
మండలిలో ఖాళీ అయ్యే ఐదు ఎమ్మెల్యే కోటా సీట్లకు ఐదు నామినేషన్లే దాఖలు
బీఆర్‌ఎస్ రెండో అభ్యర్థని నిలపకపోవడంతో తప్పిన ఎన్నికలు
13న అధికారికంగా ప్రకటించనున్న ఎన్నికల కమిషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం సోమవారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఐదు స్థానాలకు గాను ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రవణ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. సభలో ఉన్న బలాబలాలను బట్టి మూడు అధికార కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్‌ఎస్‌కు దక్కడం ఖాయం కాగా, మిగిలిన ఐదో స్థానంలో గెలిచేందుకు ఈ అవకాశం లేదు.
ఈ నేపథ్యంలో ఒకవేళ బీఆర్‌ఎస్ రెండో అభ్యరి్థని నిలబెడితే ఎన్నిక నిర్వహించాల్సి వచ్చేది. కానీ ఆ పార్టీ నుంచి కేవలం ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియలు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం ఉపసంహరణల ప్రక్రియ ముగిసేసరికి ఉన్న నామినేషన్లను పరిగణనలోకి తీసుకుంటారు.
ఉపసంహరణల సమయం ముగియగానే ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే మిగిలితే అందరు అభ్యర్థులు ఏక్రగీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటిస్తారు. మొత్తం మీద పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలావుండగా..మరో ప్రధాన పార్టీ ఎంఐఎం కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment