ఖమ్మం మయూరి సెంటర్: ఖమ్మంలో రాహుల్ గాంధీ పాల్గొనే తెలంగాణ జనగర్జన సభ విజయవంతం కాకుండా ఉండేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తూ అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అయి తే, రాజ్యం ఎప్పుడూ ఒకరి సొత్తు కాదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. శనివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ కొద్ది నెలలు ఆగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఆదివారం సాయంత్రం ఖమ్మంలో జరిగే జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో తనతో పాటు పలువురు కాంగ్రెస్‌లో చేరనున్నారని చెప్పారు. అయితే ఈ సభకు ప్రజలు వచ్చేందుకు ఆర్టీసీ బస్‌లు ఇవ్వకపోగా, ప్రైవేట్ వాహనాలను అడ్డుకునేలా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తమ చేతుల్లో ఉందనే భావనతో ఇలా వ్యవహరిస్తున్నారని, బీఆర్‌ఎస్ నేతలు సభ పెట్టుకున్నప్పడు ఒక బస్‌కు నగదు చెల్లించి.. 4 బస్సులను ఉపయోగించుకున్నా రని ఆరోపించారు. కాగా, సభకు ఖమ్మం నుంచి ఎవరూ రాకుండా శనివారం ఉదయం 7 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపివేశారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతాం..
కార్యకర్తలను కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య యుతంగా పోరాడుతూ వారికి అండగా నిలుస్తామ ని పొంగులేటి తెలిపారు. బీఆర్‌ఎస్ నేతల చెప్పు చేతల్లో ఉన్న కొందరు అధికారులు.. ఇకనైనా తీరు మార్చకోవాలని సూచించారు. తనకు, కార్యకర్తల కు ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.
పోస్టర్లు అవాస్తవం: సీపీ
డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబును హత్య చేస్తామని ఖమ్మంలో పోస్టర్లు వెలిసినట్లు మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పోలీసు కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ విచారణలో దీనిపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదని, ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ మువ్వా విజయ్‌బాబుకు ప్రాణహాని ఉందని ఆయన కానీ, ఆయన తరఫున మరెవరుకానీ ఫిర్యాదు చేయలేదని, ముప్పు జాబితాలో ఆయన లేరని స్పష్టం చేశారు. తప్పుడు కథనాలు సృష్టించి ప్రజలు తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment