
సాక్షి, హైదరాబాద్ : రాహుల్ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షునిగా కొనసాగాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మంచి ఫైటర్ అనే విషయం మొన్నటి ఎన్నికల్లో తెలిసిందన్నారు. టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగుతారని కుంతియా స్పష్టం చేశారు. ఉత్తమ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తోన్న డిమాండ్‌ను ఆయన తోసి పుచ్చారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని, అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కుంతియా పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
పార్టీ నాయకత్వం బలహీనంగా ఉందన్న విషయం.. టికెట్ల కోసం వచ్చినప్పుడు తెలియదా అని కుంతియా ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 34 శాతానికి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 29 నాగార్జున సాగర్‌లో రాష్ట్రకార్యవర్గ సమావేశం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహ రచన కోసం పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీ వేశామన్నారు. పార్టీ ఓటమిపై క్షేత్ర స్థాయి నివేదిక తెప్పించుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment