శుక్రవారం ఢిల్లీలో జరిగిన సీఈసీ భేటీకి వెళ్తున్న రేవంత్, భట్టి, మధు యాష్కి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగే 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. దీంతో 119 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో సగానికి పైగా స్థానాలకు టికెట్లు ఫైనల్ చేసినట్టయ్యింది. పార్టీలో పనిచేసిన అనుభవం, కుల సమీకరణలు, సర్వేలు, ఆర్థిక బలాలను దృష్టిలో పెట్టుకొని స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా తొలి విడతగా 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఎంపిక చేసింది. ఈ మేరకు తొలి జాబితాను 15న విడుదల చేసే అవకాశం ఉంది.
సర్వేల ఆధారంగానే..
చైర్మన్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ జరిగింది. సోనియాగాందీ, రాహుల్‌గాందీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్‌లను సైతం సమావేశానికి ఆహ్వనించారు.
రెండున్నర గంటల పాటు జరిగిన భేటీలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సహా ఏఐసీసీ స్థాయిలో చేసిన సర్వేల నివేదికలు ముందుపెట్టుకొని నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పరిశీలించారు. మొదట ఒకే ఒక్క పేరున్న 70 నియోజకవర్గాలు, ఆయా స్థానాలకు సంబంధించిన నేతల పేర్లు పరిశీలించారు. ఏయే ప్రాతిపదికల ఆధారంగా ఇక్కడ ఒకే నేత ఎంపిక జరిగిందో మురళీధరన్ కమిటీకి వివరించారు.
ఈ స్థానాలపై ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆ 70 నియోజకవర్గాల్లో ప్రతిపాదిత అభ్యర్థులకు సీఈసీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక రెండో విడత జాబితాను ఫైనల్ చేసేందుకు వచ్చేవారం మరోమారు సీఈసీ భేటీ కానుంది. దసరాకు ముందే 18న రెండో విడత జాబితా విడుదల చేయాలని సీఈసీలో నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. భేటీ అనంతరం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మాట్లాడుతూ.. ‘నేటి భేటీలో 70 సీట్లపై చర్చించాం. మరోమారు సీఈసీ భేటీ ఉంటుంది’ అని తెలిపారు.
తొలి జాబితాలో ముఖ్య నేతలు
తొలి జాబితాలో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్, గడ్డం ప్రసాద్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఫిరోజ్‌ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, పద్మావతి రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, కొండా సురేఖ, రామ్మోహన్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, అనిరుద్‌రెడ్డి, వీర్లపలి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, రోహిత్‌రావు, గడ్డం వినోద్, ఎర్ర శేఖర్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, కాట శ్రీనివాస్‌గౌడ్, వంశీకృష్ణ తదితరుల పేర్లు ఉన్నట్టు చెబుతున్నారు.
కమ్యూనిస్టులతో పొత్తు, స్థానాలపై చర్చ
సీఈసీ భేటీకి ముందు స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. చైర్మన్ మురళీధరన్‌తో పాటు మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్ తదితరులు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో సింగిల్ పేర్లతో, రెండు, మూడేసి పేర్లతో ఉన్న అభ్యర్థుల జాబితాలు రూపొందించారు. వాటిని సీఈసీ ముందుంచాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో కమ్యూనిస్టులతో పొత్తు, వారికి ఇవ్వాల్సి సీట్ల కేటాయింపుపైనా చర్చించారు. మిర్యాలగూడ, మునుగోడు, ఖమ్మం, కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ భేటీ తర్వాత జరిగిన సీఈసీ సమావేశంలోనూ పొత్తు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో పొత్తు తేల్చాలని కేసీ వేణుగోపాల్, రేవంత్‌కు హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. ఇక టికెట్ దక్కని నేతలతో వారికున్న ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలు మాట్లాడాలన్న రాష్ట్ర నేతల సూచనకు అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment