
సాక్షి, పెద్దపల్లి: బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రజలు, కార్యకర్తలు కుంభమేళా తరహాలో తరలిరావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఆమె పర్యటించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎల్కతుర్తి శివారులో జరిగే రజతోత్సవ సభ దేశంలోనే చరిత్రాత్మకం అవుతుందన్నారు. వచ్చే ఎన్నిక ఏదైనా బీఆర్‌ఎస్‌దే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
జై తెలంగాణ అనని సీఎం, మంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించడం మన దురదృష్టకరమని, జై సోనియమ్మ అనడం తప్ప జై తెలంగాణ అనని సీఎం, మంత్రులు తెలంగాణ గురించి ఏం ఆలోచిస్తారని ఆమె విమర్శించారు. 25 ఏళ్లుగా నిలబడ్డ ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ అని, ఏడాది పాటు బీఆర్‌ఎస్ పార్టీ వేడుకలు చేస్తామని తెలిపారు.
గ్రూపు–1 పరీక్ష రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.