
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయింది. కొద్ది సేపటి క్రితమే ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖారారు చేసింది. ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధిష్టానం విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్‌కు టికెట్లు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. సీపీఐ నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించింది.
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే, చివరి నిమిషంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. అయినప్పటికీ రాష్ట్ర అగ్రనేతలతో కేసీ వేణుగోపాల్ ఫోన్‌లో మంతనాలు జరిపారు. ముగ్గురు అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయడంతో ఉత్కంఠతకు తెరపడింది.
మరోవైపు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహులు పెద్ద ఎత్తున లాబియింగ్‌లు జరిపారు. చివరికి పార్టీ అధిష్టానం విజయశాంతి, అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్ పేర్లను ఫైనల్ చేసింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపించాయి. వీరితో పాటు బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్, ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లు వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment