ప్రధాన ప్రతిపక్షానికి మంత్రి పొంగులేటి సవాల్
ఎంతమంది వెళతారో వెళ్లి కొలుచుకోండి
డేట్ ఎప్పుడో చెప్పండి.. ఎన్ని ప్రొక్లెయినర్లు కావాలంటే అన్ని పెట్టుకుని అధికారులు రెడీగా ఉంటారు
హిమాయత్‌సాగర్ బఫర్ జోన్‌లో ఉన్నా, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నా కూల్చుకోండి
హైడ్రా అధికారినీ ఆదేశిస్తున్నానన్న మంత్రి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు నా ఇల్లు హిమాయత్‌సాగర్ బఫర్ జోన్‌లో లేదు. నా మీద బురద జల్లాలని, నన్ను బూచిగా చూపి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నా ఇంటి వద్దకు ఎంత మందైనా, ఎప్పుడైనా వెళ్లవచ్చు.. కొలుచుకోవచ్చు. బఫర్ జోన్‌లో ఉన్నా, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నా కూల్చుకోవచ్చు. దిస్ ఈజ్ మై చాలెంజ్. పొంగులేటి చాలెంజ్. ప్రధాన ప్రతిపక్షానికి సవాల్ చేస్తున్నా.. కొలిచిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకుంటారో మీరే నిర్ణయించుకోండి..’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గాం«దీభవన్‌లో ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
బురద జల్లే ప్రయత్నమే..
‘అవాకులు, చెవాకులు, అసందర్భ వాదనలతో పాటు మాజీ మంత్రులకు సంబంధించిన వ్యవస్థలు నామీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. నేను ఒకటే చాలెంజ్ విసురుతున్నా. మున్సిపల్, ఇరిగేషన్ శాఖలకు చెందిన మాజీ మంత్రులు, వారికి డబ్బాలు కొట్టే సంస్థలు, వ్యవస్థలు, కొత్త టేపు కొనుక్కుని వెళ్లండి. నేను కూడా రాను. మా అధికారులొస్తారు. డేట్ ఎప్పుడో చెప్పండి. ఎన్ని ప్రొక్లెయినర్లు కావాలంటే అన్ని పెట్టుకుని అధికారులు రెడీగా ఉంటారు నా ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నా, బఫర్‌జోన్‌లో ఉన్నా, ఒక్క ఇటుక పెళ్ల ఉన్నా వెంటనే పడగొట్టండి. నా ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్‌ను కూడా ఆదేశిస్తున్నా..’ అని మంత్రి అన్నారు.
మళ్లీ చెబుతున్నా..మీకా చాన్స్ ఇవ్వను
‘బీఆర్‌ఎస్ నేతల్లాగా నేను ఒకటికి వంద అబద్ధాలు చెప్పను. వాస్తవానికి నేనుండే ఇల్లు నా పేరు మీద లేదు. నా కొడుకు పేరు మీద ఉంది. అయినా ఆ ఇల్లు నాది కాదని చెప్పను. లీజుకు తీసుకున్నానని మీలాగా సొల్లు కబుర్లు చెప్పను. నేను అందరు అన్నట్టు దాంట్లో దూకు.. దీంట్లో దూకు అనను. ఇది పొంగులేటి చాలెంజ్. గతంలో ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్పా. మళ్లీ ఈరోజు చెపుతున్నా. ఈ రోజు కాదు.. ఏ రోజైనా, నీతో, నీ బావతో, ఆయన మామతో చెప్పించుకునే చాన్స్ ఈ పొంగులేటి ఎప్పుడూ ఇవ్వడు. ఇవ్వబోడు. ప్రతిపక్షానికి దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలి.’ అని పొంగులేటి అన్నారు.
రూ.31 వేల కోట్ల రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నాం
‘గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌కు సీట్లు రాలేదనే అక్కసుతో రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నాం. ఇంకా రూ.12,300 కోట్ల మాఫీ చేయాల్సి ఉంది. బీఆర్‌ఎస్ నేతల్లా మేము శనగలు తిని చేతులు దులుపుకునే రకం కాదు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు కటాఫ్ తేదీ పెట్టి ఆ తేదీలోపు ఎక్కువగా ఉన్న డబ్బులు కడితే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం..’ అని మంత్రి తెలిపారు.
2020 ఆర్‌వోఆర్ చట్టాన్ని మార్చి రైతులకు ఇబ్బంది లేకుండా వీలున్నంత త్వరలో కొత్త చట్టాన్ని తెస్తామన్నారు. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి వచి్చన సూచనలను స్వీకరిస్తామని తెలిపారు. అప్పుడెప్పుడో వచ్చి చీలి్చచెండాడతానని చెప్పిన కేసీఆర్ మళ్లీ 6–9 నెలలు కనపడడంటూ ఎద్దేవా చేశారు. మహిళా జర్నలిస్టులపై తమకు గౌరవం ఉందని, వారిపై దాడి జరిగి ఉంటే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పొంగులేటి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment