హాట్కేక్లా మారిన నియోజక వర్గం
రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం హాట్‌కేక్‌లా మారింది. ఈ నియోజకవర్గం మీద అనేక మంది కళ్లు పడుతున్నాయి. మొన్నటి వరకూ ఇక్కడి నుంచి పోటీలోకి దిగాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, మెదక్ లోక్సభ సభ్యురాలు విజయశాంతి అనుకున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి సీటు కోసం పోటీ పడుతున్న జాబితాలో లోక్‌సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ కూడా చేరారు. ఈ నియోజకవర్గంలో సెటిలర్ల సంఖ్య అధికంగా ఉంది. దాంతో జెపి కన్ను దీనిపై పడింది. బీజేపీ మద్దతుతో జేపీ రంగంలోకి దిగితే, తన కథ హుళక్కే అని టిడిపి నేత రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలుస్తోంది.
మెదక్ స్థానం నుంచి కెసిఆర్ పోటీ చేస్తారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో విజయశాంతి నియోజకవర్గాన్ని మార్చాలన్న యోచనలో పడ్డారు. ఆ క్రమంలో ఆమె మల్కాజ్‌గిరి లోక్సభ స్థానం గురించి ఆలోచన చేస్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరాలన్న విషయంలో ఆమె ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. విజయశాంతి బిజెపిలో చేరితే ఆ పార్టీ ఈ స్థానాన్ని ఆమెకే కేటాయించే అవకాశం ఉంది.
విజయశాంతితోపాటు జెపి కూడా ఈ నియోజకవర్గం వైపే చూస్తున్నారు. టిడిపి బిజెపితో పొత్తుపెట్టుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న విషయం అందరికీ తెలిసిందే. బిజెపితో పొత్తుపెట్టుకుంటే ఏ విధంగా చూసుకున్నా మల్కాజ్‌గిరి స్థానం టిడిపికి కేటాయించే అవకాశం లేదు. టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీచేయాలన్న ఆలోచనలో పడిపోయారు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఎన్డీఏతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ఇక్కడి నుంచి జేపీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయశాంతి బిజెపిలో చేరితే అప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులలో తన పరిస్థితి ఏంటని రేవంత్ మధనపడుతున్నారు. అంతేకాకుండా టీడీపీలో లొల్లి కూడా పెడుతున్నారు. మల్కాజ్‌గిరిపై ఎక్కువమంది కన్నేయడంతో ఇప్పుడు రేవంత్ చిక్కుల్లో పడ్డారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.