టీపీసీసీపై సర్వే సంచలన వ్యాఖ్యలు | Sarve Satyanarayana Sensational Comments On TPCC | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 6 2019 2:23 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Sarve Satyanarayana Sensational Comments On TPCC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ఈ సందర్బంగా మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్‌ల మధ్య వివాదం నెలకొంది. దీనిపై సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ కుంతియాలే కారణమని ఆరోపించారు. ఓటమి కారకులే మళ్లీ ఓటమిపై సమీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్‌, కుంతియాల వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని అన్నారు. వాళ్ల అసమర్ధతను ప్రశ్నిస్తే దాడులు చేయించడానికి గాంధీభవన్‌లో రౌడీలను పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు చెబుతుంటే మహేశ్‌ గౌడ్‌, బొల్లి కిషన్‌లతో ఉత్తమ్‌ తనపై దాడి చేయించినట్టు ఆరోపించారు. పార్టీలో కొందరు రౌడీ మూకలు ఉన్నారని.. ఒకరిద్దరు దద్దమ్మలు తనపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ గెలుపుకు సలహాలు ఇస్తుంటే.. ఇది నచ్చనివారు తనపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీకాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో రేపు మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. అర్హత లేని ఉత్తమ్‌కు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని.. ఆయనను పదవి నుంచి వెంటనే తొలగించాలని అధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement