61 శాతం పోలింగ్‌  | 61 Percentage Of Polling In Lok Sabha Polls In Telangana | Sakshi
Sakshi News home page

61 శాతం పోలింగ్‌ 

Published Fri, Apr 12 2019 4:25 AM | Last Updated on Fri, Apr 12 2019 5:00 AM

61 Percentage Of Polling In Lok Sabha Polls In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గురువారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 61% అంచనా పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ ప్రకటించారు. శుక్రవారం ఉదయం కచ్చితమైన పోలింగ్‌ గణాంకాలను వెల్లడిస్తామన్నారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. పోలింగ్‌ సమయం ముగిసే వరకు క్యూల్లో నిలబడిన ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల సంఘం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఎక్కడా రీపోలింగ్‌ ఉండదు! 
నిజామాబాద్, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాల పరిధిలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 7.30 గంటల వరకు పోలింగ్‌ జరుగుతూనే ఉందని రజత్‌కుమార్‌ వెల్లడించారు. పోలింగ్‌ వేళలు ముగిసిన అనంతరం గురువారం రాత్రి ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 3 లక్షల మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది, భద్రతా బలగాలకు రజత్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలను విజయవంతం చేసేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు అభినందనలు తెలిపారు. ఎక్కడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాలేదన్నారు.  హింసా, దౌర్జన్యాలు, బూత్‌ల స్వాధీనం వంటి ఘటనలు జరగలేదన్నారు. ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడిందంటూ సోషల్‌ మీడియాల్లో వస్తున్న ఫొటోల విశ్వసనీయతను రజత్‌ కుమార్‌ ప్రశ్నించారు. ఈ ఫొటోలపై విచారణకు ఆదేశించామని, ఇలాంటి ఘటనలు తన దృష్టికి రాలేదన్నారు. 

పోలింగ్‌పై భానుడి ప్రతాపం 
పోలింగ్‌ ఉదయంపూట జోరుగానే సాగింది. ఉదయం 9 గంటల వరకు 10.6%, 11 గంటలకు 22.8%, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 38.80% పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాత ఎండ తీవ్రత కారణంగా మందకొడిగా సాగింది. మధ్యాహ్నం 3 గంటలకు 48.95% పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం ఎండ తీవ్రత తగ్గిన తర్వాత మళ్లీ పుంజుకుంది. సాయంత్రం 5 గంటల నాటికి 61 శాతానికి చేరింది. 

కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభం 
షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈవీఎంలు మొరాయించడంతో పలు కేంద్రాల్లో గంట నుంచి రెండు గంటల పాటు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 5.30–6.45 గంటల మధ్య మాక్‌పోలింగ్‌ నిర్వహించిన తర్వాత పోలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. మాక్‌పోలింగ్‌లోనే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌లు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎన్నికల్లో మొత్తం 64,512 బ్యాలెట్‌ యూనిట్లు, 34,635 కంట్రోల్‌ యూనిట్లు, 34,770 వీవీప్యాట్స్‌ వినియోగించగా, మాక్‌ పోలింగ్‌ సందర్భంగా 541 బ్యాలెట్‌ యూనిట్లు, 639 కంట్రోల్‌ యూనిట్లు, 843 వీవీప్యాట్స్‌ను మార్చాల్సి వచ్చింది. ఉదయం 7 గంటలకు వాస్తవ పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత కూడా కొన్ని చోట్ల యంత్రాలు మొరాయించాయి. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ సారి ఈవీఎంల సమస్యలు తగ్గాయని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. 

బద్ధకించిన జంటనగరాలు 
ఓటేసేందుకు జంటనగరాల ప్రజలు మళ్లీ బద్దకించారు. సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన పోలింగ్‌ శాతం అంచనాల ప్రకారం.. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో అత్యల్పంగా 44.99% పోలింగ్‌ నమోదైంది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో 39.49%, మల్కాజ్‌గిరి స్థానం పరిధిలో 49.21% పోలింగ్‌ నమోదైంది. మెదక్‌ లోక్‌సభ పరిధిలో అత్యధికంగా 68.60% పోలింగ్‌ జరిగింది. గ్రామీణ ప్రాంతాలతో కూడిన చేవెళ్ల లోక్‌సభలో 54.8% పోలింగ్‌ నమోదైంది. జంటనగరాల పరిధిలో అత్యల్ప ఓటింగ్‌ శాతం నమోదు కావడంపై సీఈఓ రజత్‌కుమార్‌ స్పందించారు. గురువారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత, బలమైన అభ్యర్థులు బరిలోలేకపోవటం, జాతీయస్థాయిలో రాజధాని అంశాలు ఎజెండాలో లేకపోవటం, విస్తృత ప్రచారానికి సమయం లేకపోవటం, నగరంలో ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు అందకపోవటం వంటి కారణాలతోనే పోలింగ్‌ తక్కువగా నమోదైందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85%, ఎమ్మెల్యే ఎన్నికల్లో 70–75% పోలింగ్‌ జరిగిందన్నారు. ప్రజలతో అనుసంధానమై ఉండే వ్యక్తిని ఎన్నుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారన్నారు. ఎంపీలతో ప్రజలకు నేరుగా అనుబంధం ఉండదని, దీంతో సాధారణంగా లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ తక్కువే ఉంటుందన్నారు. పోలింగ్‌ శాతం పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు.  

సికింద్రాబాద్‌లో అత్యల్పంగా.. 
సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో అత్యంత తక్కువగా పోలింగ్‌ శాతం నమోదైంది. ఈ నియోజకవర్గంలో మధ్య, దిగువ మధ్య తరగతి జనాలు ఎక్కువగా ఉండే అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో 30.19%, ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 36.70% ఓటింగ్‌ నమోదైంది. సంపన్నుల కేంద్రమైన ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో 38% మంది ఓటేశారు. ఇక హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో యాకుత్‌పురా నియోజకవర్గంలో 32%, మలక్‌పేట నియోజకవర్గంలో 33.60% ఓటింగ్‌ నమోదైంది. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా నివసించే గోషామహల్‌లో 45.70% ఓట్లు పోల్‌కావడం విశేషం. 

220 కోట్లు విలువైన జప్తులు! 
మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని రజత్‌కుమార్‌ తెలిపారు. పోలింగ్‌ ముగియడంతో తనిఖీలు ఉండవన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మొత్తం రూ.74.56 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశామన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ.76 కోట్లు విలువైన జప్తులు కలిపితే ఈ మొత్తం రూ.220 కోట్లకు పెరుగుతుందన్నారు. 2014లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇది మూడు రెట్లు అధికమని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు.  

స్ట్రాంగ్‌ రూంలకు ఈవీఎంలు! 
పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కలెక్షన్‌ సెంటర్‌కు తరలిస్తారని రజత్‌కుమార్‌ వెల్లడించారు. అక్కడ ఉండే సహాయ రిటర్నింగ్‌ అధికారి    ఫారం–17సీ, ఈవీఎం, వీవీప్యాట్స్‌ను పరిశీలించి చూస్తారన్నారు. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లను సరిచూసుకుంటారన్నారు. తర్వాత ఎన్నికల పరిశీలకుడు దీన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేస్తారన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను సంబంధిత లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్స్‌కు తరలిస్తారన్నారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద రెండంచెల భద్రత ఉంటుందన్నారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర పోలీసు బలగాలతో రెండో అంచె బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. అక్కడ సీసీటీవీల నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను కాపలాగా పెడతామని కోరుకుంటే, వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ముగిసిన తర్వాత 45 రోజుల వరకు ఈ భద్రత ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, వాటిని సవాలు చేస్తూ 45 రోజుల్లోగా న్యాయ స్థానంలో పిటిషన్‌ వేయడానికి అవకాశముందని, అందుకే వీటికి భద్రత కల్పిస్తామన్నారు. 

గిన్నిస్‌బుక్‌లో ఇందూరు  ఎన్నికలు! 
నిజామాబాద్‌ లోక్‌ సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ చేసినా, అక్కడ పోలింగ్‌ విజయవంతంగా ముగిసిందన్నారు. ఇందుకు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ఎన్నికల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. 185  మంది అభ్యర్థులకు ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం ప్రపంచరికార్డు అని, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు కల్పించాలని ఆ సంస్థకు లేఖ రాశామన్నారు. నిజామా బాద్‌ పోలింగ్‌ సందర్భంగా 261 బ్యాలెట్‌ యూని ట్లు, 55 కంట్రోల్‌ యూనిట్లు, 87 వీవీప్యాట్స్‌ను మార్చాల్సి వచ్చిందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement