‘111’ మాస్టర్‌ ప్లాన్‌ ఎలా ఉండాలంటే? | Master plan to boost GO 111 land | Sakshi
Sakshi News home page

‘111’ మాస్టర్‌ ప్లాన్‌ ఎలా ఉండాలంటే?

Published Sat, May 14 2022 4:56 AM | Last Updated on Sat, May 14 2022 12:21 PM

Master plan to boost GO 111 land - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ తాగు నీటి అవసరాల కోసం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. అలాగే నగర అభివృద్ధి ఫలాలు 111 జీవో పరిధిలోని గ్రామస్తులూ కోరుకోవటం న్యాయమైన హక్కే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేక మాస్టర్‌ను రూపొందిస్తామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ మాస్టర్‌ ప్లాన్‌ ఎలా ఉండాలి? ఏ తరహా నిర్మాణాలు ఉండాలనే అంశంపై తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జీవీ రావు ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు.

∙    217 చదరపు కిలో మీటర్ల హైదరాబాద్‌ విస్తీర్ణానికి రెండున్నర రెట్లు అధికంగా 538 చ.కి.మీ మేర 111 జీవో పరిధి విస్తరించి ఉంది. సుమారు 1.32 లక్షల ఎకరాల భూమి అదనంగా అందుబాటులోకి రానుంది. భవిష్యత్తు తరాల కోసం జంట జలాశయాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా 111 జీవో మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించాలి. ఆ తర్వాతే పర్యావరణానికి హానీ కలిగించని నిర్మాణాలకు చోటు కల్పించాలి. తక్కువ సాంద్రత కలిగిన నివాస, సంస్థాగత, వినోదాత్మక కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉండాలి. వర్షపు నీరు, జలచరాల అధ్యయన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి.

111 జీవో మాస్టర్‌ ప్లాన్‌లో ఆయా అధ్యయన ఫలితాలకు కూడా అవకాశం కల్పిం చాలి. 111 జీవో మాస్టర్‌ ప్లాన్‌లో నెట్‌ జీరో సీవరేజ్‌ పాలసీని అవలంభించాలి. అంటే ప్రతి ఇంటికి తప్పనిసరిగా సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ) ఉండాల్సిందే. తద్వారా మురుగు నీరు బయటికి వెళ్లదు. జంట జలాశయాలు కలుషితం కావు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్విరాన్‌మెంటల్‌ సెన్సిటివ్‌ జోన్లను అధ్యయనం చేయాలి. అక్కడ స్టీల్, సిమెంట్‌ వంటి భవన సామగ్రి స్థానంలో ప్రత్యామ్నాయం వినియోగిస్తారు. కలప ఇళ్లు ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉంటాయి. ఈ తరహా జోన్లను సందర్శించి ఆ ప్రకారం చేయాలి.

కాంప్లిమెంటరీ డెవలప్‌మెంట్‌..
హైదరాబాద్‌ అభివృద్ధికి 111 జీవో కాంప్లిమెంటరీగా ఉండాలి. ఆకాశహర్మ్యాలకు, ఐటీ భవనాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడున్న ప్రాంతాలకు పోటీగా కాకుండా నగరానికి కొత్త ప్రాంతం కాంప్లిమెంటరీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోటీగా ఉంటే మాత్రం ఇప్పుడున్న ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ తగ్గే అవకాశాలున్నాయి. ఆయా గ్రామాలలో చాలా వరకు భూములు కొనుగోలు చేసి ఫామ్‌హౌస్‌లను నిర్మించడం వల్ల హైదరాబాద్‌ స్థిరాస్తి వ్యాపారంపై పరిమిత స్థాయిలో ప్రభావం ఉంటుంది.

ఒకవేళ 111 జీవో పరిధిలో హైరైజ్‌ భవనాలకు అనుమతి ఇస్తే గనక.. హైదరాబాద్‌ ఉష్ణోగ్రతపై ప్రతికూల ప్రభావం చూపించడంతో పాటూ కాలుష్యం పెరుగుతుంది. జంట జలాశయాలు మరో హుస్సేన్‌సాగర్‌ లాగా మారే ప్రమాదం ఉంది. స్వయం సమృద్ధితో కూడిన సౌకర్యాలతో పారిశుధ్యం, రోడ్లను మెరుగుపరచాలి. లేకపోతే అవి మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లాగా తయారవుతాయి. నగరంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణాన్ని కల్పించవచ్చు. దేశంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు. హెచ్‌ఎండీఏ ఏరియాలో విలీనం కావటానికి ఇప్పటికే ఉన్న భవనాలను ఒకేసారి క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంటుంది.

ఐదు జోన్లతో అద్భుతం..
► జంట జలాశయాల నుంచి కొన్ని కి.మీ మేర బఫర్‌ జోన్‌. ఇక్కడ రిసార్ట్‌లకు అనుమతి ఉండాలి.
► రెండోది స్పోర్ట్స్‌ జోన్‌. ఇక్కడ ఆట స్థలాలు, క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
► స్టీల్, సిమెంట్‌ వంటి వాటితో కాకుండా ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రితో కూడిన నిర్మాణాలు మూడో జోన్‌. ఉదాహరణ: విద్యా సంస్థలు.
► ఫోర్త్‌ జోన్‌లో తక్కువ సాంద్రత కలిగిన గృహ నిర్మాణాలు, వినోద కేంద్రాలు. ఇవి కూడా ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రితో నిర్మితమైనవై ఉండాలి.
► ఐదో జోన్‌లో మాత్రమే ఐటీ, బహుళ అంతస్తులకు అనుమతి ఉండాలి. దీంతో అన్ని జోన్లలో కార్యకలాపాలు జరుగుతాయి. ఆయా గ్రామస్తులు పెరిగిన భూముల రేట్ల ప్రయోజనాన్ని పొందుతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement