సంగారెడ్డి : ప్రజా సేవలో ప్రజాప్రతినిధులకు విశ్రామం ఉండదని, నాయకుడు నిత్య శ్రామికుడై పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం సంగారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఎన్నికలు ముగియడంతో కార్యకర్తల బాధ్యత తీరి, ప్రజాప్రతినిధుల బాధ్యత ప్రారంభమైందన్నారు. ప్రజా ప్రతినిధులకు ఆదివారం, రెండో శనివారం సెలవులంటూ ఏమి ఉండవని, నిత్య సేవకుడై ప్రతి రోజూ పనిచేయాలన్నారు. ఎదిగే కొద్ది ఒదుగుతూ.. ప్రజలకు సేవ చేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ఇక ప్రతిరోజు పండగేనన్నారు. భువనగిరిలో రోడ్ రోలర్ గుర్తు వల్ల టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చే దిశగా పని చేద్దామని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు లేనిదే నాయకులు లేరు : ప్రభాకర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష వల్లే తాను మరోసారి పార్లమెంట్‌కు వెళున్నానని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు లేనిదే నాయకులు లేరన్నారు. హరీశ్ రావు నిర్దేశంలో పకడ్బందీగా ప్రచారం చేశామని, ప్రతి కార్యకర్త టీమ్ లీడర్లా పనిచేశారని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తానని పేర్కొన్నారు. -
కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన కవిత
-
ఏవీ ఆనాటి మెరుపులు !
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి కొన్నాళ్లుగా ప్రతీ ఎన్నికల్లోనూ భంగపాటు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీచినా.. నరేంద్ర మోదీ హవా స్పష్టంగా కనిపించిన తాజా ఎన్నికల్లో సైతం వరంగల్ లోక్‌సభ పరిధిలో బీజేపీ అభ్యర్థికి గతంతో పోలిస్తే ఓట్లు ఇంకా తగ్గిపోవడం గమనార్హం. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 2,05,803 ఓట్లు పోల్ కాగా.. ప్రస్తుత ఎన్నికల్లో 83,777 ఓట్లు మాత్రమే రావడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. గతంలో దేశం మొత్తం మీ ద రెండు స్థానాల్లోనే బీజేపీ గెలుపొందగా.. అందులో ఒకరు హన్మకొండ నుంచి గెలవడం చరిత్రగా చెబుతారు. కానీ అదంతా గతంగానే మిగిలిపోగా.. ఇప్పుడు కనీసం డిపాజిట్లు దక్కించుకోలేని స్థితికి ‘కమలం’ చేరుకోవడాన్ని ఆ పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం ఉండేది. అయితే, 1999 తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు పరాజయాన్నే మూటగట్టుకుంటున్నారు. పరకాల, రద్దయిన శాయంపేట, వర్ధన్నపేట, హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో బీజేపీకి చెందిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించారు. పాత హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీకి ప్రాతినిథ్యం ఉంది. అలాగే, రద్దయిన శాయంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున 1978, 1983లో చందుపట్ల జంగారెడ్డి విజయం సాధించారు. 1985, 1989లో పరకాల నుంచి ఒంటేరు జయపాల్, వర్ధన్నపేట నుంచి 1985లో వన్నాల శ్రీరాములు, 1989లో డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు గెలిచారు. ఇక 1999లో రద్దయిన హన్మకొండ నియోజకవర్గం నుంచి మార్తినేని ధర్మారావు విజయం సాధించారు. 1984లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో దేశంలో రెండు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి మాత్రమే బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా.. ఇందులో ఒకరు రద్దయిన హన్మకొండ లోక్‌సభ నుంచి చందుపట్ల జంగారెడ్డి కావడం విశేషం. ఆ ఎన్నికల్లో రాజకీయ ఉద్దండుడు మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు(ప్రధాని కాక ముందు)ను ఓడించారు. ఇలా గతంలో బీజేపీ గెలిచిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలోనే ఉన్నా గత ప్రాభవాన్ని సాధించలేక మరింత చతికిలపడడం గమనార్హం. ఇప్పుడు అంతంతే... 1999 అనంతరం జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ పూర్వ వైభవం చాటుతామని బీజేపీ పార్టీ నాయకులు గొప్పలు చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి, రెండో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ తన సత్తా చాటలేకపోతోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. తెలంగాణలోనూ నాలుగు స్థానాల్లో విజయం సాధించినా మోదీ చరిష్మా, బీజేపీ పవనాలు ఇక్కడ పనిచేయలేదు. కాగా, 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున అభ్యర్థులు పోటీ చేసినా ఒక్క స్థానంలోనైనా కమలం వికసించలేదు. ఈసారి గతంలో మాదిరి కాకుండా పార్టీలో సీనియర్ అయిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తిని వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిపారు. అయినా విజయానికి సాధ్యం కాకపోగా.. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 2014లో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన రామగల్ల పరమేశ్వర్‌ను పార్టీ అభ్యర్థిగా నిలిపితే 2,05,803 ఓట్లు వచ్చాయి. 2015 ఉప ఎన్నికల్లో డాక్టర్ పగిడిపాటి దేవయ్యను నిలపగా 1,29,868 ఓట్లు సాధించారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకీ చెందిన అభ్యర్థినే బరిలోకి దింపినా గత రెండు ఎన్నికల్లో పోలిస్తే ఓట్ల సంఖ్య మరింత పడిపోయి కేవలం 83,777 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలా ప్రతీ ఎన్నికకు ఓట్లు తగ్గుతుండడం చర్చనీయాంశంగా మారింది. గడ్డు పరిస్థితులు.. వరంగల్ జిల్లాలో బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పడంలేదు. అభ్యర్థుల ఎంపికే సమస్యగా మారుతోందని తెలుస్తోంది. గెలిచే వారికి, పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి, ప్రజల్లో పట్టు ఉన్న వారికి కాకుండా.. అధిష్టానం వద్ద పట్టు ఉన్న వారికి టికెట్లు ఇస్తుండడంతో ఓటమి తప్పడం లేదని ఆ పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఇక టికెట్లు పొందిన వారు ఆ పార్టీలోని అసమ్మతి వాదులను కలుపుకుపోకపోవడం కూడా మరో సమస్య మారినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టపర్చకుండా ఎన్నికలకు వెళ్లడం వంటి వైఫల్యాలతో ఆ పార్టీ పూర్వ వైభవం సాధించలేక పోతోందని భావిస్తున్నారు. -
అసంతృప్తి!
సాక్షి, వికారాబాద్: ఎంపీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ నాయకులకు ముచ్చెమటలు పట్టించాయి. ఫలితాలు తాము ఊహించిన విధంగా లేకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇటీవల ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న సబితా ఇంద్రారెడ్డి తమవైపే ఉండటంతో భారీ మెజార్టీ వస్తుందని భావించిన అధికార పార్టీ నాయకులకు చుక్కలు కనిపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీపై విముఖత చూపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పని చేయకపోవడం, ప్రజల్లో వ్యతిరేకత కారణంగానే ఆ పార్టీ అభ్యర్థి ఓట్లకు గండిపడినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గతంలో కన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ ఓట్లను చీల్చిందనే అభిప్రాయమూ వ్యక్తమైంది. బీజేపీ ఓట్లు చీల్చినప్పటికీ టీఆర్ఎస్ 15వేల లోపు మెజార్టీ మాత్రమే రావడంతో సొంతపార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మెజార్టీ తగ్గడంపై ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం తన అనుచరుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు రావడంపై ఆయన నొచ్చుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సొంత నియోజకవర్గమైన చేవెళ్ల కంటే ఎక్కువగా వికారాబాద్ నియోజవకర్గంలో అధిక ఓట్లు వచ్చాయి. చేవెళ్లలో కాంగ్రెస్‌కు 15,831 ఓట్ల మెజార్టీ రాగా వికారాబాద్‌లో 20,626 ఓట్ల మెజార్టీ లభించింది. అలాగే పరిగి అసెంబ్లీ పరిధిలో 6,574 ఓట్ల మెజార్టీ విశ్వేశ్వర్‌రెడ్డికి వచ్చింది. మిగితా నియోజకవర్గాలైన రాజేంద్రనగర్, తాండూరు, శేరిలింగంపల్లి, మహేశ్వరంలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డికి కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన గెలుపు సాధ్యమైంది. వికారాబాద్, పరిగిలో కాంగ్రెస్‌కు మెజార్టీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు తమకు అండగా నిలుస్తారని టీఆర్ఎస్ భావించింది. అయితే అనూహ్యంగా వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్కు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. ఒక్క తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్కు స్వల్ప మెజార్టీ వచ్చింది. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఉన్న తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ఆశించిన స్థాయిలో మెజార్టీ దక్కలేదు. కేవలం 1199 ఓట్ల మెజార్టీ మాత్రమే టీఆర్ఎస్కు వచ్చింది. ఇక వికారాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ఓటర్లు షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ వికారాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 20,626 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి 49,318 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 69,977 ఓట్లు వచ్చాయి. విశ్వేశ్వర్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన చేవెళ్ల కంటే వికారాబాద్ ఓటర్లు కొండాకు ఎక్కువ మెజార్టీ కట్టబెట్టారు. ఎమ్మెల్యే సొంత మండలమైన ధారూరులో టీఆర్ఎస్కు 8,397 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 10,760 ఓట్లు వచ్చాయి. ఎమ ఎమ్మెల్యే ఆనంద్ సొంత గ్రామమైన కేరెళ్లిలో సైతం కాంగ్రెస్‌కు 251 మెజార్టీ రావటం రాజకీవర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోఉంది. మోమిన్‌పేట మండలంలో కాంగ్రెస్‌కు 2,541, మర్పిల్లో 4,077 మెజార్టీ కాంగ్రెస్‌కు వచ్చింది. వికారాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటింగ్ శాతం తగ్గింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ సరళిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పరిగి నియోజకవర్గంలో సైతం టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డికి 6,574 ఓట్లు రాగా టీఆర్ఎస్కు 60,055 ఓట్లు వచ్చాయి. పరిగిలో కాంగ్రెస్‌కు 6,574 మెజార్టీ వచ్చింది. పూడురు మండలంలో కాంగ్రెస్‌కు ఎక్కువగా ఓట్లు వచ్చాయి. పూడురు మండలంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్‌కు ఎక్కువగా మెజార్టీ వచ్చింది. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గటంపై టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఫలితాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశ్లేషిస్తున్నట్లు సమాచారం. పార్టీకి మెజార్టీ తగ్గటానికి గల కారణాలపై స్వయంగా ఆరా తీసిన ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
అంతర్మథనం..
ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు స్థానాలను అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నా మెజారిటీ తగ్గడంపై ఆ పార్టీ నేతలు అంతర్మథనం చేసుకుంటున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, వందలాది మంది స్థానిక ప్రజాప్రతినిధులు, వేలాదిగా కార్యకర్తలు, ఇంత బలం.. బలగం ఉన్నా జహీరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో అతి తక్కువ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం ఆ పార్టీ నేతలకు ఒకింత ఆశ్చర్యాన్ని, అసహనాన్ని కలుగజేశాయి. గతం కంటే భారీగా తగ్గిన మెజారిటీపై శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. గత సంవత్సరం డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సంగారెడ్డి సెగ్మెంట్ మినహా మిగతా తొమ్మిదింటిలో గులాబీ గుబాళించినా ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఆ ఆధిక్యత కనిపించలేదు. సంగారెడ్డి: అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన జగ్గారెడ్డి కేవలం 2వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని బట్టి చూస్తే భారీ మెజారిటీతో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లో కైవసం చేసుకుంటామని టీఆర్ఎస్ నేతలు పోలింగ్‌కు ముందు, పోలింగ్ తరువాత కూడా ధీమా వ్యక్తం చేశారు. తీరా ఓట్ల లెక్కింపును బట్టి చూస్తే మెదక్‌లో కొత్త ప్రభాకర్ రెడ్డికి కొద్దిగా మెజారిటీ తగ్గినప్పటికీ 3,16,427 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జహీరాబాద్‌లో మాత్రం ఆశించిన మెజారిటీ రాకపోవడంతో అభ్యర్థి బీబీ పాటిల్‌తోపాటుగా పార్టీ నేతలంతా ఖంగుతిన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీబీ పాటిల్ స్పల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుపై కేవలం 6,229 ఓట్ల తేడాతో గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 4,34,244 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుకు 4,28,015 ఓట్లు వచ్చాయి. ఆద్యంతం చివరి రౌండు వరకు ఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్‌లో ఎట్టకేలకు టీఆర్ఎస్ అభ్యర్థి పాటిల్ గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మొదటిసారి ఎంపీగా పోటీ చేసిన పాటిల్ 1,44,631 ఓట్లతో ఘన విజయం సాధించారు. జహీరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గం తప్ప గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఎల్లారెడ్డి సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన జాజాల సురేందర్ సైతం లోక్‌సభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్కు పూర్తిస్థాయి మద్దతునిచ్చారు. దీంతో సెగ్మెంట్లోని ఏడుగురు ఎమ్మెల్యేలు సైతం అధికార పార్టీవారే ఉండడంతో భారీ మెజారిటీ ఖాయమని భావించారు. అయితే ఓటర్లు మాత్రం విలక్షణమైన తీర్పునిచ్చారు. బీబీ పాటిల్ కేవలం 6,229 ఓట్ల తేడాతో విజయం సాధించడంతో పార్టీ అభ్యర్థితో పాటుగా ఉమ్మడి జిల్లా అధికార పార్టీ నేతలు ఖంగుతిన్నారు. ఎక్కడ లోపం జరిగిందంటూ కారణాలు అన్వేషించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా నేతలు, అభ్యర్థులతో సీఎం కేసీఆర్ ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జహీరాబాద్‌లో మెజారిటీ తగ్గడానికి కారణాలేమిటో అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. జహీరాబాద్ సెగ్మెంట్లో కాంగ్రెస్‌కు భారీ లీడ్ గత సంవత్సరం డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాణిక్‌రావుకు 34వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ లభించింది. గత నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ సంఖ్య కొంచెం అటు ఇటుగా పునరావృతమవుతుందని ఎమ్మెల్యేతో సహా పార్టీ నేతలు భావించారు. కాగా ఆర్నెళ్లు తిరగకముందే ఓట్ల తేడాలో భారీ వ్యత్యాసమొచ్చింది. జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి 23,559 ఓట్ల భారీ ఆధిక్యం లభించింది. అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి 16,421 ఓట్లు, ఎల్లారెడ్డి సెగ్మెంట్లో 8,397 లభించాయి. టీఆర్ఎస్కు అందోల్‌లో 9,778, నారాయణఖేడ్‌లో 9,365, జుక్కల్‌లో 15,780, బాన్సువాడలో 20,060 ఓట్ల మెజారిటీ లభించింది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 6,229 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి మొత్తం 14,11,612 మంది ఓటర్లు ఉండగా, 11,88,780 ఓట్లు 84.21 శాతంతో పోలయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ పార్టీకి 5,76,433 ఓట్లు (48.49 శాతం) వచ్చాయి. కాగా 2019 (గత నెలలో) జరిగిన ఎంపీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం ఓటర్లు 14,97,996 మంది ఉండగా, 10,44,504 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీఆర్ఎస్కు 4,34,244 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 సెగ్మెంట్లలో కలిపి 4,43,468 ఓట్లు 37.30 శాతం వచ్చాయి. కాగా గత నెలలో జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌కు 4,28,015 ఓట్లు పడ్డాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీకి 2018లో ఏడు సెగ్మెంట్లలో కలిపి 1,32,965 ఓట్లు ఆధిక్యం వస్తే గత నెలలో (2019)లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 6,229 ఓట్ల ఆధిక్యం మాత్రమే లభించింది. సమన్వయ లోపమే శాపమా..? ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలను భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మెదక్‌లో సుమారుగా 5 లక్షలు, జహీరాబాద్‌లో సుమారుగా 2లక్షలకు పైగానే మెజారిటీ వస్తుందని ఎన్నికల సమయంలో కార్యకర్తల, ప్రచార సభల్లో మాజీ మంత్రి, సీనియర్ నేత హరీశ్‌రావుతో సహా ఉమ్మడి జిల్లా పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేశారు. కాగా ఫలితాలు వెలువడిన తరువాత మెదక్ కాస్త పర్వాలేదనిపించినా.. జహీరాబాద్‌లో మాత్రం కేవలం 6వేల ఓట్లకే మెజారిటీ పరిమితం కావడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్ 2014లో మొదటిసారిగా ఎంపీగా టీఆర్ఎస్ టికెట్‌పై విజయం సాధించారు. ఆయనకు పార్టీ నేతలతో, సెగ్మెంట్లోని ఎమ్మెల్యేలతో అంతగా సఖ్యత, సాన్నిహిత్యం లేదని ప్రచారం జరిగింది. చాలామంది నేతలు పాటిల్ అభ్యర్థిత్వాన్ని సైతం వ్యతిరేకిస్తూ టికెట్ రెండోసారి కేటాయించకముందే సీఎం కేసీఆర్‌కు చెప్పినట్లు సమాచారం. పార్లమెంటు స్థానాల వారీగా సీఎం కేసీఆర్ శుక్రవారం ఆయా జిల్లా నేతలు, అభ్యర్థులతో ఓట్ల శాతం, మెజారిటీ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. అందువల్లనే ప్రచారం సమయంలో కూడా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అంతగా ఆసక్తి చూపలేదనే అపవాదు కూడా ఉంది. సీఎం కేసీఆర్ ఆదేశాలు తప్ప మనస్ఫూర్తిగా బీబీ పాటిల్‌కు కొందరు ప్రచారం చేయలేదని కూడా ఆ నోటా ఈ నోటా వినిపిస్తోంది. లోక్‌సభ అభ్యర్థి పాటిల్ అందరినీ కలుపుకొని పోవడంలో కాస్త విఫలమయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదిఏమైనా 6వేల ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో గెలవడంతో పార్టీ అభ్యర్థితో సహా పార్టీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఎక్కడ.. ఎలా?!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) విజయఢంకా మోగించింది. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పసునూరు దయాకర్, మాలోతు కవిత విజయం సాధించిన విషయం విదితమే. అయితే, గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, తాజా లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను బేరీజు వేసేందుకు ఆ పార్టీ అధిష్టానం పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ గత ఎన్నికలతో పోలిస్తే ‘ఎక్కడ తగ్గాం.. ఎక్కడా పెరిగాం’ అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. కొంత తగ్గిన మెజార్టీ వరంగల్ లోక్‌సభ పరిధిలో మొత్తం 16,66,085 ఓట్లకు గాను 10,61,672 ఓట్లు పోల్ కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ 3,50,298 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదే విధంగా మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 14,24,385 ఓట్లకు గాను 9,83,708 ఓట్లు పోల్ కాగా 1,46,663 ఓట్ల మెజార్టీతో మాలోతు కవిత విజయం సాధించారు. ఇలా రెండు లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగినా... 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి టీఆర్ఎస్ అభ్యర్థులకు మెజార్టీ తగ్గింది. తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం సమీక్ష జరిపిన గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలైన ఓట్లు, మెజార్టీపై ఆరా తీసినట్లు తెలిసింది. నాలుగు చోట్ల పైకి.. ఎనిమిది చోట్ల కిందకు... వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. భద్రాచలం, పినపాక, ఇల్లందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిశీలిస్తే.. ఈసారి పరకాల, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓట్లు పెరిగాయి. ఇక వరంగల్ పశ్చిమ, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మాత్రం తగ్గాయి. పరకాలలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డికి 59,384 ఓట్లు వస్తే.. ఈసారి ఆ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి 87,567 ఓట్లు నమోదయ్యాయి. భూపాలపల్లిలో గతంలో టీఆర్ఎస్కు 53,567 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 91,628 వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో అనూహ్యంగా మెజార్టీ పెరిగింది. ములుగులో 2018 ఎన్నికల్లో 66,300 ఓట్లు రాగా, ఈసారి 71,518 పార్లమెంట్ అభ్యర్థికి వచ్చాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 98,612 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 94,327 ఓట్లు పోలయ్యాయి. పాలకుర్తికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 1,17,694 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 92,437, జనగామలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 91,592 ఓట్లు రాగా.. ఇప్పుడు 68,380, డోర్నకల్‌లో అసెంబ్లీ పోలింగ్‌లో 85,467, లోక్‌సభకు 78,986, మహబూబాబాద్‌లో అసెంబ్లీకి 85,397, లోక్‌సభకు 84,031, వరంగల్ పశ్చిమలో అసెంబ్లీకి 81,006, లోక్‌సభలో 62,669, వర్దన్నపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో 1,31,252 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 97,526 ఓట్లు నమోదయ్యాయి. అయితే, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను పోలిస్తే 12 శాతం పోలింగ్ తక్కువ నమోదు కావడమే మెజార్టీ తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. కానీ మరింత సమన్వయంతో పని చేస్తే ఆ ఎనిమిది సెగ్మెంట్లలోనూ వెనుకబడిపోయే పరిస్థితి ఉండేది కాదన్న అంచనాకు అధినేత వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ‘ఓరుగల్లు’పై గులాబీ జెండా. ఒకప్పుడు కాంగ్రెస్.. ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్, మహబూబాబాద్‌పై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురేసింది. హన్మకొండ.. ఆ తర్వాత 2009 పునర్విభజనలో ఏర్పడిన వరంగల్‌గా ఏర్పడిన పార్లమెంట్ నియోజకవర్గానికి 1952 నుంచి 2015 వరకు మూడు ఉప ఎన్నికలు కలుపుకుని మొత్తం 19 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏడు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు విజయం సాధించారు. ఇక టీడీపీ ఐదు, టీఆర్ఎస్ మూడు, టీపీఎస్, పీడీఎఫ్ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో ధరావత్ రవీంద్రనాయక్ గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికలో టీడీపీ, 2009లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఎన్నికలో టీఆర్ఎస్ ఈ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావడంతో 2015 వచ్చిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ విజయం సాధించగా.. తాజా ఎన్నికల్లోనూ ఆయనే మరోమారు విజయం సాధించారు. ఇక ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోటల్లా ఉన్న మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం ద్విసభ్య నియోజకర్గంగా కొనసాగింది. ఈ సమయంలో 1957, 1962లో సార్వత్రిక ఎన్నికలు, 1965లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సమయాల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే విజయం వరించింది. ఆ తర్వాత ఈ స్థానం రద్దు కాగా.. 2009లో మళ్లీ ఏర్పడింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ విజయం సాధించారు. ఇక 2014లో మహబూబాబాద్(ఎస్టీ)లో టీఆర్ఎస్ పక్షాన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లోను టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్, టీడీపీ ప్రాభవం కోల్పోయినట్లయింది. -
టీఆర్ఎస్.. పోస్టుమార్టం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ శిబిరం ఆలోచనల్లో పడింది. కేవలం ఆరు నెలల కిందటి ఆదరణ ఎలా తలకిందులైంది..? గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల నాటి ఓట్ల సునామీ.. ఇప్పుడెందుకు దూరమైంది..? నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమికి తప్పుటడుగు ఎక్కడ పడింది..? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో టీఆర్ఎస్ అధినాయకత్వం ఉందని సమాచారం. కచ్చితంగా గెలిచి తీరుతామని భావించిన నల్లగొండ రెండోసారీ నిరాశ పరచడం, సిట్టింగ్ స్థానమైన భువనగిరిని తిరిగి నిలబెట్టుకోలేక పోవడానికి గల కారణాలను అన్వేషిస్తోందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి మొత్తంగా 5,00,346 ఓట్లు సాధించారు. కానీ, డిసెంబర్ నాటి ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని దేవరకొండ, నాగార్జు సాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యే అభ్యర్థులకు 6లక్షల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఓటమి పాలైన హుజూర్నగర్ ఓట్లూ ఉన్నాయి. అంటే కేవలం ఆరు నెలల తేడాతో ఆ పార్టీ ఏకంగా లక్ష పైచిలుకు ఓట్లను కోల్పోయింది. ఈ కారణంగానే నల్లగొండ ఎంపీ స్థానం దక్కకుండా పోయిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వ్యూహాత్మకంగా పనిచేసినా..! వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కడా అలసత్వం ప్రదర్శించినట్లు కనించలేదు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పజెప్పారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, లోక్‌సభ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని వెంట తీసుకుని ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేశారు. ఒక విధంగా కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ప్రచారం కంటే.. అధికార టీఆర్ఎస్ చేసిన ప్రచారమే ఎక్కువ. ఒకసారి పార్టీ అధినేత కేసీఆర్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేసి వెళ్లారు. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు సైతం అభ్యర్థిత్వం ఖరారుకు ముందు ఒకసారి, చివరలో ఒకసారి నల్లగొండకు ప్రచారానికి వచ్చి బహిరంగసభలో, రోడ్ షోలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలూ ఎవరికి వారూ మండలాలు, గ్రామాలను చుట్టి వచ్చారు. ఇంత చేసినా టీఆర్ఎస్ గెలుపు వాకిట బొక్కబోర్ల పడడాన్ని ఆ పార్టీ నాయకత్వం సీరియస్‌గానే పరిగణిస్తోందని చెబుతున్నారు. అతివిశ్వాసం కొంపముంచిందా..? అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరు నెలలకే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ నాటి ఫలితమే రిపీట్ అవుతుందన్న అతివిశ్వాసమే దెబ్బకొట్టిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కారణంగానే ఎమ్మెల్యేలు అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్లలేక పోయారా..? అదే పార్టీ కొంప ముంచిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏడింట ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు ఉన్నా.. చివరకు తమకు వచ్చిన మెజారిటీలో సగం ఓట్లు కూడా సాధించలేక పోవడం, పెద్ద మొత్తంలో ఓట్లకు కోత పడడాన్ని ఎవరి వైఫల్యంగా చూడాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. మంత్రి సొంత నియోజకవర్గం సూర్యాపేటలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థికంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇక, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థికి 3,484 ఓట్ల ఆధిక్యం వచ్చినా.. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు, లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లను పోలిస్తే.. 29వేల పైచిలుకు ఓట్ల తగ్గుదల ఉంది. ఇక, ఏ నియోజకవర్గంలో చూసినా.. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకి సమంగా ఓట్లు వచ్చినా గెలుపు సాధ్యమయ్యేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దెబ్బకొట్టిన కోదాడ.. హుజూర్నగర్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూర్యాపేట, నల్లగొండల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి లీడ్ వచ్చింది. దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్ వచ్చినా.. అది నాలుగు వేల ఓట్ల చొప్పునే. కానీ, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఆధిక్యమే టీఆర్ఎస్ అభ్యర్థిని దెబ్బకొట్టిందని విశ్లేషిస్తున్నారు. వరసగా కోదాడలో 11,930, హుజూర్గనర్లో 12,993, మిర్యాలగూడలో 7,186 ఓట్ల చొప్పున లీడ్ వచ్చింది. ఈ మూడు నియోజకవర్గాలే కాంగ్రెస్ అభ్యర్థిని విజయతీరాలకు చేర్చాయన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఫల్యం చెందారా ..? అన్న ప్రశ్నలపైనా చర్చ జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఏమైనా వెన్నుపోటు రాజకీయాలు దెబ్బతీశాయా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే పార్టీ నాయకత్వం ఈ ఓటమిపై పూర్తిస్థాయి సమీక్ష జరిపే వీలుందని చెబుతున్నారు. -
నల్లగొండ నా గుండె
నల్లగొండ : నల్లగొండ నా గుండెలాంటిదని, రాజకీయంగా జన్మనిచ్చి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించడంతో పాటు ప్రస్తుతం భువనగిరి ఎంపీగా విజయం సాధించానంటే నల్లగొండ ప్రజల చలువేనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భువనగిరి ఎంపీగా విజయం సాధించిన సందర్భంగా ఆయన శుక్రవారం నల్లగొండలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారం సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని పనిచేసి తెలంగాణ వెంకన్నగా పేరు తెచ్చుకున్నానన్నారు. ప్రస్తుతం ఎంపీ అయ్యానంటే అది కూడా నల్లగొండ ప్రజల చలువేనన్నారు. సీఎం కేసీఆర్ నన్ను ఓడించడం కోసం ఇన్‌చార్జ్‌లను పెట్టాడని ఆరోపించారు. నేను చేసిన ఉద్యమం ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్ కూతురు కూడా ఓడిపోయారంటే ప్రజలు టీఆర్ఎస్పై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తాను జిల్లాలో ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా పరిష్కరించడంతో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ ధర్మం, నీతి, నిజాయతీ విజయం సాధించిందన్నారు. కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని రాబోయేవి కాంగ్రెస్ రోజులేనని గుర్తుంచుకోవాలన్నారు. దుబ్బాక నర్సింహారెడ్డి మాట్లాడుతూ సారు.. కారు.. పదహారు అన్న కేసీఆర్‌కు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మైండ్ బ్లాక్ చేశారన్నారు. ముగ్గురు మొనగాళ్ల మాదిరిగా కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి విజయం సాధించారన్నారు. కోమటిరెడ్డి మీద ఉన్న అభిమానమే భువనగిరిలో గెలిపించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గుమ్మల మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అమరేందర్‌రెడ్డి, తండు సైదులుగౌడ్, బొడ్డుపల్లి లక్ష్మి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎందుకిలా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితికి సెంటిమెంట్ కరీంనగర్. పార్టీ ఆవిర్భావం తరువాత కేసీఆర్ 2001లో తొలి సింహగర్జన సభ నిర్వహించింది ఇక్కడే. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్ సన్నాహక సభ నిర్వహించి జోష్ పెంచింది ఇక్కడి నుంచే. చివరికి ఎన్నికల షెడ్యూల్ విడుతలైన తరువాత తొలి బహిరంగసభను కూడా కరీంనగర్ నుంచే మొదలు పెట్టి ఈ జిల్లాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత ఈ కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్కు షాకిచ్చింది. కరీంనగర్ లోక్‌సభ స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగింట బీజేపీకి ఘననీయమైన ఓట్లు పోల్ కావడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే నిజామాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమిలో పూర్వ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్ల భాగస్వామ్యం కూడా ఎక్కువే. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో సైతం మంథని, రామగుండంలలో టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ మెరుగైన ఓట్లు సాధించింది. మొత్తంగా చూస్తే పూర్వ కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, పెద్దపల్లిలో మాత్రమే టీఆర్ఎస్కు ఊరట లభించింది. మిగతా 8 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు రావడం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏకంగా 52వేల మెజారిటీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై 14వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఇదే నియోజకవర్గంలో బీజేపీకి ఏకంగా 52,181 ఓట్ల మెజారిటీ లభించడం గమనార్హం. మైనారిటీ వర్గాలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మెజారిటీ వర్గంలో 70 శాతం ఓట్లు బీజేపీకే పోలయినట్లు అంచనా వేస్తున్నారు. మిగతా స్థానాల్లోనూ... ఇక చొప్పదండి, మానకొండూరులలో టీఆర్ఎస్ అభ్యర్థులు రవిశంకర్, రసమయి బాలకిషన్‌లు అనూహ్యంగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. రవిశంకర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో 91వేల ఓట్లు పోల్ కాగా, ఈసారి ఇక్కడ టీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు కేవలం 41,396 అంటే దాదాపు 50వేల ఓట్లు మైనస్. బండి సంజయ్‌కు ఈ నియోజకవర్గం నుంచి ఎవరూ ఊహించని విధంగా 97,441 ఓట్లు సాధించారు. మానకొండూరులో గత ఎన్నికల్లో రసమయికి 89వేల ఓట్లు రాగా, ఈసారి 41వేల ఓట్లకు టీఆర్ఎస్ పరిమితమైంది. ఆ ఎన్నికల్లో 4356 ఓట్లు మాత్రమే వచ్చిన బీజేపీకి 73వేల ఓట్లు పోలవడం గమనార్హం. వేములవాడలోనూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు 28వేల మెజారిటీ కట్టబెట్టిన ఓటర్లు ఈసారి బీజేపీ 25వేల ఓట్ల ఆధిక్యతనిచ్చారు. కరీంనగర్ పార్లమెంటులో కరీంనగర్ మినహా మిగతా ఆరు అసెంబ్లీల్లో గత ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ రాకపోగా, ఈసారి భారీగా ఓట్లు పోలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజామాబాద్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిల్లో సైతం... నిజామాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమికి ఆ జిల్లాలోని నియోజకవర్గాలతోపాటు కరీంనగర్‌లోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లు కూడా ప్రధాన కారణమయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కన్నా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు భారీగా మెజారిటీ లభించింది. జగిత్యాలలో 7,300, కోరుట్ల నుంచి 20వేల మెజారిటీ బీజేపీకి లభించడం గమనార్హం. నిజామాబాద్‌లో కవిత ఓటమిలో ఈ రెండు నియోజకవర్గాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఇక పెద్దపల్లిలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ, మంథని, రామగుండంలలో టీఆర్‌ఎస్‌కన్నా కాంగ్రెస్‌కే ఓట్లు అధికంగా పోలయ్యాయి. మంథనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా, రామగుండంలో టీఆర్ఎస్ నేతల వర్గపోరుతో కాంగ్రెస్‌కు 2వేల స్వల్ప ఆధిక్యత లభించింది. కొంప ముంచిన అతివిశ్వాసం అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీఆర్ఎస్ మూడు నెలల తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలను తుడిచేస్తుందని ఆ పార్టీ నేతలు నమ్మారు. కరీంనగర్లో ఏడుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, వారి మధ్య సరైన సయోధ్య కరువైంది. సిట్టింగ్ ఎంపీ వినోద్‌కుమార్‌తోపాటు మంత్రి ఈటల రాజేందర్ గెలుపుపై పూర్తి ధీమాతో వ్యవహరించారు. కరీంనగర్‌తోపాటు ఒకటి రెండు పట్టణాల్లో బీజేపీకి ఓటింగ్ పెరిగినా, గ్రామీణ ఓటర్లు టీఆర్ఎస్ వైపే ఉంటారని కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ కోల్పోవడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే బహిరంగసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అభ్యర్థి ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకోగా, దాన్ని కౌంటర్ చేయడంలో టీఆర్ఎస్ నేతలు విఫలమయ్యారు. రైతుబంధు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలే తిరిగి ఓట్లు తెచ్చిపెడతాయని భావించిన ఎమ్మెల్యేలకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. కాగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కన్నా 30వేల మెజారిటీ సాధించిన మంత్రి ఈటల రాజేందర్ బీజేపీని మూడోస్థానానికి పరిమితం చేయడం గమనార్హం. టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పోలుకాకుండా ఆయన పకడ్బందీగా వ్యవహరించారు. హుస్నాబాద్‌లో సైతం 23వేల మెజారిటీ టీఆర్ఎస్ సాధించింది. త్వరలో మేథోమథనం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ అధిష్టానం త్వరలో పోస్టుమార్టం చేయనుంది. హైదరాబాద్‌లో పార్లమెంటరీ సమావేశం తరువాత వచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేస్తారు. కరీంనగర్లో ఓటమికి హిందుత్వ నినాదం, మోదీ ఎఫెక్ట్ బాగా పనిచేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో మేథోమథనం జరపనున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ బీజేపీకి పెరగడానికి గల కారణాలపై విశ్లేషణ చేయనున్నారు. -
అసెంబ్లీకి సై... లోక్‌సభకు ‘నో’..
సాక్షి, సిటీబ్యూరో: ఇంతలో ఎంత మార్పు..ఆరు నెలల్లోనే ఓటరు మనోగతం మారిందా అంటే..అవుననే అన్పిస్తోంది గురువారం నాటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలను గమనిస్తే. గత అక్టోబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏకపక్ష ఓటు వేసిన నగర ఓటరు..సరిగ్గా ఆర్నెళ్ల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పుతో రాజకీయ నేతలందరినీ ఆశ్చర్యపరిచారు. నగరంలోని నాలుగు లోక్‌సభ స్థానాల పరిధిలోనూ శాసనసభ–లోక్‌సభ ఫలితాలన్నీ తారుమారయ్యాయి. మంత్రుల నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ కారు జోరు ఒక్కసారిగా తగ్గిపోయింది. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో టీఆర్ఎస్ విజయం సునాయాసమేనని భావించినా ఎల్బీనగర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ రావటంతో ఆ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు భారీ మెజారిటీలతో విజయం సాధించినా లోక్‌సభకు వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. ఎల్బీనగర్లో కాంగ్రెస్‌కు ఏకంగా 27వేల పైచిలుకు మెజారిటీ రావటం కారు జోరుకు బ్రేకులేసింది. టీఆర్ఎస్కు కేవలం మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలోనే స్వల్ప మెజారిటీ వచ్చింది. సికింద్రాబాద్‌లో సీన్ రివర్స్ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలోనూ సీన్ రివర్స్‌గా మారింది. టీఆర్ఎస్కు నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు మినహా మరెక్కడా ఆధిక్యం రాలేదు. అంబర్‌పేటలో బీజేపీ భారీ మెజారిటీ సాధించగా, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ వెనుకబడింది. మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్, నాంపల్లిలోనే టీఆర్ఎస్కు ఆధిక్యత వచ్చింది. ఇక చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లలో శాసనసభ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీతో పోలిస్తే లోక్‌సభకు వచ్చే సరికి టీఆర్ఎస్కు నామమాత్రం మెజారిటీలే వచ్చాయి. శేరిలింగంపల్లిలో తొమ్మిది వేల పైచిలుకు, రాజేంద్రనగర్‌లో28 వేలు, మహేశ్వరంలో 27 వేల మెజారిటీలు నమోదయ్యాయి. మంత్రుల ఇలాకాలో.. ♦ సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని సనత్‌నగర్ నియోకజవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డికి ఏకంగా 18867 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ నియోకజవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తుండటం విశేషం. ♦ మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని మేడ్చల్ శాసనసభ స్థానంలో శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 80 వేలకు పైగా మెజారిటీ రాగా, తాజా ఎన్నికల్లో మాత్రం 8087 ఓట్ల మెజారిటీ మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖరరెడ్డికి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి చామకూర మల్లారెడ్డి కేబినెట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
ఓడిన చోటే గెలిచారు!
సాక్షి, ఆదిలాబాద్: ‘ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి’ అనేది పెద్దల మాట. ఈ విషయంలో తాజాగా ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన సోయం బాపురావు, బొర్లకుంట వెంకటేశ్ నేతకు ఈ నానుడి సరితూగుతుంది. గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోయం బోథ్ నియోజకవర్గం, బొర్లకుంట చెన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో ఒక్క అవకాశం చేజారితే మరో అవకాశం కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఇరువురికి డిసెంబర్ పోయిన వెంటనే ఏప్రిల్ కలిసి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగిన ఇరువురు గెలుపొందారు. పార్టీ మారి.. శాసనసభ ఎన్నికల్లో సోయం బాపురావు బోథ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకు ముందు ఆయన టీడీపీలో కొనసాగుతుండగా, రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఇక బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లో చేరి చెన్నూర్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఇరువురు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలు వీరిద్దరికి కలిసిరాక ఓడిపోయారు. ఈ పరిస్థితిలో కొద్ది నెలలు గడిచిపోయాయి. లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్‌ను సోయం ఆశించారు. అయి తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్‌ను ప్రకటించింది. దీంతో నామినేషన్ల ఘట్టం మొదలైన తర్వాత సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీని వీడి హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో కమలం గూటికి చేరారు. ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ సాధించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పెద్దపల్లి అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్‌ను ముందుగా ప్రకటించింది. ఇక టీఆర్ఎస్ నుంచి జి.వివేకానంద పేరు వినిపించినా అనూహ్యంగా నామినేషన్ల చివరి రోజు బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వెంటనే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కూడా ఇచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బోథ్ నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చెన్నూర్ నియోజకవర్గాలు ఉండగా, ఈ ఇరువురు నేతలకు డిసెంబర్లో మూసుకుపోయిన విజయం ఏప్రిల్‌లో మళ్లీ అదృష్టం తట్టింది. పార్టీ మారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి విజయం దక్కించుకున్నారు. సారుప్యత.. ఈ ఇద్దరు ఎంపీలకు సారుప్యత ఉంది. ఇరువురు డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. కాగా సోయం బాపురావు 2004లో బోథ్ నుంచి టీఆర్ఎస్ టికెట్‌కు సంబంధించి అప్పట్లో కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐటీడీఏలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన పదవి విరమణ తీసుకొని ఆ ఎన్నికల్లో బరిలో నిలిచారు. బోథ్ ఎమ్మెల్యేగా అప్పట్లో గెలుపొందారు. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2008లో ఆయన తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అయితే 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి బోథ్ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో నిరాశ చెందారు. 2014లో మరోసారి బోథ్ నుంచే కాంగ్రెస్ టికెట్ ఆశించినా రాకపోవడంతో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక బొర్లకుంట వెంకటేశ్ నేత రవాణా శాఖలో పనిచేస్తూ పదవి విరమణ తీసుకొని డిసెంబర్లో చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. 2019 ఏప్రిల్‌లో సోయం బీజేపీ నుంచి, బొర్లకుంట టీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలుపొందారు. గతం కంటే ఎక్కువే.. ఈ ఇరువురు లోక్‌సభ బరిలో నిలవగా, డిసెంబర్లో ఆయా నియోజకవర్గాల్లో అప్పుడు వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు అధికంగా రావడం గమనార్హం. సోయం బాపురావుకు బోథ్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో 54,639 ఓట్లు రాగా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 61,003 ఓట్లు వచ్చాయి. విచిత్రమేమిటంటే సోయం బాపురావు అసెంబ్లీ ఎన్నికల్లో 6వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకున్నా ఆయనకు అప్పట్లోనే విజయం దక్కే పరిస్థితి ఉండేది. ఇక వెంకటేశ్ నేతకు చెన్నూర్ అసెంబ్లీ ఎన్నికల్లో 43,848 ఓట్లు వచ్చాయి. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు చెన్నూర్ నియోజకవర్గంలో 67,219 ఓట్లు రావడం గమనార్హం. -
మంత్రులకు షాక్!
కంటోన్మెంట్: లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఇద్దరు మంత్రులకు షాక్ ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అదే విధంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి మల్కాజిగిరి నుంచి బరిలో నిలచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయా పార్లమెంట్ స్థానాల్లోని అసెంబ్లీ స్థానాల్లోనే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే స్థానిక నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగించలేకపోయింది. ఆయా మంత్రులు ఓటేసిన బూత్‌లలోనూ టీఆర్ఎస్కు ఆధిక్యం దక్కకపోవడం గమనార్హం. మారేడ్‌పల్లి నెహ్రూనగర్‌లో నివాసముండే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన తనయుడు సాయికిరణ్ యాదవ్‌ల ఓట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కస్తూర్బా కాలేజీలోని పోలింగ్ బూత్ నెం.220లో ఉన్నాయి. ఈ బూత్‌లో బీజేపీకి 395, కాంగ్రెస్‌కు 153 ఓట్లు రాగా... టీఆర్ఎస్కు కేవలం 89 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీతో పోలిస్తే టీఆర్ఎస్ 306 ఓట్లు తక్కువ రావడం గమనార్హం. ∙మంత్రి మల్లారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్న బోయిన్పల్లి సెయింట్ పీటర్స్ స్కూల్లోని పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి 207 ఓట్లు రాగా... మంత్రి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డికి 179 ఓట్లు దక్కాయి. ఈ బూత్‌లో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్కు 28 తక్కువ ఓట్లు పడ్డాయి. బీజేపీ సైతం ఈ బూత్‌లో 169 దక్కించుకోవడం గమనార్హం. -
జిల్లా అభివృద్ధికి నిధులు తెస్తా..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తానని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైందన్నారు. పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనను ఆశీర్వదించి ఖమ్మం ప్రజలకు అప్పగిస్తే.. వారు తిరుగులేని విజయాన్ని చేకూర్చారని, ఈ విజయం అపూర్వమైందని అన్నారు. తన విజయానికి కృషి చేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటానని, ప్రజా సేవకుడిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తీసుకుంటానన్నారు. తాను కేసీఆర్ అడుగు జాడల్లో నడిచే వ్యక్తినని, నాయకత్వం మాటే తన మాట అని, పార్టీ నిర్దేశించిన పనులు చేయడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. గతంలో టీడీపీ లోక్‌సభ పక్ష నాయకుడిగా ఉన్న అనుభవం ఉన్నందున.. దానిని జిల్లా అభివృద్ధికి వినియోగిస్తానన్నారు. టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నాయకుడిగా ఎవరికి అవకాశం ఉందని విలేకరులు ప్రశ్నించగా.. పార్టీ అధినేత అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని, అది వ్యక్తులు నిర్ణయించేది కాదని, పార్టీ తీసుకునే నిర్ణయమని అన్నారు. జిల్లా ప్రజలు తనను ఎంపీగానే చూడాలనుకున్నారని, అందుకే ఇంతటి ఘన విజయం అందించారని, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యమన్నారు. సమావేశంలో మేయర్ పాపాలాల్, టీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు కమర్తపు మురళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, బొమ్మెర రామ్మూర్తి, తిరుమలరావు, తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబి స్వర్ణకుమారి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదం.. ఖేదం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. నియోజకవర్గాలు, పోలింగ్ బూత్‌లలో వచ్చి న ఓట్ల ఆధారంగా పోస్టుమార్టం నిర్వహిస్తున్నాయి. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలు మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీకి మోదం కలిగించగా.. కాంగ్రెస్ పార్టీకి ఖేదం మిగిల్చాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించి.. పార్టీ టికెట్‌పై పోటీ చేసిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఘనవిజయం సాధించి ఆరు నెలలైనా గడవకముందే జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిసి పోటీ చేశాయి. ఇందులో కాంగ్రెస్.. మధిర, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. భాగస్వామ్య పక్షమైన సీపీఐ వైరాలో.. తెలుగుదేశం పార్టీ ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోటీ చేశాయి. వీటిలో వైరా, ఖమ్మం మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీకి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో జిల్లాలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో జిల్లాలో కాంగ్రెస్‌కు రాజకీయంగా తిరుగు లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరమైనా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తల అండదండలు, సంప్రదాయ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ విజయానికి కృషి చేసినా ఫలితం మాత్రం పార్టీ ఊహించిన దానికి భిన్నంగా వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, మహాకూటమి మిత్రపక్షాల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కన్నా అత్యంత తక్కువగా రావడమే కాకుండా.. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్కు మెజార్టీ రావడానికి గల కారణాలపై కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ విజయానికి ఏ నియోజకవర్గంలో.. ఏ స్థాయిలో కృషి జరిగింది.. ఆయా ప్రాంతాల్లో ఓట్ల శాతం తగ్గడానికి గల కారణాలపై కాంగ్రెస్ నేతలు ఆరా తీసే పనిలో పడ్డారు. ఏడింట్లో మెజార్టీ రాదాయె.. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ మెజార్టీ సాధించలేకపోయింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో మాత్రం రెండో స్థానాన్ని మాత్రం కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన పాలేరు, మిత్రపక్షమైన టీడీపీ గెలుపొందిన సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సైతం టీఆర్ఎస్ మెజార్టీ సాధించడం, మధిర నియోజకవర్గంలోనూ ఆ పార్టీయే మెజార్టీ సాధించింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన కొత్తగూడెం నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ది రెండో స్థానమే అయింది. ఇక వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్కు మెజార్టీ వచ్చినా.. మిగితా నియోజకవర్గాలతో పోలిస్తే స్వల్పమే కావడం కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చింది. పార్టీ కోసం పరిశ్రమించే కార్యకర్తలున్నా కొన్నిచోట్ల వారిని పూర్తిస్థాయిలో పార్టీకి పనిచేసే విధంగా నాయకులు చేయలేకపోయారని, నాయకుల చుట్టూ రాజకీయాలు తిరగడం వల్ల పార్టీకి కొంత నష్టం జరిగిందని ఖమ్మం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రేణుకా చౌదరి శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తన ఓటమికి గల కారణాలపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నామని, పోలింగ్ కేంద్రాలవారీగా వివరాలు వచ్చాక లోపం ఎక్కడ జరిగింది? పార్టీ గెలుపునకు అడ్డు పడింది ఎవరో తెలుస్తుందని.. దాని ఆధారంగా పార్టీ హైకమాండ్‌కు నివేదిక ఇస్తామన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి అనూహ్య రీతిలో పెరిగిన మెజార్టీతో ఆ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ జిల్లాలో టీఆర్ఎస్ మరింత పుంజుకుంటుందనడానికి నిదర్శనమని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో పరాజయం పాలు కావడంతో ఆ పార్టీలో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. -
‘కేసీఆర్ నియంత పోకడలకు అడ్డుకట్ట’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పోకడలను లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు అడ్డుకున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సంతృప్తికర పోటీ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం కుంతియా.. గెలిచిన ఎంపీలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ రోజు రోజుకూ పటిష్టం అవుతోందన్నారు. కేసీఆర్ ఒంటెత్తు పోకడలు, రాజకీయ ఫిరాయింపులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, పదహారు సీట్లు అంటూ విర్రవీగిన కేసీఆర్‌ను సింగిల్ డిజిట్ వద్ద ఆపి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం నేర్పారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజాస్వామ్య వాదిలా పనిచేయాలని హితవు పలికారు. 8 స్థానాల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని, మూడింట గెలిచి, మరో రెండు చోట్ల మెజారిటీతో ఓటమి పాలైందని తెలిపారు. -
‘వైఎస్ జగన్ సీఎం కావడం సంతోషంగా ఉంది’
సాక్షి, నల్గొండ : తాను ఎంపీగా గెలవడం, వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావడం తనకెంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజల కోసం దివంగత నేత వైఎస్సార్ ఒక్కడుగు వేస్తే.. వైఎస్ జగన్ రెండడుగులు వేస్తారని పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఎంతో శ్రమించి ప్రజాభిమానాన్ని గెలుచుకున్నారని ప్రశంసించారు. తన విజయం గురించి మాట్లాడుతూ.. నీతిగా పని చేశాను కాబట్టే ప్రజలు తనను గెలిపించారని తెలిపారు. ఒక ఎంపీగా విభజన చట్టంలో ఇచ్చిన హామీల కోసం సభలో కొట్లాడతానని పేర్కొన్నారు. పరిపాలనను గాలికొదిలేసి దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్, కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఘాటుగా విమర్శించారు. కాగా గురువారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి భారీ ఓటమిని చవిచూశారు. అయినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డిపై నమ్మకంతో ఆయనకు భువనగిరి లోక్‌సభ టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిజం చేస్తూ కోమటిరెడ్డి విజయం సాధించారు. కోమటిరెడ్డి పుట్టినరోజు నాడే ఆయన ఎంపీగా గెలుపు అందుకోవడంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయ్యింది. -
‘మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి జిల్లాలో బీజేపీ జెండా ఎగిరిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలకు గెలుచుకున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థుల విజయోత్సవ సభను శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ.. జీఎస్టీ అమలుపర్చిన ప్రపంచ నాయకుల్లో గెలిచింది కేవలం మోదీనే అని గుర్తుచేశారు. రాజకీయ విశ్లేషకులందరూ బీజేపీపై మానసిక ఒత్తిడి పెట్టారని, మోదీ ముందు కేసీఆర్ పనికిరారని తెలంగాణ ప్రజలు తేల్చారని పేర్కొన్నారు. మోదీని, బీజేపీని విమర్శిస్తే బాగుండదని ఆయన హెచ్చరించారు. మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలని మురళీధర రావు హితవు పలికారు. కేటీఆర్‌కు మాటలు రావడంలేదు.. నరేంద్రమోదీ హఠావో అన్న విపక్షాలకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సమావేశంలో లక్షణ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీనే తమకు అంబేద్కర్ అని అన్నారు. తెలంగాణ దాటితే టీఆర్ఎస్ చెల్లని రూపాయని ఆయన ఎద్దేవా చేశారు. ఫలితాలు చూసిన తరువాత కేటీఆర్‌కు మాటలు రావడంలేదని, రైతులు కవితను సాగనంపారని పేర్కొన్నారు. తెలంగాణలో చరిత్ర సృష్టించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమను అభినందించినట్లు లక్ష్మణ్ తెలిపారు. నియంత పాలన సాగదు: సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాష్ట్రంలోని ముఖ్యమైన స్థానాల్లో బీజేపీ గెలిచింది. టీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు వ్యతిరేకించారు. అక్రమ కేసుల ద్వారా ప్రజాసంఘాల నాయకులను కేసీఆర్ బయపెట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ మజ్లీస్ పార్టీని నమ్ముకున్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నియంత పాలన సాగదు. నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బొందుగాళ్లకు స్థానం లేదు: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కార్యకర్తలందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా. ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్ఎస్ అహంకారం గురించే మాట్లాడుతున్నారు. ప్రజలకి కేంద్ర పథకాలు తప్ప రాష్ట్ర పథకాలు ఒక్కటీ కూడా అందడం లేదు. టిఆర్ఎస్కి సెంటిమెంట్ అయిన కరీంనగర్లో ప్రజలు బీజేపీకే పట్టాం కట్టారు. తెలంగాణలో హిందువులకు తప్ప, బొందుగాళ్లకు స్థానం లేదని ప్రజలు తేల్చారు. -
‘కోట’లో కవిత
సాక్షి, కొత్తగూడెం: గిరిజనుల కోట అయిన మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కారు జోరు కొనసాగించింది. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం 2009లో ఆవిర్భవించగా ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీఆర్ఎస్లు గెలుపొందగా, మూడోసారి ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత స్పష్టమైన ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌పై ఘన విజయం సొంతం చేసుకున్నారు. తొలి నుంచి మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇటీవల టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించడం, మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం, టీఆర్ఎస్ నాయకులు మాలోతు కవితకుఎంపీ టికెటు కేటాయించడంతో గతంలో కంటే మెజారిటీ గణనీయంగా పెరిగింది. ఎవరూ ఊహించని విధంగా మెజారిటీ కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా ఎంపీగా విజయకేతనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి గిరిజన మహిళలకు ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించలేదు. దీంతో టీఆర్ఎస్ మహిళా జనాభా అధికంగా ఉన్న మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీలో నిలిచే అవకాశం మాలోతు కవితకు కల్పించడంతో తొలి గిరిజన మహిళా ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ విషయంలో నిరాశే ఎదురైనప్పటికీ పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో ఆమెకు ఎంపీగా కేసీఆర్ అవకాశం కల్పించారు. కొత్త పాత నాయకుల సహకారంతోనే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఇల్లెందు, పినపాక, ములుగు, భద్రాచలం అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందే సీటుగా అందరూ భావిస్తూ వచ్చారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్‌తో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో కొత్త, పాత నాయకులను సమన్వయం చేస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తరచూ పార్లమెంటు పరిధిలో పర్యటించారు. అలాగే కేటీఆర్ రోడ్‌షో, కేసీఆర్ బహిరంగ సభ నిర్వహణతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం పెరిగింది. పాత, కొత్త తేడా లేకుండా అంతా కలిసికట్టుగా టీఆర్ఎస్ విజయం కోసం ముందుకు సాగారు. దీంతో అనూహ్యంగా గతంలో కంటే టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సాధించింది. భారీ ఆధిక్యతతో విజయం.. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత 1,46,663 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో మొత్తం 9,83,535 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 801 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. మొత్తం ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 4,62,109 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌కు 3,15,446 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి జాటోత్ హుస్సేన్‌నాయక్‌కు 25,487, సీపీఐ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వరరావుకు 45,719 ఓట్లు పోలయ్యాయి. టీజేఎస్ అభ్యర్థి అరుణ్‌కుమార్‌కు 57,073 ఓట్లు రాగా, నోటాకు 14,082 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత మొదటి రౌండ్ నుంచి చివరి వరకు తన సమీప ప్రత్యర్థి బలరాంనాయక్‌పై ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు. చివరకు 1,46,663 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. -
‘నామా’స్తుతే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కారు జోరు కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికలకన్నా టీఆర్ఎస్ ఓటింగ్ శాతం పెరగడంతో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన నామా.. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా ఈసారి అత్యధికంగా రావడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 8 గంటలకు తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు రాగా..కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రధాన పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతుందనే రీతిలో కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి నెలకొని ఉండగా.. తొలిరౌండ్ ప్రారంభం నుంచి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. లోక్‌సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి రౌండ్ పూర్తయ్యేటప్పటికి టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సుమారు రూ.11వేల ఆధిక్యంతో ఉన్నారు. అదే ఆధిక్యం చివరి వరకు కొనసాగుతూ ప్రతి రౌండ్‌కు పెరుగుతూ వచ్చింది. తొలి మూడు, నాలుగు రౌండ్ల వరకు నామా నాగేశ్వరరావుకు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి మధ్య సుమారు 20వేలలోపు ఓట్ల వ్యత్యాసం ఉండగా.. 6వ రౌండ్ నుంచి ఈ వ్యత్యాసం క్రమేణా పెరుగుతూ వచ్చింది. తొలి రౌండ్ ప్రారంభం కాగానే కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి రెండు రౌండ్లు పూర్తయ్యే వరకు కౌంటింగ్ సరళిని పరిశీలించి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్కు మెజార్టీ.. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రతి రౌండ్లో మెజార్టీ లభించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడిందనడానికి లోక్‌సభ ఎన్నికల మెజార్టీయే నిదర్శనమని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు అత్యధిక మెజార్టీ పాలేరు నియోజకవర్గం నుంచి లభించగా.. స్వల్ప మెజార్టీ వైరా నియోజకవర్గం నుంచి లభించింది. పార్టీకి వివిధ వర్గాలు చేరువ కావడంతోపాటు ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకుని.. నామా విజయానికి చేసిన కృషి, నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడం వంటి కారణాలు సైతం పార్టీ మెజార్టీకి కారణంగా ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీ చేసిన నామా నాగేశ్వరరావు రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన ఇప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి పైనే 2009, 2019లో విజయం సాధించడం విశేషం. రేణుకా చౌదరి, నామా ప్రధాన ప్రత్యర్థులుగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీపడడం ఇది మూడోసారి. 2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావుపై రేణుకా చౌదరి విజయం సాధించగా.. 1999లో టీడీపీ అభ్యర్థి మద్దినేని బేబి స్వర్ణకుమారిపై రేణుకా చౌదరి విజయం సాధించారు. నామా గెలుపుతో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంపై టీఆర్ఎస్ తొలిసారిగా పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేసి విజయ పతాకాన్ని ఎగుర వేసినట్లయింది. 2014 ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు టీడీపీలో ఉండి.. ఆ పార్టీ తరఫున కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నామా నాగేశ్వరరావు విజయంపై టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక దృష్టి సారించడం.. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రాములునాయక్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతోపాటు ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం వంటి కారణాలు టీఆర్ఎస్కు భారీ మెజార్టీ తెచ్చి పెట్టాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కౌంటింగ్ ప్రారంభమై నాలుగు రౌండ్లు పూర్తయ్యాక కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన నామా నాగేశ్వరరావు కౌంటింగ్ సరళిని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యాక నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ల స్లిప్‌లను లెక్కించిన అనంతరం ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ఫలితాన్ని కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఆర్వీ.కర్ణన్ అధికారికంగా ప్రకటించారు. విజయం సాధించిన నామా నాగేశ్వరరావుకు ఎన్నికల ధ్రువపత్రాన్ని అందజేశారు. -
ఆదిలాబాద్‌లో బీజేపీ బోణి
సాక్షి, ఆదిలాబాద్: ఐదు నెలలకే ఎంత మార్పు.. డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలకొచ్చేసరికి ఢీలా పడిపోయింది. సిట్టింగ్ పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయింది. గులాబీ కోటాలో కమలం వికసించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ బోణి కొట్టింది. టీఆర్ఎస్ రెండో స్థానంలో, కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచాయి. సోయం బాపురావు గెలుపు.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావును విజయం వరించింది. గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి 6వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైన బాపురావు తిరిగి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మార్చి బరిలో నిలిచి విజయకేతనం ఎగరవేశారు. 2004లో టీఆర్ఎస్ నుంచి బోథ్ ఎమ్మెల్యేగా సోయం బాపురావు గెలిచారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయంగా ఏ పదవి కలిసిరాలేదు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమం ద్వారా గత కొంతకాలంగా ప్రముఖంగా నిలిచారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు నామినేషన్ల ఘట్టం సమయంలో ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరా రు. ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచే హవా.. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు మొదటి రౌండ్ నుంచే హవా కొనసాగింది. ప్రతీ రౌండ్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు. మధ్యలో టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్‌కు రౌండ్ పరంగా ఆధిక్యం వచ్చినా సోయం బాపురావుకు అంతకుముందు రౌండ్లలో వచ్చిన ఆధిక్యత ముందు అది బలాదూర్ అయిపోయింది. ఓ దశలో సోయం బాపురావుకు మెజార్టీ 70వేల నుంచి 80వేల వరకు చేరుకుంటుందని ఆ పార్టీ శ్రేణులు భావించారు. అయితే చివరి రౌండ్లలో కొంత ఆధిక్యత తగ్గింది. బీజేపీ మొదటి రౌండ్ నుంచే ఆధిక్యత కనబర్చడంతో టీఆర్ఎస్ నేతలు ముఖం చాటేశారు. కనీసం కౌంటింగ్ కేంద్రాలకు కూడా వారు రాకపోవడం గమనార్హం. సిట్టింగ్ స్థానం కోల్పోయిన టీఆర్ఎస్.. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గోడం నగేశ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ టిక్కెట్ పొందిన ఆయన గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, సిర్పూర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటం, ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన టీఆర్ఎస్లో కొనసాగుతున్న ఆత్రం సక్కు కూడా ఉండడంతో గెలుపుపై ధీమాతో మెలిగారు. అన్ని నియోజకవర్గాల్లో బలమైన కేడర్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 1లక్ష 12వేల ఓట్లు కోల్పోయారు. గుడ్డిలో మెల్ల.. కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్ మూడో స్థానంలో నిలిచినా గత ఎన్నికలకంటే ఆ పార్టీ అధిక ఓట్లు సాధించడం గుడ్డిలో మెల్లలాగ నిలిచింది. శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాథోడ్ రమేష్ ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ చేతిలో ఓటమి చెందారు. ఈ పరిస్థితిలో లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయన ఉవ్విళ్లూరారు. అయితే పరిస్థితులు మాత్రం అనుకూలించలేదు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన రాథోడ్ రమేశ్ గత కొద్ది కాలంగా రాజకీయంగా పదవి లేకపోవడంతో ప్రభావం కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తిరిగి రాజకీయంగా బలపడుదామని ఆయన అనేక ఆశలు పెట్టుకున్నారు. అయితే అవి వమ్ము అయ్యాయి. బీజేపీ శ్రేణుల సంబరాలు.. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో భారతీయ జనతా పార్టీ బోణి కొట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పార్లమెంట్ స్థానం ఏర్పడినప్పటి నుంచి సోషలిస్ట్ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లు ప్రాతినిధ్యం వహించినా బీజేపీ ఇప్పటివరకు ఇక్కడ గెలవలేదు. అయితే ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ బలంగా ఉంది. అనేక మంది సీనియర్ నేతలు పార్టీలో కొనసాగుతున్నారు. ఈ గెలుపు ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ పలుమార్లు పోటీ చేసినా గెలుపొందలేదు. తాజాగా సోయం బాపురావు గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో సంబరాలు జరుపుకున్నారు. పోలింగ్ వివరాలు.. మొత్తం ఓట్లు 14,88,353 పోలైన ఓట్లు 10,69,333 పోలింగ్ శాతం 71.45 అభ్యర్థులకు వచ్చిన ఓట్లు అభ్యర్థి పేరు వచ్చిన ఓట్లు సోయం బాపురావు 3,77,374 గోడం నగేశ్ 3,18,814 రాథోడ్ రమేశ్ 3,14,238 కుమ్రం వందన 8,007 దరావత్ నరేందర్‌నాయక్ 5,241 పవర్ కృష్ణ 2,705 భీంరావు 6,837 ఆరె ఎల్లన్న 3,019 కుమ్ర రాజు 4,388 గంట పెంటన్న 4,548 నేతావత్ రాందాస్ 5,521 నోటా 13,036 పార్టీల వారీగా వచ్చిన ఓట్లు సోయం బాపురావు బీజేపీ 3,77,374 గోడం నగేశ్‌టీఆర్‌ఎస్ 3,18,814 మెజార్టీ58,560(టీఆర్ఎస్పై బీజేపీ గెలుపు) రాథోడ్ రమేశ్ కాంగ్రెస్ 3,14,238