
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్
సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం.. బీఆర్‌ఎస్ నుంచి దాసోజు ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి అభ్యర్థుల ప్రకటన
అనూహ్య పరిణామాలేవైనా జరిగితే పోలింగ్‌కు చాన్స్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఎన్నిక జరిగే ఐదు స్థానాల్లో కాంగ్రెస్ మూడు, సీపీఐ, బీఆర్‌ఎస్ చెరో స్థానాన్ని దక్కించుకోనున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా అధికార కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌లను అభ్యర్థులుగా ప్రకటించడంతోపాటు మరో స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. సీపీఐ తరఫున నెల్లికంటి సత్యం బరిలో ఉన్నారు.

ఐదుగురు రిటైర్ అవుతుండటంతో..
ప్రస్తుతం శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్‌ల పదవీకాలం ఈ నెల 29న ముగుస్తోంది. ఖాళీ అవుతున్న ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక కోసం ఈ నెల 3న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారంతో ఈ గడువు ముగుస్తోంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంది. ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఈ నెల 20న పోలింగ్ జరుగుతుంది. కానీ ఖాళీ అవుతున్న ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే బరిలోకి దిగుతుండటంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
విజయశాంతికి ఎమ్మెల్సీ చాన్స్
⇒ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసిన ఏఐసీసీ
⇒ శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్‌లకూ అవకాశం
⇒ ఆదివారం సాయంత్రం ప్రకటించిన కేసీ వేణుగోపాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. రాష్ట్ర నేతల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు, పార్టీలో పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముగ్గురు నేతలు అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్‌నాయక్, విజయశాంతిలకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ఎవరూ ఊహించని విధంగా సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి పేరును ఎంపిక చేయడం మాత్రం టీపీసీసీ వర్గాలను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.
నాలుగు స్థానాలకుగాను.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై వారం రోజులుగా సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కోటా కింద కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం ఉండగా.. సీపీఐకి ఒక స్థానం కేటాయించడంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయి.
ఎన్నికల ముందు పొత్తులో భాగంగా తమకు ఇచ్చిన హామీ మేరకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్‌ను సీపీఐ జాతీయ కమిటీ బలంగా కోరింది. సీపీఐ జాతీయ నేత డి.రాజా, మరికొందరు నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఈ అంశంపై మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు ఏఐసీసీ, టీపీసీసీ నిర్ణయం తీసుకున్నాయి. మిగతా మూడు స్థానాలకుగాను విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను ఎంపిక చేశారు.
నేడు ఉదయం 11 తర్వాత నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించిన ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం ఉదయం 11 గంటల తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తారని సీఎల్పీ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లతోపాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం అందుబాటులో ఉన్న వారంతా రావాలని సీఎల్పీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం అందింది.
Comments
Please login to add a commentAdd a comment