
లే అవుట్‌లు, నిర్మాణ రంగంపై సందిగ్ధం
విస్తరణ జీఓ వెల్లడితో అంతా గందరగోళం
సమగ్ర మాస్టర్‌ప్లాన్ లేకుండా అనుమతులు కష్టమే
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా, సమగ్రమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించకుండానే ఆగమేఘాల మీద హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ను ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తూ తెచ్చిన జీఓ.. రియల్ ఎస్టేట్ (Real Estate) రంగాన్ని కుదేలు చేసేలా మారింది. నిర్మాణ రంగం కూడా మరింత బలహీన పడే పరిస్థితి నెలకొంది. ఇంచుమించు ఏడాదిన్నరగా చతికిల పడ్డ ‘రియల్ భూమ్’ను ఇది మరింత భూస్థాపితం చేసేలా మారిందని నిర్మాణరంగ నిపుణులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఆవిర్భవించినప్పటి నుంచి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల నుంచే ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయం లభించింది. నగరం చుట్టుపక్కల ఉన్న భూములు బంగారం కంటే ప్రియంగా మారాయి. అపార్ట్‌మెంట్‌లు, బహుళ అంతస్తుల భవనాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. హెచ్‌ఎండీఏ (HMDA) భూములకు సైతం భారీ డిమాండ్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు (Outer ring road) పరిధిలో ఎక్కడ హెచ్‌ఎండీఏ భూములను అమ్మకానికి పెట్టినా రూ.వందల కోట్ల ఆదాయం లభించింది. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలతో రియల్ రంగం వెనుకంజ వేసింది.
ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ విస్తరణతో తిరిగి కొంత రియల్ భూమ్ రావచ్చని మొదట్లో భావించారు. కానీ.. ఏ విధమైన ప్రణాళికలు, విధి విధానాలు లేకుండానే ఆకస్మికంగా జీఓ తేవడంతో అనుమతులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్‌ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి లభించే అనుమతులకు తాజాగా బ్రేక్ పడింది. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
అనుమతులు ఇచ్చేదెవరు?
ఇప్పటికే డీటీసీపీ పరిధిలో భూములు కొనుగోలు చేసి లేఅవుట్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న రియల్టర్లకు ఎలాంటి సమాధానం లభించడం లేదు. ప్రస్తుతం లే అవుట్ అనుమతుల అంశం తమ పరిధిలో లేదంటూ డీటీసీపీ (DTCP) అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణదారులు రెండు, మూడు రోజులుగా హెచ్‌ఎండీఏకు తరలివస్తున్నారు. కానీ.. హెచ్‌ఎండీఏలో సైతం చుక్కెదురే కావడం గమనార్హం. ట్రిపుల్ ఆర్ వరకు తమ పరిధి పెరిగినప్పటికీ ఇంకా ఎలాంటి విధివిధానాలు రాలేదని చెబుతున్నారు.
మరోవైపు కొత్త మాస్టర్‌ప్లాన్ వస్తే తాము అనుమతులు ఇవ్వలేమంటున్నారు. దీంతో రియల్టర్లు, వ్యాపార వర్గాలు, ఆర్కిటెక్టర్లు తదితర వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. ‘అనుమతుల కోసం కొంత కాలం ఆగాల్సిందేనంటున్నారు. కానీ.. ఎంతకాలం అనే దానిపై స్పష్టత లేకుండాపోయింది. పైగా మాస్టర్ ప్లాన్ లేకుండా అనుమతులను ఇవ్వడం కూడా సాధ్యం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇది నష్టదాయకంగా మారింది’ అని కందుకూరు ప్రాంతానికి చెందిన రియల్టర్ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు బ్యాంకుల నుంచి, ఇతరత్రా రుణాలు తీసుకుని భూములు కొనుగోలు చేసిన వ్యాపారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
మాస్టర్‌ప్లాన్‌కు మరో ఏడాది..
మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి సమగ్రమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం ఏడాది క్రితం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔటర్‌రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్‌గా, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి మిగతా తెలంగాణ అంతా రూరల్‌గా పరిగణిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు వరకు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్రమైన మాస్టర్‌ప్లాన్– 2050ని రూపొందించాల్సి ఉంది. కానీ.. ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.
చదవండి: ఎల్‌ఆర్‌ఎస్‌తో తిప్పలు.. దరఖాస్తుదారులకు చుక్కలు
మాస్టర్‌ప్లాన్ (Mastar Plan) రూపకల్పన కోసం ఆసక్తి గల అంతర్జాతీయ సంస్థల నుంచి రిక్వెస్ట్ ప్రపోజల్స్‌ను ఆహ్వానించేందుకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు చెప్పారు. ఎంపిక చేసిన సంస్థ పూర్తిగా అధ్యయనం చేసి సమగ్రమైన మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు కనీసం ఏడాది సమయం పట్టవచ్చని అంచనా. మాస్టర్ ప్లాన్ సిద్ధమైతే తప్ప హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు లభించవు. అంటే అప్పటి వరకు ట్రిపుల్ ఆర్ వరకు అన్ని రకాల నిర్మాణాలు, లే అవుట్‌లు, వెంచర్‌లు నిలిచిపోవాల్సిందేనా అనే సందేహం నెలకొంది. ఈ పరిణామం రియల్ ఎస్టేట్ భవిష్యత్‌ను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చిందని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పరిస్థితి అగమ్యగోచరం..
హైదరాబాద్ విస్తరణ పట్ల ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.. అసలు మాస్టర్‌ప్లాన్ లేకుండానే విస్తరణ జీఓ ఇవ్వడం వల్ల స్పష్టత లేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ రంగానికే కాదు హైదరాబాద్ అభివృద్ధికి కూడా ఇది నష్టమే.
– సత్యనారాయణ చిట్టి, రియల్ ఎస్టేట్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment