సాక్షి, హైదరాబాద్: గిట్టుబాటు ధర కోసం అన్నదాతలు బ్యాలెట్ పోరాటానికి సిద్ధమయ్యారు. రోడ్డెక్కి పోరాడినా, ధర్నాలు చేసినా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఇక బ్యాలెట్ పోరుతోనైనా మార్పు వస్తుందన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు సోమవారం నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి 500 నుంచి వెయ్యి మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించటం గమనార్హం. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బోధన్, నిజామాబాద్ అర్బన్ మినహా నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఇప్పటికే నామినేషన్ల అంశంపై తీర్మానాలు చేశారు.
ఈ ప్రాంతంలో బలంగా ఉన్న గ్రామాభివృద్ధి కమిటీలు, రైతు సంఘాలు, కొన్నిచోట్ల కుల సంఘాలు ఏకమై తీర్మానాలు చేశాయి. చిన్న గ్రామమైతే 2 నుంచి 5 నామినేషన్లు, పెద్ద గ్రామాలైతే 5 నుంచి 10 చొప్పున నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. నామినేషన్‌కు ఆవసరమయ్యే డిపాజిట్, ఇతర ఖర్చులను కూడా గ్రామ కమిటీలు, రైతు సంఘాలే భరించాలని కూడా తీర్మానించారు. ఫ్లోరైడ్ బాధితులు గతంలో నల్లగొండ లోక్‌సభకు 184 నామినేషన్లు దాఖలు చేసిన సంఘటన స్ఫూర్తిగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2014 ఎన్నికల సమయంలో కూడా నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 27 మంది పసుపు రైతులు నామినేషన్లు వేశారు.
గిట్టుబాటు ధరే లక్ష్యంగా...
పసుపు, ఎర్రజొన్నలు సాగు చేసిన రైతులకు దశాబ్దాల కాలంగా గిట్టుబాటు ధర లభించటంలేదు. కేంద్రం కనీస మద్దతు ధరను ప్రకటించటం లేదు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, జాతీయ రహదారుల ముట్టడి, వంటా వార్పు... ఇలా రకరకాల పద్ధతుల్లో నిరసన తెలిపారు. ఎర్రజొన్నలు క్వింటాలుకు రూ.8,500, పసుపు క్వింటాలుకు రూ. 15 వేల చొప్పున మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ వారి డిమాండ్లు నెరవేరడంలేదు. ఈ నేపథ్యంలో పసుపు, ఎర్రజొన్న రైతులంతా ఏకమై ప్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలనే లక్ష్యంతో వందల సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయించారు.
అన్నదాతల బ్యాలెట్ పోరు
Published Mon, Mar 18 2019 2:14 AM | Last Updated on Mon, Mar 18 2019 2:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment