
,మంత్రి కేటీఆర్‌కు రాఖీ కడుతున్న చిన్నారి దివ్య ,కేటీఆర్‌కు రాఖీ కడుతున్న కవిత. చిత్రంలో కేటీఆర్ సతీమణి శైలిమ
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారికి రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాఖీ బహుమతిగా ఆపన్నహస్తం అందించారు. గత ఏప్రిల్‌లో కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్‌కు చెందిన 9 ఏళ్ల దివ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కిరాయి ఆటోని నడుపుకుని జీవనోపాధి పొందుతున్న ఆమె తండ్రి చికిత్సకు డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడని స్థానిక టీఆర్‌ఎస్ యువజన నాయకుడు జగన్మోహన్‌రావు ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించి దివ్యకు చికిత్స అందించాలని నిమ్స్ వైద్యాధికారులను ఆదేశించారు.
ఈ ప్రమాదంలో దివ్య ఎడమకాలిని పోగొట్టుకోవడం విషాదంగా మారింది. ఆపదలో అన్నలా ఆదుకున్న కేటీఆర్‌కు రాఖీ కట్టాలన్న తన ఆకాంక్షని దివ్య వెలిబుచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆమెను ఆదివారం తన ఇంటికి పిలిపించుకుని రాఖీ కట్టించుకున్నారు. ఆమెకు కృత్రిమ అవయవాన్ని అందించారు. అవసరమైతే మరింత సహాయం దివ్యకు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే తనతో రాఖీ కట్టించుకోవడమే పెద్ద బహుమతి అన్న దివ్య, ఇంకేం వద్దంటూ మంత్రికి తెలిపింది.
దివ్య తండ్రి కిరాయి ఆటో నడిపిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి, త్వరలోనే అయనకు ఒక కొత్త ఆటోను రాఖీ బహుమతిగా అందిస్తానని హామీ ఇచ్చారు. దివ్యను అన్నలా ఆదుకున్న మంత్రి తారక రామారావుకు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా దివ్య తల్లిదండ్రులు తమ ఆనందన్ని వ్యక్తం పరిచారు.
కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత
మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాఖీ కట్టారు. కేటీఆర్ సతీమణి శైలిమ కూడా కవిత భర్త అనిల్ కుమార్‌కు రాఖీ కట్టారు.
Comments
Please login to add a commentAdd a comment