Nizamabad lok sabha constituency
-
కారులో పెరిగిన కసి.. ఆ గడ్డ ఇక ముందు ఎవరి అడ్డా?
పునాదులు లేని చోట కమలం పార్టీకి హఠాత్తుగా ఓ ఎంపీ ఎన్నికయ్యాడు. అనుకోకుండా లభించిన విజయాన్ని ఆస్వాదించడంతో పాటు దాన్ని కాపాడుకోవడం కూడా అవసరమే. పార్టీకి మరిన్ని విజయాలు అందించడానికి అక్కడున్న నేతలంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. కాని ఆ జిల్లాలోని కమలం రేకుల మధ్య ఐక్యత కనిపించడంలేదు. ఇంతకీ కాషాయ సేనలో అంతర్గత పోరు నడుస్తున్నదెక్కడ? ఎంపీ వర్సెస్ కన్వీనర్లు ఇందూరు కమలం పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గతంలో అంతర్గతంగా ఉండే విభేదాలు ఇప్పుడు వీధిన పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన బీజేపి ఇంటర్నల్ సమావేశం రసాభాసగా ముగిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లుగా.. ఇప్పటివరకు ఉన్నవారికి కాకుండా కొత్తవారికి ఇవ్వడంపై ఒకింత అసహనం..ఆగ్రహం వ్యక్తం అయ్యాయి. ఈ సమావేశం వల్ల మరోసారి బీజేపి నేతల మధ్య ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదోవిడత పాదయాత్ర నేపథ్యంలో ఇంఛార్జుల నియామకంలో తమను పట్టించుకోలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలపై కూడా పలు మండలాల నాయకులు అగ్గిమీద గుగ్గిలమైనట్టు సమాచారం. ఇప్పటికే ఇందూరు బీజేపీలో ఎంపీ అరవింద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నట్టుగా ఫైట్ సాగుతోంది. అరవింద్ తనకిష్టమైనవారికే పదవులిప్పించుకుంటున్నారని.. అలాగే ఇంఛార్జులు, కన్వీనర్ల నియామకాల్లోనూ తమను పట్టించుకోలేదంటూ.. కొందరు నేతలు సుమారు రెండు గంటల పాటు సమావేశంలోనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పైగా ఎంపీ అరవింద్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలూ చేసినట్టు సమాచారం. చదవండి: (మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్) నోట నవ్వుతారు.. నొసలు చిట్లిస్తారు..! బీజేపీ పదాధికారుల సమావేశంలో.. ముఖ్యంగా ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల నేతలు అరవింద్‌పై పెద్దఎత్తున ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఈ మధ్య అరవింద్ ఆర్మూర్ లోనే ఉండి పాలిటిక్స్ చేస్తున్నారు. మరోవైపు బోధన్ లోనూ బీజేపీ ఎమ్మెల్యే సీటు ఆశావహుల సంఖ్య పెరగడంతో.. ఆయా గ్రూపుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఇంతకాలం అరవింద్‌కు అనుకూలంగానే ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనర్సయ్య కూడా ఈమధ్య అరవింద్‌తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడినీ మార్చబోతున్నారంటూ.. గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అధ్యక్షుడిగా పనిచేసి.. ప్రస్తుతం అరవింద్‌కు సన్నిహితంగా ఉంటున్న పల్లె గంగారెడ్డితో పాటు.. మరికొందరి పేర్లను జిల్లా అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కారులో పెరిగిన కసి ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్ లో 11 మంది కార్పోరేటర్లు బీజేపి నుంచి ఇతర పార్టీల్లోకి వలస వెళ్ళారు. అధ్యక్ష పదవి మళ్ళీ తనకే ఇవ్వకపోతే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడైన బసవ కూడా పార్టీ మారే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ను ఢీ అంటే ఢీ కొడుతూ ఉవ్వెత్తున ఎగిసిపడిన బీజేపీ.. అంతేస్థాయిలో అంతర్గత కలహాల్లో కూరుకుపోతోంది. పైగా రానున్న ఎన్నికల్లో గట్టిగా పోరాడితే కమలం పార్టీకి అవకాశాలున్న నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ వంటి స్థానాల్లోనే ఈ అంతర్గత విభేదాలు పొడచూపడం పార్టీని కలవరపెడుతోంది. వడివడిగా ఎదిగిన బీజేపీ.. అంతే వడివడిగా సంక్షోభాలు.. అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ మళ్లీ ఇందూరుపై సీరియస్ గా దృష్టి సారిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపి బలహీనతలే ప్రత్యర్థులకు బలమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమంటూ.. నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కవిత ఎంట్రీ.. డైలమాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్!
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ డైలమాలో పడ్డారా? తొలిసారి ఎంపీగా గెలిచిన ఆనందం కొనసాగుతుందా? ఇంతటితో ఆగిపోతుందా? ఇంతకీ ఆయన టెన్షన్‌కు కారణం ఏంటి? అసలు ఇందూరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా మారబోతున్నాయి? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఓ స్థాయిలో చక్రం తిప్పిన తండ్రి అండదండలు ఓపక్క.. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితనే ఓడించిన ఆత్మవిశ్వాసం మరోపక్క.. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టాయి. అయితే కొంత కాలం స్తబ్దుగా ఉన్న కల్వకుంట్ల కవిత మళ్లీ ఇందూర్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో... ధర్మపురి అరవింద్ లో డైలామా మొదలైంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం అధికార టీఆర్ఎస్ పార్టీ వారే కాబట్టి... వారి అండదండలతో కవిత ఎమ్మెల్సీగా మళ్లీ నిజామాబాద్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. దీంతో బీజేపి మళ్లీ ఆమెపై ముప్పేట దాడిని మొదలెట్టినా... కవిత మాత్రం ఇందూరు చుట్టే తన రాజకీయ జీవితాన్ని తిప్పుతుండటంతో... ఎంపీ అరవింద్‌లో ఒకింత టెన్షన్ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఎంపీలందరినీ.. ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపాలన్న యోచనలో బీజేపి అధిష్ఠానం ఉన్నట్టుగా రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అరవింద్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టే ఆయన పెర్కిట్ లో ఇల్లు కూడా తీసుకుని...అక్కడి నుంచి కార్యకలాపాలు మొదలెట్టడం కూడా ఆ ప్రచారం నిజమే అనిపిస్తోంది. ఎన్ని ఆరోపణలున్నా.. కొంచెం గట్టి పిండమైన జీవన్ రెడ్డి... వాటన్నింటినీ చూసీచూడనట్టుగానే పోతూ... ఇంకోవైపు అరవింద్నూ అంతకంతకూ కౌంటర్ చేస్తుండటంతో... అరవింద్ ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడమా? వద్దా అన్న మీమాంసలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఫ్యూచర్ పాలిటిక్స్‌కు చిక్కు అరవింద్ మీమాంసను మరింత బలపర్చేలా... రానున్న ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ పార్లమెంట్‌కు మళ్లీ ఎన్నిక కావాలనుకుంటే నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి లేదా అసెంబ్లీకి వెళ్లాలనుకుంటే ఆర్మూర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ ఇప్పటివరకు ఊహాగానాలు కొనసాగాయి. వచ్చే ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచి లోక్‌సభ సీటుకు పోటీ చేస్తే గనుక.. తనకు గత పార్లమెంట్ ఎన్నికల్లో దక్కిన ఆదరణ మళ్లీ దక్కుతుందో.. లేదోనన్న సందేహాలే ఇప్పుడు అరవింద్ ఫ్యూచర్ పాలిటిక్స్ కు చిక్కుగా మారాయి. అదే సమయంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గంపైన కూడా అరవింద్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో క్యాడర్లో అస్పష్టత... అరవింద్ బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశించే ఆశావహుల్లో నిస్తేజానికీ ఈ డైలమా కారణమవుతోందన్నది ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. బరిలోకి అన్న సంజయ్ నిజామాబాద్ అర్బన్ నుంచి డీఎస్ తన పెద్దకుమారుడు సంజయ్‌ను బరిలోకి దించాలని యోచిస్తున్న క్రమంలో... అక్కడి నుంచి అన్నకు పోటీగా దిగే పరిస్థితి అరవింద్ కు ఉండదు. పైగా తనకు ప్రధాన అనుచరుడైన ధన్ పాల్ సూర్యనారాయణ అక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నాడు. ఇక గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఎండల లక్ష్మీనారాయణ నుంచి అంత సహకారం అందే పరిస్థితి లేదు. ఇక రూరల్ నియోజకవర్గంలో నిల్చోవడమంటే... ఎదురుగా ఉన్నది బాజిరెడ్డి గోవర్ధన్. తన తండ్రికి ఇందూర్ పాలిటిక్స్ లో ఎంత పట్టుందో... జిల్లాలోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ వంటి నియోజకవర్గాల నుంచి గెల్చిన చరిత్ర బాజిరెడ్డికుంది. ఈ క్రమంలో ఆయన్ను తట్టుకోవడమూ అంత వీజీ కాదు. ఇక బాల్కొండలో ఇప్పటికైతే మంత్రి ప్రశాంత్ రెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తున్న క్రమంలో... అరవింద్ అక్కడి నుంచి బరిలో ఉంటాడా అన్నదీ మళ్లీ డౌటే. అయితే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కూడా బీజేపి నుంచి బరిలో ఉండటానికి ఉత్సాహం చూపిస్తున్నా... అరవిందే అడ్డుపడుతున్నాడన్న ఒకింత ప్రచారమూ... ఆయన బాల్కొండపై కన్నేశాడా అనే అనుమానాలకు బలమిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలనాటికి.... అరవింద్ నియోజకవర్గ దారేది...? అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు ఝలక్ ఇచ్చిన గోమాత! -
పదవి లేకున్నా ప్రజల కోసం పనిచేస్తా: కవిత
చంద్రశేఖర్‌కాలనీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు, ఓటములు సహజమని టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓటమి చెందడంతో తట్టుకోలేక నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో ఈనెల 24న పార్టీ కార్యకర్త కిషోర్ గుండెపోటుతో మరణించాడు. సోమవారం మృతుని కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. కిషోర్ కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందినందుకు బాధపడటం లేదన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పాటుపడుతుందని అన్నారు. పదవి ఉన్నా, లేకున్నా తాను నిజామాబాద్‌ను వదిలిపెట్టిపోనని, ప్రజల సమస్యల పరిష్కారంలో, జిల్లా అభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని స్పష్టంచేశారు. పార్టీ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘హుం దాగా ఉందాం, బంగారు తెలంగాణ కోసం పనిచేద్దాం’అని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్‌గుప్తా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ నగర మాజీ మేయర్ డి.సంజయ్, డి.రాజేంద్రప్రసాద్ తదితరులు ఆమె వెంట ఉన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన కవిత -
కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన కవిత
-
కవిత ఓటమికి కారణమదే: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యేల అసమర్థత, నిర్లక్ష్యమే టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత ఓటమికి కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విశ్లేషించారు. గత ఎన్నికల సమయంలో ఆమె ఇచ్చిన హామీలను విస్మరించడం కూడా ఓటమికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. నిన్న వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత దారుణఓటమికి గురైన విషయం తెలిసిందే. అయితే కవిత ఓటమికి బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కే కారణమని టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జీవన్ రెడ్డి స్పందించారు. వారి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకైతే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిన ఓటుబ్యాంక్ ఎటుపోయిందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల అసమర్థతే కవిత ఓటమికి కారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణి పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రతినిధిగా కాకపోయిన.. ప్రజాసేవకురాలిగా కవితకు మంచి భవిష్యత్ ఉందని అన్నారు. నిజామబాద్ ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీలు దిశగా కార్యచరణ చేపట్టాలని సూచించారు. -
స్పీడు తగ్గిన కారు
సాక్షి, హైదరాబాద్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల గెలిచి ఆధిపత్యం చాటుకుంది. డిసెంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 సీట్లకు గానూ 88 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తామని టీఆర్ఎస్ నాయకత్వం ఆశించింది. టీఆర్ఎస్ 16 స్థానాలు, మిత్రపక్షం మజ్లిస్‌కు ఓ స్థానం కలిపి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలను తామే దక్కించుకుంటామని ప్రకటించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 11 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన టీఆర్ఎస్ తాజా ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితమైంది.సంఖ్యాపరంగా రెండు స్థానాలను కోల్పోయింది. మూడు సిట్టింగ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోగా, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అందని ద్రాక్షగా ఉన్న నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 71,057 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కరీంనగర్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, పార్టీ కీలక నేత బోయినపల్లి వినోద్‌కుమార్.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో 89,508 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆదిలాబాద్ సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ జి.నగేశ్‌పై.. బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు 58,493 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక టీఆర్ఎస్ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై చేవెళ్ల నుంచి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి 14,391 ఓట్ల బొటాబొటీ మెజారిటీతో గెలుపొందారు. మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌పై భారీ 3,16,427 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మంలో చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి ఎంపీగా బరిలో దిగిన నామా నాగేశ్వర్ రావు.. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత.. కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాం నాయక్‌పై 1,46,663 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై 77,829 ఓట్ల తేడాతో గెలుపొందారు. నాగర్ కర్నూల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లురవిపై 1,89,748 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పెద్దపల్లి నుంచి బొర్లకుంట వెంకటేష్ నేత.. కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై 95,180 ఓట్ల తేడాతో గెలిచారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 3,50,298 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్‌రావుపై 6,229 ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కారు. ఉనికి కాపాడుకున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర ఫలితాలతో రోజురోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు కొత్త శక్తినిచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలిచిన కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో 3 స్థానాలను గెలుచుకుంది. నల్లగొండ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఇద్దరు పార్టీ సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎ.రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటారు. భువనగిరి నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5,219 ఓట్ల స్వల్పమెజారిటీతో గెలుపొందారు. మల్కాజ్గిరి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఎ.రేవంత్ రెడ్డి 10,919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కమల వికాసం! తెలంగాణ గడ్డపై కమలం పువ్వు వికసించింది. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలను అనూహ్యంగా గెలుచుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ కీలక నేత కల్వకుంట్ల కవితను ఓడించడం ద్వారా స్థానిక బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జాయింట్ కిల్లర్‌గా నిలిచారు. 179 మంది రైతులు బరిలో దిగడంతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు, సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్‌ను బీజేపీ నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో బండారు దత్తాత్రేయ ఇక్కడినుంచి విజయం సాధించగా.. ఈసారి బీజేపీ ఎంపీగా పోటీచేసిన పార్టీ సీనియర్‌నేత కిషన్ రెడ్డి స్పష్టమైన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్‌పై గెలుపొందారు. అయితే.. కరీంనగర్లో బీజేపీ పోటీ ఇస్తుందని భావించినా.. అనూహ్యంగా బండి సంజయ్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్‌లో చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ సంపాదించిన సోయం బాపూరావు కూడా స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. -
కవిత ఓటమికి కారణాలు అవేనా..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక తొలిరోజు నుంచే సంచలనం సృష్టించింది. నామినేషన్ల దగ్గర నుంచి ఇప్పుడు ఫలితాల విషయంలో కూడా దేశం దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్కు లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కోల్పోవడం ఆపార్టీ నేతలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ముఖ్యంగా సీఎం కుమార్తె కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ఓటమి చెందడం రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె ఓటమికి అనేక కారణాలున్నప్పటికీ.. కవితకు వ్యతిరేకంగా రైతులు పోటీ చేయడం ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 68వేల పైచీలుకు ఓట్ల తేడాతే ఓటమిచెందిన విషయం తెలిసిందే. ఆర్మూర్ ప్రాంతంలో పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని సుమారు 178మంది మంది రైతులు ఆమెకు వ్యతిరేకంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశారు. అంతటితో ఆగకుండా కవిత ఓటమే లక్ష్యంగా ఆమెకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేశారు. దీని ఫలితమే వారికి అనూహ్యంగా వారికి 90 వేలకు పైగా ఓట్లను తెచ్చిపెట్టాయి. లోక్‌సభ పరిధిలో రైతులకు దగ్గరి దగ్గరి లక్ష ఓట్లు రావడమనేది సామాన్యమైన విషయం కాదు. స్వయంగా సీఎం కూమార్తె పోటీచేస్తున్న స్థానంలో రైతులకు అన్ని ఓట్లు రావడం దేశం దృష్టిని ఆకర్షించింది. ఆమె లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడమే కాక.. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ని ఓడిమి జగిత్యాలలో గులాబీ జెండాను ఎగరేయడంలో కవిత ముఖ్యపాత్ర పోషించారు. ఎన్నికలు గడిచి మూడు నెలలు కూడా ముగియకముందే ఫలితాలు అనూహ్యంగా మారాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసిన నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన రైతు సున్నం ఇస్తారికి 787 ఓట్లు వచ్చాయి. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణకు చెందిన 24 మంది రైతులు నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆయన 787 ఓట్లు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
61 శాతం పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గురువారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 61% అంచనా పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం కచ్చితమైన పోలింగ్ గణాంకాలను వెల్లడిస్తామన్నారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సమయం ముగిసే వరకు క్యూల్లో నిలబడిన ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల సంఘం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా రీపోలింగ్ ఉండదు! నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 7.30 గంటల వరకు పోలింగ్ జరుగుతూనే ఉందని రజత్‌కుమార్ వెల్లడించారు. పోలింగ్ వేళలు ముగిసిన అనంతరం గురువారం రాత్రి ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 3 లక్షల మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది, భద్రతా బలగాలకు రజత్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలను విజయవంతం చేసేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు అభినందనలు తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాలేదన్నారు. హింసా, దౌర్జన్యాలు, బూత్‌ల స్వాధీనం వంటి ఘటనలు జరగలేదన్నారు. ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడిందంటూ సోషల్ మీడియాల్లో వస్తున్న ఫొటోల విశ్వసనీయతను రజత్ కుమార్ ప్రశ్నించారు. ఈ ఫొటోలపై విచారణకు ఆదేశించామని, ఇలాంటి ఘటనలు తన దృష్టికి రాలేదన్నారు. పోలింగ్‌పై భానుడి ప్రతాపం పోలింగ్ ఉదయంపూట జోరుగానే సాగింది. ఉదయం 9 గంటల వరకు 10.6%, 11 గంటలకు 22.8%, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 38.80% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఎండ తీవ్రత కారణంగా మందకొడిగా సాగింది. మధ్యాహ్నం 3 గంటలకు 48.95% పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఎండ తీవ్రత తగ్గిన తర్వాత మళ్లీ పుంజుకుంది. సాయంత్రం 5 గంటల నాటికి 61 శాతానికి చేరింది. కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభం షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈవీఎంలు మొరాయించడంతో పలు కేంద్రాల్లో గంట నుంచి రెండు గంటల పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30–6.45 గంటల మధ్య మాక్‌పోలింగ్ నిర్వహించిన తర్వాత పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. మాక్పోలింగ్లోనే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎన్నికల్లో మొత్తం 64,512 బ్యాలెట్ యూనిట్లు, 34,635 కంట్రోల్ యూనిట్లు, 34,770 వీవీప్యాట్స్ వినియోగించగా, మాక్ పోలింగ్ సందర్భంగా 541 బ్యాలెట్ యూనిట్లు, 639 కంట్రోల్ యూనిట్లు, 843 వీవీప్యాట్స్‌ను మార్చాల్సి వచ్చింది. ఉదయం 7 గంటలకు వాస్తవ పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా కొన్ని చోట్ల యంత్రాలు మొరాయించాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ సారి ఈవీఎంల సమస్యలు తగ్గాయని రజత్‌కుమార్ పేర్కొన్నారు. బద్ధకించిన జంటనగరాలు ఓటేసేందుకు జంటనగరాల ప్రజలు మళ్లీ బద్దకించారు. సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన పోలింగ్ శాతం అంచనాల ప్రకారం.. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో అత్యల్పంగా 44.99% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 39.49%, మల్కాజ్గిరి స్థానం పరిధిలో 49.21% పోలింగ్ నమోదైంది. మెదక్ లోక్‌సభ పరిధిలో అత్యధికంగా 68.60% పోలింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాలతో కూడిన చేవెళ్ల లోక్‌సభలో 54.8% పోలింగ్ నమోదైంది. జంటనగరాల పరిధిలో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదు కావడంపై సీఈఓ రజత్‌కుమార్ స్పందించారు. గురువారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత, బలమైన అభ్యర్థులు బరిలోలేకపోవటం, జాతీయస్థాయిలో రాజధాని అంశాలు ఎజెండాలో లేకపోవటం, విస్తృత ప్రచారానికి సమయం లేకపోవటం, నగరంలో ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు అందకపోవటం వంటి కారణాలతోనే పోలింగ్ తక్కువగా నమోదైందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85%, ఎమ్మెల్యే ఎన్నికల్లో 70–75% పోలింగ్ జరిగిందన్నారు. ప్రజలతో అనుసంధానమై ఉండే వ్యక్తిని ఎన్నుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారన్నారు. ఎంపీలతో ప్రజలకు నేరుగా అనుబంధం ఉండదని, దీంతో సాధారణంగా లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ తక్కువే ఉంటుందన్నారు. పోలింగ్ శాతం పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. సికింద్రాబాద్‌లో అత్యల్పంగా.. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో అత్యంత తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఈ నియోజకవర్గంలో మధ్య, దిగువ మధ్య తరగతి జనాలు ఎక్కువగా ఉండే అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో 30.19%, ముషీరాబాద్ నియోజకవర్గంలో 36.70% ఓటింగ్ నమోదైంది. సంపన్నుల కేంద్రమైన ఖైరతాబాద్ నియోజకవర్గంలో 38% మంది ఓటేశారు. ఇక హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో యాకుత్‌పురా నియోజకవర్గంలో 32%, మలక్‌పేట నియోజకవర్గంలో 33.60% ఓటింగ్ నమోదైంది. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా నివసించే గోషామహల్లో 45.70% ఓట్లు పోల్‌కావడం విశేషం. 220 కోట్లు విలువైన జప్తులు! మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రజత్‌కుమార్ తెలిపారు. పోలింగ్ ముగియడంతో తనిఖీలు ఉండవన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మొత్తం రూ.74.56 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశామన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ.76 కోట్లు విలువైన జప్తులు కలిపితే ఈ మొత్తం రూ.220 కోట్లకు పెరుగుతుందన్నారు. 2014లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇది మూడు రెట్లు అధికమని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలు! పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్‌కు తరలిస్తారని రజత్‌కుమార్ వెల్లడించారు. అక్కడ ఉండే సహాయ రిటర్నింగ్ అధికారి ఫారం–17సీ, ఈవీఎం, వీవీప్యాట్స్‌ను పరిశీలించి చూస్తారన్నారు. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లను సరిచూసుకుంటారన్నారు. తర్వాత ఎన్నికల పరిశీలకుడు దీన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేస్తారన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను సంబంధిత లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలిస్తారన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద రెండంచెల భద్రత ఉంటుందన్నారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర పోలీసు బలగాలతో రెండో అంచె బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. అక్కడ సీసీటీవీల నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను కాపలాగా పెడతామని కోరుకుంటే, వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ముగిసిన తర్వాత 45 రోజుల వరకు ఈ భద్రత ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, వాటిని సవాలు చేస్తూ 45 రోజుల్లోగా న్యాయ స్థానంలో పిటిషన్ వేయడానికి అవకాశముందని, అందుకే వీటికి భద్రత కల్పిస్తామన్నారు. గిన్నిస్‌బుక్‌లో ఇందూరు ఎన్నికలు! నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ చేసినా, అక్కడ పోలింగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. ఇందుకు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ఎన్నికల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. 185 మంది అభ్యర్థులకు ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం ప్రపంచరికార్డు అని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించాలని ఆ సంస్థకు లేఖ రాశామన్నారు. నిజామా బాద్ పోలింగ్ సందర్భంగా 261 బ్యాలెట్ యూని ట్లు, 55 కంట్రోల్ యూనిట్లు, 87 వీవీప్యాట్స్‌ను మార్చాల్సి వచ్చిందన్నారు. -
మళ్లీ కవితనే ఎంపీ..
సాక్షి, జగిత్యాల: రైతుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తూ, పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతుగా మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ సమయంలోనే తెలంగాణను దేశంలో మోడల్‌గా నిలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చావుదెబ్బతిన్నాయని, టీఆర్ఎస్ను ఓడించేందుకు అసత్య ప్రచారాలతో కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్లు కూడ దక్కలేదన్నారు. పసుపు పంటకు బోర్డు ఏర్పాటు అంశాన్ని మొట్టమొదట లేవనెత్తింది ఎంపీ కవితేనని గుర్తుచేశారు. బోర్డు ఏర్పాటుకు బీజేపీని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోగా ఎన్నికల ముందు కొత్తడ్రామాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి పనితీరును గతంలోనే చూశామని, ఆయన రాత్కి రాజా అని వ్యాఖ్యానించారు.తమ సర్వేలో నిజామాబాద్ అభ్యర్థి కవితకు 66 శాతం ప్రజల మద్దతు ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు.ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి, వారితో మమేకమయ్యే కవితను మళ్లీ గెలిపించాలని కోరారు. నా పనితీరు నచ్చితే గెలిపించండి: టీఆర్ఎస్ అభ్యర్థి కవిత పసుపు బోర్డు సాధనకు తాను పదవీ చేపట్టిన 15 నెలల్లోనే ప్రయత్నం ప్రారంభించానని ఎంపీ కవిత అన్నారు. ఎన్నోసార్లు రాజకీయంగా ఒత్తిడి పెంచినా, ఇవ్వాల్సిన స్థితిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. సాక్ష్యాత్తు ప్రధానమంత్రి వాగ్దానాన్ని కూడా దిక్కులేదని, మేనిఫెస్టోలో కూడ పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ కలిసిపోయాయని, కాంగ్రెస్ ప్రచారం కూడా చేయడం లేదన్నారు. టీఆర్ఎస్ను ఓడించడానికి బీజేపీకి ఓటు వేయాలని కాంగ్రెస్ నాయకులు తమ క్యాడర్‌కు చెబుతున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు కొట్లాడుకుంటున్న జాతీయ పార్టీలు నిజామాబాద్ ఎన్నికల్లో ఒక్కటయ్యాయని చెప్పారు. జగిత్యాల పట్టణాన్ని కరీంనగర్‌కు ధీటుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మే 1 తర్వాత పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికీ పెన్షన్ అందజేస్తామని, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేస్తామని తెలిపారు. ఎంపీగా తన పనితీరు బాగుందన్పిస్తే మళ్లీ ఓటేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు టీఆర్ఎస్కే మద్దతు తెలుపుతున్నారన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ కన్పించకుండా పోయిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు.ఎంపీగా కవిత పదిరెట్లు పనిచేశారని, ఎప్పుడూ అందుబాటులో ఉండే కవితను మళ్లీ గెలిపించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కోరారు. -
‘కుట్రలో భాగంగానే వందల కొద్దీ నామినేషన్లు’
సాక్షి, జగిత్యాల : జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఏనాడు తెలంగాణ సమస్యలను పట్టించుకోలేదని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఈ విషయం గురించి యువత ఆలోచించి ఓటువేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారమిక్కడ ఆమె మాట్లాడుతూ.. బీజేపీ అంటే ప్రస్తుతం భారతీయ జూట్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీకి ఓటు వేయమని చెప్తున్నారని.. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. టీఆర్ఎస్ని ఓడించడానికి ఈ రెండు జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. కశ్మీర్ సమస్యను పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం.. కేవలం రాజకీయ లబ్ది కోసమే దేవుడి పేరు చెప్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి తనను ఎంపీగా ఆశీర్వదించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 2 సంవత్సరాల్లో పూర్తవుతుందని.. దీనితో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కుట్రలో భాగంగానే నామినేషన్లు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ కాంగ్రెస్ ,బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో కవితపైన కుట్రపూరితంగా వందల కొద్దీ నామినేషన్లు వేయించారని ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పలుమార్లు కవిత ప్రధాని మోదీకి విన్నవించినా ఆయన పెడచెవిన పెట్టారని.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లు అధికారంలో ఉండి బీజేపీ ప్రభుత్వం పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంగా ఉన్నారు. భారీ మెజార్టీతో కవిత విజయం సాధిస్తారు. గతంలో ఎంపీగా కవిత చేసిన అభివృద్ధిని చూడండి. బీజేపీ అభ్యర్థి అరవింద్ అనుభవం లేని నాయకుడు. గడిచిన ఐదేళ్ల కాలంలో అరవింద్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ తెలంగాణగా అభివృద్ధి చేయడంలో కేసీఆర్ కృషి అభినందనీయమమని.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
నిజామాబాద్‌లో ఎన్నికలు వాయిదా వేయాలి
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు. గురువారం జిల్లా రైతులు అందరు కలసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను వాయిదా వేయాలని కొరామని తెలిపారు. ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలంటూ పిటిషన్లో పేర్కొన్నట్లు చెప్పారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరిన రైతులు. ఇవాళ మధ్యాన్నం తరువాత నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలపై విచారించనున్న హైకోర్టు. -
కవితపై 184 మంది పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 443 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్లు దాఖలు చేసిన 503 మందిలో 60 మంది ఉపసంహరించుకోవడంతో చివరకు 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 185 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 189 మంది నామినేషన్ వేయగా నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు రైతులు, మరొకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి 28 మంది పోటీలో నిలిచారు. నియోజకవర్గం దాఖలైన నామినేషన్లు ఉపసంహరించుకున్న నామినేషన్లు తుది పోటీలో నిలిచిన అభ్యర్థులు ఆదిలాబాద్ (ఎస్టీ) 13 2 11 పెద్దపెల్లి (ఎస్సీ) 17 0 17 కరీంనగర్ 16 1 15 నిజామాబాద్ 189 4 185 జహీరాబాద్ 18 6 12 మెదక్ 18 8 10 మల్కాజ్గిరి 13 1 12 సికింద్రబాద్ 30 2 28 హైదరాబాద్ 19 4 15 చేవెళ్ల 24 1 23 మహబూబ్‌నగర్ 12 0 12 నాగర్‌కర్నులు(ఎస్సీ) 12 1 11 నల్లగొండ 31 4 27 భువనగిరి 23 10 13 వరంగల్ (ఎస్సీ) 21 6 15 మహబూబాబాద్(ఎస్టీ) 18 4 14 ఖమ్మం 29 6 23 మొత్తం 503 60 443 -
ఇందూరులో ఓటరు పట్టం ఎవరికి?
నిజామాబాద్ లోక్‌సభ.. విలక్షణ నియోజకవర్గం. కాంగ్రెస్‌కు కంచుకోట. పదిహేడో దఫా ఎన్నికలకు సిద్ధమవుతోంది. గడచిన పదహారు దఫాల్లో ఐదుసార్లు మినహా మిగిలిన విజయాలన్నీ కాంగ్రెస్ ఖాతాలోనే జమయ్యాయి. ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలవగా, మూడుసార్లు టీడీపీ గెలిచింది. నియోజకవర్గం (1952) ఆవిర్భావం నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఇక్కడ ఎక్కువ సార్లు స్థానికేతరులే ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఈ స్థానం నుంచి గెలుపొందిన నేతలెవరికీ ఇప్పటి వరకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఖాతా తెరిచిన ‘కారు’ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో 2014లో జరిగిన పదహారో లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో గెలుపొందారు. ఆమె ఎన్నికల బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే ఎంపీగా విజయం సాధించి పార్లమెంటులో అడుగు పెట్టారు. తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుమార్తె కావడంతో నిజామాబాద్ లోక్సభవైపు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. గత ఎన్నికల్లో 1.67 లక్షల మెజారిటీతో గెలుపొందిన కవిత, ప్రస్తుతం మరోమారు బరిలో నిలవనున్నారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థులు మొత్తంగా 2.17 లక్షల మెజారిటీ సాధించారు. దీంతో ఈ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి కూడా భారీ మెజారిటీతో విజయం సాధిస్తామనే ధీమా టీఆర్ఎస్ శిబి రంలో కనిపిస్తోంది. ఈ దిశగా ఈ నెల 13న నిజామాబాద్‌లో జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మధుయాష్కీ మళ్లీ... ఒకప్పటి కంచుకోటలో మళ్లీ జెండా ఎగరవేయడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడానికి పావులు కదుపుతోన్న ఆ పార్టీ మధు యాష్కీ పేరునే ఖరారు చేసింది. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి విజయం సాధించిన ఆయన, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన మరోసారి పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో.. గెలుపు సన్నాహాలుకు ఆ పార్టీ కేడర్ సిద్ధమైంది. నిజానికి యాష్కీ.. తమ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపారు. దీంతో ఆయన కాకపోతే ఇక్కడి నుంచి పోటీకి బలమైన మరో అభ్యర్థిని రంగంలోకి దించాలని పార్టీ యోచించింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే గంగారామ్ పేర్లనూ పరిశీలించింది. అలాగే, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఇక్కడి నుంచి పోటీ చేస్తారని, అదే జరిగితే ఆయనకు మద్దతునివ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ యోచించింది. చివరకు మధుయాష్కీ పేరునే అధిష్టానం ఖరారు చేసింది. నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి గెలుపులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డితో పాటు మహేశ్, భూపతిరెడ్డి తదితర నేతల సహకారం కీలకం కానుంది. కమలారవిందం.. భారతీయ జనతా పార్టీ ఈ దఫా నిజామాబాద్ లోక్‌సభ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్, టీఆర్ఎస్లకు గట్టిపోటీనివ్వాలనే యోచనలో ఉంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్ క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆయన బీజేపీలో రెండేళ్లుగా లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో స్థానిక సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌లు, బూత్ స్థాయి బాధ్యులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నరేంద్ర మోదీ పాలన, విదేశీ, రక్షణ వ్యవహారాల్లో బీజేపీ ప్రభుత్వ వైఖరి తదితరాలు తమకు కలిసి వస్తాయని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి అరవింద్ గెలుపు సంగతెలా ఉన్నా.. ఎవరి ఓట్లను చీలుస్తుందోననే భయం ప్రధాన పార్టీల్లో ఉంది. రైతుల నామినేషన్లు.. నియోజకవర్గంలో రైతుల ఆందోళన ప్రత్యేకంగా గుర్తిం చాల్సిన అంశం. ఇక్కడ ఎక్కువగా వాణిజ్య పంట లు పండుతాయి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఎర్రజొన్న, పసుపు రైతులు కొంతకాలంగా ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం స్పం దించే వరకు ఆందోళన వీడేది లేదంటూ ఇటీవల జాతీయ రహదారిని దిగ్బంధించారు. దేశం దృష్టిని ఆకర్షించేందుకు లోక్‌సభ ఎన్నికలను వేదికగా చేసుకోవాలని రైతు సంఘాలు మూకుమ్మడిగా నామినేషన్లు వేయాలని నిర్ణయించాయి. నామినేషన్లకు అవసరమైన నిధులు సమకూర్చే భారాన్ని గ్రామ సంఘాలపై పెట్టారు. ఇది ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని అంచనా. - కల్వల మల్లికార్జున్‌రెడ్డి గెలుపోటముల విశేషాలు ♦ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చిన హరీష్చంద్ర హెడ్డా.. 1930వ దశకంలో హైదరాబాద్ రాష్ట్రంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1952లో తొలిసారిగా నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. 1957, 62 ఎన్నికల్లోనూ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టారు. ♦ స్థానిక నినాదంతో 1967 ఎన్నికల్లో ఎం.నారాయణరెడ్డి విజయం సాధించారు. ♦ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతగా ఉన్న కరీంనగర్ జిల్లాకు చెందిన జె.రాంగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ తరపున మూడుసార్లు గెలిచారు. ♦ 1984, 1989 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన తాండూరు బాలాగౌడ్ (కాంగ్రెస్).. 1991లో గడ్డం గంగారెడ్డి (టీడీపీ) చేతిలో ఓడిపోయారు. ♦ 1996లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఎన్నారై గడ్డం ఆత్మచరణ్‌రెడ్డి గెలిచారు. ♦ 2004, 2009 ఎన్నికల్లో గెలుపుతో గుర్తింపుపొందిన మధు యాష్కీ (కాంగ్రెస్).. 2014 ఎన్నికల్లో కవిత (టీఆర్ఎస్) చేతిలో ఓడిపోయారు. ఇందూరు బరిలో విజేతలు -
అన్నదాతల బ్యాలెట్ పోరు
సాక్షి, హైదరాబాద్: గిట్టుబాటు ధర కోసం అన్నదాతలు బ్యాలెట్ పోరాటానికి సిద్ధమయ్యారు. రోడ్డెక్కి పోరాడినా, ధర్నాలు చేసినా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఇక బ్యాలెట్ పోరుతోనైనా మార్పు వస్తుందన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు సోమవారం నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి 500 నుంచి వెయ్యి మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించటం గమనార్హం. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బోధన్, నిజామాబాద్ అర్బన్ మినహా నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఇప్పటికే నామినేషన్ల అంశంపై తీర్మానాలు చేశారు. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న గ్రామాభివృద్ధి కమిటీలు, రైతు సంఘాలు, కొన్నిచోట్ల కుల సంఘాలు ఏకమై తీర్మానాలు చేశాయి. చిన్న గ్రామమైతే 2 నుంచి 5 నామినేషన్లు, పెద్ద గ్రామాలైతే 5 నుంచి 10 చొప్పున నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. నామినేషన్‌కు ఆవసరమయ్యే డిపాజిట్, ఇతర ఖర్చులను కూడా గ్రామ కమిటీలు, రైతు సంఘాలే భరించాలని కూడా తీర్మానించారు. ఫ్లోరైడ్ బాధితులు గతంలో నల్లగొండ లోక్‌సభకు 184 నామినేషన్లు దాఖలు చేసిన సంఘటన స్ఫూర్తిగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2014 ఎన్నికల సమయంలో కూడా నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 27 మంది పసుపు రైతులు నామినేషన్లు వేశారు. గిట్టుబాటు ధరే లక్ష్యంగా... పసుపు, ఎర్రజొన్నలు సాగు చేసిన రైతులకు దశాబ్దాల కాలంగా గిట్టుబాటు ధర లభించటంలేదు. కేంద్రం కనీస మద్దతు ధరను ప్రకటించటం లేదు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, జాతీయ రహదారుల ముట్టడి, వంటా వార్పు... ఇలా రకరకాల పద్ధతుల్లో నిరసన తెలిపారు. ఎర్రజొన్నలు క్వింటాలుకు రూ.8,500, పసుపు క్వింటాలుకు రూ. 15 వేల చొప్పున మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ వారి డిమాండ్లు నెరవేరడంలేదు. ఈ నేపథ్యంలో పసుపు, ఎర్రజొన్న రైతులంతా ఏకమై ప్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలనే లక్ష్యంతో వందల సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. -
టీఆర్ఎస్ తరఫున ముంబై టీజాక్ ప్రచారం
సాక్షి, ముంబై: తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్న పలువురు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ముంబై తెలంగాణా జేఏసీకి చెందిన ఎనిమిది మంది సభ్యులు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కల్వకుంట కవితకు మద్దతుగా ఆదివారం నిర్వహించిన ప్రచార ర్యాలీ లో ముంబై టీ జాక్ బృందం పాల్గొంది. అనంతరం ముంబైలో ఉంటున్న తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో ముంబైకర్ల పాత్ర ఎంతో ఉందని, ఇక్క డ జరిగిన ప్రతీ ఉద్యమానికి తాము సంఘీభావం తెలిపామని, కొన్ని ఉద్యమాల్లో స్వయంగా తెలంగాణకు వచ్చి పాల్గొన్నామని ఈ సందర్భంగా ఆమె దృష్టికి తీసుకొచ్చారు. రెండు రోజుల కిందట బయలుదేరిన ఎనిమిది మంది ముంబై టీ-జాక్ సభ్యు ల్లో ముగ్గురు నల్గొండలో, మిగతా వారు నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సోమవారం ప్రచార సభ ముగియగానే తిరి గి ముంబైకి వస్తున్నట్లు సభ్యులు మూల్నివాసి మాల, బద్ది హేమంత్‌కుమార్, దేవానంద్ నాగెళ్ల తెలిపారు. -
ఇందూరు కోటలో పాగా వేసేదెవరు?
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నియోకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు: నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కొండ, ఆర్మూరు, జగిత్యాల, కోరుట్ల (కరీంనగర్ జిల్లా) నియోజకవర్గం ప్రత్యేకతలు: వ్యవసాయం ప్రధాన జీవనాధారం. గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులూ ఎక్కువే. ప్రధాన అభ్యర్థుల వీరే సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ) కల్వకుంట్ల కవిత (టీఆర్ఎస్) మధుయాష్కీ గౌడ్ (కాంగ్రెస్) యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ) నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. కేసీఆర్ కూతు రు కల్వకుంట్ల కవిత మొదటిసారిగా ఎన్నిక ల బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి మధుయాష్కీగౌడ్, బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ ఆమెతో పోటీ పడుతున్నారు. తొలిసారిగా సింగిరెడ్డి రవీందర్‌రెడ్డిని వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. గడ్డం రాజిరెడ్డి, నిజామాబాద్: తెలంగాణవాదం అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి. అభ్యర్థులందరూ తెలంగాణవాదులే కావడంతో అదే నినాదంతో ప్రజల వద్దకు వెళుతున్నారు. ఆత్మవిశ్వాసంతో టీఆర్ఎస్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగినా టీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలుపుపై ధీమాగా ఉన్నారు. తెలంగాణవాదం, తెలంగాణ జాగృతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలు కలిసి వస్తా యని ఆత్మవిశ్వాసం తో ఉన్నారు. మోడీ మంత్రం గట్టెక్కిస్తుందని.. మోడీపై సానుకూలత తనకు మేలుచేస్తుందనేది బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఆలోచన. టీడీపీతో పొత్తు ఉన్నా ఆ పార్టీ శ్రేణుల సహకారంపై పెద్దగా ఆశ ల్లేని ఆయన తెలంగాణవాదంపైనే నమ్మకం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిగా తనకు గుర్తింపు ఉంటుందని, అదే తనను విజయ తీరాలకు తీసుకెళ్తుందని కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీగౌడ్ భావిస్తున్నారు. రాజన్న పథకాలే తోడుగా.. దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తోడుగా వైఎస్సార్సీపీ అభ్యర్థి సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి ముందుకుసాగుతున్నారు. వైఎస్ పథకాలతో లబ్ధిపొందిన వారు తనకు అండగా ఉంటారనే ధీమా కనబరుస్తున్నారు. ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు రాజన్నను గుర్తు చేసుకుంటుండడంతో ‘ఫ్యాన్’గాలికి తిరుగుండదనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మధుయాష్కీగౌడ్ (కాంగ్రెస్) అనుకూలం - తెలంగాణ గురించి మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీగా పేరుండడం - బాబ్లీ ప్రాజెక్టును ఆపాలని కోర్టులో కేసువేసి అడ్డుకునే ప్రయత్నం చేయడం ప్రతికూలం - ఎన్నికలప్పుడు తప్పితే మళ్లీ గ్రామాలకు వెళ్లిన దాఖలాలు లేకపోవడం - ఎంపీ కోటా కింద విడుదలైన నిధులను సరిగా వాడుకోలేదన్న విమర్శలు - హామీలకే అభివృద్ధి పరిమితం కావడం కల్వకుంట్ల కవిత (టీఆర్ఎస్) అనుకూలం - తెలంగాణ జాగృతి, బతుకమ్మ ద్వారా ప్రజలకు చేరువ కావడం - తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం, కేసీఆర్ కుమార్తె కావడం ప్రతికూలం - సెటిలర్ల నుంచి వ్యతిరేకత - రాజకీయాలకు కొత్త.. నియోజకవర్గ ప్రజలకు కొత్తముఖం సి.రవీందర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ) అనుకూలం - దివంగత నేత వైఎస్సార్ సంక్షేమ పథకాలు - తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం - ఎలాంటి ఆరోపణలు లేకపోవడం ప్రతికూలం - రాజకీయాలకు కొత్త {పత్యర్థులు అర్థికంగా బలంగా ఉండటం వై.లక్ష్మీనారాయణ (బీజేపీ) అనుకూలం - ఉప ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా గెలవడం - తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర ప్రతికూలం - అభివృద్ధి పనులు చేపట్టకపోవడం - ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కేడర్‌ను పట్టించుకోలేదన్న విమర్శ - టీడీపీతో పొత్తు నే.. గెలిస్తే.. - నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ నుంచి నాందే డ్ వరకు రైల్వేలైన్ విద్యుదీకరణ, డబ్లింగ్ పనుల పూర్తి - డిచ్పల్లి నుంచి వర్ని వరకు బోధన్ మీదుగా మహారాష్ట్రలోని నర్సి వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం - సాప్ట్వేర్ హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటు. - సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ) - పసుపుబోర్డు, పసుపు శుద్ధి కేంద్రం, చెరకు పరిశోధన కేంద్రాల ఏర్పాటు. - జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు - గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం - గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ - కల్వకుంట్ల కవిత (టీఆర్ఎస్) - గల్ఫ్ బాధితులు, యువకులకు ఉద్యోగవకాశాలు - బీడీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు - పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన - నిజామాబాద్‌లో భూగర్భ డ్రైనేజీకి రూ.147 కోట్లు వెచ్చించి పూర్తి చే యడం. మధుయాష్కీ గౌడ్ (కాంగ్రెస్) - గోదావరి నుంచి సాగు, తాగునీరు - వ్యవసాయాధార పరిశ్రమలు ఏర్పాటు - రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్, గ్రామాలకు 24 గంటల విద్యుత్, - పెద్దపల్లి- నిజామాబాద్, బోధన్ - బాన్సువాడ - బీదర్ రైల్వేలైన్లను పూర్తి చేయడం - యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ)