సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సేవల విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ కంటే మెరుగైన వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణకు మంగళం పాడే పరిస్థితి కనిపిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు ఉన్నతాధికారుల వైఖరితో వెల్‌నెస్ సెంటర్ల కార్యక్రమం క్రమంగా నిర్వీర్యమవుతోంది. ఉద్యోగుల వైద్య సేవల పథకం (ఈహెచ్‌ఎస్)ను ఆరోగ్యశ్రీ ట్రస్టులో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈహెచ్‌ఎస్ సీఈవోగా ఉన్న కె.పద్మను సొంత శాఖకు బదిలీ చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా ఉన్న కె.మనోహర్‌కు ఈహెచ్‌ఎస్ నిర్వహణ బాధ్యతలను అదనంగా అప్పగించింది. దీంతో ఈహెచ్‌ఎస్‌కు ఉన్న ప్రత్యేకత తగ్గినట్లు అయ్యిందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ అయోమయంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
సీఈవోగా పద్మను తొలగించడం సరైంది కాదు..: జర్నలిస్టులు
ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ సీఈవో బాధ్యతల నుంచి కె.పద్మను తప్పించటం సరైంది కాదని గురువారం పలువురు జర్నలిస్టులు మంత్రి కేటీఆర్‌ను శాసనసభ ప్రాంగణంలో కలసి విన్నవించారు. పథకం ప్రారంభం నుంచి పద్మ సమర్థంగా తన బాధ్యతలు నిర్వర్తించారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు సేవలు అందించటంలో పద్మ అంకితభావం మింగుడు పడక వైద్య ఆరోగ్యశాఖలో కొందరు ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించారని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మంత్రికి ఫిర్యాదు చేశారు. పద్మకు తిరిగి ఈహెచ్‌ఎస్ సీఈవో బాధ్యతలు అప్పగించాలని కోరారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతకుమారితో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. మంత్రిని కలసిన వారిలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే కార్యదర్శి రవికాంత్‌రెడ్డి, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజమౌళిచారి, ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు శైలేష్‌రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment