‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో రెవెన్యూ, గృహ నిర్మాణ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
వైఎస్సార్ స్ఫూర్తితో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది
ఈ–రేస్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో తప్పు చేసినవారు తప్పించుకోలేరు
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే నేతల క్యూ చాలా పెద్దగా ఉంది
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి లోపు రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని, తద్వారా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ స్వలాభం కోసం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేయడంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూముల రక్షణ, రెవెన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయం విషయంలో సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
ధరణి పోర్టల్‌ను సరళీకృతం చేస్తామని, ఇప్పుడున్న 33 మాడ్యూల్స్ స్థానంలో 11–13 మాడ్యూల్స్ మాత్రమే ఉంచుతామని చెప్పారు. పహాణీల్లో ఇప్పటివరకు ఒక్కటే కాలమ్ ఉందని, ఇక నుంచి 12 లేదా 13 కాలమ్స్ పెడతామని, భూముల పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ నమోదు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
5 లక్షలకు పైగా ధరణి దరఖాస్తులకు పరిష్కారం
అధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన ప్రారంభించాం. ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షలు, ఈ ఏడాదిలో వచ్చిన 2.60 లక్షల దరఖాస్తులు కలిపి 5 లక్షలకు పైగా దరఖాస్తులను పరిష్కరించాం. ఇంకా 60–70 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ధరణి పునర్నిర్మాణ కమిటీని నియమించాం. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చట్టం ముసాయిదాను ప్రజల్లో చర్చకు పెట్టాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దేశానికి రోల్ మోడల్‌గా ఉండేలా బిల్లు ప్రవేశపెడతాం.
అటవీ, రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్ భూముల సరిహద్దు వివాదాలు వచ్చాయి. వీటిని సర్వే చేసి డీ మార్కింగ్ చేస్తాం. ఏ శాఖ భూములు ఆ శాఖకు ఇచ్చేస్తాం. పార్ట్–బీలో ఉన్న భూముల సంబంధిత సమస్యలను పరిష్కరిస్తాం. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. బీఆర్‌ఎస్ హయాంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు తీసేసుకుంటాం. జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న సరైన దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తాం.
వైఎస్ స్ఫూర్తితో ఇందిరమ్మ ఇళ్ల పథకం
హైడ్రా కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందన్న వార్తల్లో వాస్తవం లేదు. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో 6–7 శాతం మేర రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. మూసీ ప్రక్షాళన విషయానికొస్తే.. ప్రజలు నివసించే ప్రాంతాల జోలికి ఇప్పుడే వెళ్లబోం. ఇళ్లు తక్కువ ఉండి ప్రజలు లేనిచోట్ల ముందు అభివృద్ధి చేస్తాం. ఆ అభివృద్ధిని ప్రజలకు చూపించి వారిని ఒప్పించి మిగిలిన చోట్ల ముందుకెళతాం.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో 18.56 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించారు. ఆ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను కేటాయిస్తున్నాం. కనీసం 400 చ.అ.లకు తగ్గకుండా వంట గది, టాయిలెట్‌తో కూడి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇది వచ్చే నాలుగేళ్లు కొనసాగుతుంది.
కేంద్ర యాప్ తయారీలో ఆలస్యం వల్లే జాప్యం
ఇందిరమ్మ లబ్ధిదారుల వివరాల నమోదులో కేంద్రం రూపొందించిన యాప్‌ను వాడుతున్నాం. ఆ యాప్ సిద్ధమైతే తప్ప లబ్ధిదారుల వివరాల నమోదు సాధ్యం కాదు. ఆ యాప్ తయారీలో కేంద్ర జాప్యం వల్ల ఈ పథకం గ్రౌండ్ అవటంలో ఆలస్యం జరిగింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి 1.52 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి 96 వేలే పూర్తి చేసింది. మిగతా వాటిని కూడా పూర్తి చేసి నిరుపేదలకిస్తాం. రూ.187 కోట్లతో డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం.
బాంబు పేలడమంటే జైల్లో పెట్టడం కాదు
అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్‌ఎస్ అరాచకంగా, అక్రమంగా వ్యవహరించింది. ఇందుకు సంబంధించి 10–12 అంశాలపై సమాచారం తీసుకుంటున్నాం. బాంబులు పేలడమంటే ఎవరినో జైల్లో పెట్టడం కాదు. ఇందిరమ్మ రాజ్యంలో కక్ష సాధింపు చర్యలుండవు. ఉద్దేశ పూర్వకంగా ఏ వ్యక్తిని, కుటుంబాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఈ–రేస్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, విదేశాలకు నిధుల సరఫరా, ఫోన్ ట్యాపింగ్ లాంటి విషయాల్లో తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. తప్పని తేలితే శిక్ష తప్పదు.
నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే. బట్ట కాల్చి మీద వేయడమే బీఆర్‌ఎస్ పని. నా ఇంట్లో ఈడీకి దొరికిన డబ్బులు లెక్కపెట్టేందుకు వేలసంఖ్యలో కౌంటింగ్ మెషీన్లు తీసుకెళ్లారని చెప్పారు. ఈడీ అనే వ్యవస్థతో సంబంధముండే పార్టీతోనే కదా వారు అంటకాగింది. ఆ పార్టీని అడిగి నా ఇంట్లో ఎన్ని డబ్బులు దొరికాయో తెలుసుకోవచ్చు కదా.
ఈ–రేస్ వ్యవహారం తెరపైకి రాగానే ఢిల్లీకి వెళ్లి ఎవరు ఎవరి కాళ్లు పట్టుకున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వంలోకి వచ్చాక నేను ఒక్క గజం భూమి కొనుగోలు చేశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. మా పార్టీలోకి చేరికలు ఆగలేదు. కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్‌ఎస్ నేతల క్యూ చాలా పెద్దగా ఉంది. బీఆర్‌ఎస్ పార్టీలో ఎవరూ ఉండరు. ఆ పార్టీలో జబ్బలు చరుచుకుంటున్న వాళ్లు, 1, 2 స్థానాల కోసం పోటీలు పడుతున్న వాళ్లు కూడా ఉండరు.
స్వేచ్ఛగా పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నా..
ఏడాది పాటు కీలక శాఖలకు మంత్రిగా పనిచేయడం సంతృప్తినిచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి పెట్టిన పార్టీలో చేరి ఎంపీనయ్యా. ఐదేళ్లు ప్రజలకు సేవ చేశా. తర్వాతి ఐదేళ్లూ మాజీ సీఎం పుణ్యాన ప్రజలతో కలిసి అరణ్యవాసం చేశా.
ఆ తర్వాత అదే ప్రజల దీవెనలు, ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యంలో సముచిత స్థానంలో ఉన్నా. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకుంటూ ఆనందంగా ఉన్నా. భవిష్యత్తులో ప్రజలకు మరింత మంచి చేసేందుకు నా వంతు ప్రయత్నిస్తా.
Comments
Please login to add a commentAdd a comment