Malkajgiri Constituency
-
బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణకు బలం!
అల్వాల్/ కంటోన్మెంట్ (హైదరాబాద్)/ నిర్మల్: బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణకు బలమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేది తామేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిస్తే.. ఢిల్లీ పాలకుల గల్లాపట్టి నిలదీసే ధైర్యం ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్రలు సాగుతున్నాయని.. అది ఆగాలంటే తెలంగాణ నుంచి కేసీఆర్ సైనికులు పార్లమెంట్లో ఉండాలని చెప్పారు.గురువారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ వీబీఆర్ గార్డెన్లో, కంటోన్మెంట్ పరిధిలోని సిఖ్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో.. నిర్మల్ జిల్లా కేంద్రంలో, భైంసాలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లలో కేటీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్లమెంట్ ఎన్నికలు కదా బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలని కొందరు అంటున్నారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గళం వినిపించడానికి కేసీఆర్ సైనికులు ఉండాలి. 2004లో ఐదుగురు ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టిన కేసీఆర్.. 32 పార్టీలను ఒప్పించి, మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. రాహుల్ గాంధీని, నరేంద్ర మోదీని ఎదిరించే దమ్ము కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ బీజేపీ వాళ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలవోకగా పడగొట్టారు. అదే కేసీఆర్, మమతా బెనర్జీ, హేమంత్ సోరేన్, స్టాలిన్, కేజ్రీవాల్ ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు. బలమైన లీడర్లు ఉన్నచోట బీజేపీ ఆటలు సాగలేదు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇవ్వాలి.బీజేపీ ముందు తల వంచేది లేదుబీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, ఈటల, రఘునందన్‌రావు, సోయం బాపూరావు వంటి బడా లీడర్లను ఓడించింది బీఆర్ఎస్ వాళ్లేనని గుర్తుంచుకోవాలి. మేం తల నరుక్కుంటాం కానీ.. బీజేపీ ముందు తల వంచేది లేదు.రేవంత్ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నారుకాంగ్రెస్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చెప్పాం. ఆ పార్టీ అబద్ధపు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను ఇబ్బంది పెడుతోంది. గత ఐదు నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. రేవంత్ చిల్లర మాటలు మాట్లాడటం తప్ప మరేమీ జరగలేదు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు హామీల అమలు గురించి నెలలు, తారీఖులు చెప్తున్నారు. కొడుకుల్లారా, పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రా.. బోటీ కొట్టేవాడా? మన ఖర్మకాలి ముఖ్యమంత్రి అయ్యిండు. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ మారింది.బీజేపీ హైదరాబాద్‌ను యూటీ చేస్తుందిరిజర్వేషన్లను రద్దుచేసి అగ్రవర్ణాలకు మేలు చేసేలా బీజేపీ కుట్ర చేస్తోంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ పదేళ్ల క్రితం ఇచ్చిన హామీలకే గ్యారంటీ లేదు, ఇప్పుడు కొత్తగా చెప్పే మాటలకు గ్యారంటీ ఏముంది? జూన్ 2వ తేదీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుంది. దీంతో కేంద్రం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.అదే జరిగితే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఇద్దరూ నాన్ లోకల్, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పక్కా లోకల్ అన్నారు. ఎంపీగా లక్ష్మారెడ్డిని, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో నివేదిత సాయన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు.భైంసాలో కేటీఆర్‌పై ఉల్లిగడ్డలు.. జైశ్రీరాం నినాదాలుభైంసా/ భైంసాటౌన్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసాలో గురువారం సాయంత్రం కేటీఆర్ నిర్వహించిన రోడ్ షోలో.. కొందరు ఉల్లిగడ్డలు, చిన్నపాటి రాళ్లు విసిరారు. కార్నర్ మీటింగ్ నిర్వహించిన ప్రాంతానికి హనుమాన్ స్వాములు, మరికొందరు చేరుకున్నారు. కేటీఆర్ ఖబడ్దార్ అంటూ ముద్రించిన ప్లకార్డులను చూపుతూ.. జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు.కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు ఆయన వాహనంపైకి ఉల్లిగడ్డలు విసిరారు. ఈ సమ యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకారులవైపు దూసు కెళ్లే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చాలా కష్టపడి ఇరువర్గాలను అదుపుచేశారు. నిరసనకారులు విసిరిన ఉల్లిగడ్డలు, చిన్నరాళ్లతో ఓ యువకుడి తలకు స్వల్పంగా గాయమైంది.దేవుడిని అడ్డంపెట్టుకుని రాజకీయాలా?భైంసాలో తనపై ఉల్లిగడ్డలు, రాళ్లు విసిరినవారిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే యువకులను రెచ్చగొట్టి ఇలా పంపిస్తుంటారని, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ‘‘కేసీఆర్ తెలంగాణలో యాదాద్రి సహా ఎన్నో మందిరాలు నిర్మించారు. ఏమీ చేయనివారే దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారు.రాముడు ఎంతో ఆదర్శవంతుడు. మేం కూడా జైశ్రీరాం అంటాం. మరి రాముడు ఎదుటివారిపై రాళ్లు విసరాలని చెప్పాడా? మా పని మేం చేసుకుంటున్నాం. మీ పని మీరు చేసుకోండి. కానీ చిల్లర పనులు చేయవద్దు. ఇలాంటి వాటికి భయపడబోం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.‘మత’ ముష్కరులపై పోరాటం కొనసాగుతుంది: ‘ఎక్స్’లో కేటీఆర్‘‘భైంసా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నాపై కొందరు బీజేపీ గూండాలు రాళ్లతో దాడి చేసిన ఘటనతో అనేక మంది ఫోన్లు చేసి నా యోగక్షేమాలు అడుగుతున్నారు. నేను క్షేమంగా ఉన్నాను. మతం పేరిట విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ విషాన్ని చిమ్మే ఈ ముష్కరులపై నాపోరాటం కొనసాగుతుంది’’ అని ‘ఎక్స్’లో కేటీఆర్ పేర్కొన్నారు. -
లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం!
సాక్షి, హైదరాబాద్: ఓ సామాన్యుడిని సీఎం స్థాయికి ఎదిగేలా చేసిననది, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పతనానికి బీజం వేసినది మల్కాజి గిరి లోక్‌సభ నియోజక వర్గమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నిక ల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ఆశించిన స్థాయి లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవలేదని, ఇప్పటికైనా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో పార్టీ నాయకులను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. నా బలం, బల గం కార్యకర్తలే. మల్కాజిగిరిలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కొందరు నాయకులు అమ్ముడుపో యి నా, కార్యకర్తలు నన్ను భుజాల మీద మోసి గెలిపించి ఢిల్లీకి పంపారు. ప్రతీ బూత్‌లో ఒక్కో కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేశారు. నాటి మల్కాజిగిరి గెలుపే నన్ను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది..’’ అని పేర్కొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మంతా కాంగ్రెస్ తుఫాను వచ్చినా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు. ఇక్కడి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం నాలుగు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదని పేర్కొ న్నారు. అందుకే మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించేలా పార్టీ యంత్రాంగం కృషి చేయాలని కోరారు. హోలీ పండుగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని, కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని చెప్పారు. పార్టీకి బలమైన నాయకత్వం ఉందని, సమన్వయంతో ముందుకెళితే విజయం సాధిస్తామని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి, సుధీర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు మైనంపల్లి సంచలన లేఖ.. బీఆర్ఎస్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా అధికార బీఆర్ఎస్ మాల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్‌కు మైనంపల్లి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక, లేఖలో బీఆర్ఎస్ పార్టీ నేతలపై మైనంపల్లి సంచలన ఆరోపణలు చేశారు. మైనంపల్లి లేఖలో.. బీఆర్ఎస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలతో తీవ్రవిబేధాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్లో పారదర్శకత, ప్రజాస్వామ్యం లేదంటూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయత్వం క్షేత్రస్థాయిలో ఉన్న శ్రేణుల అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పార్టీ పేరు మార్చడం కార్యకర్తలకు ఇష్టం లేదని, ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ తెలంగాణలో నష్టం వాటిల్లిందన్నారు. అధికారం కోసం ఆరాటపడే కొందరి చేతుల్లోకి బీఆర్ఎస్ వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికీ లొంగే ప్రసక్తే లేదు.. అంతకుముందు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియో ప్రకటనను ఆయన విడుదల చేశారు. మల్కాజిగిరి ప్రజలు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని, దేనికీ లొంగే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. రోహిత్‌కు నో టికెట్.. ఇదిలా ఉండగా.. గత నెల 21న బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మంత్రి హరీశ్‌రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లికే మరోమారు టికెట్ కేటాయించిన కేసీఆర్.. కానీ, ఆయన కుమారుడు రోహిత్‌కు మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగినా బీఆర్ఎస్ వేచి చూసే ధోరణి అవలంభించింది. ఈ నెల 26న ఢిల్లీలో సోనియా, రాహుల్ సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరిక ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజశేఖర్‌రెడ్డికి టికెట్‌పై త్వరలో ప్రకటన నెల రోజుల క్రితం మైనంపల్లి ధిక్కార స్వరం వినిపించిన మరుక్షణం నుంచే కేసీఆర్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైనంపల్లి రాజీనామా నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశముంది. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో 70 సీట్లలో వడపోత పూర్తి! -
నన్ను ఇబ్బందిపెడితే ఊరుకోను.. మైనంపల్లి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. పార్టీని తనేమీ అనలేదని.. పార్టీ కూడా తననేమీ అనలేదని చెప్పారు. తాను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని అన్నారు. ప్రాణం పోయే వరకు ఉన్నదే మాట్లాడతానని అన్నారు. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే.. తాను కూడా ఇబ్బంది పెడతానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, మైనంపల్లి శనివారం తన అనుచరులతో సమావేశమయ్యారు. మైనంపల్లి నివాసానికి మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరిపారు. అనంతరం, మైనంపల్లి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు తనకు ఫోన్ చేసినట్టుగా పేర్కొన్నారు. నా జోలికి వస్తే ఊరుకోను.. ఈ సందర్బంగా మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని తనేమీ అనలేదని.. పార్టీ కూడా తననేమీ అనలేదని చెప్పారు. తాను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని అన్నారు. ప్రాణం పోయే వరకు ఉన్నదే మాట్లాడతానని అన్నారు. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే.. తాను కూడా ఇబ్బంది పెడతానని చెప్పారు. తనకు సత్తా ఉందని.. చర్యకు ప్రతిచర్య ఉంటుందని అన్నారు. మెదక్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తనను ఎవరూ ఏం అనకుంటే వారి జోలికి వెళ్లనని చెప్పారు. తాను రేపటి నుంచి వారం రోజుల పాటు మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. వారం తర్వాతనే మీడియాతో మాట్లాడతానని తెలిపారు. బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు తనకు ఫోన్ చేసినట్టుగా పేర్కొన్నారు. తొందరపడొద్దని చెప్పారని.. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారని కూడా తెలిపారు. మీడియాతో మాట్లాడొద్దని ఆ నాయకుడు ఒట్టు కూడా వేయించుకున్నారని చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉండగా.. మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం మైనంపల్లికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అదే సమయంలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుమారుడికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వాలనే మైనంపల్లి కోరికకు మాత్రం తిరస్కరించింది. దీంతో, మైనంపల్లి తాజాగా ఈ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. చెన్నమనేనికి కీలక పదవి -
మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్
తిరుమల: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రకటన ముహూర్తానికి ముందే ఆ పార్టీ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు మంత్రి హరీశ్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం మరికొద్ది సేపట్లో అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారనగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీశ్ రావుపై ఫైర్ అయ్యారు. నేను, నా కుమారుడు ఎక్కడ నుండి పోటీ చెయ్యాలో చెప్పడానికి హరీష్‌రావు ఎవరు? ఇందులో ఆయన పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నేను మల్కాజ్ గిరి నుంచి నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తాము. ఎవ్వరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్ చేశారు. ఇంతకాలం మెదక్ అభివృద్ధిని అడ్డుకుంది హరీష్ రావేనని అవసరమైతే సిద్దిపేటలో నా తడాఖా ఏంటో చూప్పించి హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశారు. కేసీఆర్ కుటుంబంలో చాలామందికి టికెట్ ఇచ్చారని మా ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ‘నా కుమారుడు మైనంపల్లి రోహిత్ రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. కరోన సమయంలో ప్రణాలకు తగించి చాలా మందికి వైద్య సేవలు అందించారు. తండ్రి గా నా కుమారుడికి నా సపోర్ట్ ఉంటుంది. నా కొడుకుని మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. హరీష్‌రావు మెదక్ లో పెత్తనం చలాయిస్తున్నాడు. ఓ డిక్టేటర్లా హారీష్‌రావు ప్రవర్తిస్తా ఉన్నారు. హారీష్‌రావు గతం గుర్తు పెట్టుకో. ఓ టంకు డబ్బాతో, రబ్బరు చొప్పులతో వచ్చిన రోజు చూసాను. నేను హిరోగా ఉన్నా, హరీష్ రావు చాలా చిన్న వాడు....సిద్దిపేట్ అభివృద్ధి అయింది, మెదక్ ఎందుకు అభివృద్ధి కాలేదు అని అడిగినా. హరీష్‌రావు బట్టలు ఇప్పే వరకు నేను వదలను.. ఈసారి నా కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకొని హరీష్‌రావు అడ్రస్ లేకుండా చేస్తా. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటి చేస్తా బిడ్డా. హరీష్‌రావుని నిద్రపోనివ్వను. లక్ష కోట్లు హరీష్‌రావు సంపాదించాడు. టంకు డబ్బా,రబ్బరు చెప్పులతో వచ్చిన హారీష్రావ్కి లక్ష కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి. మెదక్ లో హారీష్రావ్ పెత్తనం ఏంటి. మల్కాజ్‌గిరిలో నేను పోటీ చేస్తా, మెదక్ లో నా కొడుకు పోటీ చేస్తాడు. అవసరమైతే రాజకీయాలు పక్కనపెట్టి నా కొడుకుని గెలిపించుకొంటాను. నేను టీఆర్ఎస్ పార్టీ, వారు నన్ను వద్దు అనుకొంటే నేను ఏం చేసేను. నాకు ఎమ్ఎల్ఏ టికెట్ ఇచ్చారు. ఇస్తే ఇద్దరికి టికెట్ ఇవ్వమని అడిగా. లేకుంటే ఎవ్వరికి వద్దు అని తేల్చి చెప్పాను’అని మంత్రి హరీష్‌రావుపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి. ఇది కూడా చదవండి: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు మంత్రి హరీష్ క్లాస్ -
టీపీసీసీపై సర్వే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ఈ సందర్బంగా మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్ల మధ్య వివాదం నెలకొంది. దీనిపై సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియాలే కారణమని ఆరోపించారు. ఓటమి కారకులే మళ్లీ ఓటమిపై సమీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్, కుంతియాల వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని అన్నారు. వాళ్ల అసమర్ధతను ప్రశ్నిస్తే దాడులు చేయించడానికి గాంధీభవన్‌లో రౌడీలను పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు చెబుతుంటే మహేశ్ గౌడ్, బొల్లి కిషన్లతో ఉత్తమ్ తనపై దాడి చేయించినట్టు ఆరోపించారు. పార్టీలో కొందరు రౌడీ మూకలు ఉన్నారని.. ఒకరిద్దరు దద్దమ్మలు తనపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ గెలుపుకు సలహాలు ఇస్తుంటే.. ఇది నచ్చనివారు తనపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీకాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో రేపు మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. అర్హత లేని ఉత్తమ్‌కు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని.. ఆయనను పదవి నుంచి వెంటనే తొలగించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. -
మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌కు షాక్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్న వేళ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ముఖ్య నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, ఓబీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ సీత బాబుయాదవ్, ఆయనతోపాటు జిల్లా కార్యదర్శులు ఎల్ లవకుమార్, రోహిత్ నాయుడు, ప్రవీణ్ కుమార్, రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్ ముజీబ్‌లు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు సరైన గుర్తింపు లేకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేశామని అన్నారు. తమ రాజీనామాలను ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపనున్నట్టు తెలిపారు. -
ముఖ్యమంత్రి అంటే వైఎస్సారే.
తాను చూసిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అత్యంత గొప్పవారని, తండ్రి ఆశయ సాధన కోసం జగన్ పార్టీ స్థాపించారని వైఎస్సార్ సీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి, విశ్రాంత డీజీపీ దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదర్‌నగర్‌లోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున ఫంక్షన్ హాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మనిషీ సమాజసేవ చేయాలని ఆలోచిస్తాడని, మానవసేవే మాధవ సేవగా భావించి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పోలీస్ శాఖలో ఉన్నప్పుడు కూడా విలువలకు కట్టుబడి ఉన్నానని, నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ పడకుండా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీలో ఉన్నప్పుడు అప్పుల్లో ఉన్న సంస్థను మూడేళ్లలో అభివృద్ధి పథంలోకి తీసుకొనివచ్చానని ఈ సందర్భంగా విరించారు. జగన్‌ను నమ్ముకొని పార్టీలో చేరినవెంటనే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఇచ్చారన్నారు. మల్కాజ్గిరి మిని ఇండియా అని, అందరం కలిసి ముందుకు సాగుదామని దినేష్‌రెడ్డి అనగానే సభకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో నే షనల్ మజ్దూర్ యూనియన్ నాయకుడు మహబూబ్, పార్టీ నాయకులు జంపన ప్రతాప్, నవీన్‌కుమార్, డి.శివనారాయణ, కొలన్ శ్రీనివాసరెడ్డి, సురేష్‌రెడ్డి, సత్యం శ్రీరంగం, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మల్కాజ్‌గిరిలో పోటీకీ నాగేశ్వర్ సై
హైదరాబాద్: మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్సీ కె. నాగేశ్వర్ ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నెల 30న ఆయన సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. తనకు మద్దతు తెలపాలని ఆయన కోరనున్నారు. సన్నిహితులు, మిత్రులతో ఇప్పటికే సంప్రదింపుల పర్వం పూర్తి చేసిన నాగేశ్వర్.. ఏదో ఒక పార్టీ తరపున కాకుండా, తన పంథా, వైఖరి రీత్యా అన్ని వర్గాల మద్దతు పొందేందుకు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలని నాగేశ్వర్ నిర్ణయించుకున్నారు. నాగేశ్వర్‌కు మద్దతు ఇచ్చేందుకు సీపీఎం సుముఖంగా ఉన్నట్టు కనబడుతోంది. -
హాట్‌కేక్‌లా మారిన నియోజక వర్గం
రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం హాట్‌కేక్‌లా మారింది. ఈ నియోజకవర్గం మీద అనేక మంది కళ్లు పడుతున్నాయి. మొన్నటి వరకూ ఇక్కడి నుంచి పోటీలోకి దిగాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, మెదక్ లోక్‌సభ సభ్యురాలు విజయశాంతి అనుకున్నారు. తాజాగా మల్కాజ్గిరి సీటు కోసం పోటీ పడుతున్న జాబితాలో లోక్‌సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ కూడా చేరారు. ఈ నియోజకవర్గంలో సెటిలర్ల సంఖ్య అధికంగా ఉంది. దాంతో జెపి కన్ను దీనిపై పడింది. బీజేపీ మద్దతుతో జేపీ రంగంలోకి దిగితే, తన కథ హుళక్కే అని టిడిపి నేత రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలుస్తోంది. మెదక్ స్థానం నుంచి కెసిఆర్ పోటీ చేస్తారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో విజయశాంతి నియోజకవర్గాన్ని మార్చాలన్న యోచనలో పడ్డారు. ఆ క్రమంలో ఆమె మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం గురించి ఆలోచన చేస్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరాలన్న విషయంలో ఆమె ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. విజయశాంతి బిజెపిలో చేరితే ఆ పార్టీ ఈ స్థానాన్ని ఆమెకే కేటాయించే అవకాశం ఉంది. విజయశాంతితోపాటు జెపి కూడా ఈ నియోజకవర్గం వైపే చూస్తున్నారు. టిడిపి బిజెపితో పొత్తుపెట్టుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న విషయం అందరికీ తెలిసిందే. బిజెపితో పొత్తుపెట్టుకుంటే ఏ విధంగా చూసుకున్నా మల్కాజ్గిరి స్థానం టిడిపికి కేటాయించే అవకాశం లేదు. టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీచేయాలన్న ఆలోచనలో పడిపోయారు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఎన్డీఏతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ఇక్కడి నుంచి జేపీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయశాంతి బిజెపిలో చేరితే అప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులలో తన పరిస్థితి ఏంటని రేవంత్ మధనపడుతున్నారు. అంతేకాకుండా టీడీపీలో లొల్లి కూడా పెడుతున్నారు. మల్కాజ్‌గిరిపై ఎక్కువమంది కన్నేయడంతో ఇప్పుడు రేవంత్ చిక్కుల్లో పడ్డారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.