
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
మహిళ, సంస్థాగత కోటాలు కూడా పరిగణనలోకి తీసుకుని చాన్స్
అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాజీ ఎంపీ విజయశాంతి
జానారెడ్డి చొరవతో నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శాసనమండలికి..
మిత్రధర్మం మేరకు ఓ సీటు సీపీఐకి.. ఇద్దరు ఉమ్మడి నల్లగొండ నేతలకు చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణాల తూకం పాటించింది. రెడ్డి, మైనార్టీ కోటాలో కూడా పలు పేర్లను పరిశీలించినప్పటికీ భవిష్యత్తులో చేపట్టాల్సిన మంత్రివర్గ విస్తరణ, పార్టీ కార్యవర్గ కూర్పు, ఇతర నామినేటెడ్ పదవులకు ఎంపికలను పరిగణనలోకి తీసుకుని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇద్దరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.
ఢిల్లీలో చక్రం తిప్పిన విజయశాంతి
ఈసారి ఎమ్మెల్సీగా మహిళకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎస్టీ కోటాలో మహిళను ఎంపిక చేయాలని తొలుత భావించింది. కానీ అనూహ్యంగా మహిళా కోటాలో సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో విజయశాంతి ఎక్కడా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కనిపించకపోవడం గమనార్హం. ఆమె రెండు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మహిళ, బీసీ కోటాలో తనకు చాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు.
పార్టీ కూడా ఆమె పట్ల సానుకూలంగా స్పందించడంతో.. పేరు ఖరారైందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్ర కేబినెట్‌లో ఈసారి ఎస్టీ (లంబాడా) సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేని పరిస్థితులున్న నేపథ్యంలో.. ఆ వర్గానికి ఎమ్మెల్సీగా అవకాశమివ్వాలని ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలు భావించారు. ఈ కోటాలో కొందరి పేర్లు పరిశీలించారు. అయితే మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి చొరవతో ఆయన సన్నిహితుడు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కె.శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేస్తున్న సేవలను కూడా అధిష్టానం గుర్తించినట్లయింది.
మరోవైపు మొదటి నుంచీ ఊహిస్తున్న విధంగానే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా.. అప్పటి పరిస్థితుల మేరకు తన స్థానాన్ని త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన పేరును పరిశీలించినా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఎస్సీ (మాల) సామాజికవర్గానికి చెందిన ఆయనను ఈసారి మండలికి పంపాలని పార్టీ నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన అద్దంకి దయాకర్‌కు అవకాశం కల్పించడం ద్వారా రేవంత్ మాటకు కూడా అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చినట్లయింది.
ఓసీ కోటా మినహాయింపు
ఈ దఫా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఓసీ కోటాను కాంగ్రెస్ అధిష్టానం మినహాయించింది. ఇద్దరు ఓసీ నేతల మధ్య తీవ్ర పోటీ ఏర్పడటంతోనే ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఓసీ కోటాలో ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పేరు వినిపించింది. ఆయన పేరును సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని, కచ్చితంగా అవకాశం వస్తుందనే ప్రచారం జరిగింది. మరోవైపు శాసనమండలిలో కాంగ్రెస్‌పక్ష నేత టి.జీవన్‌రెడ్డి పదవీకాలం త్వరలో ముగుస్తోంది. ఈ క్రమంలో ఆయనను మళ్లీ మండలికి ఎంపిక చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌లోని ముగ్గురు సీనియర్ మంత్రులు పట్టుబట్టినట్టు తెలిసింది.
ఈ ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన పోటీ కారణంగానే అధిష్టానం ఈసారి ఓసీ కోటాను మినహాయించిందని, ఇందుకు ప్రతిగా కేబినెట్ విస్తరణలో రెండు బెర్తులు ఓసీలకు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవడంతో మండలిలో కాంగ్రెస్‌పక్ష నేతగా కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక బీసీల కోటాలో అనేక పేర్లు వినిపించినప్పటికీ చివరకు సినీనటి విజయశాంతి వైపు అధిష్టానం మొగ్గు చూపడం అనూహ్య పరిణామం. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కూడా ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికే ఎమ్మెల్సీ అవకాశం దక్కేలా తన వంతు ప్రయత్నం చేశారు.
ఎంఐఎంకు స్థానిక సంస్థల కోటా
అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఐతో అధికారికంగా పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థా నాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పు డు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరోవైపు తమ సభ్యుడు రియాజుల్ హసన్ ఎమ్మెల్సీగా పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో.. తమకు ఇప్పుడే అవకాశమివ్వాలని ఎంఐఎం నేతలు కాంగ్రెస్ పార్టీని కోరారు. కానీ సీపీఐకి ఇవ్వాల్సి వస్తున్నందున ఈసారికి సర్దుకోవాలని.. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా లో అవకాశం ఇస్తామని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment