
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ
ఢిల్లీకి పరుగులు పెడుతున్న ఆశావహులు
ఎస్సీ, ఓసీ, బీసీ, మైనార్టీలవారీగా అధిష్టానం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలాఖరు నాటికి ఎన్నికలు జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో హడావుడి మొదలైంది. మార్చి 29 నాటికి ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. పార్టీల బలాబలాలను బట్టి వీటిలో నాలుగు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు, ఒకటి బీఆర్‌ఎస్‌కు దక్కే అవకాశముంది. ఎమ్మెల్యే కోటాలోనే తమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని ఎంఐఎం అడిగితే మాత్రం కాంగ్రెస్‌కు మూడు మాత్రమే దక్కుతాయి.
కానీ, తమకు ఈసారి నాలుగు స్థానాలు వస్తాయని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు ఒక్కో స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. బీసీ నేతలు తమ వర్గానికి రెండు సీట్లు ఇస్తారనే ఆశతో ఉన్నారు. దీంతో బీసీ వర్గాల్లో ఎమ్మెల్సీ కోసం పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. మొత్తంగా నాలుగు సీట్ల కోసం 40 మంది వరకు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఆశావహుల్లో కొందరు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిరాగా, మరికొందరు కొత్త ఇన్‌చార్జ్‌ని కలిసి ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు.
సామాజిక వర్గాల వారీగా!
ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అయితే ఒక్కో సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున పేర్లు వినిపిస్తున్నాయి. ఓసీల నుంచి టి. జీవన్‌రెడ్డి, టి. జగ్గారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పారిజాతా నర్సింహారెడ్డి, హరివర్ధన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, అల్గుబెల్లి ప్రవీణ్‌రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎస్సీల కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తోపాటు అద్దంకి దయాకర్, సింగాపురం ఇందిర, కొండ్రు పుష్పలీల, పిడమర్తి రవి, దొమ్మాట సాంబయ్య, రాచమళ్ల సిద్ధేశ్వర్, దర్శన్, జ్ఞానసుందర్, భీంభరత్‌ల పేర్లపై చర్చ జరుగుతోంది.
మైనార్టీల నుంచి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ అజారుద్దీన్, అజ్మతుల్లా హుస్సేనీల పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ వర్గాల నుంచి మధుయాష్కీగౌడ్, ఎగ్గె మల్లేశం, ఈరావత్రి అనిల్, చరణ్‌కౌశిక్ యాదవ్, సునీతా ముదిరాజ్, నీలం మధు, వజ్రేశ్‌యాదవ్, చెవిటి వెంకన్న, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, పున్నా కైలాశ్‌నేత, నవీన్ యాదవ్ పేర్లు ప్రధానంగా చర్చలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment