సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటు మరోసారి చేయొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ఆమె అన్నారు. నరేంద్ర మోదీ వెనకుండి కేసీఆర్‌ను నడిపిస్తున్నారన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు మోదీ సాయం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ చేసిన అన్నిరకాల మోసాలకు మోదీ సర్కార్ మద్దతుగా నిలిచిందని విమర్శలు గుప్పించారు.
శనివారం శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో విజయశాంతి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ టెర్రరిస్టులా ప్రజలను భయపెడుతున్నారని ఆమె విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయని, ఇక పార్లమెంట్ ఎన్నికల సమరం మొదలైందన్నారు. ఇది కాంగ్రెస్-బీజేపీకి మధ్య జరిగే యుద్ధమంటూ విజయశాంతి అభివర్ణించారు. ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, అయితే మోదీ దాన్ని ఖూనీ చేసి, నియంతలా పాలించి, మరోసారి గద్దెనెక్కాలనుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం బీజేపీని చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తోందని, మోదీ ఎప్పుడు ఏం బాంబు వేస్తారో అని ప్రజలు వణికిపోతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు మొదలు.. జీఎస్టీ, పుల్వామా ఉగ్రదాడి వరకూ ఇదే పరిస్థితి అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని విజయశాంతి కోరారు.
తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్... తమ పార్టీ ఎమ్మెల్యేలను నయానో, భయానో, ఆశ చూపించో టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు. అందరి ముందు నరేంద్ర మోదీని తండ్రీకొడుకులు తిడతారని, కానీ తెర వెనుక మాత్రం అందరూ కలిసే పనిచేస్తారని అన్నారు. తన కొడుకును ఎలాగైనా ముఖ‍్యమంత్రిని చేసి, తాను ఢిల్లీలో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ ప్రయత్నాలు ఫలించవని ఆమె జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment