సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా అధికార బీఆర్‌ఎస్ మాల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్‌కు మైనంపల్లి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక, లేఖలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలపై మైనంపల్లి సంచలన ఆరోపణలు చేశారు.
మైనంపల్లి లేఖలో.. బీఆర్‌ఎస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలతో తీవ్రవిబేధాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్‌లో పారదర్శకత, ప్రజాస్వామ్యం లేదంటూ నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్ పార్టీ అగ్రనాయత్వం క్షేత్రస్థాయిలో ఉన్న శ్రేణుల అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పార్టీ పేరు మార్చడం కార్యకర్తలకు ఇష్టం లేదని, ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ తెలంగాణలో నష్టం వాటిల్లిందన్నారు. అధికారం కోసం ఆరాటపడే కొందరి చేతుల్లోకి బీఆర్ఎస్ వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేనికీ లొంగే ప్రసక్తే లేదు..
అంతకుముందు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియో ప్రకటనను ఆయన విడుదల చేశారు. మల్కాజిగిరి ప్రజలు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని, దేనికీ లొంగే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు.
రోహిత్‌కు నో టికెట్..
ఇదిలా ఉండగా.. గత నెల 21న బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మంత్రి హరీశ్‌రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లికే మరోమారు టికెట్ కేటాయించిన కేసీఆర్.. కానీ, ఆయన కుమారుడు రోహిత్‌కు మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగినా బీఆర్‌ఎస్ వేచి చూసే ధోరణి అవలంభించింది. ఈ నెల 26న ఢిల్లీలో సోనియా, రాహుల్ సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరిక ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
రాజశేఖర్‌రెడ్డికి టికెట్‌పై త్వరలో ప్రకటన
నెల రోజుల క్రితం మైనంపల్లి ధిక్కార స్వరం వినిపించిన మరుక్షణం నుంచే కేసీఆర్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైనంపల్లి రాజీనామా నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశముంది.
ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్లో 70 సీట్లలో వడపోత పూర్తి!
Comments
Please login to add a commentAdd a comment