Himayatsagar
-
కొత్త టేపుతో నా ఇంటికి రండి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు నా ఇల్లు హిమాయత్‌సాగర్ బఫర్ జోన్లో లేదు. నా మీద బురద జల్లాలని, నన్ను బూచిగా చూపి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నా ఇంటి వద్దకు ఎంత మందైనా, ఎప్పుడైనా వెళ్లవచ్చు.. కొలుచుకోవచ్చు. బఫర్ జోన్లో ఉన్నా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా కూల్చుకోవచ్చు. దిస్ ఈజ్ మై చాలెంజ్. పొంగులేటి చాలెంజ్. ప్రధాన ప్రతిపక్షానికి సవాల్ చేస్తున్నా.. కొలిచిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకుంటారో మీరే నిర్ణయించుకోండి..’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గాం«దీభవన్‌లో ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. బురద జల్లే ప్రయత్నమే.. ‘అవాకులు, చెవాకులు, అసందర్భ వాదనలతో పాటు మాజీ మంత్రులకు సంబంధించిన వ్యవస్థలు నామీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. నేను ఒకటే చాలెంజ్ విసురుతున్నా. మున్సిపల్, ఇరిగేషన్ శాఖలకు చెందిన మాజీ మంత్రులు, వారికి డబ్బాలు కొట్టే సంస్థలు, వ్యవస్థలు, కొత్త టేపు కొనుక్కుని వెళ్లండి. నేను కూడా రాను. మా అధికారులొస్తారు. డేట్ ఎప్పుడో చెప్పండి. ఎన్ని ప్రొక్లెయినర్లు కావాలంటే అన్ని పెట్టుకుని అధికారులు రెడీగా ఉంటారు నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నా, బఫర్‌జోన్‌లో ఉన్నా, ఒక్క ఇటుక పెళ్ల ఉన్నా వెంటనే పడగొట్టండి. నా ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్‌ను కూడా ఆదేశిస్తున్నా..’ అని మంత్రి అన్నారు. మళ్లీ చెబుతున్నా..మీకా చాన్స్ ఇవ్వను ‘బీఆర్ఎస్ నేతల్లాగా నేను ఒకటికి వంద అబద్ధాలు చెప్పను. వాస్తవానికి నేనుండే ఇల్లు నా పేరు మీద లేదు. నా కొడుకు పేరు మీద ఉంది. అయినా ఆ ఇల్లు నాది కాదని చెప్పను. లీజుకు తీసుకున్నానని మీలాగా సొల్లు కబుర్లు చెప్పను. నేను అందరు అన్నట్టు దాంట్లో దూకు.. దీంట్లో దూకు అనను. ఇది పొంగులేటి చాలెంజ్. గతంలో ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్పా. మళ్లీ ఈరోజు చెపుతున్నా. ఈ రోజు కాదు.. ఏ రోజైనా, నీతో, నీ బావతో, ఆయన మామతో చెప్పించుకునే చాన్స్ ఈ పొంగులేటి ఎప్పుడూ ఇవ్వడు. ఇవ్వబోడు. ప్రతిపక్షానికి దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలి.’ అని పొంగులేటి అన్నారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నాం ‘గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు సీట్లు రాలేదనే అక్కసుతో రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నాం. ఇంకా రూ.12,300 కోట్ల మాఫీ చేయాల్సి ఉంది. బీఆర్ఎస్ నేతల్లా మేము శనగలు తిని చేతులు దులుపుకునే రకం కాదు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు కటాఫ్ తేదీ పెట్టి ఆ తేదీలోపు ఎక్కువగా ఉన్న డబ్బులు కడితే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం..’ అని మంత్రి తెలిపారు.2020 ఆర్వోఆర్ చట్టాన్ని మార్చి రైతులకు ఇబ్బంది లేకుండా వీలున్నంత త్వరలో కొత్త చట్టాన్ని తెస్తామన్నారు. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి వచి్చన సూచనలను స్వీకరిస్తామని తెలిపారు. అప్పుడెప్పుడో వచ్చి చీలి్చచెండాడతానని చెప్పిన కేసీఆర్ మళ్లీ 6–9 నెలలు కనపడడంటూ ఎద్దేవా చేశారు. మహిళా జర్నలిస్టులపై తమకు గౌరవం ఉందని, వారిపై దాడి జరిగి ఉంటే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పొంగులేటి చెప్పారు. -
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్‌లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్‌పోర్టు, జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని, ట్రిపుల్ వన్‌లోని ప్రాంతాలను కూడా మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్ప్లాన్పైన హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్‌ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగం కానుంది. పరిరక్షణపై నీలినీడలు... ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారీగా అక్రమ నిర్మాణాలు... ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు... ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్‌పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్‌ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే. ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్ల విభజనపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
నివేదిక వచ్చేవరకు జీవో 111కు కట్టుబడి ఉంటాం
సాక్షి, హైదరాబాద్: జీవో 69 ప్రకారం ప్రత్యేకంగా ఏర్పాటైన నిపుణుల బృందం తన నివేదికను సమ ర్పించే వరకు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల పరిరక్షణకు జారీ చేసిన జీవో 111కు కట్టుబడి ఉంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) చెప్పిన వివరాలను న్యాయస్థానం రికార్డు చేసింది. జీవో 111ను ఉల్లంఘించి తదుపరి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఆదేశించింది. జీవో 111ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ పర్యావరణవేత్త ప్రొ. జీవానందరెడ్డి 2007లో, ఆ తర్వాత మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఏఏజీ రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ...ఉస్మాన్‌సాగర్, హి మాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతంలో కాలుష్యా న్ని ఉత్పత్తి చేసే పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాసాలను నిషేధిస్తూ 1996లో జీవో 111ను ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. 84 గ్రామాల పరిధిలో పరీవాహక ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల వరకు దాదాపు 1,32,000 ఎకరాల పరిధిలో ఆంక్షలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అప్పట్లో హైదరాబాద్ నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా ఈ రెండు రిజర్వాయర్ల పరీవాహక ప్రాంతాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ఇది జరిగిందన్నారు. ఇప్పుడు వీటి నుంచి 1.25 శాతం నగర జనాభాకు మాత్రమే నీరు అందుతోందని, భవిష్యత్తులో వీటిపై ఆధారపడాల్సిన అవసరం కూడా లేదని వెల్లడించారు. దీనికి సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీ సిఫార్సుల కోసం ప్రభుత్వం వేచి చూస్తోందన్న ఏఏజీ వివరాలను రికార్డు చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సీనియర్ న్యాయవాది కేఎస్.మూర్తి కూడా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ధర్మాసనం రెండు రిజర్వాయర్ల చుట్టూ 10 కి.మీ. పరిధిలో నిర్మాణాలపై నిషేధానికి కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
‘111’ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలంటే?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. అలాగే నగర అభివృద్ధి ఫలాలు 111 జీవో పరిధిలోని గ్రామస్తులూ కోరుకోవటం న్యాయమైన హక్కే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేక మాస్టర్‌ను రూపొందిస్తామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలి? ఏ తరహా నిర్మాణాలు ఉండాలనే అంశంపై తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవీ రావు ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ∙ 217 చదరపు కిలో మీటర్ల హైదరాబాద్ విస్తీర్ణానికి రెండున్నర రెట్లు అధికంగా 538 చ.కి.మీ మేర 111 జీవో పరిధి విస్తరించి ఉంది. సుమారు 1.32 లక్షల ఎకరాల భూమి అదనంగా అందుబాటులోకి రానుంది. భవిష్యత్తు తరాల కోసం జంట జలాశయాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా 111 జీవో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలి. ఆ తర్వాతే పర్యావరణానికి హానీ కలిగించని నిర్మాణాలకు చోటు కల్పించాలి. తక్కువ సాంద్రత కలిగిన నివాస, సంస్థాగత, వినోదాత్మక కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉండాలి. వర్షపు నీరు, జలచరాల అధ్యయన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. 111 జీవో మాస్టర్ ప్లాన్‌లో ఆయా అధ్యయన ఫలితాలకు కూడా అవకాశం కల్పిం చాలి. 111 జీవో మాస్టర్ ప్లాన్‌లో నెట్ జీరో సీవరేజ్ పాలసీని అవలంభించాలి. అంటే ప్రతి ఇంటికి తప్పనిసరిగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఉండాల్సిందే. తద్వారా మురుగు నీరు బయటికి వెళ్లదు. జంట జలాశయాలు కలుషితం కావు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్ జోన్లను అధ్యయనం చేయాలి. అక్కడ స్టీల్, సిమెంట్ వంటి భవన సామగ్రి స్థానంలో ప్రత్యామ్నాయం వినియోగిస్తారు. కలప ఇళ్లు ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉంటాయి. ఈ తరహా జోన్లను సందర్శించి ఆ ప్రకారం చేయాలి. కాంప్లిమెంటరీ డెవలప్మెంట్.. హైదరాబాద్ అభివృద్ధికి 111 జీవో కాంప్లిమెంటరీగా ఉండాలి. ఆకాశహర్మ్యాలకు, ఐటీ భవనాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడున్న ప్రాంతాలకు పోటీగా కాకుండా నగరానికి కొత్త ప్రాంతం కాంప్లిమెంటరీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోటీగా ఉంటే మాత్రం ఇప్పుడున్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ తగ్గే అవకాశాలున్నాయి. ఆయా గ్రామాలలో చాలా వరకు భూములు కొనుగోలు చేసి ఫామ్‌హౌస్‌లను నిర్మించడం వల్ల హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారంపై పరిమిత స్థాయిలో ప్రభావం ఉంటుంది. ఒకవేళ 111 జీవో పరిధిలో హైరైజ్ భవనాలకు అనుమతి ఇస్తే గనక.. హైదరాబాద్ ఉష్ణోగ్రతపై ప్రతికూల ప్రభావం చూపించడంతో పాటూ కాలుష్యం పెరుగుతుంది. జంట జలాశయాలు మరో హుస్సేన్‌సాగర్ లాగా మారే ప్రమాదం ఉంది. స్వయం సమృద్ధితో కూడిన సౌకర్యాలతో పారిశుధ్యం, రోడ్లను మెరుగుపరచాలి. లేకపోతే అవి మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లాగా తయారవుతాయి. నగరంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణాన్ని కల్పించవచ్చు. దేశంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు. హెచ్ఎండీఏ ఏరియాలో విలీనం కావటానికి ఇప్పటికే ఉన్న భవనాలను ఒకేసారి క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఐదు జోన్లతో అద్భుతం.. ► జంట జలాశయాల నుంచి కొన్ని కి.మీ మేర బఫర్ జోన్. ఇక్కడ రిసార్ట్‌లకు అనుమతి ఉండాలి. ► రెండోది స్పోర్ట్స్ జోన్. ఇక్కడ ఆట స్థలాలు, క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► స్టీల్, సిమెంట్ వంటి వాటితో కాకుండా ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రితో కూడిన నిర్మాణాలు మూడో జోన్. ఉదాహరణ: విద్యా సంస్థలు. ► ఫోర్త్ జోన్లో తక్కువ సాంద్రత కలిగిన గృహ నిర్మాణాలు, వినోద కేంద్రాలు. ఇవి కూడా ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రితో నిర్మితమైనవై ఉండాలి. ► ఐదో జోన్లో మాత్రమే ఐటీ, బహుళ అంతస్తులకు అనుమతి ఉండాలి. దీంతో అన్ని జోన్లలో కార్యకలాపాలు జరుగుతాయి. ఆయా గ్రామస్తులు పెరిగిన భూముల రేట్ల ప్రయోజనాన్ని పొందుతారు. -
‘సాగర్’ చుట్టూ గాలింపు
మొయినాబాద్ (చేవెళ్ల): బుద్వేల్ అండర్‌పాస్ వద్ద గురువారం కనిపించి ఆ తర్వాత అదృశ్యమైన చిరుత కోసం అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. నాలుగు రోజులు గా చిరుత కోసం అధికారులు గాలిస్తూనే ఉన్నారు. ఆదివారం మరోమారు హిమాయత్‌సాగర్ జలాశయం చుట్టూ గాలించారు. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్, నాగి రెడ్డిగూడ, శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడ, మర్లగూడ, కవ్వగూడ పరిసరాల్లో అటవీ శాఖ అధికారులు అన్వేషించారు. శనివారం ఉదయం హిమాయత్‌సాగర్ జలాశయంలో చేపల వేటకు వెళ్లిన అజీజ్‌నగర్‌కు చెందిన వ్యక్తి చిరుతను చూసినట్లు అధికారులకు చెప్పడంతో అక్క డ పరిశీలించారు. చెరువు అంచున పాదముద్రలను పరిశీలించారు. అలాగే, శంషాబాద్ మండలం మ ర్లగూడ సమీపంలో రైతులు చిరుత పా దముద్రలు ఉన్నాయని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు అక్కడా ప రిశీలించారు. అవి చిరుత పాదము ద్రలు కావని నిర్ధారించుకున్న అధికారులు, అవి ఏ జంతువుకు సంబంధించినవో తెలుసుకునే పనిలో పడ్డారు. జాగిలాలతో గాలింపు: అటవీ శాఖ అధికారులు చిరుతకోసం ఆదివారం జాగిలాల (డాగ్‌స్క్వాడ్)తో గాలింపు చేపట్టారు. కాగా, హిమాయత్‌సాగర్ జలాశయం పరిసరాల్లోకి చిరుత వచ్చిందనే ప్రచారంతో సమీప గ్రామాల్లో కలకలం మొదలైంది. చెరువు చుట్టుపక్కల గ్రామాలవాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుతను త్వరగా బంధించాలని కోరుతున్నారు. భయాందోళన వద్దు.. చిరుత హిమాయత్‌సాగర్ చెరువు వైపు వచ్చిందని వదంతులు వినిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చినట్లు ఆనవాళ్లు మాత్రం కనిపించడం లేదు. పరిసర గ్రామాల ప్రజలు ఎవరూ భయాందోళన చెందవద్దు. చిరుత ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలి. – ప్రతిమ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, చిలుకూరు మృగవని -
రాష్ట్రంలో పోలీసు యూనివర్సిటీ!
⇔ పోలీసు అకాడమీని వర్సిటీగా మార్చేందుకు పోలీసుశాఖ యోచన ⇔ సిబ్బందికి ప్రొఫెషనల్ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకే... ⇔ శిక్షణ సమయాన్నే కోర్సులుగా తెచ్చేలా త్వరలో సర్కారుకు ప్రతిపాదన ⇔ ప్రభుత్వ ఆమోదం లభించగానే యూజీసీ అనుమతికి దరఖాస్తు సాక్షి, హైదరాబాద్: వృత్తి నైపుణ్యం, దర్యాప్తులో ప్రొఫెషనలిజం, చురుకుదనం వంటి అంశాలను పోలీసు సిబ్బందికి నాణ్యమైన కోర్సులుగా అందించేందుకు పోలీసుశాఖ సొంతంగా యూనివర్సిటీ ఏర్పాటుకు యోచిస్తోంది. ఫ్రెండ్లీ, వరల్డ్‌క్లాస్ పోలీసింగ్‌ను అందిపుచ్చుకునేందుకు పోలీసు కోర్సులను అందుబాటులోకి తేవా లని భావిస్తోంది. ఇందుకోసం హైదరా బాద్‌లోని రాజబహదూర్ వెంక ట్రామిరెడ్డి పోలీసు అకాడమీని యూనివర్సిటీగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. శిక్షణ కార్యక్రమాలే కోర్సులుగా... హైదరాబాద్ శివారులోని హిమాయత్‌సాగర్ వద్ద 148 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పోలీసు అకాడమీలో ప్రస్తుతం కొత్తగా నియమితు లయ్యే ఎస్సై, కానిస్టేబుళ్లకు 9 నెలలపాటు శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఇన్–సర్వీస్ శిక్షణలో భాగంగా అధికారులు, సిబ్బందికి వారం నుంచి 3 నెలల వ్యవధి ఉండే కోర్సుల్లో తర్ఫీదు ఇస్తున్నారు. వాటితోపాటు దర్యాప్తు, ఇంటలిజెన్స్, మావోయిజం, మేనేజ్మెంట్, లీడర్షిప్, ప్లాటూన్ కమాండర్స్, రిఫ్రెష్మెంట్, ట్రాఫిక్ నియంత్రణ, ఎన్ఫోర్స్మెంట్, ఫీల్డ్ వర్క్‌షాప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, సెల్ఫ్ హీలింగ్ వంటి 35 రకాల కోర్సులను ఇన్–సర్వీస్ ట్రైనింగ్‌గా అందిస్తున్నారు. అయితే ఇప్పుడు యూనివర్సిటీ ఏర్పాటు చేసి నేరుగా ఒక్కో అంశానికి కాలవ్యవధి విధించి డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులు, స్పెషలైజేషన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చేలా ఉన్నతాధికారులు కార్యచరణ రూపొందిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. పోలీసు యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే ప్రతిపాదనలు పంపనున్నట్లు ఉన్నతాధి కారులు ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతి కోసం ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. యూజీసీ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చట్టం తేవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం పోలీసు అకాడమీకి కేటాయిస్తున్న నిధులను పెంచితే సిబ్బంది, అధికారులకు వృత్తిరీత్యా కీలకంగా మారే అంశాలపై కోర్సులు అందించేందుకు వీలు కలుగుతుం దని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. రాజ్స్తాన్లో తొలిసారిగా... దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజ్స్తాన్ ప్రభుత్వం జోధ్‌పూర్‌లో ‘సర్దార్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ పోలీస్, సెక్యూరిటీ అండ్ క్రిమినల్ జస్టిస్’ను ఏర్పాటు చేసింది. సోషల్ సైన్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుతోపాటు ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ, ఎంఏ/ఎంఎస్సీ అప్లైడ్ క్రిమినాలజీ, ఎల్ఎల్ఎం/ఎంఏ క్రిమినల్ లా వంటి వివిధ రకాల కోర్సులను అందిస్తోంది. వీటితోపాటు పోలీస్ వృత్తికి తోడ్పడే పద్నాలుగు రకాల డిప్లొమా, పీజీ డిప్లొమా తదితర కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. 9 నెలల పీజీ డిప్లొమా... నూతన ఎస్సైలు, కానిస్టేబుళ్లకు ఇచ్చే 9 నెలల శిక్షణను పీజీ డిప్లొమా కోర్సుగా చేసి పాసింగ్ అవుట్ పరేడ్ సమయం లోనే కాన్వొకేషన్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తు న్నారు. అలాగే రెండేళ్లకోసారి ప్రతి నాన్‌క్యాడర్ ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు ఏదో ఒక కోర్సు చేసేలా షెడ్యూల్ రూపొందిం చాలని యోచిస్తున్నారు. -
భద్రతే ముఖ్యం..
-
భద్రతే ముఖ్యం..
వేగం కన్నా భధ్రత మిన్న అంటూ యువత నినదించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదమని హెచ్చరించింది. హిమాయత్‌సాగర్ రోడ్‌లోని షాదన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వార్షికోత్సవ ఈవెంట్ ‘పల్సేషన్’లో భాగంగా గురువారం విద్యార్థులు, వైద్యులు బైక్‌ర్యాలీ, కరపత్రాల పంపిణీతో అవగాహన కల్పించారు. - సాక్షి, సిటీబ్యూరో -
షాన్‌దార్ సెల్ఫీ...
హిమాయత్‌సాగర్‌లోని షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో బుధవారం రెండో రోజూ‘ పల్సేషన్’ కొనసాగింది. వైద్య విద్యార్థినులు స్వచ్ఛభారత్‌లో భాగంగా హరితహారం నిర్వహించారు. వర్ధమాన తార మెహ్రీన్ కౌర్ హాజరై సందడి చేసింది. సెల్ఫీలు దిగుతూ ఉత్సాహం నింపింది. దేశ భవిష్యత్తును ఆరోగ్యంగా తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టనున్న వైద్య విద్యార్థులు.. ప్రకృతి పచ్చగా వర్ధిల్లేందుకు తమ వంతు ఊపిరిలూదారు. హిమాయత్‌సాగర్ రోడ్‌లోని షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు చెందిన విద్యార్థులు తమ కళాశాలతో పాటు ఆసుపత్రిలోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం సందడిగా నిర్వహించారు. ‘షాదాన్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక కార్యక్రమం పల్సేషన్లో భాగంగా నిర్వహించిన ఈ హరితహారంలో విద్యార్థులతో పాటు వైద్యులు సైతం పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీనటి మెహ్రీన్ కౌర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. - సాక్షి, సిటీబ్యూరో -
111జీఓపై కోర్టుకు
♦ ఆంక్షలు సడలించాలని అభ్యర్థన ♦ రాజకీయాస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్ ♦ టీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ఎత్తుగడ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జీవ సంరక్షణమండలి(జీఓ 111) రాజకీయాస్త్రంగా మరోసారి తెరమీదకు వస్తోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అంక్షలను సడలించాలని కోరుతూ న్యాయపోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అధికారంలోకి వస్తే 111 జీఓను ఎత్తివేస్తామని ప్రకటన చేసిన టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ఈ అంశంపై కోర్టుకెక్కేందుకు సిద్ధమవుతోంది. జంట జలాశయాల ఉనికికి ప్రమా దం ఏర్పడకుండా 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీఓను జారీ చేసింది. తద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని 86 గ్రామాల పరిధిలో పరిశ్రమలు, నిర్మాణాలపై అంక్షలు విధించింది. కేవలం ఎగువ ప్రాంతంలోనేగాకుండా జలాశయాలకు దిగువన 10 కి.మీ. పరిధిలోను ఈ అంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీంతో పరివాహాక ప్రాంతాలైన రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, చేవెళ్ల, షాబాద్ మండలాలు, మహబూబ్‌నగర్‌లోని కొత్తూరు మండలం ఈ జీఓ పరిధిలోకి వచ్చాయి. దీంతో ఈ గ్రామాల్లో అభివద్ధి దాదాపుగా కుంటుపడింది. నగరీకరణ నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో భూముల విలువలు ఆకాశన్నంటుతున్నా.. తమ ప్రాంతంలో మాత్రం అంక్షల కారణంగా భూములను కొనలేని/అమ్మలేని పరిస్థితి ఏర్పడినందున జీవోను సడలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకొని అధికారంలోకి వస్తే జీవో రద్దు చేస్తామని హామీలు గుప్పించాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దెనెక్కితే 111 జీఓను రద్దు చేస్తామని ప్రకటించారు. అందులోభాగంగా జీఓ ఎత్తివేతపై ప్రాథమిక స్థా యిలో అధికారులతో చర్చలు కూడా జరిపారు. జీఓపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం, ఏ నిర్ణయమైనా వాటికి లోబడి నిర్ణయం తీసుకోవాల్సివుంటుందని స్పష్టం చేయడంతో ఫైలును పక్కనపెట్టారు. ఇరుకున పెట్టేందుకు... తనను గెలిపిస్తే 111 జీఓను ఎత్తివేయిస్తానని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించారు. దాదాపు రెండున్నరేళ్లయినా ఈ హామీని నెరవేర్చకపోగా.. కనీసం ప్రస్తావించకపోవడాన్ని రాజకీయాస్త్రంగా మలుచుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కార్తీక్‌రెడ్డి.. 111 జీఓపై న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జీవ సంరక్షణ మండలి నిర్ధేశించడంలో శాస్త్రీయత పాటించలేదనే అంశాన్ని కోర్టు దష్టికి తేవాలని నిర్ణయించారు. -
కబ్జాలతో ‘జలాశయాల’ ఉనికికే ప్రమాదం
- సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ - చెట్ల నరికివేతతో మానవ మనుగడ ప్రశ్నార్థకం - పెద్దషాపూర్లో మొక్కలను నాటిన సీపీ పెద్దషాపూర్ (శంషాబాద్ రూరల్): నగరవాసుల దాహార్తిని తీర్చే జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కబ్జాలను అరికట్టకుంటే భవిష్యతులో ఈ చెరువులు ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదం ఉంద ని ైసైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెద్దషాపూర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఆవరణలో శంషాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జీవన చక్రానికి ఆధారమైన చెట్లను ప్రజలు ఇష్టానుసారంగా నరికివేస్తుండడంతో జీవనాధారం కోల్పోయి.. మానవుడి మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. చెట్లను నరికివేస్తూ మన బతుకులను మనమే నాశనం చేసుకుంటున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమాన్ని అందరూ ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు మొక్క నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మొక్కల పెంపకంపై వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణతో పాటు సైబరాబాద్ పోలీసులు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నట్లు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్‌తో పాటు మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలో మొక్కలను పెంచడానికి 10 రోజుల్లోనే 1.7 లక్షల గుంతలు తీసినట్లు పేర్కొన్నారు. వర్షాలను బట్టి వచ్చే మూడు నెలల్లో మొక్కలు నాటుతామని చెప్పారు. శంషాబాద్ ఠాణాకు కొత్త భవనం.. శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు గ్రామీణ ప్రాంతంలో అనువైన చోట రెండు ఎకరాలు స్థలం కేటాయిస్తే కొత్త భవనం నిర్మిస్తామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, స్థానిక సర్పంచ్ సత్యనారాయణ అభ్యర్థనకు స్పందించిన ఆయన పోలీస్‌స్టేషన్‌ను రూ.2 కోట్ల కేటాయించి సకల సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌తో పాటు వివిధప్రాంతాల్లో షీ టీంలతో మహిళలపై దాడుల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సైబరాబాద్‌లోని ప్రతి జోన్, డివిజన్ పరిధిల్లో ఓ మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహిళా సిబ్బంది కొరత ఉందని, కొత్తగా చేపట్టే నియామకాల్లో మహిళలకు ఎక్కువ శాతం అవకాశాలు ఇస్తామని తెలిపారు. అంతకుముందు కళాజాత బృందం మొక్కల పెంపకంపై పాటల రూపంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, సర్పంచ్ సత్యనారాయణ, డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్లు ఉమామహేశ్వర్రావు, సుధాకర్, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కె.చంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు టి.రమేష్, నాయకులు రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
జంట జలాశయాల పరిరక్షణకు శ్రీకారం
- సమీప గ్రామాల మురుగు నీరు చేరకుండా నాలుగు ఎస్టీపీల నిర్మాణం - సమగ్ర నివేదిక రూపొందిస్తున్న పీబీఎస్ కన్సల్టెన్సీ - నెలాఖరుకు రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్న నివేదిక సాక్షి, సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాల( హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్) పరిరక్షణకు జలమండలి శ్రీకారం చుట్టింది. సమీప గ్రామాలు, రిసార్టులు, కళాశాలల నుంచి వచ్చి చేరుతున్న మురుగు నీటితో భవిష్యత్‌లో ఈ జలాశయాలు హుస్సేన్‌సాగర్‌లా మారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించింది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న 45 ఇంజినీరింగ్ కళాశాలలు, సమీపంలోని 12 గ్రామాల నుంచి వెలువడుతున్న మురుగు నీరు జలాశయాల్లోకి చేరకుండా ఉండేందుకు నాలుగు మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీటి నిర్మాణంతోపాటు జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన ఇతర చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించే బాధ్యతలను నగరానికి చెందిన పీబీఎస్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. ఈనెలాఖరులోగా సదరు సంస్థ నివేదికను బోర్డుకు అందజేస్తుందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నివేదిక దృష్టిసారించనున్న అంశాలివే.. - జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా నాలుగు మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి అనువైన స్థలాల గుర్తింపు. మురుగు నీటి అంచనా. - సుమారు పదివేల కి.మీల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ జలాశయాల సరిహద్దులు, జి.ఓ.111 ప్రకారం ఎగువ ప్రాంతాల్లో మరో పది కి.మీ పరిధి వరకు జలాశయాల సరిహద్దులను పక్కాగా గుర్తించడం. ఇందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) సహాయం తీసుకోవడం. - జీఐఎస్, శాటిలైట్ చిత్రాలు, టోటల్ స్టేషన్ వంటి ఆధునిక సాంకేతికతో ఎన్జీఆర్ఐ సంస్థ సరిహద్దులను గుర్తించిన తరవాత డిజిటల్ మ్యాపులు సిద్ధంచేయడం. - జలాశయంలో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించడంతోపాటు జంతు, వృక్ష అవశేషాలు, గుర్రపుడెక్క తొలగింపు, జలాశయాల అడుగున పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు. - జలాశయాల్లో నీటి రంగు మారకుండా ఏరియేషన్(ఆక్సిజన్‌స్థాయి పెంపునకు) వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించడం. - జలాశయాల్లో చేపలవేట నిషేధం. ఈ విషయంలో స్థానికుల సహకారం తీసుకోవడం. - ఫుల్ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్)వరకు ఉన్న చెట్లను కూకటి వేళ్లతో సహా తొలగించడం. - జలాశయాల్లోకి వరదనీరు చేర్చే 9 ఇన్‌ఫ్లో మార్గాల గుర్తింపు, వాటి ప్రక్షాళన. - ఎగువ ప్రాంతాలు, ఇన్‌ఫ్లో చానల్స్‌లో మట్టి, ఇసుక తోడుతున్న మాఫియాపై క్రిమినల్ కేసుల నమోదు. - క్రిమిసంహారకాలు కలిసిన వ్యర్థజలాలు, వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చి కలుస్తున్న నీటిని జలాశయాల్లోకి ప్రవేశించనీయకుండా తీసుకోవాల్సిన చర్యలు. - ఫాంహౌజ్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, రిసార్టులు, గృహవ్యర్థాలు, పరివాహ ప్రాంతాల నుంచి వచ్చి కలుస్తున్న మురుగు నీటి కట్టడికి అవసరమైన చర్యలు. - చేపల పెంపకం, వేట, బట్టలుతకడం, స్నానాలు చేయడం వంటి చర్యలపై నిషేధం. - రిజర్వాయర్‌లోకి ప్రవేశించే అన్ని కెనాల్స్ పరిరక్షణ చర్యలు సూచించడం. - జలాశయాల పరిరక్షణ విషయంలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, జలమండలి, హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, అటవీ శాఖల ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక. -
జల శుద్ధి
సాక్షి, సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీరుస్తున్న హిమాయత్‌సాగర్ , ఉస్మాన్‌సాగర్ (గండిపేట్) జంట జలాశయాలకు మురుగు నుంచి విముక్తి కల్పించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. సమీప గ్రామాలు, ఎగువ ప్రాం తాల నుంచి మురుగునీరు చేరకుండా చిలుకూరు బాలాజీ దేవాలయం, ఫిరంగినాలా, అజీజ్‌నగర్, కొత్వాల్‌గూడా ప్రాంతాల్లో మురుగుశుద్ధి కేంద్రాలు నిర్మించాలని తలపెట్టింది. ఈ కేంద్రాల్లో నిత్యం పది మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను శుద్ధిచేసేందుకు రూ.38కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొం దిస్తోంది. ఈమేరకు సాంకేతిక సర్వే, డిజైన్ రూపొం దించేందుకు అర్హత, ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు ఫైలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుత పరిస్థితి ఇదీ... భాగ్యనగర దాహార్తిని తీరుస్తోన్న చారిత్రక జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాలు తరచూ ఆర్గానిక్ కాలుష్యంతో కలుషితమవుతున్నాయని జలాశయాలపై పరిశోధన లు చేసిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చి ఇన్సిట్యూట్(నీరి) సంస్థ గతంలోనే స్పష్టం చేసింది. ఈ జలాశయాల పరిరక్షణకు 2011లో పలు విలువైన సిఫారసులు చేసినప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు. దీంతో జలాశయాల ఎగువ ప్రాంతాలు, ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన ఇంజినీరింగ్ కళాశాలలు,ఫాంహౌజ్‌లు, పరిశ్రమలనుంచి వెలువడుతోన్న వ్యర్థజలా లు నేరుగా జలాశయంలోకి చేరుతున్నాయి. మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల పరంగా చూస్తే ఈ జలాశయా లు మూడో శ్రే ణి(సి క్లాస్)లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్టీపీలతో మురుగు కష్టాలకు చెక్.. జలమండలి తాజాగా ప్రతిపాదించిన నాలుగు మురుగు శుద్ధి కేంద్రాల్లో సుమారు పదిమిలియన్ లీటర్ల వ్యర్థజలాలను శుద్ధి చేసి వాటిని తిరిగి జలాశయంలోకి చేరకుండా సమీప పంట పొలాలకు తరలించాలని జలమండలి నిర్ణయించింది. గ్రామాల వారీగా మినీ మురుగు స్టోరేజి ట్యాంకులు ఏర్పాటుచేసి అక్కడినుంచి ట్యాంకర్ల ద్వారా మురుగుశుద్ధి కేంద్రానికి వ్యర్థజలాలను తరలించి శుద్ధిచేయాలని నిర్ణయించింది. ఇలా చేస్తే తరచూ మురుగునీటి పైప్లైన్లు పగిలిపోయి మురుగు రహదారులు, సమీప గ్రామాలను ముంచెత్తదని భావిస్తున్నారు.