KT Rama Rao
-
ఎవరికీ తలవంచేది లేదు!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పడినా లేచినా తెలంగాణ కోసమే తమ పోరాటం కొనసాగుతుందని.. ఎన్నటికీ, ఎవరికీ తలవంచేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ విలీనం, పొత్తులు అంటూ వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్పై నిరాధారంగా దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని, లేకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పలు పోస్టులు చేశారు. ‘‘24 ఏళ్లుగా ఇలాంటి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను మా పార్టీ ఎదుర్కొంది. ఇవన్నీ దాటుకొని నిబద్ధత, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణను సాధించింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టాం. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాం. ఎప్పటిలాగానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పారీ్టపై అడ్డగోలు అసత్యాలు, దుష్ప్రచారాలు మానుకోవాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. దగాపడ్డ చేనేత రంగాన్ని బాగుచేశాం దశాబ్దాల పాటు దగాపడిన చేనేత రంగాన్ని బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో స్వర్ణయుగాన్ని తలపించేలా తీర్చిదిద్దామని కేటీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆరేళ్లలో చేనేత రంగానికి రూ.600 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే.. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి రూ.1,200 కోట్లు వెచ్చించామని తెలిపారు. కేసీఆర్ పాలనలోనే నేత కార్మీకులకు గుర్తింపు, గౌరవం దక్కిందన్నారు. ‘‘చేనేత మిత్ర, నేతన్నకు బీమా, 36 వేల నేత కుటుంబాలకు సాయం, 10,150 మంది నేత కార్మికులకు రూ.29 కోట్ల రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. బతుకమ్మ చీరలతో సంక్షోభంలో ఉన్న నేత రంగాన్ని గట్టెక్కించాం. సిరిసిల్లలో అపెరల్ పార్క్, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశాం..’’ అని కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ పాలనలో నేత కార్మీకుల జీవితాలు ఛిద్రమవుతున్నాయని ఆరోపించారు. నేత వ్రస్తాలపై జీఎస్టీ విధింపుతో పాటు ఆలిండియా హ్యాండ్లూమ్, ఆలిండియా హ్యాండిక్రాఫ్ట్సŠ, ఆలిండియా పవర్ లూమ్ బోర్డులు, చేనేత కార్మీకుల త్రిఫ్ట్ పథకం, హౌస్ కం వర్క్ షెడ్ పథకాలు, మహాత్మాగాంధీ బనకర్ బీమా పథకాలను కేంద్రం రద్దు చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
రాహుల్‌ను నిలదీస్తాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను నమ్మించి మోసం చేసిన రాహుల్ గాంధీని.. అవసరమైతే ఢిల్లీకి వచ్చి నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. బూతులు తిట్టినా, అవమానించినా కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తూ, నిలదీస్తూనే ఉంటామని, తమకు పోరాటం కొత్తకాదని కేటీ రామారావు ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అశోక్‌నగర్‌కు వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ గుర్తు చేశారు. ‘మీరు ఇచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాల ప్రకటనను నమ్మి యువత కాంగ్రెస్‌కు ఓటు వేసింది. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, ఉద్యోగాలు లేని కేలండర్‌ను జారీ చేశారు. మళ్లీ హైదరాబాద్ అశోక్‌నగర్‌కు వచ్చి మీ హామీని ఎలా నెరవేరుస్తారో యువతకు చెప్పండి’.. అని కేటీఆర్ పోస్టు చేశారు. జీవో 46ను రద్దు చేయాలంటూ దీక్ష చేస్తూ అరెస్టయి బండ్లగూడ పోలీసు స్టేషన్లో ఉన్న 70 మంది యువతతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ‘30 గంటలుగా దీక్ష చేస్తూ మీరు గొప్ప పోరాట స్ఫూ ర్తిని చూపుతున్నారు. కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి దీక్ష విరమించండి. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది. అవసరమైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు తీసుకెళ్లి మీ సమస్య పరిష్కారం కోసం మాట్లాడుతాం’.. అని భరోసానిచ్చారు. -
ఏకపక్ష నిర్ణయాలు ఉండవు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కేవలం బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యమవుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు గులాబీ దళాన్ని గెలిపించి తెలంగాణకు బలం ఇవ్వమని ప్రజలను కోరుతున్నాం. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకపక్ష నిర్ణయాలుండవు. అందరి అభిప్రాయాలూ తీసుకుంటాం..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. లోక్ సభ సన్నాహక సమావేశాల తొలిరోజు బుధవారం తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పేగులు తెగేదాకా పోరాడేది బీఆరెస్సే ‘బీఆర్ఎస్ దళం, గళం పార్లమెంటులో ఉండాలి. బీఆర్ఎస్ వల్లే పార్లమెంటులో తెలంగాణ మాట ప్రతిధ్వనిస్తుంది. రాష్ట్ర హక్కుల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. బెంగాల్‌కు మమతా బెనర్జీ, తమిళనాడుకు డీఎంకే స్టాలిన్, ఏపీకి జగన్, చంద్రబాబు, ఒడిశాకు నవీన్ పట్నాయక్, బీహార్‌కు నితీశ్‌కుమార్, మహారాష్ట్రకు శరద్ పవార్ తరహాలో తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి ప్రతీక, పర్యాయపదం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఆ తర్వాత విభజన హామీల అమలు, రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై కొట్లాడింది కూడా కేసీఆర్ మాత్రమే. మోదీ, రాహుల్ ఎన్నడూ తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంటులో మాట్లాడరు. తెలంగాణ గళానికి బలం లేకపోతే పార్లమెంటులో తెలంగాణ పదం వినపడకుండాపోయే చాన్స్ ఉంది..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు కార్యాచరణ ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాలను సమీక్షించుకుంటున్నాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ, గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుంటాం. చిన్న చిన్న లోటు పాట్లను సరిదిద్దుకునే దిశగా అంతర్గతంగా కార్యాచరణ ప్రారంభించాం. కేసీఆర్ కోలుకునేందుకు మరో ఐదారు వారాలు పడుతుంది. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కేసీఆర్ కూడా తెలంగాణ భవన్‌కు వచ్చి అందరితోనూ మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదిలాబాద్ లోక్‌సభ సమీక్ష సందర్భంగా సుమారు 26 మంది నేతలు మాట్లాడిన అంశాలను క్రోడీకరించి కేసీఆర్‌కు వివరిస్తాం. స్థానిక వ్యతిరేకతతో కొందరు ఎమ్మెల్యేలు ఓడినా సీఎంగా కేసీఆర్ ఉంటారని ప్రజలు భావించినట్లు మా నేతలు చెప్తున్నారు. అభివృద్ధి విషయాల్లో ఎక్కడా బీఆర్ఎస్ పనితీరుపై ఫిర్యాదులు లేవు. కాంగ్రెస్ ఫేక్ ప్రాపగాండాతో యువత, ఉద్యోగులు కొంత దూరమయ్యారు. పార్టీ, పాలనలో కొన్ని లోటుపాట్లు సవరించక పోవడం వల్ల ఓటమి పాలయ్యామనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. దానికనుగుణంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తాం..’ అని చెప్పారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగడతాం ‘రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని ఎగవేసేందుకు చేస్తున్న సిల్లీ రాజకీయాలను ప్రజలు గమని స్తున్నారు. తెలంగాణ విజయాలను వైఫల్యా లుగా చూపేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్ని స్తున్నాయి. అబద్ధాలను అస్త్రంగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో హామీలను నెరవేర్చకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ఆ ప్రభుత్వాన్ని బొంద పెడతాం. రాబోయే రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రకాల ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేస్తాం. కేడర్‌కు అండగా ఉంటూ కాంగ్రెస్ దుర్మార్గాలను ప్రజాస్వామికంగా ఎండగడతాం..’ అని కేటీఆర్ అన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్, ఆయనకు తోడుగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ సమావేశానికి హాజరు కాలేదు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ పేరును పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రతిపాదనను బలపరిచారు. పార్టీ తరపున ఎన్నికైన శాసనసభ్యులు ఈ ప్రతిపాదనను బలపరుస్తూ చప్పట్లు కొట్టడంతో కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. శాసనసభా పక్ష డిప్యూటీ లీడర్ నియామకం ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశాన్ని హరీశ్‌రావు సమన్వయం చేశారు. సమావేశం ముగిశాక ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో తెలంగాణ అమరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. -
ప్రశాంతంగా నిద్రపోయా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా. ఎగ్జిట్ పోల్స్‌లో ఏదో జరుగుతున్నట్లు చూపొచ్చు. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ మాకు శుభవార్తను అందజేస్తాయి’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రగతిభవన్లోనే ఉన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఉన్న మంత్రి హరీశ్‌రావు కూడా మాట్లాడుతూ..శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వంద రోజుల పాటు శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. -
నాడు కేసీఆర్‌ను కాపాడింది మీరే
సాక్షి, హైదరాబాద్: దీక్షాదివస్ సందర్భంగా తెలంగాణ సాధన కోసం 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు వైద్య సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యుల బృందం నాటి సంఘటనలు, అప్పటి భావోద్వేగాలను నెమరు వేసుకున్నారు. 11 రోజులపాటు కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన చెందామని ఆయన ప్రాణానికి ముప్పు కలుగుతుందన్న భయాందోళన తమను వెంటాడేదన్నారు. ఒకవైపు సీఎం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మరో వైపు అప్పటి ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన అనేక రకాల ఒత్తిడిలను తట్టుకోవడం తమకు ఒక సవాలుగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఏడు రోజుల తర్వాత కూడా తమ నిరాహార దీక్షను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందేమోనని భయం కలిగిందన్నారు. అయితే ఆయన శారీరకంగా పూర్తిస్థాయిలో బలహీనంగా మారినా, ఆరోజు తన దీక్ష కొనసాగించే ముందు మానసికంగా అత్యంత దృఢంగా ఉండడంతోనే అన్ని రోజులు దీక్ష కొనసాగించగలిగారని ఆ నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చారు. మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా నిమ్స్ వైద్య బృందం అందించిన సేవలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేటీ రామారావు భావోద్వేగంతో అన్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కాపాడుకుంటూనే మరోవైపు కుటుంబ సభ్యులుగా కేసీఆర్ ఆరోగ్యం పట్ల తమకు ఆందోళన ఉండేదన్నారు. ఆయన పట్టుదల, మొండితనం వల్లనే నిరాహార దీక్షను కొనసాగించగలిగారని చెప్పారు. అయితే ఒక కుటుంబ సభ్యుడిగా అనేక సందర్భాల్లో ఆందోళనకు గురైనప్పుడు నిమ్స్ వైద్య బృందం అందించిన మనోధైర్యం ఎప్పటికీ మరువలేమన్నారు. అత్యంత సంక్లిష్టమైన సంక్షోభ సమయంలో తమ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సజీవంగా నిలిపి స్వరాష్ట్రాన్ని సాకారం చేసేందుకు సహకరించిన వైద్య బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపి వారిని సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. -
బీఆర్ఎస్లోకి రాకేశ్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కష్టపడి సాధించుకున్న తెలంగాణను మనమే పాలించుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకం అందని ఇల్లు లేదని, ముఖ్యమంత్రిని తమ ఇంటి పెద్దగా యువత భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు ఏనుగు రాకేశ్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్ తదితరులు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు, నీళ్లు వంటి కనీస అవసరాలు కూడా తీర్చలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వరంగల్‌లో మెట్రోను పరుగులు పెట్టిస్తామని కేటీఆర్ హామీఇచ్చారు. రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ అయితే, భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని పార్టీలో చేరిన నేతలు ప్రకటించారు. -
రేవంత్‌కు అధికారమిస్తే కోఠిలో అమ్మేస్తాడు
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఓటుకు నోటు కేసులో చిక్కిన దొంగ. అమరుల స్తూపం వద్దకు వచ్చి మద్యం పంచకుండా గెలుద్దాం, ప్రమాణాలు చేద్దాం రా.. అంటున్నాడు. నోట్లకట్టలతో పచ్చిగా దొరికిన దొంగ నీతులు చెప్తున్నాడు. కాంగ్రెస్ వాళ్లే రేవంత్‌రెడ్డిని రేటెంత రెడ్డి అంటున్నారు. ఆయన చేతికి అధికారమిస్తే రాష్ట్రాన్ని కోఠిలో చారాణాకు అమ్మేస్తాడు. అందుకే కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు..’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్వీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఒక్క చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్లు బతిమాలుతున్నారని.. ఎందుకు చాన్స్ ఇవ్వాలని ప్రశ్నించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డబ్బు సంచులతో వచ్చినా ఇక్కడ చేసేదేమీ లేదని.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి కర్ణాటకలో ఐదు గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని డీకే చెప్పడంపై నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ యుద్ధంలో తమతో పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఉద్యమ సమయంలో యువత, విద్యార్థుల చావులకు కారణమైందని, ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తోందని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం ‘‘గతంలో ప్రశ్నపత్రాలు లీక్ చేసింది బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెంచా గాడు కాదా? గ్రూప్–2 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేసిందే బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్. ఆ తర్వాత పరీక్ష రద్దు చేస్తే గొడవ చేసిందీ వీళ్లే. కోర్టులో కేసు వేసి గ్రూప్–2 పరీక్షను రద్దు చేయించారు. కడుపులో గుద్ది.. నోట్లో పిప్పర మెంట్ పెడతారు వాళ్లు. పరీక్షల నిర్వహణలో కొన్ని తప్పులు జరిగినట్టు ఒప్పుకుంటున్నా. డిసెంబర్ 3 తర్వాత టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకుంటా..’’అని కేటీఆర్ ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అదే వేదికల ద్వారా తిప్పికొట్టి వాస్తవాలు ప్రచారం చేయాలని బీఆర్ఎస్వీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఏం చేశారని ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు సోషల్ మీడియా వేదికగా దీటుగా సమాధానాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదేళ్ల వయసున్న పిల్లలకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందని.. 2014 ముందు నాటి పరిస్థితులను వారికి తెలియచేయాలని.. ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చే వారి డొల్లతనాన్ని బయట పెట్టాలని సూచించారు. రాబోయే నెల రోజులపాటు 33 జిల్లాల్లో విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణ అభివృద్దిపై చర్చ పెట్టాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల, నారాయణపేటల నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్ర శేఖర్ చేరికతో మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే ఆసక్తితోనే తాను బీఆర్ఎస్లో చేరినట్టు ఎర్ర శేఖర్ అన్నారు. ముదిరాజ్‌లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ వివిధ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. -
బీఆర్ఎస్లోకి మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఉపాధ్యాయ కోటా మాజీ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి గురువారం మంత్రి కేటీ రామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ అంశాలపైన కలిసి పని చేసేందుకు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ త్వరలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహా్వనిస్తున్న బీఆర్ఎస్, తాజాగా బిత్తిరి సత్తితోనూ సంప్రదింపులు జరిపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావుతో బిత్తిరి సత్తి గురువా రం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ముదిరాజ్ సామాజికవర్గంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారు బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని కేటీఆర్, హరీశ్ కోరినట్లు సమాచారం. బీఆర్ఎస్లో చేరికకు అంగీకరించినట్లు బిత్తిరి సత్తి ‘సాక్షి’కి వెల్లడించారు. ముదిరాజ్ సామాజికవర్గానికి మరికొందరు కీలక నేతలు కూడా త్వరలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబు తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఓ పార్టీకి చెందిన కీలక నేత కూడా బీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
నేడు ‘లులు’ మాల్ ప్రారంభం
కూకట్పల్లి: ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన షాపింగ్ మాల్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా కూకట్‌పల్లిలో ఏర్పాటు చేస్తున్నట్లు ‘లులు’ గ్రూప్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అ్రషఫ్ అలీ పేర్కొన్నారు. ఈ షాపింగ్ మాల్‌ను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ చొరవతో రూ.500 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ లులు మాల్‌ను మొదటి విడతలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలి పారు. మరో రూ.200 కోట్లతో అత్యాధునిక హంగులతో లులు మాల్‌ను తీర్చిదిద్దుతామని అష్రఫ్ అలీ తెలిపారు. ఈ మాల్ తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని వివరించారు. భారతదేశంలో కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో కోయంబత్తూరులలో ఇప్పటికే లులు మార్కెట్ ను ప్రారంభించారు. ఈ మాల్లో అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన షాపింగ్ ఔట్లెట్లు, 1,400 మంది సీటింగ్ కెపాసిటీతో 5 స్క్రీన్స్‌తో సినిమా హాళ్లు, ఫుడ్ కోర్టు, పిల్లల వినోద కేంద్రం ఉంటాయని తెలిపారు. ఈ మాల్ ద్వారా 2 వేల మందికి పైగా సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. తాజా ఉత్పత్తులు, కిరాణా సామాగ్రి, ఫ్యాషన్, గృహోపకరణాలు, ఎల్రక్టానిక్స్, మొబైల్స్, సాంకేతిక, జీవనశైలి ఉత్పత్తుల కోసం లులు ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్ బ్రాండ్ పేర్లతో ప్రత్యేక విభాగాలను కలిగి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆనంద్ ఏవీ. నిషద్ ఎంఎ, వి.నందకుమార్, షిబు ఫిలిప్స్, మేనేజర్ అబ్దుల్ ఖాదీర్, రెజిత్ రాధాకృష్ణన్, అబ్దుల్ సలీం, ఇ.అష్రన్, నౌషద్ కిజక్కుప్పరల్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ‘సింటెక్స్’ పెట్టుబడి రూ.350 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వెల్స్పన్ గ్రూపు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న ‘సింటెక్స్’ హైదరాబాద్‌లో రూ.350 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపొనెంట్స్, ఇతర పరికరాలను తయారుచేసే ఈ యూనిట్ ద్వారా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వెల్స్పన్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న చందన్వెల్లిలోనే సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటవుతుంది. ఈ నెల 28న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావుతో పాటు వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా హాజరవుతారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహిసున్న వెల్స్పన్ గ్రూప్ రాష్ట్రంలో మరింత విస్తరించనుండటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో అందుబాటులోని మౌలిక వసతుల వలన అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని కేటీఆర్ అన్నారు. -
బీఆర్ఎస్లోకి గాయకుడు ఏపూరి సోమన్న
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ గాయకుడు, వైఎస్సార్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రగతిభవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలిశారు. ఉద్యమంలో కలసి పనిచేసిన రీతిలోనే బీఆర్ఎస్ వెంట నిలిచేందుకు సోమన్న సుముఖత వ్యక్తం చేయగా.. కేటీఆర్ స్వాగతించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో సోమన్న గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. కేటీఆర్ తనను పార్టీలోకి స్వాగతించారని, కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని హామీ ఇచ్చారని ఏపూరి సోమన్న ‘సాక్షి’కి వెల్లడించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ఉద్యమంలో భాగమైన తరహాలోనే అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సాయిచంద్ లేని లోటు పూడ్చేందుకే? బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగానికి వెన్నెముకగా పనిచేసిన కవి, గాయకుడు సాయిచంద్ ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సభలు, సమావేశాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలను సాయిచంద్ ముందుండి నడిపించేవారు. ఆయన లేని లోటును పూడ్చేందుకు.. జనాలను ఆకట్టుకునే శక్తి ఉన్నందుకే సోమన్నను చేర్చుకునేందుకు బీఆర్ఎస్ మొగ్గు చూపినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార సభల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు సోమన్న నేతృత్వం వహించే అవకాశం ఉందని అంటున్నాయి. బీఆర్ఎస్లోకి బీజేపీ హైదరాబాద్ నేతలు బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా, కార్పొ రేటర్‌గా పనిచేసిన వెంకట్‌రెడ్డి, ఆయన భార్య కార్పొరేటర్ పద్మ శుక్రవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. -
భవిష్యత్తుకు భరోసా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో రాజుకున్న వేడి క్రమంగా చల్లబడుతోంది. పార్టీ నేతల మధ్య సయోధ్యకు జరుగుతున్న ప్రయత్నాలు ఒకటొకటిగా కొలిక్కి వస్తున్నాయి. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని బుజ్జగించిన అధినేత కేసీఆర్.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆ నియోజకవర్గం టికెట్ ఖరారు చేశారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య నడుమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో రాజీ కుదిరింది. నర్సాపూర్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనను కూడా రెండు మూడురోజుల్లో తొలగించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి, పటాన్చెరు తదితర నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై కూడా కేటీఆర్ దృష్టి సారించారు. జనగామ, నర్సాపూర్‌తో పాటు నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలన్న ముత్తిరెడ్డి? ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, వెంకట్రాంరెడ్డి శుక్రవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసానికి వెళ్లారు. అంతా కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ముత్తిరెడ్డికి టికెట్ నిరాకరణకు కారణాలను వివరించిన కేసీఆర్.. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సహకరించి ఆయన గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో ఎమ్మెల్సీగానూ అవకాశం కల్పిస్తానని హామీ ఇ చ్చినట్లు తెలిసింది. అయితే తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలని ముత్తిరెడ్డి కోరగా ప్రస్తుతం ఎమ్మెల్సీ పల్లా నిర్వహిస్తున్న రైతుబంధు సమితి అధ్యక్ష పదవిని కేసీఆర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. కాగా ముత్తిరెడ్డి బెట్టు వీడిన నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ అభ్యరి్థగా పల్లా పేరును కేసీఆర్ ఖరారు చేశారు. నర్సాపూర్, కల్వకుర్తిపై త్వరలో స్పష్టత నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనపై బీఆర్ఎస్ అధినేత దృష్టి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా టికెట్ కోసం పట్టుబడుతుండటంతో అభ్యర్థి ప్రకటనను పెండింగులో పెట్టారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానని మదన్‌రెడ్డి స్పష్టం చేస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమ లేదా మంగళవారం అందుబాటులో ఉండాల్సిందిగా ఇద్దరు నేతలకు ప్రగతిభవన్ నుంచి సమాచారం వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కల్వకుర్తి టికెట్‌ను ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కూడా శుక్రవారం ప్రగతిభవన్ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలిసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు కసిరెడ్డి ప్రగతిభవన్‌కు చేరుకున్నప్పటికీ సీఎం ఇతర సమావేశాలతో బిజీగా ఉండటంతో భేటీ వాయిదా పడింది. కసిరెడ్డికి ఒకటి రెండురోజుల్లోనే మరోమారు పిలుపు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. తనను కల్వకుర్తి అభ్యరి్థగా ప్రకటించి, సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు తాను ఖాళీ చేసే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కసిరెడ్డి కోరుతున్నారు. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానన్న రాజయ్య! స్టేషన్ ఘన్పూర్ టికెట్ విషయంలో నెలకొన్న పంచాయితీ కూడా ప్రగతిభవన్ వేదికగా కొలిక్కి వ చ్చింది. ఎమ్మెల్సీ పల్లా శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యరి్థ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వెంటబెట్టుకుని కేటీఆర్ వద్దకు వెళ్లారు. సంప్రదింపులు, చర్చల అనంతరం కడియం శ్రీహరి అభ్యరి్థత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు రాజయ్య ప్రకటించారు. కడియం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని రాజయ్యకు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే గతంలో శ్రీహరికి వరంగల్ ఎంపీగా అవకాశం ఇ చ్చినందున తనకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాజయ్య కోరినట్లు సమాచారం. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనకు లోక్‌సభకు పోటీ చేసే అవకాశమివ్వాలని రాజయ్య పట్టుబట్టినట్లు సమాచారం. అయితే కేటీఆర్ ఏదో ఒక చట్టసభలో క చ్చితంగా పదవి ఇస్తామని భరోసా ఇవ్వడంతో రాజయ్య అంగీకరించినట్లు తెలిసింది. కేటీఆర్‌తో భేటీ అనంతరం కడియం శ్రీహరి గెలుపు కోసం పనిచేస్తానంటూ రాజయ్య ప్రకటించారు. కాగా పార్టీ నిర్ణయం మేరకు తనకు మద్దతు ప్రకటించిన రాజయ్యకు కడియం ధన్యవాదాలు తెలిపారు. -
పనులు.. నిధులు.. పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ పదో తేదీలోపు వెలువడుతుందనే సంకేతాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్, సచివాలయానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు. తమ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని, వివిధ పనులకు సంబంధించిన పెండింగు బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు. నిధుల అడ్డంకి ఉంటే తాము ప్రతిపాదించిన పనులకు కనీసం పాలనా పరమైన అనుమతులు అయినా ఇప్పించాలని విన్నవిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సుమారు పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్నందున తమ వినతులను సత్వరం పరిష్కరించాలంటూ లేఖలు సమర్పిస్తున్నారు. కేటీఆర్ సంతకాలతో కూడిన సిఫారసు లేఖలను తీసుకుని సచివాలయంలోని సంబంధిత శాఖల ఉన్నతాధి కారులు, జిల్లా అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పనులు.. పోస్టింగులు ఎమ్మెల్యేల వినతుల్లో పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు తమ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వాటికి పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారు లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే వీరిలో తమకు అనుకూలురైన పోలీసు, రెవెన్యూ అధికారుల పోస్టింగుల కోసం కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే పోస్టింగులు పూర్తయిన కొన్నిచోట్ల మార్పులకు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే తక్షణం నిధుల విడుదలకు సంబంధం లేని పనులకు ఓకే చెప్తూ, ఇతర అంశాలను పరిశీలిస్తామని మాత్రమే కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ఎన్నికలు సమీపిస్తుండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. వీటితో పాటు తుది దశలో ఉన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా సంబంధిత శాఖల మంత్రులను ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తు న్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ నెల రోజుల క్రితం ఆగస్టు 21న సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది రెండేసి పర్యాయాలకు పైగా వరుస విజయాలు సాధించిన వారే ఉండటంతో వివిధ పథకాల ద్వారా లబ్ధి ఆశిస్తున్న వారి నుంచి వీరు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తమపై ఉన్న ప్రతికూలతను తొలగించుకునేందుకు, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే పనులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీసీబంధు, గృహలక్ష్మి ఒత్తిడి.. ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఎదురవు తున్నట్లు సమాచారం. బీసీబంధు పథకం కింద రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు చెక్కుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించగా, ప్రస్తుతం లబ్ధిదారులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిగతా రెండు విడ తలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరో వైపు గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు లబ్ధిదారుల జాబితా పై స్పష్టత వచ్చేలా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తు న్నారు. మరోవైపు సామాజిక పింఛన్ల కోసం కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ సంఖ్యలో దరఖా స్తులు అందుతున్నాయి. -
అభివృద్ధిని ఓర్వలేకే అడ్డగోలు మాటలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ అభివృద్ధిని చూస్తూ ఓర్వలేకే ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతామంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నడ్డా.. అడ్డమైన మాటలు మాట్లాడొద్దంటూ హెచ్చరించారు. అడ్డం పొడుగు లేని మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించబోరని చెప్పారు. ఉప్పల్ రింగురోడ్డు వద్ద సుమారు రూ.25 కోట్లతో నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. అంతకుముందు ఉప్పల్ మినీ శిల్పారామం వద్ద రూ.10 కోట్లతో నిర్మించిన మల్టీ పర్పస్ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. మీరంతా సొంత అస్తిత్వం లేని గులాములు ‘కేసీఆర్‌ను ఎందుకు జైల్లో వేస్తారు? కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో లక్షలాది మంది ఆడ్డబిడ్డల పెళ్లిళ్లు చేసినందుకా? సర్కార్ దవాఖానాల్లో వైద్య సేవలను మెరుగుపర్చినందుకా? ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు కేసీఆర్ కిట్లను అందజేసిందుకా? డబుల్ బెడ్రూమ్ వంటి పథకాలను ప్రవేశపెట్టినందుకా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌లో మా ప్రభుత్వం 35 ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించింది. ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు సదుపాయాలను అభివృద్ధి చేసింది. కేంద్రం నారపల్లి నుంచి ఉప్పల్ వరకు చేపట్టిన ఫ్లైఓవర్ ఆరేళ్లు అయినా పూర్తి కాలేదు. అంబర్పేట్ ఫ్లైఓవర్ అలాగే ఉండిపోయింది. ఇదీ కేసీఆర్ పనితీరుకు, మోదీ పనితీరుకు మధ్య వ్యత్యాసం. కాంగ్రెస్, బీజేపీ నాయకులంతా సొంత అస్తిత్వం లేని ఢిల్లీ గులాములు. కానీ కేసీఆర్ స్వీయ రాజకీయ అస్తిత్వంతో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోని దరిద్రాన్ని, పేదరికాన్ని కేవలం తొమ్మిదేళ్లలో పోగొట్టారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ ఒక అన్నగా, ఇంటి పెద్దగా అండగా ఉండి వాళ్ల కష్టాలను తీరుస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే ప్రగతి రథ చక్రాలు పరుగులు తీస్తాయి..’ అని మంత్రి చెప్పారు. అమర వీరులను చంపింది సోనియా గాందీయే.. ‘అమర వీరులను చంపింది సోనియా గాందీయే. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో జాప్యం వల్లనే వాళ్లు చనిపోయారు. అయితే రేవంత్‌రెడ్డి అమరుల గురించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. కేసీఆర్‌ను తిడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. పులి శాకాహారిగా మారినట్లు ఆయన అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. రూ.50 లక్షల నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన దొంగోడు, జైల్లో చిప్పకూడు తిన్నోడు అవినీతి గురించి మాట్లాడుతున్నాడు..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాదచారుల భద్రతకు భరోసా ‘నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్కైవాక్ వల్ల రింగురోడ్డుకు 5 మార్గాల్లో పాదచారులు నిర్భయంగా రాకపోకలు సాగించవచ్చు. ఉప్పల్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చు చేసింది. రూ.453 కోట్లతో మంచినీళ్ల ట్యాంకులు, పైపులైన్లు కొత్తగా ఏర్పాటు చేశాం. త్వరలో ఎయిర్‌పోర్టు మెట్రో కూడా అందుబాటులోకి వస్తుంది. ఉప్పల్–ఘటకేసర్ మార్గంలో నాణ్యమైన రోడ్లు వేస్తాం..’ అని మంత్రి తెలిపారు.స్కైవాక్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన దానిపై కొద్దిసేపు నడిచారు. హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను, స్కైవాక్ మోడల్‌ను తిలకించారు. హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డి ప్రాజెక్టు ప్రత్యేకతలను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చేయూతనివ్వండి: కేంద్ర మంత్రులకు కేటీఆర్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరింత ఆర్ధిక చేయూతనిచ్చి తనవంతు అండగా నిలవాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, రహదారులు, మెట్రో రైలు విస్తరణ వంటి రంగాల్లో కేంద్రం సహకారం ఇవ్వాలని, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రగతికి తోడ్పడాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన మంత్రి కేటీఆర్.. శనివారం కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అదనపు ధాన్యం సేకరణ, హైదరాబాద్‌లో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్ఆర్డీపీ, లింకు రోడ్లు, పారిశుధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలపై వారితో చర్చించారు. అయితే శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కేటీఆర్ భేటీ జరగాల్సి ఉన్నా చివరి నిమిషంలో రద్దయింది. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ఆదివారం ఉదయం కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నట్టు తెలిసింది. రోడ్లు, రైల్వే విస్తరణ, పారిశుధ్యానికి నిధులపై హర్దీప్పూరీకి విజ్ఞప్తి ► హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల మెట్రోకు ఆమోదంతోపాటు ఆర్థిక సాయం చేయాలి. ► రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేయగా.. మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇదే రీతిలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు రూ.2,400 కోట్ల మేర ఖర్చవుతుంది. కేంద్రం రూ.800 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలి. ► హైదరాబాద్‌లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద రూ.400 కోట్ల ఆర్థిక సాయం అందించాలి. ► రూ.3,050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి 15శాతం నిధులు అంటే రూ.450 కోట్లను ఆర్థిక సాయంగా అందించాలి. ► హైదరాబాద్ నగర పరిధిలో చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణ ఖర్చు దాదాపు రూ.3,722 కోట్లలో.. కేంద్రం కనీసం రూ.744 కోట్లు భరించాలి. ► రాష్ట్రంలో కేంద్రం నిర్దేశించిన సిటిజన్ సెంట్రిక్ రీఫారŠమ్స్ కింద చేపట్టిన బయో మైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు రూ.750 కోట్లను సాయంగా ఇవ్వాలి. ► గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తేవాలి. ► కాగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమాన్ని ప్రశంసించిన హర్దీప్ సింగ్ పూరీ.. ఈ అంశంపై త్వరలో తమ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వాలని కేటీఆర్‌ను కోరారు. అదనపు బియ్యం సేకరణపై పీయూష్ గోయల్‌కు.. ► ఇటీవలికాలంలో çఅధిక ఉష్ణోగ్రతల కారణంగా ముడిబియ్యాన్ని అందించే పరిస్థితులు లేవు. మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైతం గత రబీ సీజన్లో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి.. ఈ సీజన్లో అధికంగా పండించే ఎంటీయూ 1010 రకంలో 48.20శాతం విరుగుడు ఉందని నివేదిక ఇచ్చింది. ► ప్రస్తుత సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 66.11 లక్షల టన్నుల వరిని సేకరించింది. కానీ కేంద్రం 10.20 లక్షల టన్నుల పారా బాయిల్డ్ రైస్ తీసుకుంటామన్నది. అంటే 15 లక్షల టన్నుల ధాన్యానికి మాత్రమే అనుమతించింది. మిగతా 51.11 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ముడి బియ్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి. అలా ఇచ్చేందుకు ప్రతి లక్ష టన్నులకు రూ.42.08 కోట్లు చొప్పున.. 34.24 లక్షల టన్నుల బియ్యానికి రాష్ట్రంపై రూ.1,441 కోట్ల ఆర్ధిక భారం పడుతుంది. అందువల్ల ఈ రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 20 లక్షల టన్నుల పారా బాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోవాలని కోరుతున్నాం. -
మనసున్న కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేద్దాం
సిరిసిల్ల: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొమ్మిదేళ్ల పాలనలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి కేటీ రామారావు చెప్పారు. కరోనాతో రూ.లక్ష కోట్ల నష్టం వచ్చినా కల్యాణలక్ష్మి ఆగలేదని, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, ఉచిత కరెంట్ ఇచ్చామని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, దేశంలో ఆసరా పెన్షన్లు అధికంగా ఇచ్చే ప్రభుత్వం మనదేనని అన్నారు. ఇలాంటి మనసున్న కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింట్యాలలో అదనపు తరగతి గదులు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జెడ్పీ హైస్కూల్ కాంప్లెక్స్, సిరిసిల్లలో వాలీబాల్ అకాడమీని మంత్రి ప్రారంభించారు. దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే.. ‘మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి బాటలు వేస్తున్నారు. దివ్యాంగులకు పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రూ.200, కర్ణాటక లో రూ.1,100, మహారాష్ట్రలో రూ.300, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ.600 పెన్షన్ ఇస్తుంటే..మన రాష్ట్రంలో మాత్రం రూ.3,0 16 చొప్పున చెల్లిస్తున్నాం. వచ్చే నెలనుంచి రూ.4,0 16 ఇస్తాం. గుజరాత్లో 47 వేల మంది దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. అదే మన రాష్ట్రంలో 5.15 లక్షల మందికి ఇస్తున్నాం. వారి సంక్షేమానికి రూ.1,800 కోట్లు వెచ్చించాం. ఉద్యోగాల్లో 4%, డబుల్ బెడ్రూం ఇళ్లలో 5% రిజర్వేషన్లు కల్పించాం. ఇలా ఆసరా కల్పించడం తప్పని, ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని ప్రధాని మోదీ చెబుతున్నారు. బడా వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేయడం మాత్రం మంచిదట. ఎవరేం అన్నా..ఇంకా సదరం సర్టిఫికెట్ రాని వారికి, అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్లను గుర్తించి వారికి కూడా పింఛన్లు ఇస్తాం..’ అని కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ అరపైసా సాయం చేయలే.. ‘ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా అరపైసా సాయం చేయలేదు. ఒక్క నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ అయినా, సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్, కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ అయినా తేలేదు. కానీ కాళ్లళ్ల కట్టెలు పెడుతు న్నారు..’ అని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పలు సంస్థల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి ‘గంభీరావుపేటలో కేజీ టూ పీజీ స్కూల్ రాష్ట్రానికి ఆదర్శమైంది. అక్కడ ప్రభుత్వ హాస్టళ్లను కూడా ప్రారంభిస్తాం. విద్యతోనే వికాసం..విజ్ఞానం. ఒకతరం చదువుకుంటే ఇక వెనక్కి చూడాల్సిన పని ఉండదు. ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలి. జిల్లాలోని 60 స్కూళ్లలో ఆరు నుంచి పదో తరగతి వరకు పిల్లలకు కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తున్నాం. ఈ నైపుణ్య శిక్షణ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా సర్కారు స్కూళ్లలో అమలు చేస్తాం. బాలి కలకు ఆత్మరక్షణ కార్యక్రమాలు అన్ని పాఠశా లల్లో నిర్వహిస్తాం..’ అని మంత్రి చెప్పారు. -
సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ‘నల్సార్’న్యాయ విశ్వవిద్యాలయంతో కలిసి దేశంలోనే మొదటిసారిగా సైబర్ క్రైమ్ చట్టాన్ని తెస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపారు. తెలంగాణ చేయబోయే సైబర్‌క్రైమ్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. సోమవారం టీ–హబ్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ‘రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం 2022–23’వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఐటీ రంగ వృద్ధికి సంబంధించిన అన్ని సూచీల్లో రాష్ట్రం జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకు పోతోందని చెప్పారు. బెంగళూరుకు దీటుగా హైదరాబాద్‌ను నిలబెడతామని రాష్ట్ర అవతరణ సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టామన్నారు. కేంద్రం నుంచి సాయం అందకున్నా.. కరోనా సమయంలోనూ, ఆ తర్వాత కూడా అనేక అనుమానాలు ఎదురైనా, కేంద్రం నుంచి సహాయ నిరాకరణ జరిగినా తెలంగాణ తన సొంత ప్రణాళికలతో ఐటీ రంగంలో అభివృద్ధి సాధిస్తూ వస్తోందని కేటీఆర్ చెప్పారు. పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే 9 ఏళ్లుగా ఐటీ శాఖ వార్షిక నివేదికలను విడుదల చేస్తున్నామని వివరించారు. అమెరికా, యూకే పర్యటనలో తాను సాధించిన పెట్టుబడి ప్రకటనలను, గత ఏడాది కాలంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు, కొత్త ఉద్యోగాల కల్పన వివరాలను కేటీఆర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో కొత్త శిఖరాలకు చేరుకుంటామని.. ప్రాథమిక మౌలిక వసతుల నుంచి అంతరిక్షం దాకా తెలంగాణ శరవేగంగా పురోగమిస్తోందని చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని, కేసీఆర్ మరోమారు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టి పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. ఫార్మా, బయోటెక్నాలజీలోనూ అద్భుత ప్రగతి ఫార్మా, బయో టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని కేటీఆర్ చెప్పారు. 2012లో కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు తెలంగాణలో ఐటీ ఎగుమతులు 2032 నాటికి రూ.2.5లక్షల కోట్లకు చేరుతాయని ప్రకటించిందని.. ఐటీఐఆర్ అమలు చేయకున్నా ఆ గడువుకు 9 ఏళ్ల ముందే లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ రంగం మెరుగ్గా రాణిస్తోందని వివరించారు. లైఫ్ సైన్సెస్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస్‌రావు, వీ హబ్ సీఈఓ దీప్తిరావు, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మెరుగైన విధానాలే మా నినాదం
సాక్షి, హైదరాబాద్: ఎవరినో గద్దె దించి, వేరెవరినో ఎక్కించాలనేది తమ విధానం కాదని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. కాంగ్రెస్‌తోనో మరొకరితోనో జట్టు కట్టడం, థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ కూడా తమ విధానం కాదన్నారు. రాజకీయ ప్రక్రియలో గెలుపోటములు కాకుండా ప్రజలకు ఏం చేస్తామన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. మోదీని గద్దె దించడమనేది కాకుండా ప్రభుత్వ పాలనలో మెరుగైన విధానాలే తమ నినాదమని స్పష్టం చేశారు దేశ చరిత్రలో అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. విపక్ష భేటీకి సంబంధించి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. దేశమంతటా బీఆర్ఎస్ సంచలనం ‘భారత్‌లో బహుళ పార్టీ వ్యవస్థ ఉంది. కాంగ్రెస్ లేదా బీజేపీ నాయకత్వం వహించాలనే ఆలోచనకు మేం వ్యతిరేకం. మోదీ, రాహుల్ ఏం చేస్తారన్నది మాకు అనవసరం. 2024లో మేము మాకు వీలున్న చోట పోటీ చేస్తాం. మెరుగైన పాలన ఎక్కడ ఉంటే అటువైపు ప్రజ లు ఆకర్షితులవుతారు. బీఆర్ఎస్ సంచలనం దేశమంతటా విస్తరిస్తుంది. ఎన్నికలకు 6నెలల ముందే ఎవరికి టికెట్లు వస్తాయో రావో చెప్పలేము. పనితీరు ఆధారంగా పాత వారికి టికెట్లు ఇస్తాం..’అని కేటీఆర్ చెప్పారు. మాపై వ్యతిరేకత లేదు ‘కర్ణాటకలో అసమర్థ బీజేపీని ప్రజలు తిరస్కరించారు. మణిపూర్ మండిపోతుంటే ప్రధాని, కేంద్రం హోం మంత్రి, 8 మంది సీఎంలు కర్ణాటకలో మకాం వేయడాన్ని ప్రజలు అర్దం చేసుకున్నారు. కర్ణాటక ఓటర్లు బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రమే తిరస్కరించారు. తెలంగాణలో మా ప్రభుత్వ వ్యతిరేకతకు ఎలాంటి కారణాలు లేవు. తెలంగాణలో 2018 ఎన్నికల్లో 109 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీని ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. రాష్ట్రంలో వారికున్న మూడు సీట్లు కూడా మళ్లీ రావు..’అని స్పష్టం చేశారు. తెలంగాణను దేశం అనురిస్తోంది.. ‘తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ మోడల్‌కు పునాది. నాయకులు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని తెలంగాణ తొమ్మిదేళ్లలో రుజువు చేసింది. సంపదను సృష్టించి అన్ని వర్గాల సంక్షేమానికి అందిస్తున్నాం. విద్య, ఆరోగ్యం, విద్యుత్ ఇలా అన్ని రంగాల్లో సమగ్ర, సమతుల్య, సమీకృత, సమ్మిళిత అభివృద్దితో తెలంగాణ కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నడుమ అభివృద్ధిలో సమతూకం పాటిస్తూ విధానాల రూపకల్పనలో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నాం. గుడిసెల నుంచి గూగుల్ దాకా.. పాతాళంలో బొగ్గు నుంచి అంతరిక్షంలో రాకెట్ దాకా.. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోంది. సమర్ధ ప్రభుత్వం– సుస్థిర నాయకత్వం నినాదంతో ముందుకు సాగుతున్న తెలంగాణను ఈ రోజు దేశం అనుసరిస్తోంది. తెలంగాణ ఏర్పడి దశాబ్ది అవుతున్న సందర్భంలో జేబులో ఉన్న రూపాయిని కింద పారేసి చిల్లర నాణేలు ఏరుకోవద్దు. కేసీఆర్ లాంటి అద్భుత నాయకుడు ఉండగా వీధుల్లో కారుకూతలు, పెడబొబ్బలు పెట్టే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధాని మోదీ, నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సవాలు చేస్తున్నా. దేశంలో తెలంగాణ మోడల్‌కంటే మెరుగైన నమూనా ఉన్న రాష్ట్రాన్ని చూపండి. 55 ఏళ్లలో జాతీయ పార్టీలు చేయలేని పనిని తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేసి చూపించారు. దశాబ్దం నిండుతున్న సందర్భంగా ఎన్నికల సంవత్సరంలో కేసీఆర్, బీఆర్ఎస్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతున్నా..’అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలి ► ‘రాజకీయాల్లో పోరాటాలు, కొట్లాటలు సమ ఉజ్జీలతో ఉంటాయి కానీ మరుగుజ్జులతో ఉండవు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయ మరుగుజ్జులు. ఇక్కడ మరో ప్రత్యామ్నాయం ఉందని రాష్ట్ర ప్రజలు అనుకోవడం లేదు. మేము చేసింది చెప్పుకునేందుకు ఎంతో ఉంది. 90 నుంచి 100 సీట్లతో మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. తెలంగాణ సీఎంగా వరుసగా తొమ్మిదేళ్లు పనిచేసి రికార్డు సృష్టించిన కేసీఆర్ మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా ఉంటారు. సీఎం అభ్యర్థి ఎవరో కాంగ్రెస్, బీజేపీ ప్రకటించాలి..’అని డిమాండ్ చేశారు. డీ లిమిటేషన్‌లో హేతుబద్ధత ఉండాలి ► ‘2026లో జరిగే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో శాస్త్రీయత, హేతుబద్ధత ఉండాలి. కేంద్రం సూచన మేరకు జనాభా నియంత్రణ చేసిన ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గిస్తామనడం దారుణం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రగతిశీల రాష్ట్రాలకు నష్టం జరగకుండా లోతైన చర్చ జరిపి సరైన పరిష్కారం చూపాలి. జనాభాను అధికంగా పెంచి దేశానికి గుదిబండగా మారిన రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచి, బాగా పనిచేసిన రాష్ట్రాల గొంతు నులమడం సరికాదు. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించడంలో తప్పులేదు..’అని పేర్కొన్నారు. ఏది నిజమో ఒవైసీనే అడగండి ► ‘తెలంగాణలో అమలవుతున్న మైనారిటీ సంక్షేమం ఇక్కడ ఎందుకు అమలు కావడం లేదంటూ అసదుద్దిన్ ఒవైసీ గతంలో ఉత్తరప్రదేశ్‌లో ప్రసంగించారు. ఇక్కడ మైనారిటీలకు ఏమీ జరగడం లేదని అంటున్నారు. మరి ఆయన చేసిన ప్రకటనల్లో ఏది కరెక్టోఆయన్నే చెప్పమనండి..’అని తెలిపారు. అత్యంత సమర్ధ ప్రధాని పీవీ ► ‘దేశ ప్రధానుల్లో ఇప్పటివరకు అత్యంత సమర్ధుడు పీవీ నర్సింహారావు, ఆయన తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే నేడు భారత్ అభివృద్ధి చెందుతోంది. సొంత పార్టీలో అవమానంతో పాటు గుర్తింపునకు నోచుకోని వ్యక్తి పీవీ. కాంగ్రెస్ విధానాలే భారత్ దుస్థితికి కారణం. రాహుల్ గాంధీ పార్టీకి బదులుగా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుంటే బెటర్. నోట్ల రద్దుతో సాధించిందేమిటో మోదీ నేటికీ దేశ ప్రజలకు చెప్పలేదు. గతంలో తుగ్లక్ గురించి విని ఉన్నాం.. మిగతాది మీరే పూరించుకోండి. ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, రేవంత్‌కు దేశానికి ప్రధాని కాగలిగే సత్తా ఉంది (వ్యంగ్యంగా)..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ
రాయదుర్గం: దేశంలో రోబోటిక్ టెక్నాలజీ గేమ్ చేంజర్ అవుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ (టీఆర్ఐసీ)ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రోబోటిక్స్ రంగంలో అగ్రగామిగా నిలుస్తామని, రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి వచ్చే జూలైలో ‘గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్’ను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. మంగళవారం హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్‌లో ‘తెలంగాణ రోబోటిక్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్ మాట్లా డారు. ఇది ఫ్రేమ్‌వర్క్ కింద అన్ని కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి నోడల్ బాడీగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో స్థిరమైన రోబోటిక్స్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధిలో రాష్ట్రాన్ని కేంద్రంగా చేయడం వంటి లక్ష్యాలతో ‘స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్’ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక ఆటోమేషన్, కన్సూ్యమర్ రంగాల్లో మరింత అభివృద్ధిని సాధించడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రంలోని స్టార్టప్‌లకు అవసరమైన ఇంక్యుబేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆథరైజేషన్ సపోర్ట్, మార్కెట్ ఇన్సైట్లు, ఇన్వెస్టర్ కనెక్షన్లు తదితరాల కోసం ప్రపంచస్థాయి రోబోటిక్స్ యాక్సిలరేటర్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. రోబోటిక్ టెక్నాలజీ వినియోగంలో చైనా, జపాన్, అమెరికా తర్వాత పదో దేశంగా భారత్ గుర్తింపు పొందుతోందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి, వివిధరంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్, ఆర్ట్ పార్కు ఐఐఎస్సీ, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఏజీహబ్, ఆలిండియా రోబోటిక్స్ అసోసియేషన్ వంటి సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవిలంకా, పలుసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నా కొడుక్కి 17 ఏళ్లు, ఓ రోజు సడన్‌గా నా దగ్గరకు వచ్చి: కేటీఆర్
'మ్యూజిక్ స్కూల్ సినిమా డైరెక్టర్, నిర్మాత పాపారావు బియ్యాల నాకు మంచి మిత్రుడు, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక్కడే పని చేశారు. పాపారావు సినిమా తీశారనగానే చాలా ఆశ్చర్యపోయా. పేరెంట్స్ తమ పిల్లలు ఇంజనీర్, లేదంటే డాక్టర్ కావాలనుకుంటున్న ధోరణిని సినిమాలో చూపించారు. మనకు కావాల్సింది ఇంజనీర్లు మాత్రమే కాదు ఆర్టిస్టులు కూడా' అన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్. శర్మన్ జోషి, ప్రకాశ్ రాజ్, నటి లీలా సామ్సన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది. శనివారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'నా కొడుక్కి 17 సంవత్సరాలు. మూడు నెలల కిందట సడన్‌గా ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఓ సాంగ్ పాడాను, రిలీజ్ చేస్తున్నా అని చెప్పడంతో ఆశ్చర్యపోయా. చాలామందిలో హిడెన్ టాలెంట్ ఉంటుంది. మనం వాటిని తొక్కేయకుండా ఎంకరేజ్ చేయాలి. ఇళయరాజా గారు తెలంగాణలో మ్యూజిక్ ఇండస్ట్రీ పెట్టాలి' అన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ.. 'మ్యూజిక్ ఉంటే వైలెన్స్ ఉండదు, చీటింగ్ ఉండదు. మ్యూజిక్ ఉంటే లక్ష్మి ఉంటుంది, సరస్వతి ఉంటుంది. కేటీఆర్ చెప్పినట్టు మ్యూజిక్ యూనివర్సిటీ వస్తే ఇక్కడ 200 మంది ఇళయరాజాలు తయారు అవుతారు. దేశం మొత్తం కూడా ఇక్కడ పర్ఫామెన్స్ ఇస్తారు' అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రియ, దిల్ రాజు, జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంలో ఆర్థిక మంత్రులు మారుతున్నా.. తెలంగాణకు దక్కింది శూన్యమే
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఆర్థిక మంత్రులు మారుతున్నా తెలంగాణతోపాటు టెక్స్టైల్ రంగానికి దక్కింది శూన్యమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ చివరిదని, అందులో నేత కార్మికులు, టెక్స్టైల్ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదన్నారు. ఈమేరకు కేటీఆర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రాధాన్యతను కేంద్రం గుర్తించడం లేదని, రూ.1600 కోట్లతో చేపట్టిన ఈ పార్క్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.900 కోట్లు కేటాయించాలని కోరారు. టెక్స్టైల్ రంగానికి ప్రోత్సాహం లేనందునే బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాల కంటే భారత్ వెనుకబడి ఉందన్నారు. మౌలిక వసతుల కల్పన, ప్రోత్సాహకాల విధానం లేనందునే మేకిన్ ఇండియా నినాదంగానే మిగిలిపోయిందన్నారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలకు సహకరించాలని కోరారు. మెగా క్లస్టర్‌కు రూ.100 కోట్లు ఇవ్వండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్లో 25 వేల మరమగ్గాలు ఉన్నందున మెగా క్లస్టర్‌గా గుర్తించి రూ.100 కోట్లు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. సిరిసిల్ల మరమగ్గాల ఆధునికీకరణ, వాల్యూచైన్ బలోపేతం, మార్కెట్, నైపుణ్యాభివృద్ధి తదితరాల కోసం రూ.990 కోట్లు కేటాయించాలన్నారు. పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరమగ్గాల రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ‘ఇన్–సిటు పవర్లూమ్ అప్‌గ్రెడేషన్’కింద 13వేల మరమగ్గాల ఆధునికీరణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ‘రాష్ట్రంలో 40వేల మంది నేత కార్మికులు పనిచేస్తున్నందున ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను మంజూరు చేయాలి. చేనేత ఉత్పత్తులపై ప్రతిపాదించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. దేశంలో చేనేత, వస్త్ర పరిశ్రమలో 80శాతం చిన్న, సూక్ష్మ యూనిట్లు ఉన్నందున పన్నుల భారం తగ్గించాలి. ప్రస్తుతమున్న రూ.20 లక్షల జీఎస్టీ స్లాబ్‌ను చేనేత, పవర్లూమ్ కార్మికులకు రూ.50 లక్షల వరకు పెంచాలి’అని కోరారు. వచ్చే బడ్జెట్లో తెలంగాణ టెక్స్టైల్ రంగానికి భారీగా నిధులు కేటాయించాలని, రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. టెక్స్టైల్ రంగానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పునఃసమీక్షించుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం రద్దు చేసిన ఆల్ ఇండియా హ్యాండూŠల్మ్, పవర్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ మండళ్లను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
ఉద్యోగం సాధించండి.. ఉన్నతస్థాయికి ఎదగండి
మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం.సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్నిఅందిపుచ్చుకుంది. మారిన పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మనసు పెట్టి చదివి తల్లిదండ్రుల స్వప్నాన్ని సాకారం చేయాలి. - కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు, యువత ప్రాణం పెట్టి చదివి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నడుస్తున్న ఉద్యోగపర్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రుల ఆశలు, తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ‘మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుంది..’ అని చెప్పారు. మారిన పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మనసు పెట్టి చదివి తల్లిదండ్రులు, నమ్ముకున్న ఆత్మీయుల స్వప్నాన్ని సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు సిద్ధమవుతున్న తెలంగాణ యువతకు ఆదివారం మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ రాశారు. కేసీఆర్ నేతృత్వంలో మారిన రాష్ట్ర పరిస్థితిని, తెలంగాణ ఆకాంక్షల సాధనకు జరుగుతున్న కృషిని వివరిస్తూ మార్గ నిర్దేశం చేశారు. కేటీఆర్ ఏమన్నారంటే.. తొమ్మిదేళ్లలో 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ ► వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాం. తొమ్మిదేళ్ల పాలనలో సుమారు 2.25 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా నిలవబోతున్నాం. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీకి అనుగుణంగా 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. రెండోసారి అధికారంలోకి వచ్చాక 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిబద్ధతతో వేగంగా చేపట్టాం. ఇప్పటికే సుమారు 32 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిష¯న్‌తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చాం. గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నాం. మొత్తంగా అతితక్కువ సమయంలో 2.25 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతుంది. 95 శాతం స్థానికులకే.. ► ఉద్యోగాల భర్తీలో స్థానికులకే ప్రాధాన్యత లభించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారు. అడ్డంకిగా ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించిన తరువాత ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆర్డీవో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త జోనల్ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఫలించింది. విద్యార్థులు, యువకుల కోరిక మేరకు ప్రభుత్వం ఉద్యోగ వమోపరిమితిని కూడా సడలించింది. తద్వారా మరింత మందికి అవకాశం దక్కింది. క్రమబద్ధీకరణ..పారద్శకత ► ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే.. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరించాం. త్వరలోనే మరో 10 వేల మంది ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించబోతున్నాం. తెలంగాణ ఏర్పడక ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగ నియామక ప్రక్రియపై ఎన్నో ఆరోపణలు, వివాదాలు నడిచాయి. రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఉద్యోగాన్నీ అత్యంత పారదర్శకంగా భర్తీ చేశాం. ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో గ్రూపు–1 ఉద్యోగాల్లోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికాం. ప్రభుత్వ ఉద్యోగాలే గాక, ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం మెరుగుపరిచింది. ఇప్పటిదాకా సుమారు 17 లక్షల మందికిపైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణాదే. దేశంలో ఎక్కడాలేని విధంగా స్టార్టప్ ఎకో సిస్టంను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వినూత్నంగా ఆలోచించే యువతకు అండగా ఉండేందుకు టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్, టీఎస్ఐసీ వంటి వేదికలను ఏర్పాటు చేసింది. నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు ► ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు యువత కోసం కోచింగ్ సెంటర్లతో పాటు ఇతర వసతులను ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే లైబ్రరీల బలోపేతానికి సైతం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటి దాకా ఒకెత్తు... ఇప్పుడు ఒకెత్తు ► ఇప్పటిదాకా ఒకెత్తు... ఇప్పుడు ఒకెత్తు. సీఎం ఆశయానికి అనుగుణంగా ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ప్రాణం పెట్టి చదవండి. తెలంగాణ యువతకు ఆకాశమే హద్దని చాటండి. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోవద్దు. అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టాలి. సానుకూల ధృక్పథంతో సాధన చేసి, స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి. -
రాజకీయాల్లోకీ సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు త్వరలోనే ప్రత్యేక చట్టాలను అమలు చేయనున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. చట్టాల రూపకల్పనలో నల్సార్ విశ్వవిద్యాలయం నిమగ్నమైందని, ఈమేరకు వర్సిటీతో ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుందని పేర్కొన్నారు. ప్రత్యేక సైబర్ చట్టాలతో కేసుల విచారణ, దర్యాప్తు వేగవంతమవడంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని స్పష్టంచేశారు. సైబర్ చట్టాలను అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని తెలిపారు. శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్, ఐఐటీ హైదరాబాద్, సైయంట్ సంస్థల సహకారంతో పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం దేశంలోనే మొదటిది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యక్తులు, సంస్థలతోపాటు రాజకీయాల్లో కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు గూగుల్ పే ద్వారా ఓటర్ల ఖాతాలకు నగదు బదిలీ చేశారని ఆరోపించారు. పోలీసులు, న్యాయ విభాగాలు మాత్రమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాజకీయాల్లో సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కసారి రిజిస్టర్‌లోకి ఎక్కితే... అమెరికా తరహాలో లైంగిక నేరస్తుల జాబితా తెలంగాణలోనూ అమలు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితుల జాబితాతో ప్రత్యేక వెబ్సైట్ రూపొందించాలని సూచించారు. నిందితుల పేరు, ఇతరత్రా వివరాలను రిజిస్టర్లో ఎక్కించాలని, ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఒకసారి రిజిస్టర్లో ఎక్కితే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు, రాయితీలకూ అనర్హులుగా ఉంటారని హెచ్చరించారు. డ్రోన్ పోలీసింగ్.. అవగాహన లోపం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, మోసపోతున్న వారిలో విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం విచారకరమని కేటీఆర్ చెప్పారు. సైబర్ మోసాల బారిన పడిన వారు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పోలీసు యంత్రాంగం సాధ్యమైనంత ఎక్కువగా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ‘మారుమూల ప్రాంతంలోని బాధితుడు డయల్ 100కు కాల్ చేస్తే పోలీసు వెళ్లాలంటే సమయం పడుతుంది. పోలీసు కంటే ముందే కెమెరా, సైరన్, లైట్‌తో డ్రోన్ వెళ్లి అక్కడి పరిస్థితిని పోలీసులకు చేర్చే స్థాయికి రాష్ట్రం ఎదగాలి. ఈ మేరకు డీజీపీ, హోంమంత్రి కార్యాచరణ రూపొందించాలి’ అని కేటీఆర్ చెప్పారు. నెక్ట్స్‌జెన్ పోలీసింగ్: డీజీపీ మహేందర్ రెడ్డి సాధారణ పోలీసులు, సిబ్బంది స్థానంలో టెక్ పోలీస్, నెక్ట్స్‌జెన్ పోలీసుగా మారాల్సిన అవసరం ఏర్పడిందని డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించవచ్చని, దీంతో రాష్ట్ర ఆదాయం కూడా మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ ఎకో సిస్టమ్ బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని, సైబర్ సేఫ్టీ కేంద్రం ఏర్పాటుకు కారణమిదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఏసీబీ డీజీ అంజనీకుమార్ యాదవ్, పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, సైయంట్ ఫౌండర్, చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Munugode By Election: గడువు ముగిసే వరకు కదలొద్దు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచార గడువు ముగిసేంత వరకు పార్టీ ఇన్చార్జిలు తమకు కేటాయించిన చోట ప్రచారాన్ని ఉధృతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశించారు. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ ఇన్చార్జిలతో గురువారం ఉదయం ప్రగతిభవన్ నుంచి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 30న చండూరులో టీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరవుతున్న నేపథ్యంలో జన సమీకరణకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 30న బహిరంగ సభ, 31న నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నందున ఈ రెండు రోజులను మినహాయిస్తే ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రచారం ముమ్మరం చేయాలని పార్టీ ఇన్చార్జిలకు కేటీఆర్ సూచించారు. వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం ప్రచారం ముగిసినా పోలింగ్ పూర్తయ్యేంత వరకు ఫోన్ ద్వారా పార్టీ స్థానిక యంత్రాంగాన్ని సమన్వయం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ నెల 30న జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీ జన సమీకరణను సవాల్‌గా తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. మీడియా ముందు మాట్లాడొద్దు: కేటీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ‘అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏ మాత్రం పట్టించుకోవద్దు’అని కేటీఆర్ ట్వీట్ చేశారు.