ఢిల్లీ పాలకుల గల్లా పట్టి నిలదీసే ధైర్యం కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు ఉండదు: కేటీఆర్
గత ఐదు నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది
బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మార్చి, రిజర్వేషన్లు రద్దు చేస్తుంది
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు ప్రయత్నాలు
ఇవన్నీ ఆగాలంటే.. రాష్ట్రం నుంచి కేసీఆర్ సైనికులు పార్లమెంటులో ఉండాలని వ్యాఖ్య
మల్కాజిగిరి పరిధిలో ఎన్నికల ప్రచారం.. భైంసాలో రోడ్ షో, కార్నర్ మీటింగ్
అల్వాల్/ కంటోన్మెంట్ (హైదరాబాద్)/ నిర్మల్: బీఆర్‌ఎస్ ఎంపీలతోనే తెలంగాణకు బలమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేది తామేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిస్తే.. ఢిల్లీ పాలకుల గల్లాపట్టి నిలదీసే ధైర్యం ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్రలు సాగుతున్నాయని.. అది ఆగాలంటే తెలంగాణ నుంచి కేసీఆర్ సైనికులు పార్లమెంట్‌లో ఉండాలని చెప్పారు.
గురువారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ వీబీఆర్ గార్డెన్‌లో, కంటోన్మెంట్ పరిధిలోని సిఖ్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో.. నిర్మల్ జిల్లా కేంద్రంలో, భైంసాలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లలో కేటీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్లమెంట్ ఎన్నికలు కదా బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలని కొందరు అంటున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల గళం వినిపించడానికి కేసీఆర్ సైనికులు ఉండాలి.
2004లో ఐదుగురు ఎంపీలతో పార్లమెంట్‌లో అడుగుపెట్టిన కేసీఆర్.. 32 పార్టీలను ఒప్పించి, మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. రాహుల్ గాంధీని, నరేంద్ర మోదీని ఎదిరించే దమ్ము కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ బీజేపీ వాళ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలవోకగా పడగొట్టారు. అదే కేసీఆర్, మమతా బెనర్జీ, హేమంత్ సోరేన్, స్టాలిన్, కేజ్రీవాల్ ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు. బలమైన లీడర్లు ఉన్నచోట బీజేపీ ఆటలు సాగలేదు. అందుకే బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇవ్వాలి.
బీజేపీ ముందు తల వంచేది లేదు
బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనంటూ అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, ఈటల, రఘునందన్‌రావు, సోయం బాపూరావు వంటి బడా లీడర్లను ఓడించింది బీఆర్‌ఎస్ వాళ్లేనని గుర్తుంచుకోవాలి. మేం తల నరుక్కుంటాం కానీ.. బీజేపీ ముందు తల వంచేది లేదు.
రేవంత్ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నారు
కాంగ్రెస్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చెప్పాం. ఆ పార్టీ అబద్ధపు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను ఇబ్బంది పెడుతోంది. గత ఐదు నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. రేవంత్ చిల్లర మాటలు మాట్లాడటం తప్ప మరేమీ జరగలేదు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు హామీల అమలు గురించి నెలలు, తారీఖులు చెప్తున్నారు. కొడుకుల్లారా, పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రా.. బోటీ కొట్టేవాడా? మన ఖర్మకాలి ముఖ్యమంత్రి అయ్యిండు. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ మారింది.
బీజేపీ హైదరాబాద్‌ను యూటీ చేస్తుంది
రిజర్వేషన్లను రద్దుచేసి అగ్రవర్ణాలకు మేలు చేసేలా బీజేపీ కుట్ర చేస్తోంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ పదేళ్ల క్రితం ఇచ్చిన హామీలకే గ్యారంటీ లేదు, ఇప్పుడు కొత్తగా చెప్పే మాటలకు గ్యారంటీ ఏముంది? జూన్ 2వ తేదీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుంది. దీంతో కేంద్రం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.
అదే జరిగితే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఇద్దరూ నాన్ లోకల్, బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పక్కా లోకల్ అన్నారు. ఎంపీగా లక్ష్మారెడ్డిని, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో నివేదిత సాయన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు.
భైంసాలో కేటీఆర్‌పై ఉల్లిగడ్డలు.. జైశ్రీరాం నినాదాలు
భైంసా/ భైంసాటౌన్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసాలో గురువారం సాయంత్రం కేటీఆర్ నిర్వహించిన రోడ్ షోలో.. కొందరు ఉల్లిగడ్డలు, చిన్నపాటి రాళ్లు విసిరారు. కార్నర్ మీటింగ్ నిర్వహించిన ప్రాంతానికి హనుమాన్ స్వాములు, మరికొందరు చేరుకున్నారు. కేటీఆర్ ఖబడ్దార్ అంటూ ముద్రించిన ప్లకార్డులను చూపుతూ.. జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు.
కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు ఆయన వాహనంపైకి ఉల్లిగడ్డలు విసిరారు. ఈ సమ యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనకారులవైపు దూసు కెళ్లే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చాలా కష్టపడి ఇరువర్గాలను అదుపుచేశారు. నిరసనకారులు విసిరిన ఉల్లిగడ్డలు, చిన్నరాళ్లతో ఓ యువకుడి తలకు స్వల్పంగా గాయమైంది.
దేవుడిని అడ్డంపెట్టుకుని రాజకీయాలా?
భైంసాలో తనపై ఉల్లిగడ్డలు, రాళ్లు విసిరినవారిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే యువకులను రెచ్చగొట్టి ఇలా పంపిస్తుంటారని, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ‘‘కేసీఆర్ తెలంగాణలో యాదాద్రి సహా ఎన్నో మందిరాలు నిర్మించారు. ఏమీ చేయనివారే దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారు.
రాముడు ఎంతో ఆదర్శవంతుడు. మేం కూడా జైశ్రీరాం అంటాం. మరి రాముడు ఎదుటివారిపై రాళ్లు విసరాలని చెప్పాడా? మా పని మేం చేసుకుంటున్నాం. మీ పని మీరు చేసుకోండి. కానీ చిల్లర పనులు చేయవద్దు. ఇలాంటి వాటికి భయపడబోం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
‘మత’ ముష్కరులపై పోరాటం కొనసాగుతుంది: ‘ఎక్స్’లో కేటీఆర్
‘‘భైంసా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నాపై కొందరు బీజేపీ గూండాలు రాళ్లతో దాడి చేసిన ఘటనతో అనేక మంది ఫోన్లు చేసి నా యోగక్షేమాలు అడుగుతున్నారు. నేను క్షేమంగా ఉన్నాను. మతం పేరిట విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ విషాన్ని చిమ్మే ఈ ముష్కరులపై నాపోరాటం కొనసాగుతుంది’’ అని ‘ఎక్స్’లో కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment