Vijayasanti
-
కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత రాజీనామా చేశారు. ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ పీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణరెడ్డి సోమవారం పార్టీని వీడారు. ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. త్వరలోనే నారాయణరెడ్డి బీజేపీలో చేరనున్నారు. గతంలోనే నారాయణరెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు విజయశాంతి కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీలో చేరతారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను విజయశాంతి కలిశారు. (అమిత్‌షాను కలిసిన విజయశాంతి) -
మళ్లీ పొరపాటు చేయొద్దు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటు మరోసారి చేయొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ఆమె అన్నారు. నరేంద్ర మోదీ వెనకుండి కేసీఆర్‌ను నడిపిస్తున్నారన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు మోదీ సాయం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ చేసిన అన్నిరకాల మోసాలకు మోదీ సర్కార్ మద్దతుగా నిలిచిందని విమర్శలు గుప్పించారు. శనివారం శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో విజయశాంతి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ టెర్రరిస్టులా ప్రజలను భయపెడుతున్నారని ఆమె విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయని, ఇక పార్లమెంట్ ఎన్నికల సమరం మొదలైందన్నారు. ఇది కాంగ్రెస్-బీజేపీకి మధ్య జరిగే యుద్ధమంటూ విజయశాంతి అభివర్ణించారు. ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, అయితే మోదీ దాన్ని ఖూనీ చేసి, నియంతలా పాలించి, మరోసారి గద్దెనెక్కాలనుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం బీజేపీని చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తోందని, మోదీ ఎప్పుడు ఏం బాంబు వేస్తారో అని ప్రజలు వణికిపోతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు మొదలు.. జీఎస్టీ, పుల్వామా ఉగ్రదాడి వరకూ ఇదే పరిస్థితి అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని విజయశాంతి కోరారు. తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్... తమ పార్టీ ఎమ్మెల్యేలను నయానో, భయానో, ఆశ చూపించో టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు. అందరి ముందు నరేంద్ర మోదీని తండ్రీకొడుకులు తిడతారని, కానీ తెర వెనుక మాత్రం అందరూ కలిసే పనిచేస్తారని అన్నారు. తన కొడుకును ఎలాగైనా ముఖ్యమంత్రిని చేసి, తాను ఢిల్లీలో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ ప్రయత్నాలు ఫలించవని ఆమె జోస్యం చెప్పారు. -
రేపు టికెట్లు ప్రకటించనున్న కాంగ్రెస్
కాంగ్రెస్ టికెట్ల ఖరారుపై రేపు స్పష్టత రానుంది. ఎప్పటినుంచో ఊహించిన విధంగానే నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతారెడ్డికి టికెట్ ఖాయమైనట్లు తెలుస్తోంది. మెదక్ టికెట్‌పై షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దీనికోసం 14 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం మెదక్ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ టికెట్ కోసం తీవ్రంగా కృషి చేసిన శశిధర్‌రెడ్డి రెబల్‌గా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన ఆశావహులు మాత్రం విజయశాంతి అభ్యర్థిత్వాన్ని సమర్థించినట్లు సమాచారం. సాక్షి, మెదక్: నెలరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనుంది. దీంతో మెదక్, నర్సాపూర్ టికెట్లపై స్పష్టత రానుంది. గురువారం రోజంతా స్క్రీనింగ్ కమిటీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వడకట్టింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి జాబితాను అందజేసింది. రాహుల్‌గాంధీ ఆమోదముద్ర పడినవెంటనే అభ్యర్థులను పేర్లను ప్రకటించనున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు అందరూ ఊహించిన విధంగానే నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ సునీతారెడ్డికి ఖరారు అయినట్లు తెలుస్తోంది. మెదక్ సీటుపై మాత్రం చివరి వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మెదక్ నుంచి పోటీ చేయాల్సిందిగా మాజీ ఎంపీ విజయశాంతిపై కాంగ్రెస్ అధిష్టానం వత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అధిష్టానం సూచన మేరకు ఆమె మెదక్ నుంచి పోటీ చేసేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ టికెట్ ఆశిస్తున్న ఇతర కాంగ్రెస్ నాయకులు సైతం విజయశాంతి పోటీ చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఎదుట గురువారం మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, జిల్లా నాయకుడు తిరుపతిరెడ్డిలు హాజరయ్యారు. వీరిద్దరిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జిగించినట్లు సమాచారం. విజయశాంతి విజయానికి సహకరించాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని రెబెల్‌గా పోటీ చేయొద్దని ఇద్దరిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ టికెట్‌పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి మాత్రం విజయశాంతికి టికెట్ కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మెదక్ టికెట్ తనకు ఇస్తే భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతికి బహుమానంగా ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీలో మీడియాకు తెలియజేశారు. తనకు కాంగ్రెస్ టికెట్ దక్కని పక్షంలో రెబెల్‌గా పోటీచేసే యోచనలో శశిధర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తిరుపతిరెడ్డితోపాటు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బట్టి జగపతి, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ తదితరులు విజయశాంతి అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారు. మెదక్ నుంచి టీజేఎస్ పోటీ చేసేకంటే కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి పోటీచేస్తేనే తమకు, పార్టీకి బాగుంటుందని వారు భావించటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒత్తిడి తీసుకురావడంతో.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొదలు మెదక్ అసెంబ్లీ టికెట్‌పై ఉత్కంఠ నెలకొంది. దీని కోసం 14 మంది కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో శశిధర్‌రెడ్డి మినహా మిగితా ఆశావహులంతా విజయశాంతిని కలిసి తమలో ఎవరికి టికెట్ ఇప్పించినా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఒప్పించారు. దీంతో విజయశాంతి శశిధర్‌రెడ్డిని మినహాయించి మిగితా ఆశావహుల్లో ఎవరికైనా టికెట్ ఇప్పించాలని అనుకున్నారు. అయితే అకస్మాత్తుగా టీజేఎస్ ఈ టికెట్ కోసం పట్టుబట్టింది. పొత్తులో భాగంగా మెదక్ స్థానాన్ని వదులుకునేందుకు ముందుగా కాంగ్రెస్ సిద్ధమైంది. దీనిని పసిగట్టిన ఆశావహులంతా మరోమారు విజయశాంతిని కలిసి మెదక్ టికెట్ టీజేఎస్‌కు వెళ్లకుండా చూడాలని, అవసరమైతే మీరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తెలిపారు. దీంతో విజయశాంతి మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతోపాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్దాస్ను కలిసి మెదక్ టికెట్ ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌కే ఇవ్వాలని టీజేఎస్‌కు ఇవ్వొద్దని కోరారు. మెదక్ స్థానం టీజేఎస్‌కు ఇవ్వవద్దని అనుకుంటే మీరే పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతిపై వత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో విజయశాంతి మెదక్ నుంచి పోటీచేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కాగా టీజేఎస్ మాత్రం మెదక్‌పై ఇంకా ఆశలు వదులుకోవడం లేదు. విజయశాంతి పక్కకు తప్పుకున్న పక్షంలో మెదక్ స్థానం తమకే దక్కుతుందని టీజేఎస్ నాయకులు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం టికెట్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ టికెట్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. -
త్వరలోనే జిల్లాలో విజయశాంతి పర్యటన
హవేళిఘణాపూర్(మెదక్) : త్వరలోనే మాజీ ఎంపీ విజయశాంతి మెదజ్ జిల్లాలో పర్యటించనున్నారని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు చౌదరి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తొగిట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయశాంతి పర్యటించనున్నారన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ట్రాక్టర్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. రైతుబంధు పథకం కేవలం భూస్వాముల పథకంగా మారిందని, భూయాజమానికి ఎకరానికి రూ. 4వేలు ఇస్తే మరి కౌలు రైతు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వాధీనం చేస్తామన్న హామీ ఏమైందన్నారు. ఓ వైపు ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ కార్మికులను రోడ్డున పడేస్తు మరోవైపు టీఆర్ఎస్ హయంలోనే గ్రామాభివృద్ధి జరుగుతుందని డప్పు కొట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు సిరిమల్లె శ్రీనివాస్, ఆఫీజోద్దీన్, రమేష్‌రెడ్డి, కిషన్‌గౌడ్, శంకర్, లక్ష్మినారాయణ, దుర్గయ్య తదితరులున్నారు. -
ఇత్తడి తెలంగాణ చేశారు
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని ఇత్తడి తెలంగాణ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత ఎం.విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబం మినహా రాష్ట్రంలో ఎవరి కుటుంబమూ బంగారుమయం కాలేదని దుయ్యబట్టారు. సీఎం అతి విశ్వాసంతో పనిచేస్తున్నారని, కాళ్లు నేల మీద ఉంటే మంచిదని సూచించారు. ఉద్యమంలోని కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వేర్వేరు అని వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విజయశాంతి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో నిర్బంధాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోదండరాం, మందకృష్ణ వంటి వారికి సమస్యలపై పోరాడే హక్కుందని.. కోదండరాంను అరెస్టు చేయడమే దారుణమన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పితే ప్రజలనూ జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. అవసరం కోసం పవన్‌కల్యాణ్ రాజకీయాలు చేస్తుండొచ్చని.. తెలంగాణ ప్రజలు తెలివైన వారని, ఆయన మాటలు నమ్మరన్నారు. అన్న (చిరంజీవి) వల్లే ఏమీ కాలేదని, తమ్ముడు (పవన్) ఏం చేస్తాడని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం పనిచేసిన వారిని మంత్రులుగా తీసుకోవడానికి ముందే కేసీఆర్ ఆలోచించాల్సిందని, ఇప్పుడు టీఆర్ఎస్పై తెలంగాణవాదుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. జయశంకర్ సూచన మేరకే విలీనం.. తెలంగాణ కోసం కొట్లాడుతున్న వారికి వేర్వేరు పార్టీలు ఎందుకని, కలసి పని చేయాలన్న ఆచార్య జయశంకర్ సూచన మేరకే తల్లి తెలంగాణపార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసినట్లు విజయశాంతి వెల్లడించారు. మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ అంటూ మెదక్ ఎంపీ సీటుకే ఎసరు పెట్టారని గుర్తు చేశారు. తనను అర్ధరాత్రి సస్పెండ్ చేశారని, ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ చెప్పలేదన్నారు. ఇక నుంచి చురుగ్గా రాజకీయాలు వ్యక్తిగత పనుల వల్ల కొంతకాలం మౌనంగా ఉన్నానని, ఇక నుంచి పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కోరుకుంటున్నానని, రాహుల్‌గాంధీకీ ఇదే విషయం చెప్పానని, కానీ కచ్చితంగా పోటీ చేయాలని ఆయన సూచిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని, మీడియా స్వేచ్ఛనూ హరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో చేరి శుక్రవారం నాటికి 20 ఏళ్లు అవుతున్నాయని.. ఇప్పటివరకు ఎన్నో ఆటుపోట్లు, వెన్నుపోట్లు, అవమానాలు చూసినట్లు వెల్లడించారు. తమిళనాడులో జయలలిత అంటే అభిమానమని, డీఎంకే తనను అంతం చేయాలని చూసిందన్నారు. బీజేపీలో అద్వానీకి అన్యాయం జరిగిందని, ఆయనను పార్టీ అధ్యక్షుడిగా చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. -
తెలుగుతెరపై సూపర్‌స్టార్ హీరోయిన్
తెలుగుతెరపై సూపర్ స్టార్ హోదాను అందుకున్న నటి విజయశాంతి. గ్లామర్ క్వీన్‌గా వెలిగిపోతూనే అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ విశ్వరూపం చూపించింది. ఈ రోజు లేడీ సూపర్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విజయశాంతి పుట్టిన రోజు. అప్పటి ప్రముఖ హీరోయిన్లు జయసుధ, జయప్రదలు అభినయంతో, శ్రీదేవి, మాధవిలు తమ అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజులు అవి. అప్పుడే విజయశాంతి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కధానాయికలను సవాలు చేస్తూ ఒక దశాబ్దానికి పైగా వెండితెర రాణిగా వెలిగిపోయింది. విజయశాంతి ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. 1984 నుండి 1985 వరకూ రెండుపడవల ప్రయాణంలా సాగింది ఆమె సినీ ప్రయాణం. ఒక వైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు, మరో వైపు సగటు సినీ వీక్షకులనలరించే గ్లామర్ పాత్రలను అలవోకగా పోషిస్తూ రాధ, సుహాసిని, రజని, రాధిక వంటి కథానాయికలను వెనక్కునెట్టి 1986 నాటికి తెలుగుతెరపై తనదైన ముద్ర వేసింది. 1986 తరువాత వరుసగా ఐదేళ్లపాటు ఒకదాని వెనుక ఒకటిగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ విజయపధంలో దూసుకుపోయింది. పడమటి సంధ్యారాగం, స్వయంకృషి, జానకి రాముడు, కొడుకు దిద్దిన కాపురం, శత్రువు, ముద్దాయి వంటి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ హీరోలతో సమానమైన ఇమేజ్ సంపాదించింది. భారత నారి, కర్తవ్యం చిత్రాలకు ఉత్తమ నటిగా మరో రెండు నంది అవార్డులనూ గెలుచుకోవటమే కాకుండా, కర్తవ్యం చిత్రానికి భారత ప్రభుత్వం నుండి ఊర్వశి అవార్డును కూడా కైవసం చేసుకుంది. సాధారణంగా ఉత్తమ అవార్డులు గెలుచుకునే చిత్రాలు ప్రేక్షకులకు ఎవరికీ అర్ధం కాని ఆర్ట్ ఫిల్మ్స్ మాత్రమే అయి ఉంటాయనే అపప్రధను చెరిపేస్తూ తెలుగు, తమిళ బాక్సాఫీసులను కొల్లగొట్టిన కర్తవ్యం చిత్రానికి ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. తర్వాత నందమూరి నట వారసుడు బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. అందరు హీరోల సరసన నటించి మెప్పించినా బాలకృష్ణ సరసన విజయశాంతి నటిస్తుందంటే మాత్రం ఆ సినిమాకు ఓ స్పెషల్ క్రేజ్ వచ్చేది. ఈ జంటమొత్తం 17 చిత్రాల్లో నటించడం విశేషం. టి.కృష్ణ దర్శకత్వం వహించిన ఆరు ఆణిముత్యాల్లోనూ విజయశాంతే కధానాయిక. ఇక విజయశాంతి నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకుడు కోడి రామకృష్ణ. ఈయన దర్శకత్వంలో 12 చిత్రాలలో నటించింది. రాఘవేంద్ర రావు, కోదండరామి రెడ్డిల దర్శకత్వంలో 10 చిత్రాల్లోనూ, దాసరి నారాయణ రావు దర్శకత్వంలో 6 చిత్రాల్లోనూ నటించింది. వీటితో పాటు సూర్యా మూవీస్ పతాకంపై కర్తవ్యం, ఆశయం, నిప్పురవ్వ చిత్రాలు కూడా నిర్మించింది. ఒసేయ్ రాములమ్మా తరువాత విజయశాంతిని విజయాలు పలకరించటం మానేశాయి. 2000వ సంవత్సరం నుండి ఆమె నటించే చిత్రాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. రాజకీయరంగంపై ఆసక్తితో విజయశాంతి సినిమా రంగంపై నుంచి దృష్టి మళ్లించింది. కారణాలేమైనా తెలుగుతెరకు ఒక అద్భుత నటి దూరమయింది. -
నేను రాజీనామా చేస్తే విలీనం చేస్తారా?:విజయశాంతి
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుపై ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మెదక్ ఎంపి విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మాటకు కట్టుబడని కెసిఆర్‌ను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పింది ఆయనే, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నది ఆయనే, ఇప్పుడు మాట తప్పుతున్నది ఆయనే అన్నారు. విలీనంపై కుంటిసాకులు చెబుతున్నారన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినందువల్లే టిఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయలేదని చెబుదున్నారని, తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తాను రాజీనామా చేస్తే పార్టీని విలీనం చేస్తారా? ప్రశ్నించారు. పార్లమెంటులో బిల్లు పాసైన తరువాతే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తెలంగాణ ఇస్తే తాను తప్పక కాంగ్రెస్ పార్టీలో చేరతానని సోనియా గాంధీకి చెప్పానని, ఆ మాట ప్రకారం చేరానని చెప్పారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిన తరువాత ఆ పార్టీ ఎంపిలను టిఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలు సోనియా గాంధీ అని, ఆమెకు చెందిన మనుషులపై పోటీకి పెట్టి ఓడిస్తారా? అని అడిగారు. తల్లికి వెన్నుపోడుస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు నిజాయితీపరులు, వారు తప్పక కాంగ్రెస్‌ను గెలిపిస్తారని చెప్పారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా? అని ఓ విలేకరి కెసిఆర్‌ను ప్రశ్నిస్తే ఆయన విసుక్కుంటూ మాట్లాడారని విమర్శించారు. దళితులంటే అంత చులకనా? మాటకు మీరు కట్టుపడరా? అని ప్రశ్నింనేను రాజీనామా చేస్తే విలీనం చేస్తారా?:విజయశాంతిచారు. దళితులు, బడుగు బలహీన వర్గాలవారు ఎదగకూడదా? అని అడిగారు. దొరల పాలన అన్నదే వారి ధోరణి అని విమర్శించారు. తమ డిమాండ్లు అంగీకరించలేదని చెబుతున్నారు. అలా అనుకున్నప్పుడు అప్పుడే వ్యతిరేకత తెలియజేసి ఉండవచ్చు గదా అన్నారు. అప్పుడు విజయోత్సవాలు చేసుకొని, ఇప్పుడు ఇలా మాట్లాడతారా? అని అడిగారు. డిమాండ్లంటే అవి తెలంగాణకు సంబంధించిన డిమాండ్లా? పర్సనల్ డిమాండ్లా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో తానూ ఉన్నానని, అక్కడ ఏం జరిగిందో తనకు తెలుసునని చెప్పారు. కాంగ్రెస్‌కు గెలిచే అవకాశాలు లేవని చెబుతున్నారు. గత ఎన్నికలలో మీరు అందరూ మహాకూటమిగా ఏర్పడినా కాంగ్రెస్ ఎవరితోనూ పొత్తపెట్టుకోకుండా ఒంటరిగానే గెలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ తప్పక గెలుస్తుందని చెప్పారు. దళితుడు ముఖ్యమంత్రి కావాలని, మంచి ముఖ్యమంత్రి రావాలన్నది తన కోరిక అని విజయశాంతి అన్నారు. -
హాట్‌కేక్‌లా మారిన నియోజక వర్గం
రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం హాట్‌కేక్‌లా మారింది. ఈ నియోజకవర్గం మీద అనేక మంది కళ్లు పడుతున్నాయి. మొన్నటి వరకూ ఇక్కడి నుంచి పోటీలోకి దిగాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, మెదక్ లోక్‌సభ సభ్యురాలు విజయశాంతి అనుకున్నారు. తాజాగా మల్కాజ్గిరి సీటు కోసం పోటీ పడుతున్న జాబితాలో లోక్‌సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ కూడా చేరారు. ఈ నియోజకవర్గంలో సెటిలర్ల సంఖ్య అధికంగా ఉంది. దాంతో జెపి కన్ను దీనిపై పడింది. బీజేపీ మద్దతుతో జేపీ రంగంలోకి దిగితే, తన కథ హుళక్కే అని టిడిపి నేత రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలుస్తోంది. మెదక్ స్థానం నుంచి కెసిఆర్ పోటీ చేస్తారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో విజయశాంతి నియోజకవర్గాన్ని మార్చాలన్న యోచనలో పడ్డారు. ఆ క్రమంలో ఆమె మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం గురించి ఆలోచన చేస్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరాలన్న విషయంలో ఆమె ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. విజయశాంతి బిజెపిలో చేరితే ఆ పార్టీ ఈ స్థానాన్ని ఆమెకే కేటాయించే అవకాశం ఉంది. విజయశాంతితోపాటు జెపి కూడా ఈ నియోజకవర్గం వైపే చూస్తున్నారు. టిడిపి బిజెపితో పొత్తుపెట్టుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న విషయం అందరికీ తెలిసిందే. బిజెపితో పొత్తుపెట్టుకుంటే ఏ విధంగా చూసుకున్నా మల్కాజ్గిరి స్థానం టిడిపికి కేటాయించే అవకాశం లేదు. టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీచేయాలన్న ఆలోచనలో పడిపోయారు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఎన్డీఏతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ఇక్కడి నుంచి జేపీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయశాంతి బిజెపిలో చేరితే అప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులలో తన పరిస్థితి ఏంటని రేవంత్ మధనపడుతున్నారు. అంతేకాకుండా టీడీపీలో లొల్లి కూడా పెడుతున్నారు. మల్కాజ్‌గిరిపై ఎక్కువమంది కన్నేయడంతో ఇప్పుడు రేవంత్ చిక్కుల్లో పడ్డారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. -
విజయశాంతి ఏ పార్టీ తరపున పోటీ చేస్తారు?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం శక్తివంచనలేకుండా నిజాయితీగా పోరాడిన మెదక్ లోక్‌సభ సభ్యురాలు విజయశాంతికి కష్టకాలం వచ్చింది. తను దేనికోసం పోరాడారో అది సాధించే సమయానికి రాములమ్మ టిఆర్ఎస్తో తెగతెంపులు చేసుకున్నారు. రాజకీయ పార్టీల కూడలి వద్ద ఎటువైపు వెళ్లాలా? అని చూస్తున్నారు. ఏ పార్టీలో చేరాలా? అన్న ఆలోచనలో పడ్డారు. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు రాజకీయ నాయకులు తగిన వ్యూహాలు రచించుకోకతప్పదు. అదే క్రమంలో ఆమె తన రాజకీయ భవిష్యత్‌ను పదిలపరుచుకోవడం కోసం తన ప్రయత్నాలు తను చేస్తున్నారు. రాజకీయాలంటే ఎన్నికలు - ఎన్నికలంటే నియోజకవర్గాలు - వాటిలో గెలిచే నియోజకవర్గాలు... ఆ ప్రకారంగా వ్యూహం ఉండాలి. ఆరు నూరైనా, టిఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన నియోజవకర్గం మెదక్ అని ఆమె ఖరాఖండీగా చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. దాంతో ఆమె నియోజకవర్గం విషయంలో కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. హీరోయిన్గా విజయశాంతి ఆటపాటలే కాకుండా హావభావాలతో అద్బుతంగా నటించారు. హీరోలకు తీసిపోనివిధంగా, కొన్ని సందర్భాలలో హీరోలకు పోటీగా కొన్ని చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. దక్షిణభారత సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత రాజకీయాలలోకి ప్రవేశించి టిఆర్ఎస్ అధ్యక్షుడు, అన్నయ్య కెసిఆర్ అండదండలతో మెదక్ ఎంపీగా గెలిచారు. టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్‌గా ప్రధాన భూమిక పోషించారు. 2014 ఎన్నికలలో కూడా ఆమె మెదక్ నుంచే పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఆ సీటు తనకు వచ్చే పరిస్థితి లేదని ఆమెకు తెలిసిపోయింది. దాంతో ఆమె నిరాశకు లోనయ్యారు. రాజకీయాలు ఏ రకంగా మారుతుంటాయో ఆమెకు అర్ధమైపోయింది. అన్న కెసిఆర్‌తో తెగతెంపులు - టిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిశారు. అప్పట్లో ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నాట్లు వార్తలు వచ్చాయి. కానీ చేరలేదు. ఎటువంటి పరిస్థితులలోనైనా మెదక్ నుంచే పోటీ చేయాలని ఆమె అనుకున్నారు. మెదక్ నుంచి కెసిఆర్ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. రాములమ్మ కాంగ్రెస్‌లో చేరి కెసిఆర్పైనైనా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆమె కాంగ్రెస్‌లో చేరిన తరువాత, టిఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అయితే అటువంటి అవకాశం ఉండదు. మెదక్ స్థానం కోసమే ఆమె కాంగ్రెస్‌లో చేరాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఆమె ఆలోచనలో మార్పు వచ్చినట్లు సమాచారం. మెదక్ స్థానం నుంచి కెసిఆర్ పోటీ చేస్తారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో విజయశాంతి నియోజకవర్గాన్ని మార్చాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె దృష్టి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంపై పడింది. ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలుంటాయని విజయశాంతి భావిస్తున్నారు. ఈ స్థానంలో టిఆర్ఎస్ బలహీనంగా ఉంది. సెటిలర్ల సంఖ్య అధికంగా ఉంది. ఈ నేపధ్యంలో ఇక్కడ నుంచి ఏ పార్టీ తరఫున పోటీ చేసినా గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని విజయశాంతి ఆలోచనగా తెలుస్తోంది. నియోజకవర్గ మార్పు పరిస్థితి ఇలా ఉంటే, ఏ పార్టీలో చేరాలన్న విషయంలో ఆమె ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. పార్టీ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో టిఆర్ఎస్ విలీనంగానీ లేక ఆ పార్టీతో పొత్తుగానీ పెట్టుకుంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతే కాక కాంగ్రెస్ నేతల నుంచి తగిన ప్రోత్సాహం కూడా లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితులలో ఆమె బిజెపిలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్, బిజెపి రెండు వైపుల చూస్తున్నందున ఆమె అటు సోనియా గాంధీని, ఇటు నరేంద్రమోడీనీ ఒకే స్థాయిలో పొగుడుతున్నారన్నది విశ్లేషకుల భావన. ఈ నేపధ్యంలో విజయశాంతి ఏ పార్టీలో చేరతారనేది కొద్దిరోజులలో తేలనుంది. -
తెలంగాణ చెల్లి రాములమ్మ ఎక్కడ?
తెలంగాణ చెల్లి రాములమ్మ, మెదక్ లోక్‌సభ సభ్యురాలు విజయశాంతి ఎక్కడ ఉన్నారని అందరూ చర్చించుకుంటున్నారు. మొదటి నుంచి కరుడుగట్టిన తెలంగాణ వాదిగా ఉన్న ఆమె ప్రస్తుతం దశలో ఏమీ మాట్లాడకుండా ఉండటం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. అన్నయ్య, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు దూరమైన తరువాత ఆమె పెద్దగా వార్తలలో లేరు. కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకపోయినా ఆమె ఆ పార్టీతోనే సన్నిహితంగా ఉంటున్నారు. తెలంగాణ ఏర్పాటుపై స్పష్టత వస్తున్న నేపధ్యంలో చెల్లమ్మ దారెటనేది చర్చనీయాంశమైంది. తన రాజకీయ భవిష్యత్తు విషయంలో అమె ప్రస్తుతం మౌనం వహిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం విజయశాంతి ప్రాభవం పెద్దగా కనిపించడంలేదు. ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప ఆమె సందడి అంతగా కనిపించడం లేదు. టిఆర్ఎస్ అమెను సస్పెండ్ చేసిన తరువాత కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. అధికారికంగా మాత్రం ఇప్పటికీ ఆమె కాంగ్రెస్‌లో చేరలేదు. ఈ విషయంలో ఆమె ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయో అంతుబట్టడంలేదు. మెదక్ ఎంపీగా ఉన్న విజయశాంతి వచ్చే ఎన్నికల్లోనూ ఆ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ టికెట్ విజయశాంతికి ఇస్తుందా అన్నది సందేహమే. టిఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనమైనా లేక పొత్తు పెట్టుకున్నా చెల్లెమ్మకు టిక్కెట్ హుళక్కేనని భావిస్తున్నారు. టిఆర్ఎస్లో కీలక పాత్ర పోషించిన చెల్లెమ్మను ఇప్పుడు పట్టించుకునే వారే కరువయ్యారు. చిన్న చిన్న సమావేశలకు హజరవుతున్నా ఆమె పెద్దగా మాట్లాడటం లేదు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రావడం, వచ్చే నెలలో చర్చ జరిగే అవకాశమున్నా అమె వీటిపై ఇంత వరకూ స్పందించలేదు. మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించినా ఆమె అవకాశం ఇవ్వడంలేదు. మొన్న జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశలకు కూడా ఆమె హాజరుకాలేదు. వచ్చే ఎన్నికలలో పోటీపై ఆమె గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ టికెట్ ఇవ్వని పక్షంలో మళ్లీ ఆమె కమలం వైపు అడుగువేసే అవకాశం ఉందని అంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై వచ్చే నెలలో ఆమె కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. -
వీరప్ప మొయిలీని కలిసిన విజయశాంతి
న్యూఢిల్లీ: మెదక్ ఎంపి విజయశాంతి ఈ రోజు కేంద్ర మంత్రి, ఆంటోనీ కమిటీ సభ్యుడైన వీరప్ప మొయిలీని కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఆమెను జూలై 31న టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆమె ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారు. దాంతో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గత సోమవారం ఆమె రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌ని కలిశారు. ఆమెతో పాటు అంతకు ముందు టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన రఘునందన్ కూడా దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. వీరిద్దరూ కలిసి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయశాంతి ఈరోజు వీరప్ప మొయిలీని కలవడం చర్చనీయాంశమైంది. రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి మధ్యవర్తిత్వంతో విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోనియాను కలిసినప్పుడు మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే అంశాన్ని కూడా ఆమె ఎదుట ప్రస్తావించినట్లు సమాచారం. -
సోనియాను కలిసిన విజయశాంతి
న్యూఢిల్లీ: మెదక్ లోక్‌సభ సభ్యురాలు విజయశాంతి ఈరోజు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరితో కలిసి ఆమె సోనియాను కలిశారు. నిన్న ఇక్కడకు వచ్చిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నేతలను కలుస్తున్నారు. గత నెల 31న విజయశాంతిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విజయశాంతి అనేకసార్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సస్పెన్షన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొన్నాళ్లుగా టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నవిజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో టిఆర్ఎస్ పార్టీకి, విజయశాంతికి మధ్య దూరం బాగా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ భవన్లో భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నా ఆమె మాత్రం దూరంగానే ఉండిపోయారు. ఈ నేపధ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలను కలుస్తుండటంతో విజయశాంతి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని భావిస్తున్నారు. -
రేపు సోనియాను కలవనున్న విజయశాంతి
న్యూఢిల్లీ: మెదక్ లోక్‌సభ సభ్యురాలు విజయశాంతి ఢిల్లీకి చేరుకున్నారు. ఆమె రేపు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకునే అవకాశం ఉంది. గత నెల 31న విజయశాంతిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విజయశాంతి అనేకసార్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సస్పెన్షన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొన్నాళ్లుగా టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నవిజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్లో చేరిన కొత్తల్లో ఆమెకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లోపల ఒక ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. ప్రధానమైన సమావేశాలన్నింటిలోను కేసీఆర్ పక్కనే ఆమెకు స్థానం కల్పించేవారు. కానీ, ఇటీవలి కాలంలో పార్టీకి, విజయశాంతికి మధ్య దూరం బాగా పెరుగిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ భవన్లో భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నా ఆమెమాత్రం దూరంగానే ఉండిపోయారు. ఈ నేపధ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇందుకోసమే ఆమె సోనియా గాంధీని కలుస్తున్నారని తెలుస్తోంది.