సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ అసంతృప్త నేతలైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో వారిద్దరూ తమ ముఖ్య అనుచరులతో కలసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాందీని కలవనున్నారు. ఇందుకోసం ఆదివారం రాత్రి 9 గంటలకు వారు ఢిల్లీ చేరుకున్నారు.
ఈ కార్యక్రమం కోసం నలుగురు ఏఐసీసీ ఇన్‌చార్జీలతోపాటు 22 మంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం అందింది. దీంతో చాలా మంది నాయకులు ఆదివారం రాత్రే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరికొందరు సోమవారం ఉదయం చేరుకో నున్నారు. పొంగులేటి, జూపల్లి బృందంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, వి. హనుమంతరావు, రేణుకాచౌదరి, జీవన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, బలరాం నాయక్, శ్రీధర్‌బాబు, మధుయాష్కీ గౌడ్, దామోదర రాజనర్సింహ, పోదెం వీరయ్య,జగ్గారెడ్డి, మల్లు రవి, మహేశ్‌కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, రోహిత్ చౌదరి, పీసీ విష్ణునాథ్, మన్సూర్ అలీఖాన్, వంశీచందర్‌రెడ్డిలను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానం అందింది.
వారిలో 20 మందికిపైగా నేతలు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. పొంగులేటి, జూపల్లి వెంట పాయం వెంకటేశ్వర్లు, మువ్వా విజయ్‌బాబు, బానోతు విజయాబాయి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, మేఘారెడ్డి తదితరులు వెళ్లనున్నట్లు తెలిసింది. వీరంతా ఖర్గే, రాహుల్ గాంధీని కలసి తెలంగాణ రాజకీయాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ మార్గనిర్దేశం చేయనుంది. ఈ సమావేశంలోనే ఖమ్మంలో పొంగులేటి బృందం పార్టీలో చేరిక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించాల్సిన బహిరంగ సభ తేదీలు కూడా ఖరారు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఆట మొదలవుతోంది: పొంగులేటి
ఆదివారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నామని వ్యాఖ్యానించారు. ఆట మొదలవుతోందని.. ఆటను పర్‌ఫెక్ట్‌గా ఆడబోతున్నామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదని ప్రజలు భావిస్తున్నారని... ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని పొంగులేటి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సహా 4–5 జిల్లాల నుంచి నేతలం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలకు వచ్చామని చెప్పారు. ఇతర పార్టీల నేతలు, ఇతర ప్రాంతాల నేతలు సైతం పెద్ద ఎత్తున చేరబోతున్నారన్నారు. ఖర్గే, రాహుల్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తానని పొంగులేటి తెలిపారు.
ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత కోసమే: మల్లు రవి
రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించేందుకే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మాజీ ఎంపీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని, అదేవిధంగా రాష్ట్రంలోనూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, అందులో భాగంగానే ఈ చేరికలని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పౌర హక్కుల సంఘాలు, కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు చేయీచేయీ కలిపి బీఆర్‌ఎస్ నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం కావాలని మల్లు రవి పిలుపునిచ్చారు.
ఢిల్లీ చేరుకున్న పొంగులేటి, జూపల్లి
Published Mon, Jun 26 2023 5:05 AM | Last Updated on Mon, Jun 26 2023 11:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment