ఖమ్మంలో పాదయాత్రలో అభివాదం చేస్తున్న భట్టి విక్రమార్క
రాష్ట్రంలో తిరిగి పట్టు పెంచుకుని అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్ధమైంది. సీనియర్లు అంతా ఏకతాటికిపై వస్తుండటం.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతుండటం.. సీనియర్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ముగుస్తుండటం నేపథ్యంలో దీనికి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఐదు లక్షల మందికిపైగా జనాన్ని సమీకరించేందుకు అంతా సిద్ధం చేసింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సభలో పాల్గొని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు.
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి విజయవాడ మీదుగా నేడు ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జనగర్జన సభకు హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 5:30 గంటలకు సభా ప్రాంగణానికి రాహుల్ విచ్చేస్తారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. సభ ముగిశాక రోడ్డు మార్గంలో గన్నవరం వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తారని వివరించాయి.
కీలక ప్రకటనకు అవకాశం...
ఈ సభతోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. రానున్న ఎన్నికల్లో అనుసరించే రాజకీ య వ్యూహం, ఇతర పార్టీలతో పొత్తులు, ప్రజలకు ఇవ్వాల్సిన హామీలపై ఈ వేదిక నుంచే రాహుల్ కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాహు ల్ గాంధీ తొలిసారి రాష్ట్రానికి వస్తుండటం, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు భారీ స్థాయిలో పార్టీలో చేరనుండటం, సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర ముగింపు జరుగుతుండటంతో ఈ సభకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ తగ్గి బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ జవసత్వాలు నింపుకుంటున్న వేళ జరుగుతున్న ఈ సభ వేదికగా రాహుల్ ఏం మాట్లాడుతారో, ఎలాంటి రాజకీయ ప్రకటన చేస్తారో, ప్రజలకు ఎలాంటి హామీలిస్తారో అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సభలో కర్ణాటక మంత్రి బోసురాజుతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంతా పాల్గొననుంది.
భారీ స్థాయిలో ఏర్పాట్లు...
జనగర్జన బహిరంగ సభకు అంతా సిద్ధమైంది. ఖమ్మం నగరమంతా కాంగ్రెస్ తోరణాలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని వైరా రోడ్డులో ఉన్న పొంగులేటి వ్యవసాయ క్షేత్రంలో సుమారు 100 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి, పార్టీ నేతలు వీహెచ్, సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎంపీ బలరాం నాయక్ సభా ఏర్పాట్లను శనివారం సైతం పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మంతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి భారీగా జనాన్ని సభకు తరలించేందుకు ఏర్పాట్లు జరిగాయి.
సభకు 5 లక్షల మందికిపైగా తరలించేలా వాహనాలను సిద్ధం చేశామని పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 55 అడుగుల ఎత్తులో 144 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో 200 మంది కూర్చొనేలా సభా వేదికను నిర్మించారు. 140 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తులో భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సభాస్థలిని 100 ఎకరాల్లో ఏర్పాటు చేయగా వేదిక ముందు 1.50 లక్షల మంది కూర్చొని వీక్షించేలా గ్యాలరీలు, కుర్చీలు సిద్ధం చేశారు. అలాగే మిగతా వారు సభను వీక్షించేలా 12 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతోపాటు మరో 4 లక్షల మంది నిల్చొని చూసేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment