రేపు సోనియాను కలవనున్న విజయశాంతి
న్యూఢిల్లీ: మెదక్ లోక్సభ సభ్యురాలు విజయశాంతి ఢిల్లీకి చేరుకున్నారు. ఆమె రేపు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకునే అవకాశం ఉంది. గత నెల 31న విజయశాంతిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విజయశాంతి అనేకసార్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సస్పెన్షన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కొన్నాళ్లుగా టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నవిజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్లో చేరిన కొత్తల్లో ఆమెకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లోపల ఒక ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. ప్రధానమైన సమావేశాలన్నింటిలోను కేసీఆర్ పక్కనే ఆమెకు స్థానం కల్పించేవారు. కానీ, ఇటీవలి కాలంలో పార్టీకి, విజయశాంతికి మధ్య దూరం బాగా పెరుగిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ భవన్లో భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నా ఆమెమాత్రం దూరంగానే ఉండిపోయారు. ఈ నేపధ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇందుకోసమే ఆమె సోనియా గాంధీని కలుస్తున్నారని తెలుస్తోంది.