Kuntiya
-
అప్పులు తప్ప ఒరిగిందేమీ లేదు
గజ్వేల్: కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల అప్పులు తప్ప ఒరిగిందేమీ లేదని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదల సమస్యలను గాలికొదిలేసి కేసీఆర్, ఆయన కుటుంబీకులు మాత్రం ఫలితాలను అనుభవిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు నొక్కడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలను హడావుడిగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. రిజర్వేషన్ల ప్రకటన తర్వాత నోటిఫికేషన్‌కు సమయం ఇవ్వాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని కోరారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో టీఆర్ఎస్ను మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి ఇక్కడి ప్రజలు రాష్ట్రానికి మేలు చేయాలని పిలుపునిచ్చారు. గజ్వేల్‌లో టీఆర్ఎస్ ఓడితే అప్పుడైనా ఆ పార్టీ నేతల్లో కనువిప్పు కలుగుతుందన్నారు. సీఎం ఇటీవల ప్రారంభించిన ఆడిటోరియానికి గతంలో పగుళ్లు ఏర్పడగా.. రంగులేసి ప్రారంభోత్సవం చేశారని పేర్కొన్నారు. ఇక్కడే పరిస్థితే ఇలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చని విమర్శించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీలో ఏకపక్ష పోకడలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏకపక్ష పోకడలు పోతున్నారని, సీనియర్ నేతలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, దామోదర రాజనర్సింహలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఈ ముగ్గురు నేతలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియాను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆక్షేపణలు చేసిన ఆ ముగ్గురు నేతలు కుంతియాపై కస్సుబస్సులాడినట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జుల నియామకంలో ఎవరిని సంప్రదించారని, ఇష్టం వచ్చిన వారిని ఇన్చార్జులుగా నియమించారని అభ్యంత రం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరు టీఆర్ఎస్ కోసం పనిచేస్తుంటే మరికొందరు కాంగ్రెస్‌ను బతికించుకునేందుకు పోరాడుతున్నారని వారు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాల్సి ఉంటుందని, సీనియర్లను విస్మరించడం మంచిది కాదని అభిప్రాయపడ్డ నేతలు.. భవిష్యత్తులోనైనా తమ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కుంతియాను కోరారు. కాగా, కుంతియాను పలువురు టీపీసీసీ నేతలు కూడా ఆదివారం కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. -
గాంధీ అంటే ఒక ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: గాంధీ అంటే ఓ ఆదర్శమని, ఆయన జీవితం ఓ సిద్ధాంతమని ఏఐ సీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా టీపీసీసీ ఆధ్వ ర్యంలో చార్మినార్ నుంచి గాందీభవన్ వరకు బుధవారం శాంతి యాత్ర నిర్వహించారు. గాంధీభవన్ లో జరిగిన సభలో కుంతియా మాట్లాడుతూ శాంతి, అహింస ఆయుధాలతో స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీ అన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు పాల్గొన్నారు. -
యురేనియం తవ్వకాలపై పోరు
సాక్షి, హైదరాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ కోర్ కమిటీ తీర్మానించింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి కుంతియా అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. యురేనియం తవ్వకాలు, రైతులు, వ్యవసాయ సమస్యలు, డెంగీ జ్వరాలు, యాదాద్రిలోని చిత్రాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన నేతలు.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టే అంశాలపై ఏఐసీసీ ఆదేశాల ప్రకారం త్వరలో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యమాలకు సంబంధించి పలు కమిటీలు వేయాలని, త్వరలో పెద్దఎత్తున ఉద్యమ కార్యచరణ చేపట్టాలని నిర్ణయించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ బృందం ఆదివారం యాదగిరిగుట్టకు వెళ్లనుంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు, వీహెచ్, పొన్నాల, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, కొండపల్లి విద్యాసాగర్ ఈ బృందంలో ఉన్నారు. ఈ నెల 15న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో సభ్యత్వనమోదు కార్యక్రమం షెడ్యూల్ నిర్ణయించనున్నారు. ఇప్పటికే 22 లక్షల సభ్యత్వం ఉండగా, దానిని 40 లక్షలకు పెంచాలని పార్టీ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపైనా చర్చించింది. -
'తెలంగాణ' ఆమోదయోగ్యం కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు మీకు ఆమోద యోగ్యం కాదా..? అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంమంత్రిని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై హోంమంత్రి అమిత్ షా పదే పదే విమర్శిస్తూ వ్యాఖ్యానించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆదివారం మధ్యాహ్నం ఇక్కడి ఏఐసీసీ కార్యాలయంలో ఆయన పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, పార్టీ నేత మహేశ్ గౌడ్ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ అత్యంత క్లిష్ట సమయంలో నాయకత్వం వహించి కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచారు. రాజీనామా చేసిన నేపథ్యంలో వారి సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా రావడాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ ప్రజల హృదయాల్లో సోనియాగాందీకి ప్రత్యేక స్థానం ఉంది. మొన్న జరిగిన లోక్‌సభ సమావేశాల్లో హోంమంత్రి మాట్లాడిన తీరు నిర్ఘాంతపరిచింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను విమర్శించడం ఆశ్చర్యపరిచింది. రాష్ట్ర ఏర్పాటులో హోం శాఖ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వ్యక్తిగా చెబుతున్నా.. కాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సందర్భం లో తెలంగాణ ప్రక్రియను విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుపై 2009 డిసెంబర్లోనే హోం మంత్రి ప్రకటించారు. అఖిలపక్ష సమావేశాలు జరిపారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసి సంప్రదింపులు జరిపారు. అందరితో చర్చించిన తర్వాతే తెలంగాణ ఏర్పాటు చేసిన సంగతి హోంమంత్రికి తెలియాలి. దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఏ బిల్లు పెట్టినా ఓటింగ్ జరిపే సమయంలో తలుపులు మూసేస్తారు..’అని చెప్పారు. నెహ్రూపై తప్పుడు ప్రచారమా.. ప్రధాని, హోంమంత్రి, చోటా మోటా బీజేపీ నేతలు కూడా నెహ్రూపై వ్యాఖ్యానించడం సరికాదని ఉత్తమ్ అన్నారు. ‘స్వాతంత్య్రం కోసం పదేళ్లు జైల్లో ఉన్న నెహ్రూపై తప్పుడు ప్రచారం చేయడం, చరిత్రను వక్రీకరించడం బాధగా ఉంది. ఆరి్టకల్ 370 వర్తింపజేయడం ఆ నాటి కేబినెట్ నిర్ణయం. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు దానిని విమర్శించడం, వారి గొప్పతనాన్ని తగ్గించేలా మాట్లాడటం సమాజంలోని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి. కశ్మీర్ సమస్యను నెహ్రూ తయారుచేశారన్న అమిత్ షా వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు.. హైదరాబాద్, జునాగఢ్‌ను సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేశారని, కశీ్మర్ సమస్య నెహ్రూ తెచ్చారని ప్రచారం చేస్తున్నారు. వీరు ఒకే కేబినెట్లో ఉండి అవి చేస్తే చరిత్రను వక్రీకరిస్తున్నారు. అన్ని నిర్ణయాలు కలసికట్టుగా తీసుకున్నవే. వారిద్దరూ కాంగ్రెస్ నేతలే’ అని పేర్కొన్నారు. బీజేపీ బలంతో వచ్చినవి కావు: కుంతియా అంతకుముందు కుంతియా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌కు తదుపరి సంస్థాగత ఎన్నికలు జరిగేంతవరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఉంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ సమర్థంగా పనిచేశారు. దేశవ్యాప్తంగా పోరాటాల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటమికి ఆయన బాధ్యత లేదని సీడబ్ల్యూసీ అభిప్రాయపడుతూ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడింది. ఆయన తన రాజీనామా వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తం గా 200 మంది నేతలు శనివారం సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు తమ అభిప్రాయం తెలిపారు. రాహుల్ అందుకు సిద్ధంగా లేరు. సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాం దీని ఎన్నుకుంది. టీపీసీసీ దీనిని స్వాగతిస్తోంది. తెలంగాణ ఏర్పాటు కేవలం సోనియా వల్లే సాధ్యమైంది. తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు సమర్థంగా పనిచేసి విజయం సాధి స్తాయి. కాంగ్రెస్ ఖాళీ అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీకి వచ్చిన ఆ 4 సీట్లు బలం వల్ల వచ్చినవి కావు. ఆదిలాబాద్ ఎంపీ గెలవడానికి కారణం ఆయ న గోండుల నాయకుడు.. నిజామాబాద్‌లో రైతులంతా కవితను ఓడించాలని నిర్ణయించుకోవడంతో అక్కడ బీజేపీ గెలిచింది. మా పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పోయినా ముగ్గురు ఎంపీలు గెలిచారు. మా పార్టీ కచ్చి తంగా బలపడుతుంది’ అని అన్నారు. -
‘పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి’
సాక్షి, హైదరాబాద్ : రాహుల్ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షునిగా కొనసాగాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మంచి ఫైటర్ అనే విషయం మొన్నటి ఎన్నికల్లో తెలిసిందన్నారు. టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగుతారని కుంతియా స్పష్టం చేశారు. ఉత్తమ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తోన్న డిమాండ్‌ను ఆయన తోసి పుచ్చారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని, అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కుంతియా పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంటుందని అన్నారు. పార్టీ నాయకత్వం బలహీనంగా ఉందన్న విషయం.. టికెట్ల కోసం వచ్చినప్పుడు తెలియదా అని కుంతియా ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 34 శాతానికి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 29 నాగార్జున సాగర్‌లో రాష్ట్రకార్యవర్గ సమావేశం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహ రచన కోసం పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీ వేశామన్నారు. పార్టీ ఓటమిపై క్షేత్ర స్థాయి నివేదిక తెప్పించుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది!
-
ఏం జరుగుతోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే అంశంతోపాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై సీనియర్ నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ఆదివారమం తా హైదరాబాద్‌లోని ఓ హోటల్ వేదికగా అంతర్మథ నం జరిపారు. వలసలకు గల కారణాలు, భవిష్యత్తు లో జరగనున్న ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహంపై చర్చతోపాటు బీజేపీలోకి ఎవరెవరు వెళ్లాలనుకుంటున్నారన్న దానిపై ఆయన ఆరా తీసినట్టు తెలుస్తోంది. రాహుల్ తర్వాతే... టీపీసీసీ అధ్యక్ష మార్పుపై కూడా కుంతియాతో రాష్ట్రనేతలు చర్చించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకత్వమార్పు జరుగుతుందనే చర్చ పార్టీలో నడుస్తోంద ని, వాస్తవ పరిస్థితి ఏమిటని అడుగగా జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉండాలా వద్దా అనేది తేలిన తర్వాతే పీసీసీ అధ్యక్షుల గురించి ఓ కొలిక్కి వస్తుందని, అప్పటివరకు ఎలాంటి మార్పులు ఉండబోవని కుంతియా స్పష్టం చేసినట్టు తెలిసింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరుండాలన్న దానిపై కూడా కుంతియా నేతల వద్ద ఆరా తీసినట్టు తెలిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వండి: జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం కుంతియాను కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, రాజకీయ పరిణామాలపై చర్చించిన అనంతరం తనకు టీపీసీసీ వర్కిం గ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీని జాగ్రత్తగా కాపాడు కోవాల్సిన అవసరం ఉందని, క్షేత్రస్థాయి కార్యకర్తలకు భరోసా కల్పించడానికి తాను కృషి చేస్తానని ఆయన కుంతియాకు తెలిపారు. జగ్గారెడ్డి విజ్ఞప్తి పట్ల కుంతి యా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. నిర్ణయం తీసుకోండి.. కుంతియాను టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఎం.కోదండరెడ్డి కలిసి రాజగోపాల్‌రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు సమాచారం. రాజ గోపాల్‌రెడ్డి పార్టీనుద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యం లో షోకాజ్ నోటీసు జారీ చేశామని, దానికి స్పందన లేదని, నోటీసు ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ అవే వ్యాఖ్యలు చేశారని వివరించారు. రాజగోపాల్‌రెడ్డి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. కుంతియాను కలిసినవారిలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, హర్కర వేణుగోపాల్‌రావు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలపై వ్యూహం ఖరారు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై టీపీసీసీ దృష్టి సారించింది. దీనికోసం బీసీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఆదివారం రాత్రి సమావేశమైన టీపీసీసీ కోర్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా నేతృత్వంలో ఈ సమావేశం సాగింది. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌గాంధీ తన నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం వ్యూహం ఖరారు చేసింది. పొన్నం ప్రభాకర్ కన్వీనర్‌గా ఏఐసీసీ కార్యదర్శులు సంపత్, వంశీచంద్‌రెడ్డి సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఖాళీగా ఉన్న నియోజకవర్గాల బాధ్యుల నియామకం వారంరోజుల్లో పూర్తిచేయాలని నిర్ణయించింది. 29న నాగార్జునసాగర్‌లో టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ బాధ్యులతో సమావేశం కావాలని నేతలు నిర్ణయించారు. మున్సిపాలిటీలలో బీసీ ఓటర్ల నమోదుపై పార్టీ సీరియస్‌గా పరిశీలించాలని కోర్ కమిటీ తీర్మానించింది. 34 శాతం బీసీ రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపింది. పార్టీ అధ్యక్షుల అనుమతి లేకుండా ఎవరు విలేకరుల సమావేశాలు పెట్టవద్దని, పార్టీ అంశాలు ప్రకటించవద్దని ఉత్తమ్ హెచ్చరించారు. సమావేశంలో కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్, వంశీచంద్‌రెడ్డి, చిన్నారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సీఎల్పీ మాజీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తదితరులు పాల్గొన్నారు. అసంతృప్తులెవరు? పార్టీ నుంచి నేతలు ఎందుకు వెళ్లిపోతున్నారనే అంశంపై ఒకరిద్దరు సీనియర్లతో కుంతియా చర్చించారు. భరోసా లేకనే వెళుతున్నట్టు పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు చెబుతున్నారని, అసలు క్షేత్రస్థాయి పరిస్థితికి, నాయకత్వం దగ్గర ఉన్న సమాచారానికి మధ్య ఉన్న అంతరం ఏమిటన్న దానిపై వారితో మాట్లాడారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితోపాటు బీజేపీలోకి ఎవరెవరు వెళ్లాలనుకుంటున్నారని, పార్టీపట్ల వారికి ఉన్న అసంతృప్తి ఏమిటని అడిగి తెలుసుకున్నారు. సీనియర్లు ఇచ్చిన సలహా మేరకు పార్టీలో ఉన్న అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరపాలని, వారు పార్టీని వీడి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. -
‘జనాలు తిరగబడి తన్నే రోజు వస్తుంది’
సాక్షి, హైదరాబాద్ : 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో కాంగ్రెస్ నాయకులు 36 గంటల దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌ఛార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు వీహెచ్, జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అక్రమంగా ఎమ్మెల్యేలను చేర్చుకుందని ఆరోపించారు. ఎమ్మెల్యేలంతా ఒకేసారి పార్టీ వీడారనడం అబద్ధమన్నారు. పార్టీ వీడిన వారి మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా.. గవర్నర్‌ను కలిసినా సరైన స్పందన రాలేదన్నారు. కోర్టుకు వెళ్తే కేసును ఈ నెల 11కు వాయిదా వేశారని తెలిపారు. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని కుంతియా ప్రశ్నించారు. కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ప్రజాస్వామ్యానికే వెన్నుపోటుగా అభివర్ణించారు. ప్రతిపక్షాన్ని చూసి కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. దళిత ప్రతిపక్ష నేత కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అప్రజాస్వామిక చర్యలను జనాలు చూస్తున్నారని.. ఏదో ఒక రోజు తిరగబడి తంతారని హెచ్చరించారు. -
ఆ ఆత్మహత్యలకు సర్కారుదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై రాష్ట్రపతిని కలుస్తామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు సర్కారుదే బాధ్యతని, వారి తల్లిదండ్రులకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ‘ఇంటర్’అవకతవకలపై కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్, జనసేన, తెలంగాణ ఇంటి పార్టీ శనివారం ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాయి. విద్యామంత్రి జగదీశ్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత కుంతియా డిమాండ్ చేశారు. లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం కూడా ఉందని భావించాల్సి వస్తుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఇంటర్ సమస్యకు పరిష్కారం చూపకపోతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం హెచ్చరించారు. 3 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కీలక సమయాల్లో ముఖ్యమంత్రి విహార యాత్రలకు వెళ్లడమేంటని మండిపడ్డారు. ఇంటర్ బోర్డు అవకతవకల ఘటనకు నూటికి నూరుపాళ్లు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఇసుక మాఫియా తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో విద్యా మాఫియా నడుస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు రమణ అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారిని శిక్షించాలని, ఆయా కుటుంబాలకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయకపోతే కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామన్నారు. నాడు డిప్యూటీ సీఎం రాజయ్యను అకారణంగా తొలగించారని, ఇప్పుడు ఇన్ని తప్పులు జరిగినా జగదీశ్‌రెడ్డిని ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, తెలంగాణ జనసేన అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడారు. తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు... ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కూడా కార్యక్రమం లో మాట్లాడారు. వారు మాట్లాడుతున్నంతసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మహేశ్వరి తల్లి మాట్లాడుతూ.. తమ కుమార్తె కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ఒకతే బిడ్డ అని.. ఎవరూ లేరన్నారు. అనామిక తల్లిదండ్రులు, అమ్మమ్మ మాట్లాడుతూ... కేసీఆర్ ఇంత మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీహెచ్, నగేశ్ బాహాబాహీ సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్, టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్ బాహాబాహీకి దిగారు. దీంతో ధర్నా కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై నుంచి వీహెచ్ మాట్లాడుతుండగా, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా అక్కడికి వచ్చారు. అదే సమయంలో నగేశ్ కూడా వేదిక పైకి వెళ్లారు. కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో ఆయన కూర్చునేందుకు యత్నించారు. ఈ క్రమంలో నగేశ్, వీహెచ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వీహెచ్ చేయి చేసుకోవడంతో నగేశ్ ఆయన చొక్కా పట్టుకున్నారు. తోపులాటలో ఇద్దరూ కిందపడిపోయారు. అప్రమత్తమైన అఖిలపక్ష నేతలు ఇద్దరి మధ్య సయోధ్యకు యత్నించారు. పార్టీ రాష్ట్ర ఇన్చా ర్జి వచ్చినప్పుడు బాధ్యతగల నాయకుడు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం, నారాయణ జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. చనిపోయిన పిల్లల కుటుంబాల ముందు ఇలా మనం కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరాం అన్నా రు. కావాలంటే మీరు గాంధీభవన్‌లో కొట్లాడుకోం డంటూ సీపీఐ నేత నారాయణ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం
స్టేషన్ మహబూబ్‌నగర్: రానున్న పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సిద్ధం చేసేలా కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ మేరకు పార్లమెంట్ స్థానాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్లో శనివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ నంది ఎల్లయ్య, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టనున్న ప్రణాళికలు, కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ ఇన్చార్జీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ ఓట్లు తగ్గాయో తదితర అంశాలను ఆరా తీశారు. టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని ప్రచారం చేసి మైనార్టీలను కాంగ్రెస్ వైపు ఆకర్షితులను చేయాలని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాత్రాన నేతలు, కార్యకర్తలు ఆందోళన పడొద్దని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల కంటే 45 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించాలని మెజార్టీ నేతలు ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఇక సీనియర్లతో చర్చించి మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం పోటీపడుతున్న అభ్యర్థుల జాబితాను ఆదివారం లోగా గాంధీభవన్‌లో సమర్పించాలని డీసీసీ అధ్యక్షుడికి సూచించినట్లు తెలిసింది. మండల స్థాయిల్లో నేతల అభిప్రాయం మేరకు సాధ్యమైనంత తక్కువ మందితో జాబితాను అందజేయాలని చెప్పినట్లు సమాచారం. కాగా, ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో పాటు డీకే.అరుణ, రేవంత్‌రెడ్డి హాజరుకాకపోవడం గమనార్హం. -
‘లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను, సమస్యలను అధిగమించి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటుతామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేం దుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ మంగళవారం ఇక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను రాహుల్‌కు వివరించామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్ల సాధనకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని రాహుల్ సూచించారన్నారు. దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి పనిచేయాలని ఆదేశించారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సమర్థవంతంగా ముందుకెళ్లాలని రాహుల్ సలహా ఇచ్చారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ చెప్పారు. దీని కోసం తుది కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు రెండు, మూడు రోజుల్లో మళ్లీ ఏఐసీసీ కార్యదర్శితో తాను, సీఎల్పీ నేత సమావేశమవ్వాలని రాహుల్ ఆదేశించారన్నారు. సమావేశంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం, రేవంత్‌రెడ్డి, కుసుమకుమార్, ఎమ్మెల్యేలు సబితా, సీతక్క, హరిప్రియ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గండ్ర, వనమా వెంకటేశ్వరరావు, సుధీర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, కాంతారావు, జయప్రకాశ్‌రెడ్డి, సురేందర్, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, ఉపేందర్‌రెడ్డి, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పాల్గొన్నారు. -
టీపీసీసీపై సర్వే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ఈ సందర్బంగా మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్ల మధ్య వివాదం నెలకొంది. దీనిపై సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియాలే కారణమని ఆరోపించారు. ఓటమి కారకులే మళ్లీ ఓటమిపై సమీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్, కుంతియాల వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని అన్నారు. వాళ్ల అసమర్ధతను ప్రశ్నిస్తే దాడులు చేయించడానికి గాంధీభవన్‌లో రౌడీలను పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు చెబుతుంటే మహేశ్ గౌడ్, బొల్లి కిషన్లతో ఉత్తమ్ తనపై దాడి చేయించినట్టు ఆరోపించారు. పార్టీలో కొందరు రౌడీ మూకలు ఉన్నారని.. ఒకరిద్దరు దద్దమ్మలు తనపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ గెలుపుకు సలహాలు ఇస్తుంటే.. ఇది నచ్చనివారు తనపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీకాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో రేపు మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. అర్హత లేని ఉత్తమ్‌కు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని.. ఆయనను పదవి నుంచి వెంటనే తొలగించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. -
లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కండి
సాక్షి,హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా ఇప్పటినుంచే నేతలంతా కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు సూచించారు. పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు అసెంబ్లీ పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులే అండగా నిలవాలని సూచించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలపై నిర్వహించిన సమీక్షకు ఏఐసీసీ ఇన్చార్జ్ కార్యదర్శి శ్రీనివాసన్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ్‌కుమార్, సీనియర్‌నేతలు షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా తదితరులు హాజరయ్యారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంగనర్, వరంగల్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమీక్షకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను నియోజకవర్గాల వారీగా అడిగి తెలుసు కున్నారు. ఎంపీలుగా పోటీకి ఆసక్తి ఉన్న ఆశావహుల పేర్లను తమకు రెండు, మూడు రోజుల్లో సూచించాలని కోరారు. ఈ నెల 25లోపు అధిష్టానం సూచన మేరకు జాబితాను సిద్ధం చేస్తామని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు 33 డీసీసీలు భర్తీకి చేయాల్సి ఉన్నందున, సరైన నేతల పేర్లను సూచించాలన్నారు. ] సీనియర్ నేతలు దూరం.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి నేతలను సమాయత్తం చేయాలని అధిష్టానం ఆదేశించినప్పటికీ పార్టీ సీనియర్ నేతలెవరూ ఈ ఆదేశాలను అంతగా పట్టించుకోలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్లు రేవంత్‌రెడ్డి, అజారుద్దీన్లు, మధుయాష్కీ గౌడ్, సుదర్శన్‌రెడ్డి, గీతారెడ్డి, సురేశ్ షెట్కార్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణరెడ్డి వంటి సీనియర్ నేతలు ఈ సమీక్షకు హాజరుకాలేదు. పోటీచేసిన అభ్యర్థులే ఇన్‌ఛార్జిలు: ఉత్తమ్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. జనవరి 14లోగా బూత్, మండల్, బ్లాక్ స్థాయిల్లో అన్ని కమిటీలను వేయాలని ఆదేశించారు. -
త్యాగాలకు సిద్ధంకండి!
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ బుజ్జగింపులు ప్రారంభించింది. పొత్తుల్లో భాగంగా అన్ని స్థానాల్లో పోటీచేసే అవకాశం ఉండదు కనుక.. అభ్యర్థులు సహకరించాలని కోరింది. 90–95 చోట్ల మాత్రమే పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని, మిగిలిన చోట్ల ఆశావహులు త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. టీఆర్ఎస్ను గద్దె దింపాలన్న లక్ష్యం నెరవేరాలంటే పార్టీలోని కొందరు త్యాగం చేయాల్సి వస్తుందని, అంతమాత్రాన అలాంటి నేతలు నిరాశ చెందాల్సిన పనిలేదన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ నామినేటెడ్ పదవులిస్తామని వారు హామీ ఇచ్చారు. ‘పొత్తులు ఖాయం. కూటమిగా ఎన్నికలకు వెళ్లాలని అధిష్టానం చెప్పింది. టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం. ఈ క్రమంలో మనం కొన్ని స్థానాల్లో పోటీచేయలేము. మొత్తం 5వేల మంది ఆశావహులు పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో వెయ్యి మందిని స్క్రీనింగ్ చేయాలని రాహుల్ చెప్పారు. ఆ కార్యక్రమం పూర్తవుతోంది. కానీ మనం గరిష్టంగా 100 మందికి మాత్రమే టికెట్ ఇవ్వగలం. మిగిలిన వాళ్లు నిరాశ చెందవద్దు. తగిన న్యాయం చేస్తాం’అని కుంతియాపేర్కొన్నారు. బుధవారం గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ భేటీ జరిగింది. ముఖ్య నేతలతో పాటు ఆఫీస్ బేరర్లు, జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 45 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సిన తీరు, ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న అంశాలపై కీలక సూచనలు చేశారు. నవంబర్ 1 నుంచి బూత్ స్థాయి మీటింగ్‌లు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ముందే ఈ నెల 25న పార్టీ అధికార ప్రతినిధులతో వర్క్‌షాప్ నిర్వహిస్తామని కుంతియా తెలిపారు. అనంతరం 28, 29, 30 తేదీల్లో ఏదో ఒక రోజు ఇంటింటి ప్రచారాన్ని మొదలు పెట్టాలని, 31న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని నేతలకుసూచించారు. అనంతరం నవంబర్ 1 నుంచి 7 వరకు నియోజకవర్గాల్లో బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని మార్గదర్శనం చేశారు. నియోజకవర్గ ఇంచార్జీలు ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానికంగా ఉండాలని, పార్టీ ప్రచార కార్యక్రమాలకు సమయం కేటాయించాలని, అలా ఇవ్వని పక్షంలో ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా, ఈ సమావేశంలో కూటమిలో సీట్ల పంపకాలపై ఎంపీ నంది ఎల్లయ్య నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాలమూరు జిల్లాలో పార్టీ బలంగా ఉందని, ఈ స్థానాలను టీడీపీకి సీట్లు కేటాయిస్తే తాను వ్యతిరేకిస్తానని చెప్పినట్లుగా సమాచారం. దీనిపై కుంతియా జోక్యం చేసుకుంటూ.. పొత్తులు పూర్తిగా రాహుల్ మార్గదర్శనం మేరకు జరుగుతున్నందున అందరూ సహకరించాల్సిందేనని స్పష్టం చేశారని సమాచారం. -
సీట్ల త్యాగానికైనా సిద్ధమే: కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీతో సహా పలు పార్టీలతో పొత్తుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ‘మహాకూటమి’ లో సయోధ్య చెడిందంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా కీలక వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి ఉమ్మడి లక్ష్యమైన కేసీఆర్ ఓటమికై కాంగ్రెస్ పార్టీ సీట్ల త్యాగానికి కూడా సిద్ధంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు మిగతా పార్టీలన్నీ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక వర్గాలు, గెలిచే అభ్యర్థుల ప్రతిపాదికగా సీట్ల కేటాయింపు అంశమై చర్చలు జరుపుతున్నామని కుంతియా పేర్కొన్నారు. మహాకూటమి సీట్ల సర్దుబాట్ల విషయం త్వరగా పూర్తవ్వాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. తెలంగాణలోని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. బీసీలకు కేసీఆర్ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి 15 మంది ఆశావహులు ఉన్నారని పేర్కొన్నారు. -
‘కర్ణాటకం’పై నిరసనలు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనుంది. ఈ ఆందోళనల్లో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలకు వివరించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనలను రాష్ట్రంలోనూ ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఏఐసీసీ నుంచి గురువారం కబురు రావడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో గాంధీ భవన్లో సమావేశమయ్యారు. సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులతో సమావేశమై శుక్రవారం నిర్వహించాల్సిన ఆందోళనలపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో చర్చించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. అప్రజాస్వామిక చర్య: కుంతియా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ లేకున్నా గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం అప్రజాస్వామికమని కుంతియా విమర్శించారు. గురువారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం అవుతానని యడ్యూరప్ప ముందుగానే చెప్పారంటేనే బీజేపీ ఈ విషయంలో కుట్రతో వ్యవహరించిందని అర్థమవుతోందన్నారు. బీజేపీ తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టనున్న ఆందోళన కార్య క్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తున్నా సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడీఎస్‌కు మద్దతు ప్రకటించిన కేసీఆర్ ఈ విషయంలో నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గుర్తించాలని, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని జానారెడ్డి వ్యాఖ్యానించారు. మోదీ దిష్టిబొమ్మ దహనం... కర్ణాటకలో బీజేపీ అనుసరిస్తున్న అనైతిక రాజకీయాలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బీజేపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌ల నేతృత్వంలో పలువురు కార్యకర్తలు గాంధీభవన్ నుంచి బీజేపీ కార్యాలయం వైపు బయలుదేరగా పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేతలు అక్కడే ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా, అరెస్టు చేసిన నేతలను పోలీసులు బేగంబజార్ పీఎస్‌కు తరలించి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. -
'ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు అప్రజాస్వామికం'
-
కువైట్‌లో చిక్కిన కార్మికులకు విమాన టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లి చిక్కుకుపోయిన భారతీయ కార్మికులు తిరిగి స్వదేశానికి వచ్చేలా తోడ్పాటు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో కూడిన బృందం కువైట్‌లో పర్యటిస్తోంది. ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా శుక్రవారం కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లి కార్మికుల వివరాలు తెలుసుకున్నారు. సుమారు 30 వేల మంది భారతీయులు స్వదేశానికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో ఐదు వేల మంది వరకు తెలంగాణ వలస కార్మికులున్నారు. కానీ స్వదేశానికి వెళ్లడానికి విమాన టికెట్లకు డబ్బులు లేక ఇబ్బందిపడుతున్నారు. అలాంటి 100 మంది కార్మికులకు విమాన టికెట్లు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. తర్వాత వారిని మోసగించిందని ఆయన ఆరోపించారు. ఈ టికెట్ల ఖర్చును జేఎన్ వెంకట్ (కోరుట్ల), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), షబ్బీర్ అలీ (కామారెడ్డి), కెఆర్ సురేశ్‌రెడ్డి (ఆర్మూర్), సుదర్శన్‌రెడ్డి (బోధన్), మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్), ఈరవత్రి అనిల్ (బాల్కొండ), నంగి దేవేందర్‌రెడ్డి (మక్తల్) భరిస్తున్నట్లు తెలిపారు. -
విజయశాంతికి కీలక పదవి?
సాక్షి, హైదరాబాద్: సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చురుకుగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీతో విజయశాంతి సమావేశం అయినట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె ఈ సందర్భంగా రాహుల్‌కు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి చురుకుగా పాల్గొంటారని, కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేస్తారన్నారు. కాగా విజయశాంతి గత కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ చేరికపై ఆమె అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెకు పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయశాంతి రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక గత ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయశాంతి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. -
ప్రభుత్వ తప్పులను మేధావులు ప్రశ్నించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, తప్పులను మేధావు లు ప్రశ్నించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారా ల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా పేర్కొన్నారు. ప్రశ్నించకుంటే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థక మవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రొఫెషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుస రిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మేధోమథనం జరగాలని, చర్చ జరిగిన ప్పుడే అలాంటి విషయాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, జీడీపీ తదితర అం శాలపై మేధావులు ప్రత్యేక చర్చలు నిర్వహించా లన్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మేధావులు ప్రత్యక్ష రాజకీ యాల్లోకి రావాలని, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిం చకపోతే పాలకులు నియంతలుగా మారుతారని అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పాల నపై మేధావులు బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. తర్వాత ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసో జు శ్రవణ్‌ను సన్మానించారు. సమావేశంలో గీతారెడ్డి, మల్లురవి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దెదించాలి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి ప్రజల ఆకాంక్షలను నేరవేర్చకుండా నియంతలా పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి పిలుపునిచ్చారు. లంబాడా హక్కు ల పోరాట సమితి ఆధ్వర్యంలో ‘మేమెంతమందిమో–మాకంత వాటా’పై ఉమ్మడి రాష్ట్ర సదస్సును ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్వహించగా వారు హాజరై మాట్లాడారు. గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లకు జీవో ఇచ్చి తక్షణమే అమలు చేయాలన్నారు. తెలంగాణ కోసం పోరాడిన దళితులు, గిరిజనులు, నిరుద్యోగుల ఆంకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రజా సమస్యలను విస్మరిస్తున్న సర్కార్ మెడలు వంచేందుకు పోరుబాట పట్టాలన్నారు. -
డీకే అరుణ ఓకే..రేవంత్ చేరికకు ముహూర్తం ఖరారు
-
డీకే అరుణ ఓకే.. రేవంత్ చేరికకు ముహూర్తం ఖరారు!
సాక్షి, హైదరాబాద్: టీడీపీకి గుడ్‌బై చెప్పిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎల్లుండి (మంగళవారం) కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరే అవకాశముంది. రేవంత్ రాకపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. డీకే అరుణ వంటి పలువురు నేతలు ఆయన రాకను వ్యతిరేకించినట్టు కథనాలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌లోకి రేవంత్ రాకను ఎవరూ వ్యతిరేకించడం లేదని తెలిపారు. డీకే అరుణతో ఇప్పటికే మాట్లాడానని, పెద్ద వ్యతిరేకత లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో షరతులతో కూడిన చేరికలు ఉండవని కుంతియ చెప్పుకొచ్చారు. నవంబర్‌లో రాహుల్ పర్యటన ఉంటుందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ సర్కారు చేపట్టిన పెద్దనోట్ల రద్దుకు నిరసనగా నవంబర్ 8న బ్లాక్ డేకు పిలుపునిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రేవంత్‌రెడ్డి పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కుంతియ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రేవంత్ రాక అంశాలపై చర్చించారు. -
రేవంత్‌తో పాటు మరో 30మంది!
-
రేవంత్ రెడ్డితో పాటు మరో 30మంది!
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీని వీడిన రేవంత్ రెడ్డి...కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైంది. నెలాఖరులో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 31న ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణలోని పరిణామాలపై చర్చ జరగనుంది. అదే రోజు పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ సమక్షంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు మరో 30మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. ఆయనతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. కాగా రేవంత్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆ ముప్పైమంది ఎవరా? అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇక సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రేవంత్ రెడ్డి... కార్యకర్తలతో భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనంతరం తొలిసారి ఆయన ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు. అలాగే సోమవారం ఉదయం ఆయన జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం నగరంలోని జలవిహార్‌లో అనుచరులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. -
కేసీఆర్‌కు సింగరేణి ఎన్నికల భయం
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్‌కు సింగరేణి ఎన్నికల భయం పట్టుకుందని తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆర్సీ.కుంతియా అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయబోరని సింగరేణి కార్మికులు భావిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు కార్మికులు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. బలమైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు కలవడంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. -
కేసీఆర్.. నయా హిట్లర్
ఎమ్మెల్యేలను కొనడం ఏం రాజనీతి..?: ఆర్.సి.కుంతియా సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్ హిట్లర్‌లా ప్రవరిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా అన్నారు. ఇందిరమ్మ రైతుబాటలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు గురువారం ఖమ్మంలో భూ రికార్డులపై అవగాహన సదస్సు–శిక్షణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో కుంతియా మాట్లాడుతూ ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు భూములిచ్చి.. సొమ్ములిచ్చి కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కొనసాగించడం ఏ రకమైన రాజనీతి అని ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలోని ప్రభుత్వాలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. సోనియా, రాహుల్ నేతృత్వంలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 39 జీవో ద్వారా రైతులు, రైతు కూలీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని రెవెన్యూ రికార్డులను పటిష్టం చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే సీసీఎల్ఏకు మూడేళ్లుగా అధికారి కరువయ్యారని, రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రభుత్వం నిద్రపుచ్చిందన్నారు. డీసీసీ అధ్యక్షులు అయితం సత్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల సెక్రటరీ సతీశ్ జార్బోలి, ఎంపీ రేణుకాచౌదరి శాసనమండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరామ్‌నాయక్, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ది బలవంతపు భూసేకరణ: ఉత్తమ్ కాంగ్రెస్ హయాంలో పేదలకు 10 లక్షల ఎకరాలను ఇస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో బలవంతపు భూసేకరణ ద్వారా వాటిని లాక్కుంటోందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మూడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కరువైందన్నారు. పర్సంటేజీలు వచ్చే మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు మాత్రమే ప్రభుత్వం రూ.50 వేల కోట్లు విడుదల చేసిందన్నారు. -
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సహకరించకండి
కుంతియాకు మాలమహానాడు వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియాను మాలమహానాడు నేతలు కోరారు. అంతేకాకుండా వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కుంతియాను ఢిల్లీలో మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు కలసి వినతిపత్రాన్ని అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు, రాజ్యాంగ స్ఫూర్తికి వర్గీకరణ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయమై పార్టీ వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కుంతియా హామీ ఇచ్చినట్టు చెన్నయ్య తెలిపారు. మాలమహానాడు ఆధ్వర్యంలో ధర్నా వర్గీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం ధర్నా చేపట్టారు. సంఘం అధ్యక్షుడు రాంమూర్తి మాట్లా డుతూ.. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తే సహిం చబోమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడులపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
జానారెడ్డిని మార్చం
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ నేతగా జానారెడ్డి మార్చే ఉద్దేశం లేదని ఏఐసీసీ నేత కుంతియా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్నిసేకరించలేదన్నారు. డీఎస్ వంటి వారు అధికారం కోసం పార్టీ మారుతున్నారని, ఆయన మారడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఏఐసీసీ నేత కుంతియా విమర్శించారు. తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని కుంతియా వెల్లడించారు. ఇందుకోసం విరాళాలు సేకరిస్తామన్నారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ నెలాఖరుకల్లా ఈ కార్యక్రమం దాదాపు 25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురంలో రాహుల్ పర్యటిస్తారని తెలిపారు. సుమారు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే వరంగల్ ఉపఎన్నికల్లో పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మీరాకుమార్ ప్రస్తావన రాలేదన్నారు. రంజాన్ సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ము స్లిం సోదరులకు ఇప్తార్ విందులను ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. -
తుది దశకు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు
- జిల్లాల వారీగా కుంతియా, భట్టి సమీక్ష హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు గురువారంతో గడువు ముగియనుండటంతో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క గాంధీభవన్‌లో బుధవారం ఈ అంశంపై జిల్లాల వారీగా సమీక్షించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల సభ్యత్వ నమోదు తీరును వారు పరిశీలించారు. ఈ సమీక్షల్లో సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, ఇతర నాయకులు డి.శ్రీనివాస్, కె.ఆర్.సురేశ్ రెడ్డి, పద్మా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భిక్షమయ్యగౌడ్, మహేశ్వర్‌రెడ్డి, ఆకుల లలిత, తాహెర్, సి.జె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో భట్టి మాట్లాడుతూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ రాష్ట్రంలో చేపట్టనున్న పాదయాత్రకు రైతులను సమీకరించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మే రెండో వారంలో పర్యటన ఉంటుం దని, తేదీ, ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. -
కాంగ్రెస్ నేతల సమీక్ష రసాభాస
హైదరాబాద్:గాంధీభవన్ లో ఆదివారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతో టీపీసీసీ చీఫ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియాలు సమావేశమైయ్యారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్, మహేష్ కుమార్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాను పోటీ చేసిన నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లో జోక్యం చేసుకుంటారని డీఎస్ ను మహేశ్ ప్రశ్నించాడు. దీంతో ఇరువురు నేతలకు కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సర్ది చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. -
ఆరు నెలల్లోనే తిరుగుబాటు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఆరు నెలల్లోనే తిరుగుబాటు చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల అన్నారు.. వీరు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమీక్షలో పాల్గొని మాట్లాడారు.. వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఆరు నెలల్లోనే తిరుగుబాటు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జిల్లా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై హన్మకొండలోని కాంగ్రెస్ భవన్లో శనివారం చేపట్టిన సమీక్షా సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 75లక్షల మందికి పింఛన్లు, 50లక్షల మందికి ఇళ్లు, రైతాంగానికి రుణాలు అందించిన చరిత్ర ఉందన్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సక్రమంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. రాజకీయాలకతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని గుర్తు చేశారు. దీంతోనే ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యత్వానికి ప్రజలు, వివిధ వర్గాల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. రాష్ట్రంలో 25లక్షల సభ్యత్వమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సభ్యత్వ నమోదులో జిల్లా అగ్రగామిగా ఉందన్నారు. సోనియాగాంధీ జన్మదినాన్ని తెలంగాణ డిక్లరేషన్ డేగా ప్రకటించిన విషయాన్ని వివరించారు. నియోజకవర్గాల వారీగా పార్టీని పటిష్టం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని అన్నారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.ఎస్.కుంతియా మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యత్వాన్ని నెలాఖరు వరకు పూర్తి చేయాలని అన్నారు. సభ్యత్వంపై సమీక్ష జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో చేపట్టిన సభ్యత్వంపై పొన్నాల, కుంతి యా సమీక్షించారు. ఈ నెలాఖరు వరకు పూర్తి సభ్యత్వాన్ని చేపట్టి జిల్లాను మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని సూచించా రు. జిల్లా, నియోజకవర్గ ముఖ్య నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే ఒక్కో నియోజకవర్గం వారీగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి కుసుమకుమార్, డీసీసీ అధ్యక్షుడు నాయి ని రాజేందర్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు బలరాంనాయక్, బస్వరాజు సార య్య, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, పొదెం వీరయ్య, డాక్టర్ విజయరామారావు, ఎర్రబెల్లి స్వర్ణ, కొండేటి శ్రీధర్, దుగ్యాల శ్రీనివాసరావు, జంగా రాఘవరెడ్డి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వెంకటస్వామిగౌడ్, భరత్‌చందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ హరిరమాదేవి, సిరిసిల్ల రాజయ్య, ఈవీ శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బట్టి శ్రీనివాస్, శ్రీకర్, ఘంట నరేందర్‌రెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, పోశాల పద్మ, బిన్ని లక్ష్మణ్, సాంబారి సమ్మారావు, బస్వరాజు కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8,550 పుస్తకాలకు సభ్యత్వం చేపట్టిన 4,400 పుస్తకాలు టీపీసీసీ అధ్యక్షుడికి అందజేశారు. దొంతి గైర్హాజరు జిల్లా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పార్టీ ఒక్కగానొక్క ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచి పొన్నాల, దొంతి మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే. దొంతి తిరిగి కాంగ్రెస్‌కు రావడం పొన్నాలకు ఇష్టం లేదనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే దొంతి సైతం సమీక్ష సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, నర్సంపేట నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమీక్షలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ పొన్నాలను ప్రశ్నించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు కాకుండా ఓడిపోయిన అభ్యర్థికే ప్రాధాన్యతనిస్తున్నారనే అంశాన్ని లేవనెత్తినట్లు సమాచారం. దీంతో సమావేశం కొంత వేడెక్కినట్లు తెలిసింది. తన ఓటమికి కూడా ఇదే కారణమని అన్నట్లు తెలిసింది. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, కుంతియా, కుసుమకుమార్‌ను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.